
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే చంపేస్తారా ?
టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ శాసనసభలో సీఎల్పీ నేత కె.జానారెడ్డి శనివారం హైదరాబాద్లో మండిపడ్డారు.
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ శాసనసభలో సీఎల్పీ నేత కె.జానారెడ్డి శనివారం హైదరాబాద్లో మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే చంపేస్తారా అని టీఆర్ఎస్ ప్రభుత్వన్ని నిలదీశారు. చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా అధికార టీఆర్ఎస్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్ అక్రమాలను అన్ని ప్రజాస్వామిక వేదికలపైనా ఎండగట్టాం, ఫిర్యాదు చేశామని జానారెడ్డి గుర్తు చేశారు. ఇక అంతిమంగా ప్రజల్లోకి వెళ్లి టీఆర్ఎస్ ఆగడాలను ఎండగడతామన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందో టీఆర్ఎస్ నేతలే చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యన్ని రక్షించకుండా అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ఇతర పార్టీ నేతలను ప్రలోభపెట్టి ఎన్నికల్లో గెలవడం అనైతికం, అక్రమం అని జానారెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన వారిని పదవులకు రాజీనామా చేయించాలని టీఆర్ఎస్ నేతలకు జానారెడ్డి సవాల్ విసిరారు.
అయితే టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే చంపేస్తామంటూ తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీకి శుక్రవారం బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కె. జానారెడ్డిపై విధంగా స్పందించారు.