వచ్చారు.. వెళుతున్నారు!
* ఢిల్లీ వచ్చి ఎవరినీ కలవకుండానే తిరుగుముఖం పట్టిన టీ-కాంగ్రెస్ నేతలు
* జీవోఎం సభ్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో జానారెడ్డి సహా పలువురు నేతల తిరుగుపయనం
న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుగా తయారైంది తెలంగాణ కాంగ్రెస్ నేతల పరిస్థితి. కేంద్ర మంత్రివర్గ బృంద(జీవోఎం) సభ్యులతోపాటు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలందరినీ కలవాలని శుక్రవారం ఢిల్లీ వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ ఒక్కరినీ కలవకుండానే తిరుగుముఖం పట్టారు. హైకమాండ్ పెద్దలు, జీవోఎం సభ్యులెవరూ అందుబాటులో లేకపోవడం, ఆదివారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని తెలియడంతో చేసేదేమీలేక వెళ్లిపోయారు.
వాస్తవానికి తెలంగాణ బిల్లుకు తుది రూపం ఇచ్చే పనిలో జీవోఎం నిమగ్నమై ఉండటంతో సదరు బిల్లులో ఏకే ఆంటోనీ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోకుండా ఒత్తిడి తేవాలనే లక్ష్యంతోనే తెలంగాణ ప్రజాప్రతినిధులంతా నిర్ణయించారు. దీంతోపాటు సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేలా ఒప్పించాలని భావించారు. అందులో భాగంగా మూడు రోజులపాటు హస్తినలో మకాం వేసి జీవోఎం సభ్యులతోపాటు హైకమాండ్ పెద్దలందరినీ కలవాలని షెడ్యూల్ రూపొందించుకుని పనులన్నీ వాయిదా వేసుకుని మరీ ఢిల్లీ వచ్చారు.
జైపాల్‌రెడ్డి ఇంట్లో భేటీ
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు కె.జానారెడ్డి, డీకే అరుణ, పి.సుదర్శన్‌రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి పి.బలరాం నాయక్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటర మణారెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్, భిక్షమయ్యగౌడ్, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్ సహా పలువురు నేతలు శుక్రవారం ఉదయమే ఢిల్లీ చేరుకున్నారు. వారంతా నేరుగా కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసానికి వెళ్లి అల్పాహార విందు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ నెల 18న ఉదయం 10.30 గంటలకు తెలంగాణ కేంద్ర మంత్రులతో జీవోఎం సమావేశం కానున్న నేపథ్యంలో ఏయే అంశాలను ప్రస్తావించాలనే దానిపై కొద్దిసేపు చర్చించారు. తర్వాత జీవోఎం సభ్యులతోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, ఇతర హైకమాండ్ పెద్దలను కలిసేందుకు ఫోన్లో ప్రయత్నించగా, వారెవరూ ఢిల్లీలో అందుబాటులో లేరని తెలిసింది. దీంతో ఆయా నేతలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఢిల్లీలో ఉన్నారని తెలియడంతో కనీసం ఆయననైనా కలవాలనే ఉద్దేశంతో అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించగా అక్కడి నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిసింది.
మరోవైపు శని, ఆది వారాల్లో కూడా జీవోఎం సభ్యులు, హైకమాండ్ పెద్దలు హస్తినలో అందుబాటులో ఉండే అవకాశాల్లేవని తేల డంతో ఇక అక్కడ ఉండటం అనవసరమనే భావనకు వచ్చా రు. జానారెడ్డి, డీకే అరుణ, సుదర్శన్‌రెడ్డి, భిక్షమయ్య గౌడ్ సహా పలువురు నేతలు సాయంత్రమే హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. జీవోఎంకు నివేదిక అందజేసే బాధ్యతను జైపాల్‌రెడ్డి, రాజనర్సింహకు అప్పగించినట్లు సమాచారం.
అహ్మద్‌పటేల్ అపాయింట్‌మెంట్ కోసం యత్నం..
కొందరు నేతలు మాత్రం పనులన్నీ వాయిదా వేసుకుని ఎలాగూ ఢిల్లీ వచ్చామని, రెండ్రోజులు ఇక్కడే ఉండి సొంత పనులు చక్కదిద్దుకుంటామని చెప్పారు. సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్ ఢిల్లీలోనే ఉన్నారని సమాచారం ఉండటంతో ఆయన అపాయింట్‌మెంట్ కోసం యత్నిస్తున్నారు. మంత్రులంతా హైదరాబాద్ వెళ్లిన తరువాత పౌరసరఫరాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు శుక్రవారం సాయంత్రం 7గంటల సమయంలో ఢిల్లీకి రావడం గమనార్హం. మరోవైపు హస్తినలోనే ఉండిపోయిన నేతలకు కేంద్ర మంత్రి బలరాం నాయక్ విందునిచ్చారు.
నేడు రాహుల్‌తో డిప్యూటీ సీఎం భేటీ
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయనకు శనివారం రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చినట్లు తెలిసింది.