మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యం నెరవేరింది. పట్టువదలకుండా కృషి చేస్తే ఎప్పటికైనా అనుకున్నది సాధించవచ్చని ఈ ఉద్యమం రుజువుచేసింది. ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగకు ఇది వ్యక్తిగత విజయం అని కూడా భావించవచ్చు. మాదిగ దండోరా పేరుతో సాగిన ఉద్యమం ఉమ్మడి ఎపిలో విశేష ప్రభావం చూపిందని చెప్పాలి.ఒకప్పుడు తమ పేరు చివర మాదిగ అని పెట్టుకుంటే సమాజంలో చిన్నతనం అవుతుందేమో అనుకునే దశ నుంచి మాదిగ అన్న పదానికి ఒక గౌరవాన్ని,గుర్తింపును తెచ్చిన ఘనత ఆయనది. వర్గీకరణ కన్నా మందకృష్ణ తీసుకు వచ్చిన పెద్ద సామాజిక మార్పు ఇది అని చెప్పాలి.
.. గత ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో జరిగిన సభలో మంద కృష్ణను దగ్గరకు తీసుకుని తాను కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా పనిచేస్తానని ప్రకటించారు. కృష్ణను ఏకంగా తన నాయకుడుగా కూడా ఆయన ప్రకటించడం అందరిని ఆకర్షించింది. అయినా వర్గీకరణ సాధ్యమా? కాదా? అనే చర్చ కొనసాగింది. విశేషంగా గతంలో వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన సుప్రింకోర్టు ఇప్పుడు దానిని కొట్టివేసి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయానుసారం వర్గీకరణ చేసుకోవచ్చని అత్యున్నత న్యాయ స్థానం నిర్ణయం చేసింది. దీని ప్రకారం సామాజిక, ఆర్ధిక అంశాల ప్రాతిపదికన ఎస్సీలలో వర్గీకరణ చేయవచ్చని స్పష్టం చేసింది. తత్ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాలలో వర్గీకరణ ప్రాతిపదికన అవకాశాలు లభిస్తాయి.
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్ లు ఉన్నాయి. కాని ఈ రిజర్వేషన్ అవకాశాలు ఎస్సీలలో బలమైన కొన్ని వర్గాలకే అధికంగా లభించాయన్న బావనతో దండోరా ఉద్యమం ఆరంభం అయింది. ప్రధానంగా మాల వర్గంకు చెందినవారికే ఈ రిజర్వేషన్ ల ఫలాలు అధికంగా దక్కుతున్నాయన్న అభిప్రాయం మాదిగ,తదితర ఉప కులాలలో ఏర్పడింది. రాజకీయ పదవులలో సైతం మాలల ఆదిపత్యం ఎక్కువగా ఉంటున్నదని, తమ సంఖ్యకు అనుగుణంగా పదవులు దక్కడం లేదన్న ప్రచారం జరిగేది. తెలంగాణలో మాదిగలు అధిక సంఖ్యలో ఉంటారు.అదే విభజిత ఆంద్ర ప్రదేశ్ లో మాల వర్గం వారు ఎక్కువగా ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రాజకీయాలు కూడా ఉమ్మడి ఏపీలో సాగుతూ వచ్చాయి.
తొలుత నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ ప్రక్రియ ఆరంభమైంది. మాలవర్గం నేతలు దీనిని పూర్తిగా వ్యతిరేకించారు. చంద్రబాబు ఎస్సీలలో విభజన చిచ్చు పెడుతున్నారని వారు ఆరోపించేవారు. ఎస్సీలలో ఎక్కువమంది కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటారన్న అభిప్రాయం అప్పట్లో ఉంది. ఆ వర్గంలో తనకంటూ ఓటు బ్యాంకును తయారుచేసుకునే ఉద్దేశంతో వర్గీకరణ వైపు చంద్రబాబు మొగ్గుచూపారన్న విమర్శ కూడా అప్పట్లో ఉండేది. అయితే..
ఈ వర్గీకరణ తమకు మేలు చేస్తుందని మాదిగ,తదితర ఉపకులాలు భావించి, మంద కృష్ణ ఉద్యమానికి మద్దతు ఇచ్చాయి.దాంతో వివిధ రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆయా రాజకీయ పక్షాలు ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయాలు చేశాయి. ఈ దశలో సుప్రింకోర్టులో వర్గీకరణ చెల్లదని తీర్పు రావడంతో ఇది అత్యంత జఠిల సమస్యగా మారింది. ఆ తరుణంలో ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా శాసనసభలో తీర్మానం చేసింది. కేంద్రంలోని యుపీఏ ప్రభుత్వం వద్దకు దీనిపై అఖిలపక్షాన్ని పంపించి ఆయన సమస్య పరిష్కారానికి కృషి చేశారు. దీనికి వ్యతిరేకంగా మాలమహానాడు నేతలు నిరాహార దీక్షలకు దిగగా, వైఎస్ ఆర్ వారిని ఒప్పించి విరమింప చేశారు. అప్పట్లో ఉషా మెహ్రా నేతృత్వంలో ఒక కమిషన్ ను ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ వర్గీకరణపై వివిధ రాష్ట్రాలలో అభిప్రాయాలు సేకరించింది. ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్న పరిస్తితులను దృష్టిలో ఉంచుకునే కేంద్రం అప్పట్లో వ్యవహరించిందన్న భావన ఉంది. ఆ కమిషన్ కూడా వర్గీకరణకు సానుకూలమైన నిర్ణయాలు వెలువరించలేదు. దాంతో ఇది పెద్ద పెండింగ్ సమస్యగా మారింది. అయితే మాదిగ దండోరా ఉద్యమాన్ని మంద కృష్ణ నిలుపుదల చేయలేదు. మద్యలో దండోరాలో చీలికలు వచ్చినా, రాజకీయాల ప్రభావం పడినా, అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన తన వాయిస్ వినిపిస్తూనే వచ్చారు.
రాష్ట్ర విభజన తర్వాత నాటి టీఆర్ఎస్(బీఆర్‌ఎస్) ప్రభుత్వం కూడా దీనిపై అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. బిజెపి అగ్రనేతలు దండోరాకు మద్దతు ఇవ్వడంతో ఇది ఒకరకంగా కొత్తరూపు దాల్చిందని చెప్పాలి. సీనియర్ నేత వెంకయ్యనాయుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటివారు కృష్ణకు సహకరించారు. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ తాను ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా ఒక భారీ సభను నిర్వహించడంతో ఈ ఉద్యమం కొత్త మలుపు తిరిగింది.ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయంతీసుకుని కోర్టుకు ఆ విషయం తెలిపింది. ఒకసారి సుప్రింకోర్టు నిర్ణయం అయిన తర్వాత తిరిగి కేసును ఓపెన్ చేసి కోర్టు విచారణ జరపడం సంచలనమే అని చెప్పాలి. తదుపరి రెండు దశాబ్దాలకు సుప్రింకోర్టు తన తీర్పును మార్చుకుని వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం ఉందని తేల్చడంతో ఇది ఒక కొలిక్కి వచ్చినట్లయింది.
ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే.. ఒకప్పుడు రాజకీయ లక్ష్యంతో ఉమ్మడి ఏపీలో రిజర్వేషన్ లకు అనుకూలంగా నిర్ణయించిన టీడీపీ, రాష్ట్ర విభజన తర్వాత దాని జోలికి వెళ్లలేదు. 2014 టరమ్ లో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలో మాదిగ దండోరా ఉద్యమానికి అనుమతి ఇవ్వలేదు. దానికి కారణం ఏపీలో మాలవర్గం వారి ప్రాధాన్యత అధికంగా ఉండడమే అని భావిస్తారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో వీరి ప్రాబల్యం అధికంగా ఉంటుందని అంటారు.మాదిగ దండోరాకు వ్యతిరేకంగా మాల మహానాడు నేతలు కూడా ఆరోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించేవారు.దీంతో ఈ వ్యవహారం క్లిష్టమైన సమస్యగా ఉండేది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయం వెలువరించడంతో ఇది ఒక కొలిక్కివచ్చినట్లయిందనిపిస్తుంది. అయితే మాల మహానాడు నేతలు ఏ రకంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
ఇప్పుడు కొత్త సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీయులలో ఏ ఉప కులంవారు ఎంత మంది ఉన్నారన్నదానిపై గణాంకాలు సేకరించవలసి ఉంటుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం వర్గీకరణ చేసి విద్య,ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ లు కల్పిస్తే సరిపోతుందా?లేదా?అనేది చూడాల్సి ఉంది. కాగా, ఎస్సీ వర్గీకరణపై సుప్రిం తీర్పును తెలంగాణలోని రాజకీయ పక్షాలు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తమ వంతు ప్రయత్నం సాగించాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఒక ప్రకటన చేస్తూ తమ రాష్ట్రం వెంటనే దీనిని అమలు చేస్తుందని ప్రకటించారు.సుప్రింకోర్టులో సీనియర్ న్యాయవాదిని నియమించి కేసును బలంగా వినిపించడంతో తీర్పు అనుకూలంగా వచ్చిందని కాంగ్రెస్ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. మరో నేత కడియం శ్రీహరి టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు వర్గీకరణపై తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది తమ ఘనతేనని బిజెపి పేర్కొంది. కాగా కాంగ్రెస్ పార్టీ మాదిగలను అణచివేసే ప్రయత్నం చేస్తే.. తమ అధినేత కేసీఆర్ వారిని ఆదుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాస్త ఆచితూచి స్పందించారనిపిస్తోంది. దీనిని సామాజిక న్యాయంగా వ్యాఖ్యానించారాయన. ఎస్సీలతో పాటు ఎస్టీ వర్గీకరణపై తీర్పు రావడంతో దాని ప్రభావం ఏ రకంగా ఉండేది అప్పుడే చెప్పజాలం. అంతా హర్షిస్తారా?లేక కొత్త ఆందోళనలు ఏమైనా వస్తాయా అన్నది చూడాలి. ఏది ఏమైనా ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం లభించిందని ఆశిద్దాం.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment