దాదాపుగా అందరికీ జీవితంలోనూ ఏదో ఒక సమయంలో మోచేయి నొప్పి రావచ్చు. మరీ ముఖ్యంగా ఇంటి పనులు చేస్తుండే గృహిణుల్లో ఈ సమస్య ఇంకా ఎక్కువ. ఇలా మోచేతికి సమస్య రావడం ఎందుకంటే... ఇతర దేశాల్లోని మహిళలతో పోలిస్తే మన దేశంలోని మహిళలూ, గృహిణులూ నిత్యం ఏదో ఒక ఇంటిపని చేస్తూనే ఉంటారు. ఈ కారణంతో ఏదో ఓ సమయంలో మోచేతికి వచ్చే సమస్యలు వాళ్లలోనే ఎక్కువగా బయటపడుతుంటాయి. ఇక మరో కారణమేమిటంటే... నిర్మాణపరమైన తేడాలున్నప్పుడు కూడా కొందరిలో మోచేతి సమస్యలు బయటపడుతుంటాయి. మోచేతి సమస్యలపై అవగాహన, నివారణ కోసం ఈ కింది అంశాలు తెలుసుకుందాం.
సాధారణంగా మోచేతికి ఈ కింద పేర్కొన్న సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మోచేతి విషయంలో కనిపించే కొన్ని సమస్యలు...
ఆటల్లో గాయాల వల్ల : క్రికెట్ లేదా టెన్నిస్, బ్యాడ్‌మింటన్ వంటి రాకెట్‌తో ఆడే ఆటల్లోనూ, ప్రధానంగా పురుషుల్లో మరింత ఎక్కువ బరువు వేసి వెయిట్ లిఫ్టింగ్ వంటివి చేసినప్పుడు మోచేయి గాయపడి నొప్పి రావచ్చు. చేతిని వాడాల్సిన పద్ధతిలో ఉపయోగించకుండా అకస్మాత్తుగా కదిలించడం, ఆటలకు ముందు తగినంత వార్మప్ చేయకపోవడం వంటి కారణాలతో ఇలా జరగవచ్చు.
హైపర్ ఎక్స్‌టెండెడ్ ఎల్బోస్ : చేతిని పూర్తిగా చాచినప్పుడు... మోచేతి దగ్గర అది 180 డిగ్రీలు ఉంటుంది. కానీ కొందరిలో అంటే... దాదాపు 30 శాతం మందిలో (అందునా ప్రధానంగా మహిళల్లో) అది 180 డిగ్రీల కంటే ఎక్కువే ఒంపు తిరుగుతుంది. ఇలా 180 డిగ్రీల కంటే కాస్తంత ఎక్కువగా మోచేయి బయటివైపునకు ఒంపు తిరగడాన్ని ‘హైపర్ ఎక్స్‌టెండెడ్ ఎల్బో’గా చెబుతారు. ఇలా ఎక్కువగా ఒంగుతున్నట్లు కనిపించడమన్న అంశమే మహిళలు ఎక్కువగా బరువులు మోసినప్పుడు అది మోచేతి బెణుకుకు కారణమవుతుంటుంది.
ఎపీకాండలైటిస్ : చేతి భాగంలోని ఎముక (ఎపికాండైల్)కు ఒకసారి గాయమయ్యాక, మళ్లీ అదే చోట పదే పదే దెబ్బతగులుతుండటం వల్ల ఆ గాయం తిరిగి రేగుతుండవచ్చు. భుజం కండరాలు కూడా ఈ చోటే ఎముకకు అతికి ఉంటాయి. దాంతో ఏ కొద్దిపాటి శ్రమ చేసినా మళ్లీ గాయం రేగిపోయి నొప్పి వస్తుండవచ్చు. ఒక్కోసారి ఆ నొప్పి ఒకే చోట ఉండవచ్చు లేదా చేయి అంతటికి పాకవచ్చు. ఇలా జరగడాన్నే ల్యాటరల్ ఎపికాండైలైటిస్ అంటారు.
చాలా ఎక్కువగా శ్రమించేవారిలో, ఈ శ్రమలో భాగంగా మోచేతిని ఎక్కువగా వాడేవారిలో కొన్ని సందర్భాల్లో మోచేతి దగ్గర కండరాన్ని ఎముకకు అంటించే ‘టెండన్’ విపరీతంగా అరిగి΄ోవచ్చు. ఇలాంటి కండిషన్‌నే ‘టెన్నిస్ ఎల్బో’గా పేర్కొంటారు. చాలా సందర్భాల్లో ‘ల్యాటరల్ ఎపీకాండైటిస్’నూ ‘టెన్నిస్ ఎల్బో’నూ దాదాపుగా ఒకే అర్థంలో వాడుతుంటారు.
మోచేతి నొప్పి తగ్గాలంటే...
మోచేయి విషయంలో ఏదైనా సమస్య ఉందేమో తెలుసుకోవడానికి ఎవరికి వారే ఇలా చెక్ చేసుకోవచ్చు. మొదట చేతిని చాచాలి. అది 180 డిగ్రీలు చాచగలిగితే పరవాలేదు. లేదంటే ఏదైనా సమస్య ఉందని అర్థం.
మోచేతి ప్రాంతంలో వేలితో నొక్కాలి. లేదంటే ఏదైనా పనిచేస్తున్నప్పుడైనా మోచేతి పరిసరాల్లో నొప్పి వస్తోందంటే ఏదో సమస్య ఉన్నట్లు భావించాలి.
కొన్ని పరిష్కారాలు...
సాధారణంగా మోచేతికి ఏదైనా సమస్య వచ్చినా లేదా నొప్పి మరీ ఎక్కువగా లేక΄ోయినా... ప్రతివాళ్లూ తాము రోజూ చేసినట్లే ఇంట్లోని బరువులు ఎత్తడం / ఆటలాడటం వంటివి చేయవచ్చు. మరీ నొప్పిగా ఉంటే మాత్రం చేతికి తగినంత విశ్రాంతినివ్వాలి.
ఏదైనా ఆటలాడటం వల్ల నొప్పి వస్తుంటే... ఒకవేళ ఆ గాయం తాజాదైతే (1 – 3 రోజులది) దానికి ఐస్‌ప్యాక్ పెట్టవచ్చు.
వేణ్ణీళ్లతోనూ కాపడం పెట్టవచ్చు.
నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఎలక్ట్రోథెరపీ వంటివి చేయించుకోవడం ఒక్కటే సరి΄ోదు. ఇలాంటి గాయాలైన సమయంలో మోచేతికి విశ్రాంతినివ్వడంతోపాటు ఎల్బో, రిస్ట్ స్ట్రెచ్చింగ్ వ్యాయాలు చేయాలి. ఆ సమయంలో మోచేతికి శ్రమ కలిగించడం గానీ లేదా తగిలిన చోటే మళ్లీ మళ్లీ గాయం రేగేలా దెబ్బతగలనివ్వడం గానీ చేకూడదు. అలాంటి సందర్భాల్లో గాయం రేగితే ‘టెండన్’ దెబ్బతినవచ్చు. అందుకే మోచేతి నొప్పి రెండు వారాలకుపైగా అదేపనిగా కొనసాగితే తప్పక డాక్టర్‌కు చూపించుకోవాలి.
కొన్ని సందర్భాల్లో మోచేతి నొప్పి అదే పనిగా వస్తుంటే ఒకసారి డాక్టర్‌కు చూపించి అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు కారణంగా వస్తుందేమోనని చూసుకొని, అక్కడ సమస్య ఏమీ లేదని నిర్ధారణ చేసుకొని నిశ్చింతగా ఉండవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment