సాక్షిప్రతినిధి, నల్లగొండ : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తమ సిట్టింగ్ స్థానమైన ఈ నియోజకవర్గాన్ని నిలబెట్టుకునేందుకు అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా.. నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత కె.జానారెడ్డి బరిలోకి దిగుతున్నారు. 2018 ఎన్నికల్లో జానారెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నోముల నర్సింహయ్య సంచలన విజయం సాధించి జానా వరుస విజయాల పరంపరకు చెక్ పెట్టారు. నోముల హఠాన్మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని తిరిగి ఎలాగైనా చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, తమ సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని అధికార టీఆర్‌ఎస్.. సాగర్‌ను దక్కించుకోవడం ద్వారా రాష్ట్ర రాజకీయాలను తన వైపునకు తిప్పుకోవాలని బీజేపీ .. ఇలా మూడుకు మూడు పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి అభ్యర్థిత్వం మాత్రమే తేలగా.. టీఆర్‌ఎస్, బీజేపీలు ఇంకా తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు.
ఆఖరి రోజు అభ్యర్థి ప్రకటన..?
నామినేషన్ల దాఖలుకు ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది. వివిధ రాజకీయ కారణాలు, సామాజిక కోణాలను పరిగణనలోకి తీసుకుంటున్న అధికార టీఆర్‌ఎస్ తమ అభ్యర్థిని అదే రోజు ప్రకటించాలని చూస్తోందని పార్టీ వర్గాల సమాచారం. టీఆర్‌ఎస్ ప్రకటించే అభ్యర్థిని బట్టి.. దానికి అనుగుణంగా తమ క్యాండెట్‌ను ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీలూ చివరి రోజు వరకు వేచి చూస్తాయేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్ నుంచి పలువురు ఆశావహులు టికెట్ కోసం క్యూలో ఉన్నారు. వీరంతా కేవలం రెండు సామాజిక వర్గాలకు చెందిన వారే కావడం గమనార్హం.
నోముల నర్సింహయ్య తనయుడితో పాటు.. అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఇద్దరు కూడా టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డితో పాటు అదే సామాజిక వర్గం నుంచి మరొకరు లైన్‌లో ఉన్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇస్తుందో చూసి.. దానికి భిన్నంగా మరో సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని ఎంపిక చేస్తే.. తమకు లాభిస్తుందని బీజేపీ ఎదురు చూస్తోంది. దీంతో ఇరు పార్టీల అభ్యర్థుల ఖరారు, పేర్ల ప్రకటన చివరి రోజు వరకూ తేలేలా కనిపించడం లేదని విశ్లేషిస్తున్నారు.
పార్టీలో అసంతృప్తులకూ చెక్ పెట్టే వ్యూహం
టికెట్ ఆశించి భంగపడిన వారు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయకుండా.. అసంతృప్తులకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు కూడా అభ్యర్థి ప్రకటనను ఆలస్యం చేయాలన్న వ్యూహంతోనే టీఆర్‌ఎస్ అధినాయకత్వం ఉందని పేర్కొంటున్నారు. టికెట్ రాని వారు బీజేపీ వైపు చూడకుండా అడ్డుకోవడంతోపాటు.. నామినేషన్ దాఖలు తర్వాత కేవలం రెండు వారాల సమయమే ప్రచారం మిగిలి ఉండడంతో రెబల్‌గా బరిలోకి దిగి అన్ని ఏర్పాట్లు చేసుకునే వెసులుబాటు కూడా లేకుండా చేయాలన్న ఎత్తుగడతోనే ఆలస్యం చేస్తారని పేర్కొంటున్నారు.
ఒకవైపు బీజేపీకి అవకాశం ఇవ్వకుండా చూడడం.. మరో వైపు పార్టీలో అసంతృప్తులు, తిరుగుబాట్లు లేకుండా చూసుకోవడంతో అన్న రెండు ప్రయోజనాలు ఆశించే.. టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రకటనను ఆఖరి రోజు వరకూ చేయక పోవచ్చని అంటున్నారు. మరోవైపు అభ్యర్థి ఎంపిక విషయంలో ఆ పార్టీ ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది. దీనికోసం ఇప్పటికే జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు కూడా తీసుకుంది. నిఘావర్గాల ద్వారా నివేదికలు తెప్పించుకుంది. అయినా.. తుది నిర్ణయానికి వచ్చే ముందో సారి జిల్లా ముఖ్యనేతలతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఈ భేటీ ఒకటీ రెండు రోజుల్లో ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment