‘స్థానికత’తో తంటాలు | peoples have concern on fees reimbursement | Sakshi
Sakshi News home page

‘స్థానికత’తో తంటాలు

Published Fri, Aug 1 2014 2:30 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

‘స్థానికత’తో తంటాలు - Sakshi

‘స్థానికత’తో తంటాలు

తెలంగాణ విద్యార్థులు ‘ఫీజు’ కోసం.. వారి కుటుంబం 1956 నవంబర్ 1వ తేదీకి ముందు నుంచీ ఇక్కడే నివసిస్తున్నట్లు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

* తెలంగాణవారిమేనని నిరూపించుకోవడం కష్టమనే భావన
* లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటున్న కాంగ్రెస్ నేతలు 1956కు ముందు నుంచీ ఆధారాలెలా చూపాలంటూ ప్రశ్న
* ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వలస వెళ్లిన కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరం
* స్థానికంగా ఉండనందున ‘ధ్రువీకరణ’ ఇవ్వలేమని తేల్చిచెబుతున్న మండలాధికారులు

 
సాక్షి, హైదరాబాద్:
తెలంగాణ విద్యార్థులు ‘ఫీజు’ కోసం.. వారి కుటుంబం 1956 నవంబర్ 1వ తేదీకి ముందు నుంచీ ఇక్కడే నివసిస్తున్నట్లు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాము తెలంగాణ ప్ర జలమే అని నిరూపించుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తుం దనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

1956కు పూర్వం నుంచి తెలంగాణలో ఉన్నట్లు ఆధారాలు చూపితేనే ‘స్థానికత’ సర్టిఫికెట్లు ఇస్తామని రెవెన్యూ అధికారులు తెగేసి చెబుతుండటం తో... ఆ ఆధారాలు ఎలా సేకరించాలంటూ ప్రజలు స్థానిక ప్ర జాప్రతినిధులు, ఎమ్మెల్యే నివాసాలకు క్యూ కడుతున్నారు. ‘ఫీజు’పై ప్రభుత్వ నిర్ణయం వల్ల ఒక్క నల్లగొండ జిల్లాలోనే దాదా పు 5 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడిందని ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి నియోజకవర్గమైన నాగార్జునసాగర్‌లో దాదాపు 70 శాతం మందికి స్థానికత సర్టిఫికెట్లు వచ్చే అవకాశమే లేదని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు అభిప్రాయపడ్డారు.
 
సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జిల్లాలోని ముంపు బాధితులంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ నియోజకవర్గంలో స్థిరపడ్డారని.. వారంతా తెలంగాణ బిడ్డలేనని నిరూపించుకోవడం సాధ్యమయ్యే పనికాదని చెప్పారు. గురువారం అసెంబ్లీ వద్ద భాస్కర్‌రావు మాట్లాడుతూ... తన నియోజకవర్గం మిర్యాలగూడలోనూ దాదాపు ఇదే పరిస్థితి కన్పిస్తోందని, తమకు స్థానిక ధ్రువపత్రాలు ఇప్పించాలంటూ నిత్యం వందలాది మంది తనవద్దకు వస్తున్నారని చెప్పారు.
 
పార్టీ సీనియర్ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో సగం మందికి ‘స్థానికత’ను నిరూపించుకునే పరిస్థితి ఉండదని అభిప్రాయపడ్డారు. పోలవరం ముంపు గ్రామాలు మినహా భద్రాచలం డివిజన్‌లోని నాలుగు మండలాలు తెలంగాణలో ఉన్నాయని, ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆ మండలాల ప్రజలంతా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అనర్హులవుతారని పేర్కొన్నారు.
 
తల్లిదండ్రులు తెలంగాణలో పుడితే చాలు: జానారెడ్డి
‘‘తల్లిదండ్రులు స్థానికులైతే ఆయా కుటుంబాలన్నీ ప్రభుత్వమిచ్చే రాయితీలకు అర్హులేనని తమిళనాడు ప్రభుత్వం నిబంధన పెట్టింది. తెలంగాణలోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తే బాగుంటుంది. అలా కాకుండా 1956 నవంబర్ 1వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించడంవల్ల తెలంగాణ స్థానికతను నిరూపించేందుకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.’’ అని జానారెడ్డి పేర్కొన్నారు.
 
‘‘నల్లగొండ జిల్లా మునగాల, చిలుకూరు, నడిగూడం, కోదాడ మండలాలకు చెందిన ప్రజలెవరికీ స్థానిక ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకూడదని మండలాధికారులు నిర్ణయించారు. ఎందుకంటే మునగాల పరగణాలో ఉన్న ఈ ప్రాంతమంతా 1956కు పూర్వం సీమాంధ్రలో కలిసి ఉండటమే కారణం. ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన పోలవరం ముంపు గ్రామాలు మినహా భద్రాచలం డివిజన్ ప్రజలందరిదీ దాదాపు ఇదే పరిస్థితి..’’
 
‘‘ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సురేష్ కుటుంబం 1956కు పూర్వం నుంచీ అక్కడే ఉంటోంది. అయితే వారికి ఆస్తిపాస్తులేమీ లేకపోవడంతో ఆ కుటుంబం అద్దె ఇళ్లలో నివసిస్తోంది. 1956కు పూర్వం ఇక్కడున్నట్లు ఏ ఆధారం లేనందున ఇప్పుడు వారికి స్థానిక ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు..’’

‘‘నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన రాజేష్ కుటుంబం.. ఊరిలోని ఇల్లు, ఆస్తులన్నీ అమ్మేసుకుని పాతికేళ్ల కింద హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడింది. రాజేష్ తండ్రి, తాత ముత్తాతలంతా మిర్యాలగూడకు చెందిన వారే. ఇంజనీరింగ్ చదువుతున్న రాజేష్ కుమారుడికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించాలంటే 1956కు పూర్వం నుంచే తమ కుటుంబం తెలంగాణలో నివసిస్తున్నట్లు ధ్రువీకరణ పత్రం కావాలి. కానీ మిర్యాలగూడ తహసీల్దార్ మాత్రం రాజేష్ కుటుంబం స్థానికంగా ఉన్నట్లు ఆధారాల్లేనందున స్థానిక ధ్రువీకరణ పత్రం ఇవ్వలేమని తేల్చి చెప్పారు..’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement