‘నందికొండ’కు క్వార్టర్లే అండ..! | Quarters in Nandikonda Municipality is Try to Sale | Sakshi
Sakshi News home page

‘నందికొండ’కు క్వార్టర్లే అండ..!

Published Tue, Jul 23 2019 7:49 AM | Last Updated on Tue, Jul 23 2019 7:50 AM

Quarters in Nandikonda Municipality is Try to Sale - Sakshi

నాగార్జునసాగర్‌ కాలనీల్లోని క్వార్టర్స్‌ వ్యూ

నాగార్జునసాగర్‌ : అరవైఏళ్లుగా స్థానిక పాలనను నోచుకోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కాలనీలు నందికొండ మున్సిపాలిటీ పేరుతో స్వయం పాలనలోకి వచ్చాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇచ్చిన మాట ప్రకారం సాగర్‌ కాలనీలన్నింటినీ కలిసి నందికొండ పేరుతో మున్సిపాలిటీగా చేస్తూ ప్రకటించారు. అయితే ఇన్నాళ్లూ కేవలం ప్రాజెక్టు మెయింటెనెన్స్‌ నిధులతోనే ఎన్నెస్పీ అధికారులు కాలనీల ప్రజల అవసరాలు తీరుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం నందికొండ మున్సిపాలిటీగా మారిన నేపథ్యంలో అన్ని కాలనీల్లోని ప్రజలకు సకల సౌకర్యాలు సమకూర్చాలన్నా.. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలన్నా రూ.లక్షలాది కోట్ల నిధులు అవసరం. ఇందుకు ఇక్కడ నున్న ప్రభుత్వ క్వార్టర్లను విక్రయించాల్సిందేనని..అప్పుడే మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని స్థానికుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే డిమాండ్‌ను సైతం ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.

క్వార్టర్లను విక్రయించి వచ్చిన నిధులతో తమ మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని కోరుతున్నారు. ఇదే నినాదాంతో గత అసెంబ్లీభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన నోముల నర్సింహయ్య.. క్వార్టర్లలో నివాసముంటున్న వారికే వాటిని విక్రయింపజేసే విషయాన్ని ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల మున్సిపాలిటీ ఎన్నికల బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించిన సమయంలో కూడా సాగర్‌లోని క్వార్టర్లు విక్రయించే విషయాన్ని సీఎంకు విన్నవించి చర్చించారు. దీంతో ముఖ్యమంత్రి గతంలో నామినల్‌ రేటుకే పేదలకు విక్రయించిన క్వార్టర్ల వివరాలు, విక్రయించాల్సిన క్వార్టర్ల వివరాల నివేదికను పంపాల్సిందిగా ఆదేశించారు. దీంతో సోమవారం హైదరాబాద్‌లోని సాగర్‌ ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ క్యాంపు కార్యాలయానికి ఎన్‌ఎస్‌పీ ఇంజనీర్లు వివరాలతో కూడిన పైల్‌ను పంపారు.

 సాగర్‌ కాలనీల్లోని క్వార్టర్లు 2,861..
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇంజనీరుల, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, కూలీలు నివాసముండేందుకుగాను తాత్కాలికంగా హిల్‌కాలనీ, పైలాన్‌కాలనీ, రైట్‌బ్యాంకు కాలనీలను ఏర్పాటు చేశారు.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిన సమయంలో రైట్‌బ్యాంక్‌ కాలనీ ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లింది. రెండు కాలనీలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. ఇక్కడ మొత్తం 2,861 క్వార్టర్లు ఉన్నాయి. గతంలో నందమూరితారక రామారావు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో సీ–230, డి–113, ఈ–748, ఎండీ–180, బి2–100 మొత్తం సుమారుగా 1,510క్వార్టర్లను విక్రయించారు. ఇక మిగిలినవి ఈఈ–33, ఏఈ–93, ఏ–278, బి–872 క్వార్టర్లు ఉన్నాయి. అంటే మొత్తం 1,351క్వార్టర్లు మిగిలాయి. వీటిని కూడా ప్రభుత్వం మెయింటనెన్స్‌ బాధ్యతులు చూడకుండా ఏనాడో వదిలేసింది. ఇందులో కొన్ని క్వార్టర్లు కూలిపోగా మరికొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. ఉద్యోగులు, ప్రైవేట్‌ వ్యక్తులు నివాసముంటున్న క్వార్టర్లను వారే మరమమ్మతులు చేసుకుని ఉంటున్నారు. ఆ క్వార్టర్లు మాత్రమే ప్రస్తుతం పటిష్టంగా ఉన్నాయి. మిగతావన్నీ అవసాన దశకు చేరాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement