ప్రతీకాత్మక చిత్రం
తల భాగంలోని శ్వాస–జీర్ణ సంబంధ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్స్‌ను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటారు. పెదవులు, నోరు, చిగుర్లు, నాలుక, నేసల్ క్యావిటీ (ముక్కు భాగం), ఫ్యారింగ్స్, స్వరపేటిక వంటి భాగాలలో క్యాన్సర్స్ హెడ్ అండ్ నెక్ కిందికి వస్తాయి. ఈ క్యాన్సర్స్‌లో 90 శాతం వరకు స్క్వామస్ సెల్ కార్సినోమా రకానికి చెందినవి. అంటే మ్యుకస్ ఉండి ఎప్పుడూ తడిగా ఉండే లోపలి పెదవులు, చిగుర్లు, కాలుక వంటి భాగాలలో ఈ క్యాన్సర్ వస్తుంటాయి. మెదడు, అన్నవాహిక, థైరాయిడ్ గ్రంథి, తలలోని కండరాలు, చర్మానికి వచ్చే క్యాన్సర్స్‌ను క్యాన్సర్స్‌ను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లుగా పరిగణించరు.
ఊపిరితిత్తుల క్యాన్సర్స్‌కు లాగానే ఈ క్యాన్సర్స్‌కూ ఆల్కహాల్, పొగాకు, దాని సంబంధిత ఉత్పత్తులే ప్రధాన కారణాలు. తల, మెడకు సంబంధించిన క్యాన్సర్స్‌కు 75% కారణాలుగా పొగాకు, పొగాకు సంబంధిత ఉత్పాదనలు, గుట్కా, పాన్, జర్దా, నస్యం, వక్క, బీడీ, చుట్ట, తమలపాకులు, సిగార్‌లు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆల్కహాల్, పొగాకు... రెండు అలవాట్లూ ఉన్నట్లయితే ముప్పు మరింత ఎక్కువ.
నోటిలో తెలుపు ఎరుపు మిళితమైన మచ్చలు (ప్యాచెస్), గొంతు బొంగురుగా ఉండటం, మింగడంలో ఇబ్బంది, దవడల వాపు, శ్వాస తీసుకోవడం, మాట్లాడటం కష్టం కావడం, తలనొప్పి, వినికిడిశక్తి తగ్గడం, చెవిపోటు... ఇలా క్యాన్సర్ కణితి పెరిగే ప్రదేశాన్ని బట్టి లక్షణాలు అనేక రకాలుగా ఉంటాయి.
లక్షణాలు అనుమానాస్పదంగా ఉంటే బయాప్సీ, ఎమ్మారై, పెట్ స్కాన్ వంటి ఇమేజింగ్ ప్రక్రియలతో క్యాన్సర్ వచ్చిన భాగాన్ని పరీక్షించి స్టేజ్‌నూ, గ్రేడింగ్‌లను నిర్ధారణ చేస్తారు. క్యాన్సర్ వచ్చిన భాగం, స్టేజ్, రోగి వయసు, ఆరోగ్యం వంటి అనేక అంశాల ఆధారంగా చికిత్స ఉంటుంది. సర్జరీ, రేడియేషన్, కీమో, టార్గెటెడ్ థెరపీ లేదా అవసరాన్ని బట్టి కొన్ని కాంబినేషన్ థెరపీలూ నిర్ణయిస్తారు.
హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు ఓరల్ క్యావిటీ అంటే పెదవులు, నాలుక చిగుర్లు, నోటిలోని కింది భాగం, పైభాగం, జ్ఞానదంతాల వెనుకవైపున ఉండే చిగుర్ల వంటి ప్రాంతాల్లో ప్రధానంగా కనిపిస్తుంటాయి.
ఫ్యారింజియల్ : ముక్కు వెనక కూడా ఆ భాగం 5 అంగుళాల లోతు వరకు ఉంటుంది.
లారింజియల్ : మాట్లాడటానికి సహకరించే స్వరపేటిక, వోకల్ కార్డ్స్, ఆహారాన్ని శ్వాసనాళాల్లోకి పోకుండా అడ్డుకునే ఎపిగ్లాటిస్.
పారానేసల్ సైనసెస్‌తో పాటు నేసల్ క్యావిటీ : తల మధ్యభాగంలో ముక్కుకు ఇరువైపులా బోలుగా ఉండే సైనస్‌లు.
లాలాజల (సెలైవరీ) గ్రంథులు : నోటి లోపల కింది భాగంలో దవడ ఎముకలకు ఇరుపక్కలా ఉండే లాలాజల గ్రంథులు.
మన దేశంలో కనిపించే ప్రతి మూడు క్యాన్సర్లలో ఒకటి ఈ తరహా క్యాన్సర్లకు సంబంధించినదై ఉంటుంది. లేటు దశలో గుర్తించడం వల్ల లేదా ఇతర భాగాలకు (మెటాస్టాసిస్) క్యాన్సర్ పాకడం వల్ల ఈ క్యాన్సర్‌కు గురైన వారిలో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. మనదేశంలో ఏడాదికి పది లక్షల మంది వరకు ఈ క్యాన్సర్లకు గురవుతున్నారు. వారిలో దాదాపు రెండు లక్షల మంది వరకు ఈ క్యాన్సర్‌కు సంబంధించినవారే. పొగాకును అనేక రకాలుగా ఉపయోగించడం, సున్నంతో కలిపి ఎక్కువసేపు నోటిలో ఉంచుకోవడం, తమలపాకు, వక్క నమలడం వంటి అలవాట్లే మనదేశంలో ఈ సంఖ్య ఇంతగా పెరగడానికి దోహదం చేస్తున్నాయి.
తొలిదశలో అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 లలో కనుగొంటే... కేవలం సర్జరీతోనే ఈ క్యాన్సర్‌కు శాశ్వత పరిష్కారం లభించవచ్చు. సర్జరీ తర్వాత చాలాసార్లు రీ–కన్‌స్ట్రక్టివ్ సర్జరీ అవసరం ఉంటుంది. స్టేజ్ 3, స్టేజ్ 4 లలో కీమో, రేడియేషన్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 3 డీసీఆర్, వీఎమ్‌ఏటీ, ఐఎమ్‌ఆర్‌టీ, ఐజీఆర్‌టీ, బ్రాకీథెరపీ, బీమ్ థెరపీ వంటి ఆధునిక రేడియోథెరపీ పద్ధతులలో చికిత్స విధానాలుంటాయి. సాధారణంగా ఈ క్యాన్సర్‌కు కీమోథెరపీ పాత్ర ఒకింత తక్కువే అని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కీమోను కంబైన్‌డ్ ట్రీట్‌మెంట్‌గా లేదా కొంతవరకు ఉపశమనంగా ఉపయోగిస్తారు.
ఈ చికిత్స తర్వాత బాధితులు తమకు ఇంతకుముందు ఉన్న అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. నోటి పరిశుభ్రతను పాటించాలి. ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ, జా–స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజ్‌ల వంటివాటిని అనుసరించాలి. డాక్టర్లు సూచించిన మేరకు తప్పనిసరిగా ఫాలో–అప్‌లో ఉండాలి.
మానసిక ఒత్తిడి, విటమిన్ల లోపంతో వచ్చే నోటిపొక్కులు, అల్సర్స్ బాధాకరంగా ఉంటాయి కాబట్టి మనం వాటిని ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాం. నొప్పిలేని వాటిని నిర్లక్ష్యం చేస్తాం. నోటిలో నొప్పిలేకుండా తెలుపు (ల్యూకోప్లేకియా) లేదా ఎరుపు (ఎరిథ్రోప్లేకియా) రంగులో ప్యాచెస్ కనిపించినప్పుడు తప్పక పరీక్షలు చేయించుకోవాలి. చాలామంది డెంటల్ చెకప్స్ లేదా దంత, చిగుర్ల సంబంధిత సమస్యలతో డెంటిస్టుల దగ్గరికి వెళ్లినప్పుడు ఈ సమస్యలు బయటపడుతూ ఉంటాయి. అందుకే తరచూ దంతవైద్యుడిని కలుస్తూ, నోటి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటూ ఉండటం అవసరం.
- డా. సీహెచ్. మోహన వంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్
ఫోన్ నంబరు: 9849022121
Comments
Please login to add a commentAdd a comment