సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారానికి గురువారం సాయంత్రం 5 గంటలకు తెరపడింది. శనివారం పోలింగ్ జరగనుండటంతో అభ్యర్థులు, స్థానిక నేతలు బూత్ స్థాయిలో ఏజెంట్ల నియామకం, సమన్వయంపై దృష్టి సారించారు. సామాజికవర్గాల ఓట్లను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేశాయి. గత 17న సాగర్ ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడిన నాటి నుంచే నియోజకవర్గంలో రాజకీయ సందడి మొదలవగా, సుమారు 20 రోజులుగా అన్ని పార్టీలు ప్రచారంతో హోరెత్తించాయి.
ప్రధాన రాజకీయ పక్షాల్లో కాంగ్రెస్ మాజీ మంత్రి జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని ముందస్తుగా ప్రకటించగా, టీఆర్‌ఎస్, బీజేపీ చివరి నిమిషం వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఉత్కంఠకు దారితీసింది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కు అవకాశం దక్కగా, బీజేపీ నుంచి డాక్టర్ రవినాయక్ బరిలోకి దిగారు. గతేడాది డిసెంబర్ మొదటి వారంలో నోముల నర్సింహయ్య మరణించగా, టీఆర్‌ఎస్ ఎన్నికల సన్నాహాలను ముందుగానే ప్రారంభించింది. అభ్యర్థి ఎంపికతో సంబంధం లేకుండానే నియోజకవర్గం పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, కొందరు ముఖ్య నేతలకు ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగించింది. మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో పార్టీ కేడర్‌తో సమావేశాలు నిర్వహించిన టీఆర్‌ఎస్, ప్రచార గడువు దగ్గరపడే కొద్దీ గ్రామ స్థాయి మీటింగ్‌లకు ప్రాధాన్యతనిచ్చింది. వివిధ సామాజికవర్గాల మద్దతు కూడగట్టేందుకు టీఆర్‌ఎస్ సర్వశక్తులూ ఒడ్డింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 14న హాలియాలో జరిగిన బహిరంగ సభకు హాజరై పార్టీ ఎన్నికల ప్రచారానికి మరింత ఊపుతెచ్చారు.
సర్వశక్తులూ కూడగట్టుకున్న కాంగ్రెస్
ఇదే నియోజకవర్గం నుంచి గతంలో రెండు పర్యాయాలు ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి జానారెడ్డి మరోమారు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల షెడ్యూలు వెలువడక ముందే గ్రామాలను చుట్టివచ్చిన జానారెడ్డికి మద్దతుగా నామినేషన్ల తర్వాత పార్టీ రాష్ట్ర నేతలు, కేడర్ కూడా ప్రచారంలో కలసి వచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, శాసనసభా పక్షం నేత భట్టి విక్రమార్కతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు మండలాలు, మున్సిపాలిటీల వారీగా ప్రచార బాధ్యతలు స్వీకరించారు. బహిరంగ సభల జోలికి వెళ్లకుండా గ్రామ స్థాయి ప్రచారానికి కాంగ్రెస్ నేతలు పరిమితమయ్యారు. గతంలో జానారెడ్డి చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో జానారెడ్డి అసెంబ్లీలో ఉండాల్సిన అవసరాన్ని పదే పదే ప్రస్తావించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం కూడా సాగర్ చేరుకుని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
చాపకింద నీరులా బీజేపీ ప్రచారం
చివరి నిమిషం వరకు అభ్యర్థి ఎంపికపై గోప్యత పాటించిన బీజేపీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ రవి నాయక్‌ను బరిలోకి దించింది. కాగా, పార్టీ టికెట్ ఆశించిన కడారి అంజయ్య యాదవ్.. టీఆర్‌ఎస్‌లో చేరగా, 2018లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నివేదిత రెడ్డి కొంతకాలం ప్రచారానికి దూరంగా ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు డాక్టర్ లక్ష్మణ్, డీకే అరుణ, విజయశాంతితో పాటు ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఇతర నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌తో పాటు కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ కూడా ప్రచారానికి వచ్చారు. అయితే బీజేపీ బహిరంగ సభల జోలికి వెళ్లకుండా రోడ్‌షోలు, గ్రామ స్థాయి ప్రచారానికి పరిమితమైంది.
‘సాగర్’ ప్రచారానికి తెర.. పోలింగ్‌పై పార్టీల దృష్టి
Published Fri, Apr 16 2021 4:46 AM | Last Updated on Fri, Apr 16 2021 4:51 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment