సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు రాజకీయ నేతల బహిరంగ ప్రచారానికి తెరపడనుంది. నెలరోజులుగా ఉధృతంగా సాగిన ఈ ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్రులు కూడా గ్రామాలన్నీ చుట్టివచ్చారు. గెలుపే ధ్యేయంగా ప్రచారం సాగించారు.
ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో సీఎం కేసీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీఎస్పీ నేత ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నాయకులు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమ పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం సాగించారు. ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తున్న కె.ఎ. పాల్ కూడా తన వినూత్న ప్రచారంతో ఓటర్లలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.
సభలు... సమావేశాలు... ఇంటింటి ప్రచారాలు
మునుగోడు ఉప ఎన్నిక వేడి రెండున్నర నెలల క్రితమే ప్రారంభమైంది. రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచే అన్ని ప్రధాన పార్టీలు మునుగోడుపై దృష్టి సారించాయి. కాంగ్రెస్ ఆగస్టులోనే అక్కడ సభ నిర్వహించి కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేసింది. తర్వాత ఆగస్టు 20న మునుగోడులో జరిగిన బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరు కావడంతో టీఆర్‌ఎస్ పూర్తిస్థాయి ప్రచారాన్ని ప్రారంభించింది. మళ్లీ అక్టోబర్ 30న చండూరులో జరిగిన సభకు కేసీఆర్ వచ్చేంతవరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలకు అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి తరఫున ప్రచార బాధ్యతలు అప్పగించారు.
బీజేపీ అగ్రనేత అమిత్‌షా ఆగస్టు 21న మునుగోడు నియోజకవర్గానికి వచ్చి రాజగోపాల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్నప్పటి నుంచే కమలం పార్టీ ప్రచార ఢంకా మోగించింది. బీజేపీ ఢిల్లీ నేతలు, ఇతర రాష్ట్రాలకు చెందిన మంత్రులు, రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలు ఇక్కడే మకాం వేసి రాజగోపాల్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. ఇక, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తో పాటు ఉత్తమ్, భట్టి, శ్రీధర్‌బాబు, సీతక్క, జగ్గారెడ్డి లాంటి నేతలంతా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి విజయం కోసం గ్రామగ్రామాన ప్రచారం నిర్వహించారు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి శంకరాచారి గెలుపు కోసం ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు పనిచేశాయి. స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ శక్తి మేరకు ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు.
చివరి రోజు ఇలా...!
ప్రచారంలో చివరి రోజైన మంగళవారం సాయంత్రం వరకు మునుగోడు దద్దరిల్లనుంది. టీఆర్‌ఎస్ పక్షాన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు చివరి రోజున రోడ్‌షోల్లో పాల్గొననున్నారు. బీజేపీ ముఖ్య నేతలు, రాష్ట్ర నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు.. 7 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో బైక్‌ర్యాలీలు, రోడ్డుషోల్లో పాల్గొననున్నారు. ఇక, కాంగ్రెస్ మునుగోడులో మంగళవారం జరిపే ‘మహిళా గర్జన’సభకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఇక, ప్రచారం ముగియనున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి నుంచే అన్ని పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పోలింగ్ ఘట్టంపై దృష్టి సారించనున్నారు. చివరి నిమిషంలో ఓటర్లను ఆకర్షించేందుకు ‘అన్ని రకాల’ప్రయత్నాలను చాపకింద నీరులా చేయనున్నారు.
చదవండి: టీఆర్‌ఎస్‌తో జోడీ లేదు
Comments
Please login to add a commentAdd a comment