'అప్పుడే నయీంని పట్టుకోవాలని ఆదేశించా'
హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీం ఆగడాలపై సిట్ విచారణ మంచిదనని సీఎల్పీ నేత కె.జానారెడ్డి అభిప్రాయపడ్డారు. సిట్ విచారణలో వాస్తవాలు బయటకు రాకపోతే... అప్పుడు సీబీఐ విచారణ గురించి ఆలోచించాలన్నారు. శనివారం హైదరాబాద్లో కె.జానారెడ్డి మాట్లాడుతూ... నేను హోం మంత్రిగా ఉన్నప్పుడు నయీం గురించి కొందరు సమాచారం ఇచ్చారన్నారు.
అయితే లిఖిత పూర్వకంగా మాత్రం ఎవరూ ఇవ్వలేదని చెప్పారు. నయీంను పట్టుకోవాల్సిందిగా నేను పోలీసులను ఆదేశించానని ఆయన గుర్తు చేసుకున్నారు. కానీ అతడి ఆచూకీ దొరకడం లేదని నాకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గడానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హోం మంత్రిగా నేను చేసిన కృషే కారణమని జానారెడ్డి పేర్కొన్నారు.