సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఖాళీ అయిన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంపై అధికార టీఆర్‌ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. సుదీర్ఘ కాలం.. వరుస విజయాలతో రికార్డు నమోదు చేసిన జానారెడ్డి(కాంగ్రెస్)పై 2018 ఎన్నికల్లో నోముల(టీఆర్‌ఎస్) విజయం సాధించారు. ఇక, ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉన్న క్రమంలో.. తిరిగి తమ సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు పరిస్థితులు ఎలా ఉన్నాయని అధికార పార్టీ ఆరా తీయడం మొదలుపెట్టింది. పార్టీ వర్గాల ద్వారా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసూ్తనే.. నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తోందని సమాచారం. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల అనుభవం నేపథ్యంలో ఈసారి గులాబీ అధినాయకత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
సవాల్‌గా నిలవనున్న ఉప ఎన్నిక?..
టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చింది. కానీ, దుబ్బాకలో అపజయం తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘గ్రేటర్’ ఫలితాలు కూడా చేదు అనుభవాన్నే మిగిల్చాయి. దీంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఆ పార్టీకి సవాల్‌గా మారింది. దీని కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. నియోజకవర్గంలోని పరిస్థితులను అంచనా వేస్తోంది. 2018 శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాల్లో 9 చోట్ల టీఆర్‌ఎస్ జయకేతనం ఎగురవేసింది. కానీ, ఆ వెనువెంటనే 2019లో పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో రెండు ఎంపీ స్థానాల్లోనూ (నల్లగొండ, భువనగిరి) ఓటమిని చవి చూసింది. అయితే, తర్వాత హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. అయినా, ఇప్పుడు.. నాగార్జునసాగర్‌లో తన స్థానాన్ని తానే నిలబెట్టుకోవాల్సిన ఆత్మరక్షణలో ఆ పార్టీ ఉంది.
సమాచార సేకరణలో నిఘా వర్గాలు..
ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి నోముల నియోజకవర్గంలోనే ఉంటూ అందరికీ అందుబాటులో ఉన్నారు. ఆయన మరణంతో ఈ స్థానం నుంచి ఎవరిని పోటీకి పెడతారన్నది చర్చనీయాంశం అయింది. నోముల తనయుడు, భార్యలో ఎవరికి టికెట్ ఇస్తారన్నదానిపైనే ప్రచారం సాగుతోంది. కానీ, దుబ్బాక ఫలితం తర్వాత టీఆర్‌ఎస్ అధిష్టానం వారసత్వ రాజకీయాలపై పునరాలోచన చేస్తోందన్న చర్చ వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అభ్యర్థి ఎంపికకు నియోజకవర్గ ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ నిఘా విభాగాల నుంచి ఓ నివేదిక సీఎం కేసీఆర్‌కు అందిందని చెబుతున్నారు.
సవాల్‌గా నిలవనున్న ఉప ఎన్నిక?..
Published Sun, Dec 6 2020 3:02 AM | Last Updated on Sun, Dec 6 2020 7:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment