'ఏపీ అసెంబ్లీలాగా మనది ఉండొద్దనే..'
హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం వస్తే చాలా మార్పు వస్తుందని ప్రజలు ఆశించారని తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. ఆ విధంగానే కొత్తగా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకుపోవాలని సూచించారు. బుధవారం 12.30గంటల ప్రాంతంలో తెలంగాణ బడ్జెట్పై చర్చ ప్రారంభమైంది. ప్రతిపక్ష నేత జానారెడ్డి ఈ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అనేక పార్టీలు అధికారంలోకి వచ్చాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ తమ ఆకాంక్షలను నెరవేరుస్తుందని ప్రజలు పట్టంకట్టారని, దాన్ని తాము కూడా స్వాగతించామని చెప్పారు.
ప్రజలు ఆశించినట్లుగా ప్రభుత్వ పనిచేస్తే సహకారం ఇస్తామని, లేదంటే ప్రజల పక్షాన ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తామని తెలిపారు. ఈ రాష్ట్రంలో మరో పార్టీ ఉండకూడదని పలువురు మంత్రులు మాట్లాడతారని, అసలు అలా ఎలా మాట్లాడుతారని, ఇలా చేయడానికి వచ్చారా, లేక ప్రజలకోసం వచ్చారా అని ప్రశ్నించారు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా అవే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు.
ప్రజాస్వామ్య ముసుగులో ఇది నియతృత్వం అని అన్నారు. అయిన సర్దుకుపోతున్నామని చెప్పారు. వారెన్ని మాట్లాడితే అంతకు రెట్టిపు మాట్లాడగలం అని, కానీ దానివల్ల ఏం ప్రయోజనం కలుగుతుందని ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీలో ఉన్న లొల్లి మాదిరిగా తెలంగాణ అసెంబ్లీలో ఉండకూడదని సంయమనంతో వ్యవహరిస్తున్నామని జానారెడ్డి అన్నారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని, ఒకనాడు ఒక్కతిగా ఉన్న జయలలిత నేడు పరిపాలన చేస్తోందని, కొన్ని ప్రాంతాలకు పరిమితమైన బీజేపీ నేడు దేశాన్ని పాలిస్తుందన్న విషయం అధికార పార్టీ గుర్తుంచుకోవాలని చెప్పారు.