సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎల్పీ నేత కుందూరు జానా రెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారనే వార్తలు తెగ ప్రచారం అయ్యాయి. నాగార్జునసాగర్ టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డిని బరిలో నిలపాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నట్లు.. దీనిపై ఇప్పటికే సంప్రదింపులు జరిపారని, టికెట్ ఆఫర్ చేశారని వార్తలు వినిపించాయి. తాజాగా వీటిపై రఘువీర్ రెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. సంతాప దినాలు ముగిసేవరకు ఈ విషయంపై ఎలాంటి రాజకీయాలు చేయవద్దని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు.
ఇక దీనిలో నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల నర్సింహయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జానా రెడ్డి కుమారుడిగా తాను అందరికి సుపరిచితుడనని.. తండ్రి బాటలో నైతిక విలువలతో కూడిన రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాను అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించిన రోజు నుంచే ఉప ఎన్నికలపై వివిధ రాజకీయ పార్టీల వారు గెలుపు పై రకరకాలుగా విషప్రచారానికి తెర తీస్తున్నారు. ఇది చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. విలువలు కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నేతగా తాను కోరేది ఒక్కటే అని.. నోముల నర్సింహయ్య సంతాప దినాలు పూర్తయ్యేవరకు రాజకీయాలు పక్కకు పెట్టాలని రఘువీర్ రెడ్డి సూచించారు. (చదవండి: కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి జానారెడ్డి!)
తాను పార్టీ మారుతున్నానని కొన్ని రాజకీయ పార్టీలు దిగజతారుడు రాజకీయ విష ప్రచారం చేయిస్తున్నాయని మండి పడ్డారు. సోషల్ మీడియాలో, మీడియాలో తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న తప్పుడు కథనాలను ఏ ఒక్కరు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. విలువలు కల్గిన రాజకీయాలతో ప్రజలతోనే తన జీవిత ప్రయాణమని తెలియజేశారు రఘువీర్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment