మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న జానా
- కుట్రలు, కుతంత్రాల నడుమ పోలింగ్
- 60 ఏళ్ల వారికి బదులుగా 20 ఏళ్లవారితో ఓట్లేయించుకున్న ఘనత ఆయనదే
- టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల
హాలియా, న్యూస్‌లైన్ : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల విషయంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మేకపోతుగాంభీర్యం ప్రదర్శిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు. గురువారం హాలియాలో ఆ పార్టీ జిల్లా నాయకుడు మల్గిరెడ్డి లింగారెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రశాంతంగానే జరిగాయన్నారు. ఫలితాలు మాత్రం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా రానున్నట్లు తెలిపారు. వివాదాస్పదమైన గ్రామాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని స్థానిక రిటర్నింగ్ అధికారితో పాటు జిల్లా కలెక్టర్, స్టేట్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. అయినా స్థానిక రిటర్నింగ్ అధికారి సరిగా స్పందించలేదని ఆరోపించారు.
60 ఏళ్ల వారి ఓట్లను 20 ఏళ్ల వారితో వేయించుకున్నారన్నారు. రిగ్గింగ్‌కు పాల్పడేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్ ఏజెంట్లపై దాడులకు పాల్పడడం సిగ్గుచేటని విమర్శించారు. పేరూరు గ్రామ పోలింగ్ బూత్‌లో కూర్చున్న టీఆర్‌ఎస్ ఏజెంట్‌ను కొడితే ఆపేందుకు అక్కడికి వెళ్లిన తన కుమారుడిని ఎక్కడోనివిరా అంటూ దుర్భాషలాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు. మరి భాస్కర్‌రావు, హనుమంతరావు, నీ కుమారుడు ఎక్కడోళ్లని ఎమ్మెల్యే టికెట్ అడిగారని జానాను ప్రశ్నించారు. ‘మీరు పెద్దరికంతో వ్యవహరిస్తే చేతులెత్తి దండం పెడతా.. లేకుంటే దొండాకు పసరు నుంచి అన్నీ కక్కిస్తా’ అని జానాను హెచ్చరించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు మల్గిరెడ్డి లింగారెడ్డి, అంకతి వెంకటరమణ, కృష్ణయ్య, ఎక్కలూరి శ్రీనివాస్‌రెడ్డి, కర్ణ నర్సిరెడ్డి పాల్గొన్నారు.