Basavaraju Saraiah
-
కాంగ్రెస్‌లోకి బస్వరాజు సారయ్య?
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘ఆపరేషన్ ఆకర్ష్’పై మళ్లీ ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తిరిగి సొంతగూటికి చేరుతారన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే రామసహాయం సురేందర్‌రెడ్డిని కలిసిన ఆయన.. గత నెల 29న సీఎం రేవంత్ రెడ్డి సమీక్షకు హాజరై ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సంప్రదింపులు చేసినట్లు చర్చ జరుగుతోంది. బస్వరాజు సారయ్యతోపాటు మండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ తక్కళ్లపెల్లి రవీందర్రావులపైన సోమవారం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం ఇస్తున్న బండా ప్రకాశ్ ఫొటో చక్కర్లు కొట్టింది. అయితే దీనిపై వేర్వేరుగా స్పందించిన బండా ప్రకాశ్, తక్కళ్లపెల్లి రవీందర్రావులు తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారంగా కొట్టిపారేశారు. బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఎమ్మెల్సీ రవీందర్రావు స్పష్టం చేశారు. శాసనమండలి సమావేశాల సందర్భంగా కర్టసీగా సీఎంను కలిసిన ఫొటోలను తాజా ఫొటోలుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ప్రకాశ్ పేర్కొన్నారు.ఎమ్మెల్సీల్లో ఓరుగల్లుకు బీఆర్ఎస్ పెద్దపీట...గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవుల్లో ఉమ్మడి వరంగల్‌కు పెద్దపీట వేశారు. ఎనిమిది మంది సీనియర్ నేతలకు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో, పార్టీ ప్రస్థానంలో వెన్నుదన్నుగా ఉన్న ఈ జిల్లాకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించారు. సత్యవతి రాథోడ్, బస్వరాజు సారయ్య, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, డాక్టర్ బండా ప్రకాశ్, సిరికొండ మధుసూదనాచారిలకు వివిధ కేటగిరీల కింద ఎమ్మెల్సీలుగా చాన్స్ దక్కింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జనగామ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందడంతో రాజీనామా చేయగా, ఆయన స్థానానికి జరిగిన ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న(కాంగ్రెస్) ఇటీవలే గెలిచారు. ఎమ్మెల్సీగా ఉండి స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కడియం శ్రీహరి సైతం గెలుపొందినా.. ఆయన కూడా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సంఖ్య ఆరుకు తగ్గింది. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలలో కలిసొచ్చే వారిపై కాంగ్రెస్ గురి పెట్టడం చర్చనీయాంశమవుతోంది.బీఆర్ఎస్కు గట్టి షాకేనా..?నేతల వలసలతో ఇప్పటికే సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి వరంగల్‌లో మరో షాక్ తగిలేలా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపైన కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే బస్వరాజు సారయ్య కాంగ్రెస్‌లో చేరడానికి రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం అదే దారిలో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత నెల 29న సీఎం రేవంత్ వరంగల్ పర్యటన సందర్భంగా ఆయన సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో సారయ్య భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చేరికలపై చర్చించారన్న ప్రచారం జరిగింది. మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డిని కలిసిన సందర్భంగా రెండు నెలల క్రితమే సారయ్య కాంగ్రెస్‌లో చేరుతారని భావించారు. అయితే ఆయనతోపాటు ఒకేసారి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను చేర్చుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం, సీఎం భావించి బ్రేక్ వేశారన్న ప్రచారం కూడా సాగింది. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై ఎమ్మెల్సీ సారయ్య కూడా స్పష్టత ఇచ్చారు. డాక్టర్ బండా ప్రకాశ్, రవీందర్ రావు మాత్రం ప్రచారాన్ని ఖండిస్తున్నారు. -
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి
అందరి కృషి వల్లే ‘నాగోబా’ విజయవంతం శివాలయం నిర్మాణానికి కృషి వచ్చే యేడు నాగోబా జాతర తెలంగాణలోనే.. జిల్లా ఇన్చార్జి మంత్రి సారయ్య ఉట్నూర్/ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్ : కేస్లాపూర్లో కొలువైన నాగోబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున ఇచ్చిన హామీలు నెరవేర్చామని, అందరూ కలిసి కట్టుగా కృషి చేయ డం వల్లే నాగోబా జాతర విజయవం తం అయిందని జిల్లా ఇన్చార్జి మంత్రి బసవరాజు సారయ్య అన్నా రు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో జరుగుతున్న నాగోబా జాతరను పురస్కరించుకుని ప్రభుత్వం గిరిజన దర్బార్ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సోమవారం నిర్వహించిన దర్బార్‌కు జిల్లా ఇన్చార్జి మంత్రి బస్వరాజు సారయ్య హాజరై మాట్లాడారు. నాగోబా సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ స్టాల్స్‌ను పరిశీలించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వేదికపై వివిధ ఆవిష్కరణలు చేశారు. నాగోబా ఆలయ అభివృద్ధికి నిధులు వెచ్చించాం.. : మంత్రి సారయ్య నాగోబా ఆలయంఅభివృద్ధి పనుల్లో భాగంగా దాదాపు రూ.59 లక్షలు వెచ్చించి పనులు పూర్తి చేశామన్నారు. ముత్తునూర్ నుంచి కేస్లాపూర్ వరకు రోడ్డు నిర్మాణానికి మరో రూ.35 లక్షలు వెచ్చిస్తున్నామని త్వరలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయ సమీపంలో శివాలయం నిర్మించాలని ఆదివాసీలు కోరుతున్నారని, ఆలయ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. శివాలయం నిర్మాణంలో నాగోబా భక్తుడిగా తన నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతంతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కావాల్సి మౌలిక వసతులు ఏజెన్సీలో పుష్కలంగా ఉన్నాయన్నారు. అటవీ హక్కుల కల్పనలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్టంలో ఏ జిల్లాలోలేని విధంగా దాదాపు 37 వేలకు పైగా గిరిజనులకు సుమారు 4 లక్షలకు పైగా ఎకరాల అటవీ భూములపై హక్కులు కల్పించామన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీల పరిస్థితిని గమనించిన ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు శ్రీకారం చుట్టిందన్నారు. సబ్‌ప్లాన్ రావడానికి జిల్లా ప్రేరణ అన్నారు. అనంతరం జాతర సందర్భంగా నిర్వహించిన క్రీడాపోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. సమస్యలు పరిష్కారం కావడం లేదు.. : ఆదివాసీ సంఘాల నాయకులు ప్రభుత్వాలు ఎన్ని మారిన ఆదివాసీలు అభివృద్ధి చెందడం లేదని ఆదివాసీ సంఘాల నాయకులు మండిపడ్డారు. రాజ్యాంగంలో ఆదివాసీల మనుగడకు రూపొందించిన చట్టాలు సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో ప్రభుత్వ ఉద్యోగాలకు అధికారులు ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు తీసుకురమంటున్నారని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు ఆత్రం తిరుపతి అన్నారు. 1950 కంటే ముందు ఏజెన్సీలో బతుకుతున్నా ఆదివాసీలకు ఏజెన్సీ ధ్రువీకరణ ప్రతాలు అధికారులు ఇవ్వడం లేదు. కానీ 1976-77 ప్రాంతంలో గిరిజనులుగా గుర్తించబడ్డ లంబాడాలకు 1950 నుంచి ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు ఏలా ఇస్తారంటూ ప్రశ్నించారు. ఆదివాసీలకు ఓటరు లిస్టు ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలన్నారు. దర్బార్‌లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు తీర్మాణం చేయాలని ప్రధాన్ పురోహిత్ సంఘం జిల్లా అధ్యక్షుడు అర్క కమ్ము డిమాండ్ చేశారు. కేస్లాపూర్లో గిరిజన బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. కేస్లాపూర్ సర్పంచ్ నాగ్నాథ్ మాట్లాడుతూ నాగోబా ఆలయం సమీపంలోని వడమర వద్ద రూ. 50 లక్షలతో షెడ్లు నిర్మించడం ద్వారా మెస్రం వంశీయుల విడిదికి సౌకర్యంగా ఉంటుందన్నారు. ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు బోజ్జు మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పాఠశాలల పిల్లలను ఆశ్రమాలకు తరలించడం వల్ల ఆయా పాఠశాలలు పూర్తిగా మూత పడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశపెద్దలు ఆర్డీవో రాంచంద్రయ్య, ఏవో భీమ్, ఈఈటీడబ్ల్యూ శంకరయ్య, ఏజెన్సీ డీఈవో సనత్‌కుమార్, జీసీడీవో ఇందిరా, ఏఎస్పీ జోయల్ డెవీస్, పీఈటీసీ ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, గుంజాల లిపి అధ్యయన వేదిక కన్వీనర్ జయదీర్ తిరుమల్‌రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు రవీందర్ రావు, నాయకులు రేఖ శ్యాం నాయక్, హరినాయక్, భరత్ చౌహన్, నరేష్, మర్సకోల తిరుపతి, కనక యాదవ్ రావు, తిరుపతి, జమునానాయక్, తుకారం, చంద్రయ్య, మచ్చ శంకరయ్య, రాజేశ్వర్ పాల్గొన్నారు. రాష్ట్ర పండుగగా గుర్తింపు తేవడానికి కృషి చేశాం జిల్లాలో ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా జాతరకు జల్.. జంగల్.. జమీన్ నినాదంలో అడవి బిడ్డల హక్కుల కోసం పోరాడిన కొమురం భీమ్ వర్ధంతి వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తింపు తేవడానికి జిల్లా యంత్రాంగం కృషి చేసి విజయం సాధించిందని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. గిరిజన యూనివర్సిటీ కోసం రాష్ట్ర గవర్నర్‌కు మరో సారి ప్రతిపాదనలు పంపించామన్నారు. కొమురం భీమ్ ప్రాజెక్టు ద్వారా ఏజెన్సీలోని నార్నూర్, కెరమెరి, సిర్పూర్(యు), జైనూర్ మండలాలకు శాశ్వత తాగునీటి వసతుల కల్పనకు రూ.68 కోట్లతో పనులు చేస్తున్నామన్నారు. రెండో విడతలో భాగంగా మరో రూ.10 కోట్లు వెచ్చించి ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాలకు తాగునీరు అందించేందుకు పనులు చేపట్టడం జరిగిందన్నారు. గుంజాల గ్రామంలో బయట పడ్డ గోండు లిపి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాన్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో వాచకంను ప్రవేశపెడుతామన్నారు. జిల్లా వ్యాప్తంగా గిరిజన యువతీయువకులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడానికి ఐదు యూత్ ట్రెయినింగ్ సెంటర్ల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇంద్రవెల్లి మండలంలో రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని, ముత్తునూర్ నుంచి కేస్లాపూర్ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.35 లక్షలు ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు వివరించారు. ఉద్యోగాల భర్తీకోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలో ఉపాధి పథకంలో భాగంగా వంద పని దినాలకు బదులు 150 పని దినాలు గిరిజనులకు కల్పిస్తామన్నారు. - కలెక్టర్ అహ్మద్‌బాబు లోటుపాట్లు ఉంటే మన్నించండి.. నాగోబా జాతర ఏర్పాట్లలో ఏమైన లోటుపాట్లు ఉంటే మన్నించాలని ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్ స్పష్టం చేశారు. జాతరకు రోజుకు 70 వేల మంది భక్తులు వచ్చారన్నారు. గతంలో ఇక్కడ గిరిజన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం డీఎడ్ కళాశాల ఉండేదని, మళ్లీ ఆ కళాశాలను తిరిగి ప్రారంభించేలా ఐటీడీఏ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. - జనార్దన్ నివాస్, ఐటీడీఏ పీవో సమస్యలపై అధికారులు స్పందించడం లేదు.. గిరిజన సమస్యలపై కలెక్టర్, ఐటీడీఏ పీవో స్పందించడం లేదు. ఓ ప్రజాప్రతినిధిగా గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని ఎన్నిమార్లు చెప్పినా పరిష్కరించడం లేదని మండిపడ్డారు. ఏటా గిరిజనులు మృత్యువాత పడుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. ఉట్నూర్ కేంద్రంగా ఏరియా ఆస్పత్రిని ఏర్పాటు చేసి గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలి. ఎంతమంది కలెక్టర్లు, పీవోలు వచ్చినా గిరిజనాభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. - సుమన్ రాథోడ్, ఖానాపూర్ ఎమ్మెల్యే ఆదివాసీ దేవుళ్ల రక్షణకు కమిటీ వేయాలి.. ఆదివాసీ సంస్కృతి సంరక్షణకు, ఆదివాసీ దేవుళ్ల రక్షణకు ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా ప్రత్యేక కమిటీ వేయాలి. జిల్లావ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీ దేవుళ్ల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. ఏజెన్సీలో గిరిజన యూనివర్సిటీ కోసం తనవంతుగా కృషి చేస్తానన్నారు. - ఆత్రం సక్కు, ఎమ్మెల్యే -
మంత్రితో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే
వరంగల్: మంత్రి బసవరాజు సారయ్యతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వాగ్వాదానికి దిగారు. తన డివిజన్ లో సమస్యలు పరిష్కరించడంలో కుట్ర జరుగుతుందంటూ మంత్రిని నిలదీశారు. విలీన గ్రామాల సమస్యలను పరిప్కరించాలని డిమాండ్ చేస్తూ కార్పోరేషన్ కార్యాలయాన్ని టీఆర్ఎస్ బుధవారం ముట్టడించింది. విలీన గ్రామాల అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించాలంటూ పట్టుబట్టడంతో అక్కడే ఉన్న మంత్రి బసవరాజు కలగజేసుకున్నారు. తన డివిజన్ లో సమస్యలు పరిష్కరించాలంటూ ఆయన బసవరాజు, కమీషనర్ లతో మాటల యుద్ధానికి దిగారు. -
పైకా ఉమెన్స్ క్రీడలు ప్రారంభం
-
మంత్రి లేకుండానే...
ఉట్నూర్, న్యూస్‌లైన్ : జిల్లా ఇన్చార్జి మంత్రి బస్వరాజు సారయ్య ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయాల్సి ఉండగా అదేం చేయకుండా హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. దీంతో ఆయన స్థానంలో అధికారులు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఈ తతంగాన్ని పూర్తి చేశారు. ఇదీ సంగతి మంత్రి బస్వరాజు సారయ్య శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు జిల్లాలో అధికారికంగా పర్యటన చేపట్టేందుకు శనివారం జిల్లాకు వచ్చారు. తన పర్యటనలో మొదటి రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాత్రి ఉట్నూర్‌లో బస చేశారు. ఆదివారం ఆయన ఉట్నూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా శనివారం రాత్రే ఉట్నూర్ నుంచి వెళ్లిపోవడంతో సంబంధిత పనులుకు అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేయాల్సి వచ్చింది. ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జునియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ అహ్మద్‌బాబు, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఎంపీ రాథోడ్మ్రేశ్, స్థానిక ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ హాజరయ్యారు. రూ.4 కోట్ల 60 లక్షల 95 వేల విలువ గల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పథకాలందేలా చర్యలు కలెక్టర్ అహ్మద్‌బాబు మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ఏజెన్సీ గ్రామాల ప్రజలకు అందేలా తగు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఏజెన్సీలో గిరిజన బాలికల కోసం ఉట్నూర్‌లో మూడు రూ.కోట్లతో సమీకృత వసతి గృహ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లోని పలు గిరిజన గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు రూ.80.95 లక్షలు, ఉట్నూర్‌లో వివిధ పనులకు రూ.33.75 లక్షలు, జూనియర్ కళాశాలకు రూ.46.25 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు వివరించారు. గిరిజన గ్రామాలకు సురక్షిత నీరు అందించేందుకు కొమురం భీమ్ ప్రాజెక్టు వద్ద చేపట్టిన మొదటి దశ పనులు జనవరిలోగా పూర్తి చేసి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2012-13 ఏజెన్సీ డీఎస్సీ రాసిన గిరిజన అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వులు అందించేందుకు ఇప్పటికి ఆరుసార్లు అవకాశం కల్పించామని, అయినా అభ్యర్థులు వారి ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు అందజేయలేదని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను నియమించాలి అనంతరం ఎంపీ రాథోడ్ రమేశ్, ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్ మాట్లాడుతూ, ప్రభుత్వం కోట్లాది రూపాయలతో మౌళిక వసతులు కల్పిస్తున్నా నాణ్యమైన బోధన అందించేందుకు ఉపాధ్యాయుల కొరత ఉందని అన్నారు. ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయాల్సిన మంత్రి చేయకుండానే వెళ్లిపోవడం సరికాదని అన్నారు. మంత్రి ఏజెన్సీ గిరిజన సమస్యలపై పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆర్డీవో రాంచంద్రయ్య, ఈఈటీడబ్ల్యూ శంకరయ్య, తహశీల్దార్ చిత్రు, ఇన్చార్జి ఎంపీడీవో రమాకాంత్‌రావు, ఉట్నూర్, లక్కారం, వాడ్గాం సర్పంచులు బొంత ఆశారెడ్డి, మర్సకోల తిరుపతి, గాంధారి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, నియోజకవర్గ ఇన్చార్జి హరినాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ హైమద్, టీడీపీ మండల అధ్యక్షుడు సాడిగె రాజేశ్వర్, నాయకులు తుకారం, చంద్రయ్య, రవి, పూజారి శివాజీ పాల్గొన్నారు. -
రాజ్యాధికారంలో బీసీలకు భాగం కావాలి
హైదరాబాద్, న్యూస్‌లైన్: అన్ని రంగాల్లో వెనుకబడిన మేరు కులస్తులను ఆదుకునేందుకు పార్టీలకు అతీతంగా నేతలందరూ ముందుకు రావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన 12వ మేరు మహా సభకు జానారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజ్యాధికారంలో బీసీల భాగస్వామ్యం ఉండాలని అన్నారు. మేరు సంఘం ప్రతిపాదించిన డిమాండ్లను ప్రభుత్వంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి బసవరాజు సారయ్య మాట్లాడుతూ... వెనుకబడిన తరగతులకు రావాల్సిన హక్కులు అడుక్కుంటే రావని, పోరాడి సాధించుకోవాలని సూచించారు... మేరు కులస్తుల ఫెడరేషన్‌కు రూ.200 కోట్లు కేటాయించాలని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, శంకర్రావు, కేవీ కేశవులు, మేరు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కీర్తి ప్రభాకర్, దక్షిణ భారత బీసీ కమీషన్ చైర్మన్ కేసీ కాలప్ప తదితరులు పాల్గొన్నారు. -
గరం.. గరం
అవినీతి, అక్రమాలపై ప్రజాప్రతినిధుల ధ్వజం ఐఎస్ఎల్ పేరిట రూ.17.36 కోట్ల స్కాంపై నిరసన కాంగ్రెస్ ఫ్లెక్సీల ఏర్పాటుపై ఎంపీ, ఎమ్మెల్యేల ఆందోళన కలెక్టర్ బాబు టీమ్‌కు కితాబు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఉట్నూరు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పాలక మండలి సమావేశం గరం గరంగా సాగింది. ప్రొటోకాల్ నుంచి మొదలుకుని పలు సంక్షేమ, అభివృద్ధి పనుల అమలులో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై రచ్చ రచ్చ అయ్యింది. సుమారు మూడేళ్ల మూడు నెలల తర్వాత శుక్రవారం ఉట్నూరులోని కొమురం భీమ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వం, అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. అటవీశాఖ, డ్వామా, హౌసింగ్, ఐటీడీఏ ద్వారా అమలవుతున్న పథకాలు, ఐఏపీ, ఆర్ఐడీఎఫ్, ఈజీఎస్ నిధుల కేటాయింపులో వివక్ష జరుగుతోందంటూ ధ్వజమెత్తారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం కింద ఓ ప్రైవేట్ ఏజెన్సీకి రూ.17.36 కోట్లు కట్టబెట్టడంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని, వెంటనే తీర్మానం ఆమోదించాలంటూ ఐటీడీఏ పాలకమండలి సమావేశంలో సభ్యులు పట్టుబట్టారు. సుమారు ఆరు గంటలపాటు జరిగిన సమావేశం ఏజెండాలో 23 అంశాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రధానాంశాలపైనే చర్చ సాగింది. ఈ సందర్భంగా ఎంపీ రాథోడ్ రమేశ్, ముథోల్ ఎమ్మెల్యే ఎస్.వేణుగోపాలాచారి, ఇన్చార్జి మంత్రి బస్వరాజు సారయ్య మధ్య పలుమార్లు వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి సారయ్య ఫ్లెక్సీలు,{పొటోకాల్పై వివాదం ఐటీడీఏ పాలకమండలి సమావేశం సందర్భంగా కొమురం భీమ్ కాంప్లెక్స్ ఆవరణలో ఇన్చార్జి మంత్రి బస్వరాజు సారయ్యతోపాటు ప్రభుత్వం, పార్టీ ప్రతినిధుల ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేయడంపై ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీలు రాథోడ్ రమేశ్, జి.వివేక్, ఎమ్మెల్యేలు గోడం నగేశ్, జోగు రామన్న, కావేటి సమ్మయ్య, గడ్డం అరవిందరెడ్డి, నల్లాల ఓదేలు, రాథోడ్ సుమన్‌బాయి తదితరులు నిరసన వ్యక్తం చేశారు. ‘ఫ్లెక్సీలు తొలగిస్తే తప్ప సమావేశానికి హాజరుకామని’ సమావేశ మందిరానికి వెళ్లకుండా సమీపంలోని అతిథి గృహానికి చేరుకున్న వారు సుమారు గంటపాటు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎంపీ రాథోడ్ రమేశ్ ‘ఇది కాంగ్రెస్ పార్టీ సమావేశమా? లేక ఐటీడీఏ పాలకమండలి సమావేశమా? అర్థం కావడం లేదు’ అంటూ కలెక్టర్ అహ్మద్ బాబు, ఐటీడీపీ పీవో జనార్దన్ నివాస్ దృష్టికి తీసుకెళ్లి వారితో వాగ్వాదానికి దిగారు. ఇంతలో సమావేశం మందిరానికి చేరుకున్న ఇన్చార్జి మంత్రి బస్వరాజు సారయ్య పరిస్థితి తెలుసుకుని ఎంపీలు, ఎమ్మెల్యేలను సమావేశానికి ఆహ్వానించారు. దీంతో సమావేశ మందిరానికి చేరుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫ్లెక్సీల వివాదం తేల్చాకే సమావేశాన్ని ప్రారంభించాలని పట్టుబట్టగా మంత్రి సారయ్య, కలెక్టర్ అహ్మద్ బాబుల ఆదేశం మేరకు పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది ఫ్లెక్సీలను తొలగించడంతో గొడవ సద్దు మణిగింది. ఫ్లెక్సీల వివాదం సద్దుమణిగిన తర్వాత తమ నియోజకవర్గంలోని కడెంలో తాను లేకుండా అభివృద్ధి పనులు మంత్రి సారయ్య ప్రారంభించారని ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ ప్రోటోకాల్ వివాదం లేవనెత్తారు. ఐటీడీఏ అధికారుల ద్వారా ముందే సమాచారం పంపించామని కలెక్టర్ అహ్మద్ బాబు సమాధానం చెప్పారు. రూ.17.36 కోట్ల స్కాంపై విచారణకు డిమాండ్ జిల్లాలో లక్ష మరుగుదొడ్ల నిర్మాణం పేరిట గతంలో పనిచేసిన అధికారులు కొందరు ఎంపీడీవోల ద్వారా ఓ కాంట్రాక్టర్‌కు రూ.17.36 కోట్ల మేరకు చెల్లించి స్కాంకు పాల్పడ్డారంటూ ఎంపీలు, ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. మూడు వేలకు దాటని వ్యక్తి మరుగుదొడ్ల(ఐఎస్ఎల్)కు టూల్ కిట్స్ పేరిట ఓ కాంట్రాక్టర్ రూ.17.36 కోట్లు చెల్లించిన అధికారులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని ఎంపీ రాథోడ్ రమేశ్ పట్టుపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హౌసింగ్, ఉపాధి హామీ పథకం కోసం ఏటా రూ. కోట్లు ఖర్చు చేస్తున్న అధికారులు సక్రమంగా ఖర్చు చేయకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఎంపీ అసంతృ ప్తిని వ్యక్తం చేశారు. హౌ సింగ్‌లో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ అహ్మద్ బాబు ఐఎస్ఎల్ల నిర్మాణంపై సర్వే చేసి ప్రభుత్వానికి ఇటీవలే నివేదిక పంపామని పేర్కొనగా, ఇన్చార్జి మంత్రి సారయ్య వి జిలెన్స్ విచారణకు ఆదేశించనున్నట్లు ప్రకటిం చారు. కాగా వామపక్ష తీవ్ర ప్రాబల్యం గల ప్రాంతాల్లో మంజూరు చేసే ఐఏపీ నిధుల విషయంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యేలు జోగు రామన్న, కావేటి సమ్మయ్య, గోడం నగేశ్, ఆత్రం సక్కు, సముద్రాల వేణుగోపాలాచారి ఆందోళన వ్యక్తం చేశా రు. గిరిజన సమస్యలపై అవగాహన లేకుండా రూ.28 కోట్లతో ఆమోదించిన పనులను తక్షణ మే రద్దు చేసి ఎంపీలు, ఎమ్మెల్యేలు చేసే ప్రతి పాదనలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే గత ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన పనులు ఆమోదం లభించిందని, వాటిని రద్దు చేసే అవకాశం లేదని కలెక్టర్, పీవో వివరించారు. ఎంపీ వ్యాఖ్యలపై నిరసన మూడేళ్ల తర్వాత జరిగిన ఉట్నూరు ఐటీడీఏ పా లకమండలి సమావేశం సుమారు ఆరు గంటల పాటు వాడివేడీగా సాగింది. హౌసింగ్, అటవీ శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థల్లో అవినీతి పెచ్చుపెరిగిందని, అవినీతి అధికారులపై చర్య లు తీసుకునే వారే లేరని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దేశ, రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోతే జిల్లాలో కాంగ్రెస్ నేతలు, అధికారుల కారణంగా అవినీ తి పెచ్చరిల్లిందని, అడవులను సంరక్షించాల్సిన అటవీశాఖ అధికారులు, డీఎఫ్‌వోలు దొంగలు గా మారి స్మగ్లర్లకు సహకరించారంటూ ఎంపీ రాథోడ్ రమేశ్ తీవ్రమైన వ్యాఖ్య లు చేయడంపై డీఎఫ్‌వోలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జన్నారం డీఎఫ్‌వో రామకృష్ణారావు అటవీశాఖ అనుమతులకు సంబంధించి వివరణ ఇస్తున్న సమయంలో ఎంపీ చేసిన వ్యాఖ్యలపై వారు తీ వ్రంగా ప్రతిఘటించి నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ తమను దొంగలంటూ నిరాధారమైన ఆ రోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొనగా... ఆధారాలతో నిరూపిస్తామంటూ ఎంపీ రమేశ్ సవాల్ చేయడంతో ఇరువర్గాల మధ్యన వాగ్వాదం పెరగడంతో మంత్రి సారయ్య జోక్యం చేసుకుని శాంతింప జేశారు. నిజంగానే ఆధారాలుంటే చర్యలు తీసుకుందామని మంత్రి సర్ధిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. మీరొచ్చాకే పరిస్థితి మారింది.. పాలక మండలి సమావేశం ఆద్యంతం నిరసన లు, ఆందోళనలు, విమర్శలు, వాగ్వాదాల మ ధ్యన అవినీతి, అక్రమాలపై చర్చ జరిగినా.. ‘మీరొచ్చాకా జిల్లాలో పరిస్థితి మారింది’ అం టూ చివరకు కొందరు ప్రజాప్రతినిధులు కలెక ్టర్ అహ్మద్ బాబు టీమ్‌కు కితాబు ఇచ్చారు. ఫె ్లక్సీల ఏర్పాటు, ప్రోటోకాల్ వివాదంపై రగిలిన సభ్యులు ప్రజాప్రతినిధులను కలుపుకుని ఇంకా పనిచేయాలంటూ వారికి ధీమా ఇచ్చారు. బ యోడీజిల్ మొక్కల పెంపకం మొదలుకుని, ఐఎస్ఎల్ టూల్‌కిట్స్ పంపిణీ వరకు స్కామ్‌లకు నిలయంగా మారిన సమయంలో రెండున్నర మాసాలుగా పాలన కొంత గాడిన పడినట్లు కనిపిస్తుందని పేర్కొన్నారు. కాగా మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీలు రాథోడ్ రమేశ్, జి.వివేక్, ఎమ్మెల్యేలు గోడం నగేశ్ గడ్డం అరవింద రెడ్డి, జోగు రామన్న, సముద్రాల వేణుగోపాలాచారి, కావేటి సమ్మయ్య, సుమన్ రాథోడ్, ఆత్రం సక్కు, నల్లాల ఓదేలు, గుండా మల్లేశ్, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్‌రెడ్డి హాజరు కాగా ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, నిర్మల్ ఎమ్మెల్యే ఎ.మహేశ్వర్‌రెడ్డి గైర్హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ సుజాత శర్మ, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, డ్వామా, డీఆర్డీఏ పీడీలు వినయ్ కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డిలు, జిల్లా అటవీశాఖాధికారి తిమ్మారెడ్డి, పీఆర్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, ట్రాన్స్‌కో ఎస్ఈలు ఉమా మహేశ్వర్‌రెడ్డి, హంసారెడ్డి, ఇంద్రసేన్, అశోక్‌లు, జేడీఎ రోజ్‌లీల, డీ ఎంహెచ్వో డాక్టర్ స్వామి, డీఎప్వోలు శేఖర్‌రెడ్డి, వినోద్, రామకృష్ణారావులతోపాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
'సీమాంధ్రులు ఎన్ని చేసిన తెలంగాణ ఖాయం'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రులు ఎన్ని ఉద్యమాలు చేసిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడటం ఖాయమని రాష్ట్ర మంత్రి బి.సారయ్య స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సీడబ్ల్యూసీ సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆ నేపథ్యంలో సీమాంధ్రలో నిరసనలు ఉవ్వెత్తున్న ఎగసి పడుతున్నాయి. దాంతో తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం ఎమైన వెనక్కి తగ్గుతుందా అన్న విలేకర్లు అడిగిన ప్రశ్నకు సారయ్య పై విధంగా సమాధానం ఇచ్చారు. -
గతంలో కలిపినదాన్నే విడదీస్తున్నారు:సారయ్య
వరంగల్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం కాదని, గతంలో కలిపినదానినే ఇప్పుడు విడదీస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఫోరం కన్వీనర్ బసవరాజు సారయ్య స్పష్టం చేశారు. అనేక సమస్యల కారణంగా దీనిని విడదీయవలసి వస్తుందన్నారు. రాజకీయాలు చేయడానికి చాలా విషయాలు ఉన్నాయని, అతి సున్నితమైన ఈ విషయాన్ని రాజకీయం చేయడం చాలా బాధాకరం అన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.