హైదరాబాద్, న్యూస్‌లైన్: అన్ని రంగాల్లో వెనుకబడిన మేరు కులస్తులను ఆదుకునేందుకు పార్టీలకు అతీతంగా నేతలందరూ ముందుకు రావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన 12వ మేరు మహా సభకు జానారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజ్యాధికారంలో బీసీల భాగస్వామ్యం ఉండాలని అన్నారు. మేరు సంఘం ప్రతిపాదించిన డిమాండ్లను ప్రభుత్వంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి బసవరాజు సారయ్య మాట్లాడుతూ... వెనుకబడిన తరగతులకు రావాల్సిన హక్కులు అడుక్కుంటే రావని, పోరాడి సాధించుకోవాలని సూచించారు... మేరు కులస్తుల ఫెడరేషన్‌కు రూ.200 కోట్లు కేటాయించాలని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, శంకర్రావు, కేవీ కేశవులు, మేరు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కీర్తి ప్రభాకర్, దక్షిణ భారత బీసీ కమీషన్ చైర్మన్ కేసీ కాలప్ప తదితరులు పాల్గొన్నారు.