ఊహలతో అద్భుతాలా? | telangana budget is hypothetical, says jana reddy | Sakshi
Sakshi News home page

ఊహలతో అద్భుతాలా?

Published Wed, Nov 12 2014 1:46 AM | Last Updated on Sat, Aug 11 2018 6:44 PM

telangana budget is hypothetical, says jana reddy

* బడ్జెట్‌పై సర్కారుకు జానారెడ్డి ప్రశ్నల పరంపర
* భూములమ్మి 3 నెలల్లో 6,500కోట్ల ఆదాయమెలా తెస్తారు?
* ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లలో రూ. 10 వేల కోట్లు కూడా రాని విషయం తెలియదా?
* 4.7% లోటును ఎలా పూడుస్తారు?
* కేంద్రం నుంచి రూ. 21 వేల కోట్ల గ్రాంట్ తేవడం ఎలా సాధ్యం?
* ఏ అంచనాలతో ఈ బడ్జెట్‌ను పెట్టారు.. మేమెలా నమ్మాలి?
* అద్భుత, విచిత్ర బడ్జెట్ ప్రవేశపెట్టారంటూ వ్యంగ్యాస్త్రాలు
* మున్ముందు 100% అద్భుతాలు జరుగుతాయన్న సీఎం కేసీఆర్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ పూర్తిగా ఊహాజనితంగా ఉందని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. బడ్జెట్ హామీల అమలు ఏ మేరకు సాధ్యమన్న అంశంపై ప్రభుత్వానికే స్పష్టత లేదని విమర్శించారు. ఊహాజనిత అంచనాలతో అద్భుతాలను ఎలా సృష్టిస్తారని ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా జానారెడ్డి రెండు గంటల పాటు మాట్లాడారు. తన ప్రసంగంలో గత ప్రభుత్వాల్లో ఆదాయం, వృద్ధి రేటు మొదలుకొని.. ప్రస్తుత బడ్జెట్‌లో ప్రస్తావించిన లోటు భర్తీ, భూముల అమ్మకం, భూ పంపిణీ, ఇళ్ల నిర్మాణం, రుణమాఫీ, గృహ నిర్మాణం, పరిశ్రమలు, విద్యుత్ వంటి అంశాలను ప్రస్తావించారు. వీటన్నింటికీ నిధులు ఎలా తెస్తారంటూ ప్రశ్నాస్త్రాలు, వ్యంగ్యోక్తులు విసిరారు. జానా చురకలపై మధ్యమధ్యలో ముఖ్యమంత్రి సహా మంత్రులు పలువురు కల్పించుకున్నా ఆయన మాత్రం తనదైన శైలిలో ప్రసంగాన్ని కొనసాగించారు. రాష్ట్రానికి మేలు జరిగేలా, ప్రత్యేక హోదా దక్కేలా ఐక్యంగా పోరాడదామని ప్రభుత్వానికి సూచించారు.

ఇదో అద్భుత, విచిత్ర బడ్జెట్..
చర్చను ప్రారంభిస్తూ... సరైన అధ్యయనం లేకుండా బడ్జెట్‌ను రూపొందించినట్టుగా ఉందని జానారెడ్డి అన్నారు. ‘‘రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి రూ.2,545 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది. పది నెలల కోసం పెట్టిన ఈ బడ్జెట్‌లో విచిత్రకరం, అద్భుతమైన అంశం ఏంటంటే 17,318 కోట్ల ఆర్థిక లోటును అంచనా వేశారు. 4.7 శాతం లోటుకు సరిపడా నిధులు కేంద్ర ప్రభుత్వ నుంచి, అదనపు లభ్యతల నుంచి వస్తాయన్న నమ్మకం ఉందన్నారు. ఏ అంచనాల ఆధారాలతో పెట్టారు. మేం దీన్ని ఎలా నమ్మాలి. ఆశల పల్లకిలో అంచనాలు, ఆధారాలు లేని అద్భుతమైన, విచిత్రమైన బడ్జెట్ పెట్టారు’’ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. జానా వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించారు.

‘‘మున్ముందు మీకు అద్భుతాలు, విచిత్రాలు కనిపిస్తాయి. వందశాతం తెలంగాణ ప్రజలు అద్భుతంగా పైకి రావాలనే కొట్లాడారు. 100 శాతం అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతాలు చూసి మీరు మమ్ముల్ని పొగిడే రోజు వస్తుంది’’ అని అన్నారు. ఇందుకు జానా స్పందిస్తూ... అద్భుతాలు జరగడానికి ఇదేమీ అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదంటూ చురకంటించారు. ‘‘అద్భుతాలు చేస్తామంటే సహకరిస్తాం. అంతేకానీ ఆ అద్భుతాలతో ప్రజలను గందరగోళ పరచొద్దు’’ అని అన్నారు. అనంతరం లోటుపై జానా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘4.79 శాతం లోటు ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం మాత్రం లోటులో 3 శాతం మాత్రమే అప్పు తేవాలని చెబుతోంది. ఇలాంటప్పుడు రూ.6,700 కోట్ల మొత్తాన్ని ఎక్కడ్నుంచి తెస్తారో ప్రభుత్వం చెప్పాలి’’ అని ప్రశ్నించారు.

దీనిపై ముఖ్యమంత్రి మరోమారు స్పందిస్తూ... ‘‘ఎఫ్‌ఆర్‌బీఎం ప్రకారం రూ.11 వేల కోట్లు  మాత్రమే తీసుకుంటాం. అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి 3 శాతాన్ని పెంచాలని ఇటీవలే ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థికమంత్రిని కోరా. ఈ ఎఫ్‌ఆర్‌బీఎంను పెంచే అవకాశం ఉంది. ఇక ఎస్‌ఓటీఆర్, ఎస్‌టీఆర్ ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలు రుణాలు 90 శాతం వరకు తీసుకునే అవకాశం ఉంది’’ అని వివరించారు.

దీనిపై జానా స్పందిస్తూ.. ‘‘మీరు సాధించవచ్చు. కానీ మాకు నమ్మకం లేదు’’ అని అన్నారు. అనంతరం భూముల అమ్మకాలపై మాట్లాడుతూ ‘‘భూములు అమ్మితే రూ.6,500 కోట్లు వస్తాయని అన్నారు. వైఎస్ హయాంలో భూములు అమ్మితే పదేళ్ల కాలంలో రూ.10 వేల కోట్లు ఉమ్మడి రాష్ట్రానికే రాలేదు. ఈ మార్చిలోగా రూ.6,500 కోట్లు ఒక్క తెలంగాణలో ఎలా తెస్తారు? అందుకు భూములు ఎక్కడున్నాయి? ఎవరి భూములు అమ్ముతారు.. ఎంత భూమిని అమ్ముతారు?’’ అని ప్రశ్నలు గుప్పించారు. ‘‘మీరు ఊహించి, నమ్మి, ఆశించిన దాన్ని మమ్ముల్ని నమ్మి, ఆశించాలని అంటే ఎలా’’ అని అన్నారు.

రూ.21 వేల కోట్ల గ్రాంట్ ఎలా తెస్తారు?
గ్రాంట్ ఇన్ ఎయిడ్‌పై జానారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ 2012-13లో రూ.7 వేల కోట్లు, 2013-14లో రూ.8,991 కోట్లు వచ్చింది. ఈ లెక్కలతో పోలిస్తే ప్రస్తుతం రూ.21 వేల కోట్ల గ్రాంట్ తేవడం ఎలా సాధ్యం’’ అని అడిగారు. ఇదే సందర్భంలో ఉమ్మడి ఏపీ బడ్జెట్‌ను, ప్రస్తుత తెలంగాణ బడ్జెట్‌ను పోల్చుతూ చలోక్తులు విసిరారు. ‘‘ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే ఉమ్మడి ఏపీలో 2012-13 బడ్జెట్ రూ.1.20 లక్షల కోట్లు, 2013-14లో రూ.1.40 లక్షల కోట్లు పెడితే అది 2014-15కు రూ.1.60 లక్షల కోట్ల వరకు ఉండేది. మరి ఏపీ రూ.1.10 లక్షల కోట్లు, తెలంగాణ రూ.1.06 లక్ష కోట్లు బడ్జెట్ పెడితే అదనంగా ఉన్న రూ.50 వేల కోట్లు ఎలా వస్తాయి? ఇదో ఊహాజనిత, అద్భుత, విచిత్రమైన బడ్జెట్. ఏపీ పెట్టిందని వారికి పోటీగా పెట్టారా?’’ అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు.

ప్రజలకు ద్రోహం చేయకండి..
రుణమాఫీపై మాట్లాడుతూ.. ‘‘రుణమాఫీ గందరగోళంగా ఉంది. మాఫీ చేస్తామని చెప్పాక రైతులు బ్యాంకులకు చెల్లింపులు చేయలేదు. దీంతో వడ్డీలు పెరిగాయి. ఇప్పుడేమో మీరు రుణమాఫీ వల్ల 50 శాతం రుణాలు ఇచ్చారని అంటున్నారు. మిగతా 50 శాతం రైతులు ప్రైవేటు అప్పులు తెచ్చుకోవాల్సిందే. వాటికి 2 శాతం వడ్డీ కట్టినా నాలుగేళ్లలో తడిపి మోపెడవుతుంది. అప్పుడు రుణమాఫీతో లాభం ఏంటీ?’’ అని జానారెడ్డి ప్రశ్నించారు. ‘‘మమ్మల్ని మీరు ద్రోహులని తిట్టినా, తెలంగాణ ప్రజలకు మాత్రం ద్రోహం చేయకండి’’ అని అన్నారు.

దీనిపై ఈటెల స్పందిస్తూ.. ‘‘ద్రోహం చేయకండి అనడం అసమంజసం. రైతుల కష్టాలు, నష్టాలు మాకు తెలుసు. మీరెన్ని రకాలుగా దెప్పిపొడిచినా రైతులకు మేలు చేసి మీతోనే భేష్ అనిపించుకుంటాం’’ అని అన్నారు. తర్వాత జానారెడ్డి భూపంపిణీపై మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ఉన్న 18 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో 10 లక్షల మందికైనా 3 ఎకరాల చొప్పున భూములివ్వాలంటే ఎకరాకు కనీసం రూ.4 లక్షలు వేసినా రూ.2 లక్షల కోట్లు అవుతుంది. ఇది జరగాలంటే టీఆర్‌ఎస్ మూడు పర్యాయాలు అధికారంలోకి రావాలి. అది జరగదు. ప్రస్తుతం బడ్జెట్‌లో కేటాయించిన రూ.వెయ్యి కోట్లతో కేవలం 8,300 మందికే భూములు ఇవ్వొచ్చు’’ అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటెల కలుగజేసుకొని.. ‘‘ప్రస్తుత కేటాయింపులు గతంలో మంజూరై వివిధ దశల్లో ఉన్న వాటిని పూర్తి చేసేందుకు ఇచ్చాం. డబుల్ బెడ్ రూమ్‌లకు తర్వాత కేటాయింపులు జరుపుతాం’’ అని సమాధానమిచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement