కరోనా వైద్యపరీక్షలు.. వివరాలు | Medical Examination Of Diagnose COVID-19 Disease | Sakshi
Sakshi News home page

కరోనా వైద్యపరీక్షలు.. వివరాలు

Published Sun, May 2 2021 12:11 AM | Last Updated on Sun, May 2 2021 3:56 AM

Medical Examination Of Diagnose COVID-19 Disease - Sakshi

ప్రస్తుతం కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇందుకోసం కోవిడ్‌ వ్యాధి నిర్ధారణకు రకరకాల పరీక్షలు అవసరమవుతున్నాయి. దాంతో కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తున్న వారంతా ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌లూ, ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు, సీటీ స్కాన్‌ వంటి రకరకాల వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. ఏయే పరీక్షలు ఎందుకు ఉపయోగపడతాయో, వాటిని ఏ సమయంలో చేయించాలో తెలుసుకోవడంతో పాటు... ఆయా పరీక్షల ప్రత్యేకతలు, ప్రాధాన్యాలు... అవి మాత్రమే తెలియజేసే కొన్ని ప్రత్యేకమైన సంగతులు, కొన్ని వైద్య పరీక్షలలోని స్కోర్‌లు, ఆ అంకెలతో  తెలిసివచ్చే వివరాలూ, వ్యాధి తీవ్రత వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఉపయోగపడేదే ఈ సమగ్ర కథనం.

తొలుత ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ గురించి... 
కరోనా వైరస్‌ సోకిందా లేదా అనే విషయాన్ని నిర్ధారణ చేయడానికి ఇది చాలా త్వరగా నిర్వహించగలిగిన వైద్య పరీక్ష. పరీక్ష ఫలితాలూ వేగంగా వస్తాయి. ఫలితాలు కొన్నిసార్లు నెగెటివ్‌ సూచించినా... రోగిలో మాత్రం లక్షణాలు కనిపిస్తూ ఉండవచ్చు. అంటే ఫాల్స్‌ నెగెటివ్స్, ఫాల్స్‌ పాజిటివ్స్‌ వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ. దాంతో ఫలితాల కోణంలో చూసినప్పుడు ఇది పూర్తిగా ఆధారపడదగిన పరీక్ష కాకపోవచ్చు.  

ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ గురించి... 
రివర్స్‌ ట్రాన్‌స్క్రిప్షన్‌ పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ టెస్ట్‌కు సంక్షిప్తరూపమే ‘ఆర్‌టీపీసీఆర్‌’ పరీక్ష. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ కంటే ఆర్‌టీపీసీఆర్‌ ఫలితాలు 48 – 72 గంటలు కూడా పడుతున్నాయి. 

సీటీ స్కాన్‌
ఇటీవల ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు, ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల కంటే సీటీ స్కాన్‌ను ఎక్కువగా డాక్టర్లు విశ్వసిస్తున్నారు. దీనికి కారణం కూడా ఉంది. ఓ వ్యక్తికి కరోనా ఇన్ఫెక్షన్‌ సోకాక లక్షణాలు ఏవీ లేకుండా వ్యాధి దానంతట అదే తగ్గిపోతే అతడికి దాదాపుగా ఎలాంటి ప్రమాదమూ ఉండకపోవచ్చు. కానీ ఒక్కోసారి రోగిలో ఏ లక్షణాలూ బయటకు కనిపించకపోయినా... ప్రాథమిక పరీక్షలు అనదగిన ర్యాపిడ్‌ యాంటీజెన్, ఆర్‌టీపీసీఆర్‌లలో నెగెటివ్, (ఒక్కోసారి పాజిటివ్‌) వచ్చినా... ఊపిరితిత్తుల్లో వ్యాధి కరోనా వైరస్‌ కారణంగా వచ్చిన కోవిడ్‌–19 యేనా, కాదా అన్న విషయం ఇదమిత్థంగా తెలియకపోవచ్చు.

వ్యాధి ఒకవేళ ఊపిరితిత్తులను ప్రభావితం చేసినట్లయితే అందులోని కోరాడ్‌ స్కోర్‌ను బట్టి అది కరోనా వైరస్‌ కారణంగా వచ్చిన వ్యాధియేనా... కాదా అన్నది డాక్టర్లు తెలుసుకుంటారు. అలా కోవిడ్‌ను నిర్ధారణ చేసే సీటీస్కాన్‌ పరీక్ష గురించి విపులంగా తెలుసుకుందాం. కంప్యూటరైజ్‌డ్‌ టోమోగ్రఫీ అనే మాటకు సంక్షిప్తరూపమే సీటీ స్కాన్‌. ఈ పరీక్షలో రేడియేషన్‌ సహాయంతో ఛాతీని పూర్తిగా స్కాన్‌ చేస్తారు. ఛాతీలో ఏవిధమైన సమస్య ఉన్నా సులువుగా  తెలుసుకోవచ్చు. ఊపిరితిత్తుల వ్యాధి నిర్ధారణకు ఎక్స్‌–రే కన్నా ఎన్నో రెట్లు వివరంగా తెలిపే సామర్థ్యం సీటీ స్కాన్‌ పరీక్షకు ఉంది. 

కరోనా వచ్చినవాళ్లకు సీటీ స్కాన్‌ ఎప్పుడు?
కరోనా వచ్చిన వాళ్లకు సీటీ స్కాన్‌ ఎప్పుడు చేయాల్సి వస్తుందో తెలుసుకుందాం. వైద్య విషయాలపై విపరీతంగా పెరిగిపోయిన శ్రద్ధతో... వైద్య నిపుణులు సూచించకపోయినప్పటికీ ఇటీవల  చాలామంది లక్షణాలు కనిపించిన మొదటిరోజే... తమంతట తామే నిర్ణయం తీసుకుని సీటీస్కాన్‌ చేయించుకుంటున్నారు. అలా చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. కరోనా వచ్చిన మొదటిరోజునే వ్యాధి ఊపిరితిత్తుల్లోకి చేరదు. వ్యాధి ఊపిరితిత్తుల్లోకి చేరడానికి కనీసం ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధి పడుతుంది. వ్యాధి కొంతమందిలో అసలు ఊపిరితిత్తుల వరకు కూడా చేరదు. అందుకే కరోనా వ్యాధి లక్షణాలు కనిపించడం మొదలైన తర్వాత ఐదు రోజుల వరకు లక్షణాలు తగ్గకుండా అలాగే కొనసాగుతున్నప్పుడు మాత్రమే సీటీ స్కాన్‌ చేయించాల్సిన అవసరం ఉంటుంది.

జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు రావడం, ఆయాసం రావడం, నీరసంగా ఉండటం వంటి లక్షణాలు వాటంతట అవే తగ్గిపోతే... ఇక సీటీ స్కాన్‌ చేయించాల్సిన అవసరమే ఉండదు. ఈ లక్షణాల్లో ఏ ఒక్కటైనా ఐదు నుంచి ఆరు రోజుల తర్వాత కూడా కొనసాగితే అప్పుడు తప్పక సీటీ స్కాన్‌ చేయించుకుని, డాక్టర్‌కు చూపాలి. వాసన, రుచి తెలియకపోయినా పర్లేదు. ఆ లక్షణాల కోసం మాత్రం సీటీ స్కాన్‌ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అంటే దీన్ని బట్టి మనకు స్పష్టమయ్యే విషయం ఏమిటంటే... లక్షణాలు తగ్గకుండా కొనసాగుతున్న సందర్భాల్లో... అవి మొదలైన ఐదో రోజు తర్వాత సీటీ స్కాన్‌ చేయించుకోవాలన్నమాట. 

వ్యాధి తీవ్రత తెలిసేదెలా? 
మరి వ్యాధి తీవ్రత ఇంత ఉందంటూ చెప్పడానికి సీటీ స్కాన్‌తో అవకాశం లేదా అంటే ఖచ్చితంగా ఉందనే సమాధానమే వస్తుంది. అయితే వ్యాధి తీవ్రతను చెప్పడానికి సీటీ స్కాన్‌లో వేరే విధానాన్ని అవలంబిస్తారు. దీన్ని సీటీ సివియారిటీ స్కోర్‌గా పిలుస్తారు. ఇది రెండు సిస్టమ్స్‌లో ఉంటుంది. ఒక సిస్టమ్‌లో ఊపిరితిత్తులను 5 భాగాలుగా పరిగణించి రిపోర్ట్‌ ఇస్తారు. ఇంకో సిస్టమ్‌లో ఊపిరితిత్తులను 20 భాగాలుగా విభజించి, స్కోర్‌ ఇస్తారు. మొదటి సిస్టమ్‌లో మొత్తం స్కోరు గరిష్టంగా 25 భాగాలు ఉంటుంది. దాంతో రోగి తీవ్రతను బట్టి 1/25 మొదలుకొని 25/25 వరకు స్కోర్‌ ఇస్తూ వ్యాధి తీవ్రతను సూచిస్తారు. ఇక రెండో సిస్టమ్‌లో మొత్తం స్కోరు 40 ఉంటుంది. కాబట్టి పేషెంట్‌ రిపోర్ట్‌ 1/40 నుంచి మొదలుకొని తీవ్రత ఆధారంగా 40/40 వరకు ఇచ్చే అవకాశం ఉంది. 

సివియారిటీ (తీవ్రత) తెలిపే స్కోరే కీలకం 
సీటీస్కాన్‌ రిపోర్టులో అత్యంత కీలకమైన భాగమే ఈ ‘సీటీ సివియారిటీ స్కోరు’. సీటీ సివియారిటీ స్కోరు అధికంగా ఉన్నట్లయితే జబ్బు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా సీటీ సివియారిటీ స్కోర్‌ తీవ్రత తక్కువగా ఉన్నట్లయితే జబ్బు తీవ్రత తక్కువగా ఉన్నట్లు అవగతమవుతుంది. కొన్ని రిపోర్టులలో సీటీ సివియారిటీ స్కోర్‌కు బదులుగా ఊపిరితిత్తులు ఎంత శాతం ఇన్ఫెక్ట్‌ అయ్యాయనే విషయాన్ని రిపోర్ట్‌ చేస్తారు. ఇది కూడా వ్యాధి తీవ్రతను సూచించే కీలకమైన అంశమే. ఇదే సీటీస్కాన్‌లోని కోవిడ్‌ రిపోర్ట్స్‌లో ‘సీటీ’ అనే మరో నంబరు కూడా మనకు ప్రముఖంగా కనిపిస్తుంది. అయితే ఇది సీటీ స్కాన్‌లో కాకుండా ఆర్‌టీపీసీఆర్‌ రిపోర్టులో కనిపిస్తుంది. ‘సీటీ’ అంటే ‘సైకిల్‌ థ్రెషోల్డ్‌’ అని అర్థం. సైకిల్‌ థ్రెషోల్డ్‌ గురించి తెలుసుకోవాలంటే ముదుగా మనం ఆర్‌టీపీసీఆర్‌ ఏవిధంగా చేస్తారు అనేది తెలుసుకోవాలి.

ఆర్‌టీపీసీఆర్‌ ఎలా చేస్తారంటే...
ఆర్‌టీపీసీఆర్‌ అనే పరీక్షలో గొంతులోనుంచి తీసిన స్వాబ్‌ (ఒక రకంగా చెప్పాలంటే అక్కడి శాంపిల్‌) నుంచి వైరస్‌ తాలూకు ఆర్‌ఎన్‌ఏ ను విడదీస్తారు. ఈ ఆర్‌ఎన్‌ఏ ని ఉత్ప్రేరకాల సహాయంతో మరింతగా విస్తరించేలా (ఆంప్లిఫికేషన్‌) చేస్తారు. ఈ ఆంప్లిఫికేషన్‌ అనేది సైకిల్స్‌ (పరిభ్రమణాల)లో ఉంటుంది. ఎన్ని పరిభ్రమణాల (సైకిల్స్‌) తర్వాత ఈ వైరస్‌ను గుర్తిస్తున్నామో... ఆ నంబరును ‘సైకిల్‌ థ్రెషోల్డ్‌’ అంటారు. అంటే... కేవలం తక్కువ పరిభ్రమణాల తర్వాతనే వైరస్‌ కనబడినట్లయితే... వైరస్‌ దేహంలో చాలా ఎక్కువ మోతాదులో ఉన్నట్లు అర్థం. అలా కాకుండా చాలా ఎక్కువ భ్రమణాల (సైకిల్స్‌) తర్వాత వైరస్‌ కనిపిస్తే... దాని మోతాదు దేహంలో చాలా తక్కువ గా ఉందని అర్థం. ఇక 35 భ్రమణాల తర్వాత కూడా వైరస్‌ ను కనుగొనకపోతే అప్పుడు దేహంలో వైరస్‌ లేదని అర్థం. అలాంటి సందర్భాల్లో ఫలితం ‘నెగిటివ్‌’ వచ్చినట్లుగా చెప్పవచ్చు. 

కేవలం 25 సైకిల్స్‌ కంటే తక్కువ ఆంప్లిఫికేషన్స్‌తో వైరస్‌ కనబడట్లుగా అయితే ఎక్కువ మోతాదులో దేహంలో వైరస్‌ ఉందని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎమ్‌ఆర్‌) మార్గదర్శకాల ప్రకారం సైకిల్‌ థ్రెషోల్డ్స్‌ను వ్యాధి నిర్ధారణకు ఉపయోగించుకోవాలి తప్ప... వ్యాధి తీవ్రత ను నిర్ధారణ చేయడానికి కాదు. ఎందుకంటే ఈ సైకిల్‌ థ్రెషోల్డ్‌ వల్ల మనకు తెలుస్తున్న వ్యాధి తీవ్రతకూ... నిజానికి రోగిలో కనిపించే తీవ్రతకూ (క్లినికల్‌ మానిఫెస్టేషన్స్‌)కూ సంబంధం ఉండటం లేదు. అందుకే తీవ్రత సూచించడానికి దీన్ని పరిగణనలోకి తీసుకోకూడదంటోంది ఐసీఎమ్‌ఆర్‌. 

ఇటీ కరోనా వైరస్‌ కారణంగా వచ్చే కోవిడ్‌–19 వ్యాధిని నిర్ధారణ చేయడానికి ఉపయోగిస్తున్న వైద్య పరీక్షలపై స్థూలంగా అవగాహన కల్పించుకోడానికి ఉపయోగపడే అంశాలు. వీటిని కేవలం మన అవగాహన కోసం చదివి తెలుసుకోవాలి తప్ప... వీటి ఆధారంగా సాధారణ ప్రజలు విశ్లేషణలు చేయడం సరికాదు. ఎందుకంటే వైద్యులు ఆ పని కోసం సాధారణ ప్రజల (లే మెన్‌)కు తెలియని మరెన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 

సీటీ స్కాన్‌లో కనిపించే నంబర్లు... వాటి ప్రాధాన్యత 
సీటీస్కాన్‌ రిపోర్టులో మనకు రెండు రకాల నంబర్లు కనిపిస్తాయి. మొదటి నంబరు కోరాడ్‌ నంబరు. అంటే ‘కోవిడ్‌–19 రిపోర్టింగ్‌ అండ్‌ డేటా సిస్టమ్‌’ అనే మాటకు ఇది సంక్షిప్త రూపం అన్నమాట. ఈ నంబరు సహాయంతో కోవిడ్‌ ఉందా లేదా అని చెప్పడానికి ప్రయత్నం చేయడం సాధ్యమవుతుంది. అయితే కోవిడ్‌ తీవ్రతను ఈ నంబరు సూచించదు. ఈ కోరాడ్‌ సిస్టమ్‌లో మనకు 0 నుంచి 6 వరకు అంకెలు కనబడతాయి. అవి వేటిని సూచిస్తాయో వివరంగా చూద్దాం. 
►కోరాడ్‌ – 0 అంటే స్కాన్‌ సరిగా రాలేదని అర్థం. అంటే సాంకేతిక సమస్య వల్ల స్కాన్‌ సరిగా రాలేదని మనకు తెలుస్తుంది. 
►కోరాడ్‌ – 1 అంటే స్కాన్‌ సరిగా వచ్చింది. కానీ అది కోవిడ్‌ ఖచ్చితంగా కాదు. అంటే ఊపిరితిత్తుల్లో ఏ విధమైన ఇన్ఫెక్షన్‌ లేదు అనడానికి సూచన. కేవలం కరోనా వైరస్‌ మాత్రకాదు.. మిగతా ఏ రకమైన వైరల్‌ లేదా బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ లేవు అని అర్థం. 
►కోరాడ్‌ – 2 అంటే అంటే స్కాన్‌లో కోవిడ్‌ జబ్బు ఉండే అవకాశం చాలా తక్కువ అని అర్థం. అయితే ఈ కేటగిరీలో వేరే ఇన్ఫెక్షన్స్‌ ఊపిరితిత్తుల్లో ఉండి ఉండవచ్చు. ఉదాహరణకు బ్రాంకైటిస్‌ లేదా బ్రాంకో నిమోనియా లాంటివి ఉండే అవకాశం ఉందనడానికి సూచన. 
►కోరాడ్‌ – 3  అంటే అది కోవిడ్‌ అయితే కావచ్చు లేదా కాకపోవచ్చు కూడా. 
►కోరాడ్‌ – 4 అంటే కోవిడ్‌ అయ్యేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉందని అర్థం. ఇంకా కొన్ని వేరై వైరల్‌ నిమోనియా కూడా అయి ఉండవచ్చేమో అనేదానికి ఇది సూచన. 
►కోరాడ్‌ – 5 అంటే ఇది దాదాపుగా కచ్చితంగా కోవిడ్‌–19 తాలూకు నిమోనియానే కావచ్చనేందుకు సూచన. 
►కోరాడ్‌ – 6 అంటే సీటీ స్కాన్‌ రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఆర్‌టీపీసీఆర్‌ లేదా ర్యాపిడ్‌ టెస్ట్‌ రిజల్ట్స్‌ పూర్తిగా పాజిటివ్‌ అని అర్థం. అంటే ఈ కోరాడ్‌ –6 కేటగిరీ ప్రకారం అది పూర్తిగా కోవిడ్‌ అవునా, కాదా అని చెప్పడానికి వీలవుతుంది. అంతే తప్ప అది కోవిడ్‌ తీవ్రతకు సూచన కానే కాదు. 
►అందుకే కోరాడ్స్‌ క్యాటగిరీ – 5 ఉంది కాబట్టి అడ్మిట్‌ చేస్తున్నాం అని చెప్పడం సరికాదు. ఇది కోవిడ్‌ డయాగ్నసిస్‌ (వ్యాధి నిర్ధారణకు) సూచనే తప్ప... వ్యాధి తీవ్రతకు సూచన కానేకాదన్న విషయం తెలుసుకోవాలి. 
►వ్యాధి తీవ్రతను సూచించేందుకు ఈ కోరాడ్‌ అనే విధానం ఎంతమాత్రమూ సరిపోదు. 

డా. ఎంఎస్‌ఎస్‌ ముఖర్జీ, సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement