Nomula Narsimhaiah
-
Father's Day: తండ్రిని తలుచుకొని పాట పాడిన ఎమ్మెల్యే నోముల భగత్
సాక్షి, నల్గొండ: అమ్మ నవమాసాలు మోసి జన్మనిస్తే..బతుకంతా ధారపోసి జీవితమిచ్చేది మాత్రం నాన్నే. స్వార్థం లేని ప్రేమతో గుండెలపై ఆడించేది.. కష్టాల్లో నిబ్బరంగా, ఆపదల్లో ధైర్యంగా నిలబడేలా చూసేది నాన్నే. కన్నబిడ్డ ఎదుగుదలకు అహర్నిశలు శ్రమించే శ్రమజీవి నాన్నే. అందుకే.. నాన్న నీకు వందనం. నేడు ప్రపంచ తండ్రుల దినోత్సవం. ఫాదర్స్ డేఏ సందర్భంగా నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ తన తండ్రి నోముల నర్సింహయ్యను తలుచుకొని పాట పాడారు.. నా దారి నువ్వే నాన్నా.. నా ధైర్యం నువ్వే నాన్నా’ అంటూ పాట పాడారు. ఈ పాటను తనే స్వయంగా రాసి తండ్రికి అంకితం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఎమ్మెల్యే తన టట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. ‘మా నాన్నకు అంకితం.. ప్రపంచంలోని నాన్నలందరికీ ఫాదర్స్‌డే శుభాకాంక్షలు’ అనిపేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పాట జనాలకు ఆకట్టుకుంటోంది. చదవండి: Father's Day: తల్లి దూరమైన పిల్లలు.. అమ్మ కూడా... నాన్నే! A small dedication to my father..Happy father's day to all father's out there...#fathersday pic.twitter.com/xuUEXJtC3s — Nomula Bhagath Kumar (@BagathNomula) June 19, 2022 -
‘సవాల్‌గా నిలవనున్న ఉప ఎన్నిక?..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఖాళీ అయిన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంపై అధికార టీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. సుదీర్ఘ కాలం.. వరుస విజయాలతో రికార్డు నమోదు చేసిన జానారెడ్డి(కాంగ్రెస్)పై 2018 ఎన్నికల్లో నోముల(టీఆర్ఎస్) విజయం సాధించారు. ఇక, ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉన్న క్రమంలో.. తిరిగి తమ సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు పరిస్థితులు ఎలా ఉన్నాయని అధికార పార్టీ ఆరా తీయడం మొదలుపెట్టింది. పార్టీ వర్గాల ద్వారా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసూ్తనే.. నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తోందని సమాచారం. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల అనుభవం నేపథ్యంలో ఈసారి గులాబీ అధినాయకత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. సవాల్‌గా నిలవనున్న ఉప ఎన్నిక?.. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చింది. కానీ, దుబ్బాకలో అపజయం తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘గ్రేటర్’ ఫలితాలు కూడా చేదు అనుభవాన్నే మిగిల్చాయి. దీంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఆ పార్టీకి సవాల్‌గా మారింది. దీని కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. నియోజకవర్గంలోని పరిస్థితులను అంచనా వేస్తోంది. 2018 శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాల్లో 9 చోట్ల టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. కానీ, ఆ వెనువెంటనే 2019లో పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో రెండు ఎంపీ స్థానాల్లోనూ (నల్లగొండ, భువనగిరి) ఓటమిని చవి చూసింది. అయితే, తర్వాత హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. అయినా, ఇప్పుడు.. నాగార్జునసాగర్‌లో తన స్థానాన్ని తానే నిలబెట్టుకోవాల్సిన ఆత్మరక్షణలో ఆ పార్టీ ఉంది. సమాచార సేకరణలో నిఘా వర్గాలు.. ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి నోముల నియోజకవర్గంలోనే ఉంటూ అందరికీ అందుబాటులో ఉన్నారు. ఆయన మరణంతో ఈ స్థానం నుంచి ఎవరిని పోటీకి పెడతారన్నది చర్చనీయాంశం అయింది. నోముల తనయుడు, భార్యలో ఎవరికి టికెట్ ఇస్తారన్నదానిపైనే ప్రచారం సాగుతోంది. కానీ, దుబ్బాక ఫలితం తర్వాత టీఆర్ఎస్ అధిష్టానం వారసత్వ రాజకీయాలపై పునరాలోచన చేస్తోందన్న చర్చ వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అభ్యర్థి ఎంపికకు నియోజకవర్గ ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ నిఘా విభాగాల నుంచి ఓ నివేదిక సీఎం కేసీఆర్‌కు అందిందని చెబుతున్నారు. -
ఆ వార్తల్లో నిజం లేదు: కుందూరు రఘువీర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎల్పీ నేత కుందూరు జానా రెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారనే వార్తలు తెగ ప్రచారం అయ్యాయి. నాగార్జునసాగర్ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డిని బరిలో నిలపాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నట్లు.. దీనిపై ఇప్పటికే సంప్రదింపులు జరిపారని, టికెట్ ఆఫర్ చేశారని వార్తలు వినిపించాయి. తాజాగా వీటిపై రఘువీర్ రెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. సంతాప దినాలు ముగిసేవరకు ఈ విషయంపై ఎలాంటి రాజకీయాలు చేయవద్దని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఇక దీనిలో నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల నర్సింహయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జానా రెడ్డి కుమారుడిగా తాను అందరికి సుపరిచితుడనని.. తండ్రి బాటలో నైతిక విలువలతో కూడిన రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాను అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించిన రోజు నుంచే ఉప ఎన్నికలపై వివిధ రాజకీయ పార్టీల వారు గెలుపు పై రకరకాలుగా విషప్రచారానికి తెర తీస్తున్నారు. ఇది చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. విలువలు కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నేతగా తాను కోరేది ఒక్కటే అని.. నోముల నర్సింహయ్య సంతాప దినాలు పూర్తయ్యేవరకు రాజకీయాలు పక్కకు పెట్టాలని రఘువీర్ రెడ్డి సూచించారు. (చదవండి: కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి జానారెడ్డి!) తాను పార్టీ మారుతున్నానని కొన్ని రాజకీయ పార్టీలు దిగజతారుడు రాజకీయ విష ప్రచారం చేయిస్తున్నాయని మండి పడ్డారు. సోషల్ మీడియాలో, మీడియాలో తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న తప్పుడు కథనాలను ఏ ఒక్కరు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. విలువలు కల్గిన రాజకీయాలతో ప్రజలతోనే తన జీవిత ప్రయాణమని తెలియజేశారు రఘువీర్ రెడ్డి. -
నోముల ఆడియో దుమారం
నకిరేకల్: దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణ వాంగ్మూలం పేరుతో ‘నన్ను ఎర్రజెండాతో సాగనంపండి’ అంటూ ఆయన వాయిస్‌తో వచ్చిన ఓ ఆడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రాజకీయ వర్గాల్లో ఇది పెద్ద దుమారాన్ని లేపింది. అయితే చివరికి ఫేక్ అని తేలింది. నోముల నర్సింహయ్య రాజకీయ అరంగేట్రం చేసింది సీపీఎం నుంచే. ఆ పార్టీ తరఫున నకిరేకల్ నుంచి రెండు దఫాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి నాగార్జునసాగర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం నుంచి మరణవాంగ్మూలం అంటూ ఆయన వాయిస్‌తో ఓ ఆడియో వాట్సాప్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ ఆడియో వాస్తవమని కొందరు, ఫేక్ అని మరికొందరు చెప్పుకొచ్చారు. చివరికి కుటుంబ సభ్యులు దీనిపై స్పందించి ఫేక్ అని కొట్టిపారేశారు. ‘మా నాన్న వాయిస్‌తో మిమిక్రీ చేసి, ఆడియోను వైరల్ చేయడం మా కుటుంబానికి ఎంతో బాధ కలిగించింది’ అంటూ ఆయన కుమారుడు భగత్ ఖండించారు. ఆడియో వైరల్‌పై ఎస్పీ రంగనాథ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అభిమానంతోనే ఆడియో చేశా.. ఇదిలా ఉండగా, తాను నర్సింహయ్యతో కలిసి పనిచేశానని, ఆయనపై అభిమానంతోనే ఈ ఆడియో చేసినట్లు కోదాడకు చెందిన ప్రజానాట్య మండలి కళాకారుడు కొండల్ ఓ వీడియోలో స్పష్టం చేశాడు. కానీ కొందరు దీనిని స్వార్థానికి వాడుకుని వైరల్ చేసి ఆ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేశారని చెప్పాడు. నర్సింహయ్య కుటుంబానికి వీడియోలో క్షమాపణ తెలిపాడు. నేడు నోముల అంత్యక్రియలు హాజరుకానున్న సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో జరగనున్నాయి. నోముల కుటుంబానికి చెందిన రెండు ఎకరాల స్థలంలో వారి తల్లిదండ్రుల సమాధుల పక్కనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. ఈ మేరకు అధికారులు, కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం హెలికాప్టర్లో నేరుగా పాలెంకు వచ్చే అవకాశం ఉండటంతో అందుకోసం హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. వీఐపీల వాహనాల పార్కింగ్ కోసం స్థలం చదును చేశారు. అంత్యక్రియల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్‌లు బుధవారం పరిశీలించారు. హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించి తగిన సూచనలు చేశారు. నకిరేకల్ నుంచి పాలెంకు భౌతికకాయం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో భద్రపరిచిన నోముల నర్సింహయ్య భౌతికకాయాన్ని గురువారం ఉదయం 7.30 గంటలకు మొదట నకిరేకల్‌కు తరలిస్తారు. అక్కడ ప్రజల సందర్శనార్థం 10.30 గంటల వరకు ఉంచుతారు. ఆ తర్వాత స్వగ్రామమైన పాలెం తీసుకెళ్తారు. కాగా, అమెరికాలో ఉన్న నోముల కుమార్తె బుధవారం రాత్రి 8 గంటలకు స్వగ్రామానికి చేరుకున్నారు. -
నోముల అకాల మరణం : ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) అకాల మరణంపై నిజామాబాద్ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వెంట నడిచిన గొప్ప నాయకులంటూ నోముల సేవలను గుర్తు చేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూన్నానంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె నోముల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్‌రావుకూడా నోముల మృతిపై విచారం వ్యక్తం చేశారు. (టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత) కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస తీసకున్నారు. ఈ ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో వెంటనే నోములను అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. నోముల మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని టీఆర్ఎస్ శ్రేణులు విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గారి అకాల మరణం వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యాను. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వెంట నడిచిన గొప్ప నాయకులు నోముల నర్సింహయ్య గారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/y6lm4KdxJQ — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 1, 2020 నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గారి ఆకస్మిక మరణం తీవ్ర దురదృష్టకరం. జీవితాంతం ప్రజలకోసం వారి హక్కుల కోసం పోరాడారు. తాను నమ్ముకున్న సిద్ధాంతాలకోసం నిబద్ధతగా పనిచేసిన వ్యక్తి నర్సింహయ్యగారు. వారిమృతి పట్ల తీవ్రసంతాపాన్ని తెలుపుతూ.. వారి కుటుంభసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి pic.twitter.com/67iX9HXRF7 — Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) December 1, 2020 -
‘నందికొండ’కు క్వార్టర్లే అండ..!
నాగార్జునసాగర్ : అరవైఏళ్లుగా స్థానిక పాలనను నోచుకోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలనీలు నందికొండ మున్సిపాలిటీ పేరుతో స్వయం పాలనలోకి వచ్చాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇచ్చిన మాట ప్రకారం సాగర్ కాలనీలన్నింటినీ కలిసి నందికొండ పేరుతో మున్సిపాలిటీగా చేస్తూ ప్రకటించారు. అయితే ఇన్నాళ్లూ కేవలం ప్రాజెక్టు మెయింటెనెన్స్ నిధులతోనే ఎన్నెస్పీ అధికారులు కాలనీల ప్రజల అవసరాలు తీరుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం నందికొండ మున్సిపాలిటీగా మారిన నేపథ్యంలో అన్ని కాలనీల్లోని ప్రజలకు సకల సౌకర్యాలు సమకూర్చాలన్నా.. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలన్నా రూ.లక్షలాది కోట్ల నిధులు అవసరం. ఇందుకు ఇక్కడ నున్న ప్రభుత్వ క్వార్టర్లను విక్రయించాల్సిందేనని..అప్పుడే మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని స్థానికుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే డిమాండ్‌ను సైతం ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. క్వార్టర్లను విక్రయించి వచ్చిన నిధులతో తమ మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని కోరుతున్నారు. ఇదే నినాదాంతో గత అసెంబ్లీభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన నోముల నర్సింహయ్య.. క్వార్టర్లలో నివాసముంటున్న వారికే వాటిని విక్రయింపజేసే విషయాన్ని ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల మున్సిపాలిటీ ఎన్నికల బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించిన సమయంలో కూడా సాగర్‌లోని క్వార్టర్లు విక్రయించే విషయాన్ని సీఎంకు విన్నవించి చర్చించారు. దీంతో ముఖ్యమంత్రి గతంలో నామినల్ రేటుకే పేదలకు విక్రయించిన క్వార్టర్ల వివరాలు, విక్రయించాల్సిన క్వార్టర్ల వివరాల నివేదికను పంపాల్సిందిగా ఆదేశించారు. దీంతో సోమవారం హైదరాబాద్‌లోని సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ క్యాంపు కార్యాలయానికి ఎన్ఎస్పీ ఇంజనీర్లు వివరాలతో కూడిన పైల్‌ను పంపారు. సాగర్ కాలనీల్లోని క్వార్టర్లు 2,861.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇంజనీరుల, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, కూలీలు నివాసముండేందుకుగాను తాత్కాలికంగా హిల్‌కాలనీ, పైలాన్‌కాలనీ, రైట్‌బ్యాంకు కాలనీలను ఏర్పాటు చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిన సమయంలో రైట్‌బ్యాంక్ కాలనీ ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లింది. రెండు కాలనీలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. ఇక్కడ మొత్తం 2,861 క్వార్టర్లు ఉన్నాయి. గతంలో నందమూరితారక రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో సీ–230, డి–113, ఈ–748, ఎండీ–180, బి2–100 మొత్తం సుమారుగా 1,510క్వార్టర్లను విక్రయించారు. ఇక మిగిలినవి ఈఈ–33, ఏఈ–93, ఏ–278, బి–872 క్వార్టర్లు ఉన్నాయి. అంటే మొత్తం 1,351క్వార్టర్లు మిగిలాయి. వీటిని కూడా ప్రభుత్వం మెయింటనెన్స్ బాధ్యతులు చూడకుండా ఏనాడో వదిలేసింది. ఇందులో కొన్ని క్వార్టర్లు కూలిపోగా మరికొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు నివాసముంటున్న క్వార్టర్లను వారే మరమమ్మతులు చేసుకుని ఉంటున్నారు. ఆ క్వార్టర్లు మాత్రమే ప్రస్తుతం పటిష్టంగా ఉన్నాయి. మిగతావన్నీ అవసాన దశకు చేరాయి. -
చంద్రబాబు పచ్చి మోసకారి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
రెంటచింతల (మాచర్ల): ఏపీ సీఎం చంద్రబాబు పచ్చి మోసకారి అని, ఆయన వాగ్దానాలను మళ్ళీ నమ్మి మోసపోవద్దని నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలోని సత్రశాల వద్దనున్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామి దేవస్ధానంలోని స్వామివారికి ఆయన సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ..నాలుగున్నరేళ్లు ప్రధాని మోదీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగి, తన స్వప్రయోజనాల కోసం బీజేపీతో అంటకాగి చంద్రబాబు ఏపీకి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. అబద్ధాలతో ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబును ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్‌తో కలిపి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కేంద్రంలో మంచి ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. -
టీఆర్ఎస్లో.. కొత్త ముచ్చట!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : శాసనసభకు తాజాగా జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు తొమ్మిది స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్లో ఇప్పుడో కొత్త ముచ్చట నడుస్తోంది. ఎన్నికల్లో అభ్యర్థులకు సహకరించిన వారెవరు, కోవర్టు రాజకీయాలకు పాల్పడిన వారెవరన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో ఆ పార్టీ మంచి విజయాలను సొంతం చేసుకున్నా.. గెలిచిన చోట కూడా అభ్యర్థులకు సహకరించని వారు, ఇబ్బందుల పాలు చేసిన సంఘటనలు తదితర అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఓటమి పాలైన నకిరేకల్ నియోజకవర్గంలో కొందరు నాయకులు పార్టీ అభ్యర్థి విజయం కోసం ఏమాత్రం చిత్తశుద్ధితో పనిచేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే.. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలపై పార్టీ వర్గాలు హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి ఈ సారి ఎనిమిదో విజయం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. టీఆర్ఎస్కే చెందిన ఓ నాయకుడు కాంగ్రెస్ శిబిరానికి లోపాయికారీగా సహకారం అందించారని, గులాబీ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సిం హయ్య గత ఎన్నికల్లో ఓడిపోయినా.. ఈసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో ముందునుంచీ ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ వెళ్లారు. అయితే, స్థానికేతరుడన్న కారణంతో మొదట ఇక్కడి నాయకత్వం ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించింది. కానీ, అప్పటికి ఆపద్ధర్మ మంత్రిగా ఉండిన జి.జగదీశ్‌రెడ్డి చొరవతో ఈ గొడవ సద్దుమణిగింది. నోముల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన నాయకులందరితో మాట్లాడిన జగదీశ్‌రెడ్డి వారి చేతులు కలిపించారు. ఫలితంగా నాయకులంతా ఏకతాటిపై నిలబడి అభ్యర్థి విజయం కోసం పనిచేశారు. అయితే.. ఇక్కడే అనుకోని ఓ పరి ణామం చోటు చేసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏం జరిగింది..? అభ్యర్థులకు చేదోడు వాదోడుగా ఉంటారని కొందరు సీనియర్ నాయకులకు ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పారు. ఇలా కొద్ది రోజులపాటు ఎన్నికల వ్యవహారాలు చూసిన ఓ నాయకుడి వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన అభ్యర్థి, ఇతర నేతలు.. పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారని సమాచారం. దీంతో ఆయనను ఆ బాధ్యతలనుంచి తప్పించి, శాసనమండలి సభ్యుడు కర్నె ప్రభాకర్‌కు సాగర్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్ బాధ్యతలు అప్పజెప్పారు. ఈ విషయాలన్నీ బయటకు కనిపించినవే, కార్యకర్తలు అందరికీ తెలిసినవే. అయితే.. ఆ నాయకుడు ఏకంగా ఎదుటి పక్షానికి తమ సొంతింటి సమాచారం, ఎప్పటికప్పుడు.. ఏం జరుగుతుందో చేరవేశాడన్నది ప్రధాన అభియోగం. దీంతోపాటు అభ్యర్థి ఎన్నికల ఖర్చుల కోసం అప్పజెప్పిన బడ్జెట్లో కొంత చేతివాటం కూడా ప్రదర్శించారని చెబుతున్నారు. ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పిన సమయంలోనే, ఎన్నికల ఖర్చుల డబ్బులు కూడా అప్పజెప్పాలని చూసినా, డబ్బుల వ్యవహారం చూసే బాధ్యత తనకు వద్దని, అభ్యర్థికే ఆ డబ్బులు ఇవ్వాలనడంతో పార్టీ అభ్యర్థి నోములకే ఇచ్చారని తెలుస్తోంది. అయితే, ఎంత ఖర్చయ్యింది..? మిగిలింది ఎంత..? ఎంత అప్పజెబుతున్నారో లెక్కలు తీస్తే కనీసం రూ.50లక్షల తేడా కొట్టిందని, ఈ మొత్తం సదరు నాయకుడి చేతివాటం ఫలితమే అన్న నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది. ఈ విషయం మొత్తాన్ని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇక, హుజూర్నగర్ నియోజకవర్గంలోనూ ఓ నాయకుడు అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి దగ్గర ఖర్చుల పేర ప్రతి రోజూ కొంత లెక్క తేడా చూపించారని పార్టీ శ్రేణుల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నకిరేకల్‌లోనూ తెరవెనుక మంత్రాంగం ఈ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. పార్టీ గుర్తు కారును పోలిన ట్రక్ చేసిన నష్టం వల్లే ఓడిపోయినట్లు ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినా, దానికంటే కొందరు టీఆర్ఎస్ నాయకులే లోపాయికారీగా, తెరవెనుక చేసిన మంత్రాంగం వల్లనే ఎక్కువ నష్టం జరిగిందన్న అభిప్రాయం బలం గా ఉంది. నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్ విజయం సాధించినా, అక్కడా ట్రక్ గుర్తు 9,818 ఓట్లు చీల్చింది. దీంతో టీఆర్ఎస్ మెజారిటీ తగ్గింది. తుంగతుర్తి నియోజకవర్గంలో ట్రక్ 3,729 ఓట్లు చీల్చినా అక్కడా అభ్యర్థి విజయం సాధించారు. కానీ, నకిరేకల్ నియోజకవర్గంలో ట్రక్ 10,383 ఓట్లు చీల్చడంతోపాటు కొందరు నాయకుల సహాయ నిరాకరణ, తమ అనుచరులను కాంగ్రెస్‌కు పనిచేయాలని పురమాయించడం వంటి చర్యలు దెబ్బకొట్టాయన్న నిర్ధారణకు వచ్చారని చెబుతున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో గెలిచిన, ఓడిన తమ పార్టీ అభ్యర్థులకు జరిగిన కోవర్ట్ రాజకీయంపై, సదరు నాయకులపై పార్టీ అధినాయకత్వం తీవ్రంగానే ఆలోచిస్తోందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. -
నాకేం అభ్యంతరం లేదు: నోముల
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జానా రెడ్డికి కొన్ని అంశాలు గుర్తు చేయాల్సిన సమయం వచ్చిందని టీఆర్ఎస్ నేత నోముల నర్సింహ్మయ్య వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తే మా పార్టీకి ప్రచారం చేస్తానని జానారెడ్డి గతంలో అన్నారని వెల్లడించారు. వరద కాలువకు ఇరవై ఏండ్ల కింద శంకుస్థాపన చేస్తే మీ హయాం వరకు ఎందుకు పని పూర్తి కాలేదని ప్రశ్నించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనే రైతుబంధు కింద రూ.100 కోట్లు వచ్చాయి...జానారెడ్డి చెక్కులు పంపిణీకి వస్తే మంచిదని అన్నారు. జానారెడ్డి మాకు ప్రచారం చేసినా, మా కండువా కప్పుకున్నా నాకేం అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఇంకా మాట్లాడుతూ..‘ మా నాయకుడు కేసీఆర్ ఏం చెప్పినా వింటాం. కరెంటు విషయంపై మీరు(జానారెడ్డి) అప్పుడు జోష్‌లో అన్నారు. అది గుర్తు చేసుకోండి. ప్రజా తీర్పు కోసం శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్తున్నాం. కేసీఆర్ కిట్ వల్ల ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. 36 పార్టీలను తెలంగాణ కోసం ఏకం చేసిన ఘనత కేసీఆర్‌ది. మీరు ఎంత మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించినా నిజం అదే. రైతు బీమాతో రైతు ధీమాగా ఉన్నాడు. డబుల్ బెడ్రూం గురించి మీరు కబుర్లు చెబుతున్నారు. మీ కన్నా బాగా ఇండ్లను నిర్మిస్తే దానిపై కూడా విమర్శలా..ప్రాజెక్టులు నిర్మిస్తే వాటిపై కేసులు వేస్తారు. నల్గొండ జిల్లాలో మీ కోటలు కూలడం ఖాయం. పన్నెండు సీట్లకు పన్నెండు గెలుస్తా’మని వ్యాఖ్యానించారు. -
జానా కాగితం పులి మాత్రమే
నాగార్జునసాగర్ : సీఎల్పీ నేత, సీనియర్ శాసనసభ్యుడు కె జానారెడ్డిపై టీఆర్ఎస్ నాయకుడు నోముల నర్సింహయ్య విరుకుపడ్డారు. జానారెడ్డి ఒక కాగితం పులి లాంటి వారని విమర్శించారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జానారెడ్డి రైతుల కోసం ఏమీ చేయలేకపోయారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరుతడుల ద్వారా సాగర్ ఆయకట్టుకు రెండు పంటలకు నీరిచ్చి రైతులకు అండగా నిలిచారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే సాధమయ్యేనా అని ప్రశ్నించారు. ఎన్నో సంవత్సరాలుగా మంత్రిగా ఉన్న జానారెడ్డి ఒక్కసారైనా ఎడమకాల్వపై పర్యటించారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ 16 వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్బంగా నిర్వహిస్తున్న వరంగల్ భహిరంగసభ చరిత్ర సృష్టిస్తుందని తెలిపారు. సంవత్సరానికి రెండు పంటలకు సంబంధించి 8 వేల రూపాయలు ఇస్తానని ప్రకటించడం పట్ల రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. అదే విధంగా యాదవులు, నాయీబ్రాహ్మణులు, గిరిజనులు, ముస్లింలు సైతం ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. సంతోషాన్ని వరంగల్ సభకు భారీగా రావడం ద్వారా వారు తెలుపనున్నారన్నారు. నియోజకవర్గంలో 57వేలకు పార్టీ సభ్యత్వాలు చేరాయని, చేరిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా వరంగల్ బహిరంగ సభ పోస్టర్‌ను వారు విడుదల చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కేవీ రామారావు, పగిల్ల సైదులు, అంకతి వెంకటరమణ, రాం అంజయ్యయాదవ్, బొల్లం శ్రీను, బొల్లం రవి, కావేటి రాము, మన్నెం రంజిత్ యాదవ్, పరమేష్, సుజయ్, కేశబోయిన జానయ్య, పిల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. -
విపక్షాలవి బఫూన్ మాటలు: నోముల
సాక్షి, హైదరాబాద్: జిల్లాల ఏర్పాటుపై విపక్షాల విమర్శలు బఫూన్ మాటలని మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మండిపడ్డారు. విపక్షాలు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాయని అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. సీపీఎం ఎక్కడ పోటీ చేసినా కనీసం డిపాజిట్ రాలేదని, ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురించి మాట్లాడటానికి తమ పార్టీ కార్యకర్త చాలని వ్యాఖ్యానించారు. ఇచ్చంపల్లి గురించి తమ్మినేని ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. దళితులు, మైనార్టీల మీద ఆయనది క పట ప్రేమని అన్నారు. తమ్మినేని వల్ల సీపీఎం లాభపడిందో.. నష్టపోయిందో తేల్చుదామని నోముల సవాల్ చేశారు. -
జయ, లాలు బాటలోనే బాబూ నడవాలి
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తక్షణమే రాజీనామా చేయాలని టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య డిమాండ్ చేశారు. గతంలో ఇలాంటి అవినీతి ఆరోపణలు వచ్చినపుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, బీహార్ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ తమ తమ పదవులకు రాజీనామా చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు కూడా వారి బాటలోనే నడవాలని, పదవి నుంచి తప్పుకోవాలని ఆయన సూచించారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు బాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే గవర్నర్ నరసింహన్ పై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారని నోముల విమర్శించారు. గవర్నర్ తప్పుకోవాలంటూ టీ-టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. -
‘నోముల విమర్శలు సరికావు’
సాక్షి,హైదరాబాద్: యాదవుల ఐక్యతను దెబ్బతీస్తున్నారంటూ ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య విమర్శించడం సరికాదని గొల్ల కురుమ హక్కుల పోరాట సమితి పేర్కొంది. నోముల క్షమాపణలు చెప్పాలని శనివారమిక్కడ సమితి నేత దాసరి నగేష్‌యాదవ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న జానా
కుట్రలు, కుతంత్రాల నడుమ పోలింగ్ 60 ఏళ్ల వారికి బదులుగా 20 ఏళ్లవారితో ఓట్లేయించుకున్న ఘనత ఆయనదే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల హాలియా, న్యూస్‌లైన్ : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల విషయంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మేకపోతుగాంభీర్యం ప్రదర్శిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు. గురువారం హాలియాలో ఆ పార్టీ జిల్లా నాయకుడు మల్గిరెడ్డి లింగారెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రశాంతంగానే జరిగాయన్నారు. ఫలితాలు మాత్రం టీఆర్ఎస్కు అనుకూలంగా రానున్నట్లు తెలిపారు. వివాదాస్పదమైన గ్రామాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని స్థానిక రిటర్నింగ్ అధికారితో పాటు జిల్లా కలెక్టర్, స్టేట్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. అయినా స్థానిక రిటర్నింగ్ అధికారి సరిగా స్పందించలేదని ఆరోపించారు. 60 ఏళ్ల వారి ఓట్లను 20 ఏళ్ల వారితో వేయించుకున్నారన్నారు. రిగ్గింగ్‌కు పాల్పడేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ ఏజెంట్లపై దాడులకు పాల్పడడం సిగ్గుచేటని విమర్శించారు. పేరూరు గ్రామ పోలింగ్ బూత్‌లో కూర్చున్న టీఆర్ఎస్ ఏజెంట్‌ను కొడితే ఆపేందుకు అక్కడికి వెళ్లిన తన కుమారుడిని ఎక్కడోనివిరా అంటూ దుర్భాషలాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు. మరి భాస్కర్‌రావు, హనుమంతరావు, నీ కుమారుడు ఎక్కడోళ్లని ఎమ్మెల్యే టికెట్ అడిగారని జానాను ప్రశ్నించారు. ‘మీరు పెద్దరికంతో వ్యవహరిస్తే చేతులెత్తి దండం పెడతా.. లేకుంటే దొండాకు పసరు నుంచి అన్నీ కక్కిస్తా’ అని జానాను హెచ్చరించారు. ఆయన వెంట టీఆర్ఎస్ జిల్లా నాయకులు మల్గిరెడ్డి లింగారెడ్డి, అంకతి వెంకటరమణ, కృష్ణయ్య, ఎక్కలూరి శ్రీనివాస్‌రెడ్డి, కర్ణ నర్సిరెడ్డి పాల్గొన్నారు. -
జానారెడ్డిపై ఎన్నికల సంఘానికి నోముల ఫిర్యాదు
హైదరాబాద్: నాగార్జున సాగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నోముల నరసింహయ్య తన ప్రత్యర్థి మాజీ మంత్రి జానారెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జానారెడ్డి సాగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. జానారెడ్డి డబ్బు ప్రభావంతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జానారెడ్డి ఓటర్లను ప్రలోభ పెడ్తున్నాడని నోముల ఫిర్యాదు చేశారు. -
నోముల పార్టీ వీడడం బాధాకరం: తమ్మినేని
తాము ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని తెలంగాణ రాష్ట్ర సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. ఇప్పటికి 38 ఎమ్మెల్యేలు, 3 ఎంపీ స్థానాలు ఖరారు చేసినట్లు తెలిపారు. మరో మూడు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఖరారు చేయనున్నట్లు చెప్పారు. నోముల నర్సింహయ్య పార్టీ వీడడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. నోముల సీపీఎం పార్టీతో ఉన్న అనుబంధాన్ని తమ్మినేని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. తమ పార్టీ అభివృద్ధి ప్రణాళిక ఈ నెల13 లేదా 14న ప్రకటిస్తామన్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం నోముల నర్సింహయ్య తీసుకున్న సంగతి తెలిసిందే. -
'దొరల పెత్తనానికి' నిరసనగా టీఆర్ఎస్లోకి చేరా
నల్గొండలో దొరల పెత్తనానికి నిరసనగానే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు సీపీఎం మాజీ నేత నోముల నర్శింహయ్య వెల్లడించారు. నోముల నర్సింహయ్య శనివారం హైదరాబాద్‌లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ కోసం సీపీఎంలో ఉంటూనే పోరాటం చేసినట్లు ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతానికి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే ద్రోహం చేశాయంటూ ఆ రెండు పార్టీలపై నోముల నిప్పులు చెరిగారు. నోములతోపాటు కొడంగల్ కాంగ్రెస్ నేత గుర్నాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరారు.