బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ ఫోకస్
బండా ప్రకాశ్, తక్కళ్లపెల్లి రవీందర్‌రావులపై ప్రచారం
సోషల్ మీడియాలో సీఎం రేవంత్‌తో ప్రకాశ్ ఫొటో
ప్రచారాన్ని కొట్టిపారేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘ఆపరేషన్ ఆకర్ష్’పై మళ్లీ ప్రచారం జోరందుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తిరిగి సొంతగూటికి చేరుతారన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే రామసహాయం సురేందర్‌రెడ్డిని కలిసిన ఆయన.. గత నెల 29న సీఎం రేవంత్ రెడ్డి సమీక్షకు హాజరై ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సంప్రదింపులు చేసినట్లు చర్చ జరుగుతోంది. బస్వరాజు సారయ్యతోపాటు మండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ తక్కళ్లపెల్లి రవీందర్‌రావులపైన సోమవారం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
సీఎం రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం ఇస్తున్న బండా ప్రకాశ్ ఫొటో చక్కర్లు కొట్టింది. అయితే దీనిపై వేర్వేరుగా స్పందించిన బండా ప్రకాశ్, తక్కళ్లపెల్లి రవీందర్‌రావులు తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారంగా కొట్టిపారేశారు. బీఆర్‌ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఎమ్మెల్సీ రవీందర్‌రావు స్పష్టం చేశారు. శాసనమండలి సమావేశాల సందర్భంగా కర్టసీగా సీఎంను కలిసిన ఫొటోలను తాజా ఫొటోలుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ప్రకాశ్ పేర్కొన్నారు.
ఎమ్మెల్సీల్లో ఓరుగల్లుకు బీఆర్‌ఎస్ పెద్దపీట...
గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవుల్లో ఉమ్మడి వరంగల్‌కు పెద్దపీట వేశారు. ఎనిమిది మంది సీనియర్ నేతలకు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో, పార్టీ ప్రస్థానంలో వెన్నుదన్నుగా ఉన్న ఈ జిల్లాకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించారు. సత్యవతి రాథోడ్, బస్వరాజు సారయ్య, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, డాక్టర్ బండా ప్రకాశ్, సిరికొండ మధుసూదనాచారిలకు వివిధ కేటగిరీల కింద ఎమ్మెల్సీలుగా చాన్స్ దక్కింది.
అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జనగామ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందడంతో రాజీనామా చేయగా, ఆయన స్థానానికి జరిగిన ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న(కాంగ్రెస్) ఇటీవలే గెలిచారు. ఎమ్మెల్సీగా ఉండి స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కడియం శ్రీహరి సైతం గెలుపొందినా.. ఆయన కూడా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల సంఖ్య ఆరుకు తగ్గింది. కాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలలో కలిసొచ్చే వారిపై కాంగ్రెస్ గురి పెట్టడం చర్చనీయాంశమవుతోంది.
బీఆర్‌ఎస్‌కు గట్టి షాకేనా..?
నేతల వలసలతో ఇప్పటికే సతమతమవుతున్న బీఆర్‌ఎస్ పార్టీకి ఉమ్మడి వరంగల్‌లో మరో షాక్ తగిలేలా ఉంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపైన కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే బస్వరాజు సారయ్య కాంగ్రెస్‌లో చేరడానికి రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం అదే దారిలో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గత నెల 29న సీఎం రేవంత్ వరంగల్ పర్యటన సందర్భంగా ఆయన సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో సారయ్య భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చేరికలపై చర్చించారన్న ప్రచారం జరిగింది. మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డిని కలిసిన సందర్భంగా రెండు నెలల క్రితమే సారయ్య కాంగ్రెస్‌లో చేరుతారని భావించారు. అయితే ఆయనతోపాటు ఒకేసారి 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలను చేర్చుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం, సీఎం భావించి బ్రేక్ వేశారన్న ప్రచారం కూడా సాగింది. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై ఎమ్మెల్సీ సారయ్య కూడా స్పష్టత ఇచ్చారు. డాక్టర్ బండా ప్రకాశ్, రవీందర్ రావు మాత్రం ప్రచారాన్ని ఖండిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment