ఈ మధ్య ఓ మహిళ తన అందాన్ని ఇనుమడింపచేసుకోడానికి వెళ్తే ఆ చికిత్సకులు కాస్తా ముఖాన్ని అందవికారంగా మార్చారన్న వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మంచి చేసుకోబోతే చెడు ఎదురైనట్లుగా అందరూ ఉలిక్కిపడ్డారు. అందం కోసం అతివలు ఆకాంక్షించడం, అందాలకు మెరుగులు పెట్టుకునేందుకు ప్రయత్నించడం చాలా సాధారణమైన విషయం. అందంగా కనపడాలనే ఆకాంక్షతో ఎన్నో ప్రక్రియలను అనుసరిస్తుంటారు. అయితే ఏ చికిత్స చేయించుకుంటే... మరే ప్రక్రియను అనుసరిస్తే అది ఎలా పరిణమిస్తుందోనని చాలామంది ఆందోళన పడుతుంటారు. అలాంటి అనుమానాలను నివృత్తి చేసే ప్రత్యేక కథనం ఇది.
పెరుగుతున్న సౌందర్యకాంక్ష...తరుగుతున్న చికిత్సాప్రమాణాలు
ఇటీవల మహిళల్లో సౌందర్య కాంక్ష పెరుగుతోంది. దానికి తోడు వివిధ సౌందర్యసాధనాలు, ప్రక్రియలు, చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. అనేక ప్రకటనలు వారిని ప్రలోభపెట్టే విధంగా హోరెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌందర్యసాధనాల వాడకం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలి, చికిత్సల కోసం సరైన విద్యార్హతలు, నిపుణులూ అయిన వారిని ఎలా ఎంచుకోవాలి వంటి అనేక అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ తమ లుక్స్‌కు ప్రాధాన్యం ఇస్తుండడంతో సౌందర్యరంగంలో వాణిజ్యానికి అవకాశాలు పెరిగాయి. దాంతో నిపుణులు కానివారు, ఎలాంటి అర్హతలూ లేనివారు కూడా ఈ రంగంలోకి వస్తున్నారు. ఫలితంగా సౌందర్యాన్ని ఇనుమడింపజేసుకునేందుకు భారీగానే మూల్యాన్ని చెల్లించాల్సివస్తోంది.
క్లినిక్కుల ప్రకటనలే చాలా?...మరి కావాల్సిందేమిటి?
సౌందర్యం పట్ల అభిలాష, దాన్ని ఇనుమడింపజేసుకోవాలనే కోరిక పెరగడంతో తమ ప్రత్యేకతలను తెలుపుతూ చాలా క్లినిక్స్ వెలుస్తున్నాయి. వారు తమ వద్ద లభించే ప్రత్యేకమైన ప్రక్రియలూ, ఉపకరణాలూ, ఇతరత్రా సాధనాల గురించి విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే... కేవలం ప్రత్యేకమైన సామగ్రి, ఉపకరణాలు, యంత్రపరికరాలు ఉండటం మాత్రమే ఒక సంస్థ తాలూకు చికిత్స సామర్థ్యాన్ని నిర్ణయించదు. వాటిని ఉపయోగించడంలో సమర్థులైన వైద్యులు ఉండాలి. వారు తప్పనిసరిగా ఆ సామగ్రిని లేదా చికిత్సాప్రక్రియను చేపట్టడానికి గల విద్యార్హతను కలిగి ఉండాలి. అప్పుడే వాటికి సార్థకత.
నూరు శాతం ఫలితాలంటే నమ్మకండి...
మీ కురుల విషయంలో... అవి పూర్తిగా నూరు శాతం పెరుగుతాయని నమ్మబలికినా లేదా అవాంఛిత రోమాల విషయంలో అవి నూరు శాతం తొలగిస్తామనంటూ చెప్పినా పూర్తిగా నమ్మకండి. ఎందుకంటే చికిత్స అన్నది ఎప్పుడూ నూరు శాతం ఫలితాలు ఇవ్వకపోవచ్చు. చాలా సందర్భాల్లో మెరుగైన ఫలితాలను మాత్రమే ఇస్తుందన్న చేదు నిజాన్ని అంగీకరించాకే చికిత్సకోసం ముందుకు వెళ్లండి.
హక్కుగా అడగవచ్చు...
ఏదైనా డెర్మటాలజిస్టు స్పెషలిస్టుగా ఉన్న ఆసుపత్రికి వెళ్లినప్పుడు అక్కడి డాక్టర్ విద్యార్హతలను అడిగి తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. వారి పేరు, విద్యార్హత, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) రిజిష్టర్డ్ నెంబరు వంటివి గల ఐడి కార్డును చూపమని అడిగి, వారి అర్హతలను నిర్థరించుకోవచ్చు.
విద్యార్హతలు లేని వైద్యులూ ఉంటారు...
చర్మవైద్యానికీ, సౌందర్యాలను మెరుగుపరిచే ప్రక్రియలను అనుసరించే రంగంలోకి సరైన విద్యార్హతలు, అనుభవం, నైపుణ్యం లేనివారు సైతం వస్తున్నారు. వారు వైద్యవిద్యను చదవకుండానే, అందులో స్పెషలైజేషన్స్ సాధించకుండానే తమను బ్యూటీషియన్లుగా/కాస్మటాలజిస్టులుగా చెప్పుకునేవారు ఎక్కువవుతున్నారు. దాంతో బ్యూటీపార్లర్‌కూ, అర్హత గల డెర్మటాలజిస్ట్ నడిపే క్లినిక్‌కూ మధ్య తేడా తగ్గిపోతోంది. అందువల్ల రోగులు పొరబడే అవకాశాలు ఎక్కువ. ఇలా సరైన విద్యార్హతలూ, అదే రంగంలోని ఉన్నత విద్య లేకుండానే చికిత్సలో పాలుపంచుకునేవారిని ‘క్వాక్స్’గా పేర్కొంటుంటారు.
మెడికల్‌షాపులూ వైద్యచికిత్స కేంద్రాల్లా...
కొన్ని చోట్ల మందుల దుకాణాలే ఒక క్లినిక్ భూమికను పోషిస్తుంటాయి. క్లినిక్ యజమాని ఇచ్చిన మందులు వాడేస్తుంటారు. ఇలా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడే మందులనే ‘ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్’గా చెబుతుంటాం. ఒక్కోసారి వాళ్లిచ్చే కొన్ని మందులు వికటించి మరిన్ని ఆరోగ్య సమస్యలూ వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు మందుల షాపు యజమానులు ఇచ్చే మందులూ తొలుత కొంత నయం చేసి ఆ తర్వాత చాలా తీవ్రమైన సమస్యల్లోకి నెట్టేసే ప్రమాదమూ ఉంది.
ఇతర సాధారణ మందులూ.. చర్మంపై వాటి దుష్ర్పభావం..
కొన్నిచోట్ల ఒళ్లు నొప్పులు అనగానే ‘ఓవర్ ద కౌంటర్’ మందుగా నిమ్యులిసైడ్ అనే మందును ఇవ్వడం ఆనవాయితీ. కానీ ఆ మందు వాడటం వల్ల దీర్ఘకాలంలో వారి మూత్రపిండాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. దీన్నే వైద్య పరిభాషలో ‘డ్రగ్ ఇండ్యూస్‌డ్ నెఫ్రోపతి’గా పేర్కొంటారు. పైగా ఆ మందు ప్రభావం వల్ల ‘స్టీవెన్ జాన్సన్స్ సిండ్రోమ్’ అనే మెడికల్ ఎమర్జన్సీ కండిషన్ ఏర్పడవచ్చు. ఈ చర్మసమస్య ఒక్కోసారి ప్రాణాంతకమూ అయ్యే అవకాశం ఉంది. అందుకే మందుల షాపుల్లోనూ, సొంతవైద్యంతోనూ మందులు వాడకూడదు. సమస్య చిన్నదైనా ఒకసారి అర్హత కలిగిన చర్మవైద్య నిపుణులను కలిసి మాత్రమే మందులు వాడాలి.
పెద్ద సెంటర్లలో ఇలాంటి మోసాలు జరగవా?
చర్మవ్యాధుల చికిత్స రంగంలో కొన్ని చాలా పెద్ద పెద్ద సంస్థలూ ఆర్భాటంగా, అట్టహాసంగా తమను తాము ప్రమోట్ చేసుకుంటుంటాయి. పేరుకు పెద్ద సంస్థలే అయినా అక్కడి డాక్టర్లు కేవలం వైద్య విద్యను మాత్రమే అభ్యసించిన (ఎంబీబీఎస్) వారై ఉండవచ్చు. వారు డెర్మటాలజీని ఒక కోర్సుగా చదివి ఉండకపోవడం వల్ల వారికి చర్మవ్యాధుల చికిత్స విషయంలో అత్యంత సూక్ష్మస్థాయి పరిజ్ఞానం పూర్తిగా ఉండకపోవచ్చు. కొన్ని పెద్ద సంస్థలు సైతం ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాయి. అందుకే చర్మవైద్యచికిత్స ప్రక్రియలకు వెళ్లాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఒక సంస్థలోని అత్యున్నత ప్రమాణాలను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి.
ఒకేలా కనిపించే వేర్వేరు సమస్యలు.. చికిత్సలు
చర్మానికి లేదా కురులకు సంబంధించిన అనేక సమస్యలు ఒకేలా కనిపిస్తాయి. కానీ ఒక డెర్మటాలజిస్టే వాటిని నిర్దిష్టంగా గుర్తుపట్టగలరు. ఉదాహరణకు పిగ్మెంటేషన్ అనే కండిషన్‌లో చర్మంపై ఒకచోట మెలనిన్ అనే చర్మపు రంగు నల్లగా పోగుపడినట్లుగా ఉంటుంది. ఈ కండిషన్‌ను సాధారణంగా ‘మెలాస్మా’ అంటారు. ఈ కండిషన్‌తో పోలి ఉంటే ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఉదాహరణకు... పిటీరియాసిస్ వెర్సికొలర్, టీనియా ఫేసీ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌లో కొన్ని సందర్భాల్లో లెప్రసీలో లెకైన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే కండిషన్‌లో ఎరిథ్రాస్మా అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లో ఎకాంథోసిస్ నైగ్రికాన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పై కండిషన్లు అన్నీ దాదాపుగా ఒకేలా కనిపిస్తూ ఒకదాన్ని మరోటి పోలి ఉంటాయి. అప్పుడు అది నిర్దిష్టంగా ఏ సమస్య అన్న విషయాన్ని కేవలం డెర్మటాలజిస్టు గుర్తుపట్టి, దేనికి ఇవ్వాల్సిన చికిత్సను దానికి ఇస్తారు. ఒకవేళ ఒక సమస్యను తప్పుగా గుర్తిస్తే దాని వల్ల ఒనగూరే నష్టం చాలా తీవ్రంగా ఉండవచ్చు, ఒక్కోసారి వెనక్కు తీసుకోలేనిది కూడా కావచ్చు. ఇక మహిళల్లో ముఖంపైన అవాంఛిత రోమాల విషయానికి వస్తే దీనికి కారణమైన అంశాన్ని ముందుగా వివరంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎన్నో కారణాల వల్ల మహిళల్లో అవాంఛిత రోమాలు ఒక లక్షణంగా కనిపిస్తాయి. ముఖంపై అవాంఛిత రోమాలు లేదా హిర్సుటిజమ్ అనే సమస్యకు ఉన్న అనేక కారణాల్లో పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఒకటి. దీనివల్ల కలిగే హైపర్‌యాండ్రోజెనిసిస్ లేదా ఒవేరియన్ గడ్డల వల్లగానీ, అడ్రినల్ గడ్డల వల్లగానీ, పిట్యూటరీ గడ్డల వల్లగానీ యాండ్రోజెన్ హార్మోన్ ఎక్కువగా స్రవించడం... ఇలా ఎన్నో కారణాలు ఉండవచ్చు. అందుకే ముఖంపై అవాంఛిత రోమాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఒకేలాంటి చికిత్స ఉండదు. కారణాన్ని బట్టి చికిత్స మారుతుంది.
కురుల సమస్యలకుటైకోస్కోప్ సహాయమిలా..
ట్రైకోస్కోప్ సహాయంతో కురులను మరింత పెద్దవిగా చూస్తూ వాటి చిత్రాలు (మేగ్నిఫైడ్ ఇమేజెస్ విత్ ట్రైకోస్కోప్) తీసుకుంటారు. వాటిని పేషెంట్‌కు చూపిస్తూ వారి అసలు సమస్యను వివరంగా చెబుతారు. ఇలా మీకు మీ సమస్యలను వివరంగా చెప్పేవారినే నమ్మండి.
వెంట్రుకల చికిత్సలో జాగ్రత్తలిలా...
ఇటీవల చాలామంది తమ కురుల అందాలను ఇనుమడింపజేసుకోడానికి ట్రైకాలజిస్టులు అనే నిపుణులను సంప్రదిస్తున్నారు. అయితే చాలా సెంటర్లలో కొందరు తమను తాము ట్రైకాలజిస్టులుగా అభివర్ణించుకుంటున్నారు. వాస్తవానికి డెర్మటాలజీలో సూపర్‌స్పెషాలిటీ చేసి, ఆ రంగంలో శిక్షణ పొందినవారే ఆ తర్వాత ట్రైకాలజీ అనే వెంట్రుకలకు సంబంధించిన సబ్‌స్పెషాలిటీలో మరింత శిక్షణ పొందుతారు.
కాబట్టి ట్రైకాలజిస్టులను సంప్రదించేవారు... సదరు వ్యక్తి డెర్మటాలజీ సూపర్‌స్పెషాలిటీ చదివాక ట్రైకాలజీ అనే సబ్‌స్పెషాలిటీలో శిక్షణ తీసుకున్నారా లేదా అన్నది నిర్ధారణ చేసుకున్న తర్వాతే వారి నుంచి సేవలు పొందాలి.
లేజర్ విషయంలో నైపుణ్యం ఎంత అవసరమంటే...
లేజర్ చికిత్సలో అది రోమం మూలంలో ఉండే మెలనిన్‌పై ప్రభావం చూపుతుంది కాబట్టి తాము ఏ అవసరం కోసం లేజర్ చికిత్స చేస్తున్నామన్న అంశం ఆధారంగా ఎంత మేరకు లేజర్‌ను వెలువరించాలి, దాని ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి అన్నది స్పష్టంగా మానిటర్ చేస్తూ ఉండాలి. ఇది కేవలం అందరికీ ఒకేలా ఉండదు. కొందరి చర్మం నల్లగా ఉండవచ్చు. మరికొందరు కాస్త ఫెయిర్ ఉండవచ్చు. వాళ్ల చర్మపురంగు, చర్మపు తీరుతెన్నులు, దాని తరహాను బట్టి కూడా ఈ ఫ్రీక్వెన్సీ మారుతుంది.
పొరబాట్లు ఎలా జరుగుతాయంటే..?
ఉదాహరణకు కొన్ని వాస్తవ సంఘటనలు
చుండ్రు ఎంత చిన్న సమస్యో అందరికీ తెలిసిందే. ఒక సెంటర్‌లో ఈ సమస్యను సోరియాసిస్ అనే సమస్యగా చూపి పేషెంట్‌ను భయపెట్టారు. దాన్ని తాము పూర్తిగా తగ్గిస్తామనీ, భవిష్యత్తులో మళ్లీ రాకుండా చూస్తామంటూ పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేశారు. దీంతో పేషెంట్ తీవ్రమైన షాక్‌కు గురై... ఒకదశలో ఐసీయూలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొన్ని చర్మసమస్యలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. అలాంటప్పుడు అక్కడి చర్మం ముక్కను సేకరించి బయాప్సీ పరీక్షకు పంపాల్సి రావచ్చు. మరింత నిశితంగా పరిశీలించాల్సి రావచ్చు. ఎందుకంటే చిన్న పుట్టుమచ్చలా ఉన్న సమస్య నిజానికి కార్సినోమా లేదా క్యాన్సర్ కావచ్చు. అందుకే సమస్య తీవ్రతను బట్టి చికిత్స ఉండాలి. అంతేగాని ఒకేలా కనిపించే లక్షణాలన్నింటికీ ఒకే చికిత్స సరిపోదని గుర్తించాలి.
ఒక్కోసారి కొందరిలో చాలా పుట్టుమచ్చలు ఒకేసారి వస్తుంటాయి. ఇలాంటి పుట్టుమచ్చలు చాలా సాధారణమే కాబట్టి వాటిని చాలామంది తీవ్రంగా పరిగణించరు. కానీ ఒక్కోసారి అవి కడుపు లేదా పేగుల్లోని క్యాన్సర్లకు సూచన కావచ్చు.
చర్మ, కురుల సమస్యలకు ఇచ్చే కొన్ని మందులు ఇతరత్రా మందులు వాడుతున్నప్పుడు ప్రతికూల ఫలితాలు ఇవ్వవచ్చు. అందుకే చర్మవైద్య నిపుణులు అనేక అంశాలను రోగిని అడిగి తెలుసుకుని, మందులను సూచిస్తుంటారు. అందుకే మీ డెర్మటాలజిస్ట్‌తో మీ విశ్వసనీయత చికిత్స విషయంలో కీలక భూమిక పోషిస్తుంది.
లేజర్లు... రకాలు...
సాధారణ ప్రజలకు లేజర్ అనగానే అదేదో ఒక్కటే యంత్రం అనుకుంటారు. కానీ ఇందులోనూ చాలా రకాల లేజర్ ఉపకరణాలు ఉంటాయి. ఉదాహరణకు ఎన్‌డీ యాగ్, సోప్రానో, ఎస్‌హెచ్‌ఆర్ ( ఐపీఎల్), డయోడ్ లేజర్ లాంటివి. ఇవన్నీ వేర్వేరు తరహా చికిత్సల కోసం ఉద్దేశించిన లేజర్ ఉపకరణాలు. వీటిలో అన్నీ కురుల మూలం వద్ద ఉన్న మెలనిన్ పిగ్మెంట్‌ను తొలగించేలా పనిచేస్తాయి. అయితే ఇదే టెక్నాలజీ తెల్లవెంట్రుకల విషయంలో పనిచేయదు. అయితే కొన్ని సెంటర్లలో అక్కడి సిబ్బంది తెల్లవెంట్రుకల విషయంలోనూ తాము సమర్థమైన చికిత్స అందిస్తామని తప్పుడు వాగ్దానాలు చేస్తుంటారు. నిజానికి అది సాధ్యం కాదు.
ప్రస్తుతం ఉన్న అధునాతన వైద్యవిజ్ఞానంలో మనకు ప్రధానంగా అందుబాటులో ఉన్న లేజర్లు ఆరు రకాలు. వాటితో ప్రయోజనాలివి...
1) అవాంఛిత రోమాలను తొలగించేవి
2) పిగ్మెంటేషన్‌కు చికిత్స చేసేవి
3) పచ్చబొట్టు తొలగించడం కోసం
4) వాస్క్యులార్ ట్యూమర్స్ తొలగించడం కోసం
5) మొటిమలు వాటి వల్ల చర్మంపై ఏర్పడ్డ గుంటల వంటివాటిని సరిచేసేవి.
6) చర్మాన్ని మరింతగా తేజోవంతం (రీజూవినేషన్) చేయడం కోసం, చర్మాన్ని బిగుతుగా చేయడం కోసం.
ఇలాంటి లేజర్లు పెద్ద కేంద్రాల్లో చాలా చోట్ల ఉన్నాయి. వాటిని ఉపయోగించడంలో డాక్టర్లు నిర్దిష్టమైన ప్రోటోకాల్స్ (క్రమబద్ధంగా లేదా నియమబద్ధంగా అనుసరించాల్సిన ప్రక్రియలు) ఉన్నాయి. ఆ ప్రోటోకాల్స్ ఆధారంగానే వాటిని ఉపయోగించాలి.
అందానికి చికిత్స చేసేవారు... అన్నింట్లోనూ నిష్ణాతులై ఉండాలి
అందాన్ని ఇనుమడింపజేసే చికిత్సకులను ‘కాస్మటాలజిస్ట్’లు అంటారు. వీరు కూడా డెర్మటాలజీ తర్వాత ఈ సబ్‌స్పెషాలిటీలో మరింత లోతుగా అధ్యయనం చేసినవారై ఉంటారు. అందానికి చికిత్స చేసే ప్రతివారూ కాస్మటాలజిస్ట్ కాలేరు. కాస్మటాలజిస్ట్ అంటే... ఒక చికిత్స చేసేటప్పుడు అక్కడి కండరాలు, అక్కడి నరాల తీరుతెన్నులు, వాటికి రక్తసరఫరా జరుగుతున్న తీరు, అక్కడ వ్యాపించి ఉన్న రక్తనాళాల నెట్‌వర్క్, అక్కడి లింఫాటిక్ డ్రైనేజీ వ్యవస్థ... ఇలా ఎన్నో విషయాలపై పూర్తి అవగాహన, పట్టు కలిగినవారై ఉంటారు.
కొందరు ఎలాంటి అర్హత లేకుండానే లేదా కొంతమంది సినిమా రంగానికి చెందిన సెలిబ్రిటీలకు, మోడల్స్‌కు చికిత్స చేశామని చెప్పుకుంటూనో తమను తాము కాస్మటాలజిస్టులుగా అభివర్ణించుకుంటూ ఉంటారు. కానీ నిజమైన కాస్మటాలజిస్టుకు పైన పేర్కొన్న అన్ని అంశాలపై లోతైన పరిజ్ఞానం ఉండాలని గుర్తించండి.
ఇటీవల బొటాక్స్ ఇంజెక్షన్‌తో ముఖాన్ని అందంగా చేసుకోవడం, ముఖంపైన ముడతలను తొలగించుకోవడం చేస్తున్నారు. బొటాక్స్ అనే ఆ మందు న్యూరో-మస్క్యులార్ జంక్షన్స్‌ను రిలాక్స్ చేసి ముఖంపై ముడుతలు తొలగిపోయేలా చేస్తుంది. ఒకసారి రిలాక్స్ అయిన న్యూరో-మస్క్యులార్ కండరాలు 4 - 6 నెలల పాటు అలాగే ఉండిపోతాయి. ఆ వ్యవధిలో పేషెంట్ తనను తాను చాలా ఫ్రెష్‌గా, యౌవనంగా (యంగ్ లుక్స్‌తో) ఉన్నట్లు ఫీలవుతాడు. కానీ మందు ప్రభావం తొలగిపోయాక మళ్లీ కండరాలన్నీ యథాతథ స్థితికి వస్తాయి. ఒకవేళ ఇదే బొటాక్స్ చికిత్సను తప్పుగా (రాంగ్ వేలో) చేస్తే, ఒక్కోసారి ముఖానికి పక్షవాతం (ఫేషియల్ పెరాలసిస్) రావచ్చు.
అలాగే కొన్ని సందర్భాల్లో ముఖంలో గుంటలు, నొక్కులు ఉన్నప్పుడు ఫిల్లింగ్ అనే ప్రక్రియను అనుసరిస్తుంటారు. కానీ ఫిల్లర్స్ అన్నవి పూర్తిగా శాశ్వత ఫలితాలు ఇవ్వవనే విషయాన్ని గుర్తుంచుకునే చికిత్సకు వెళ్లాలి. వీటి ప్రభావం 9 నెలల నుంచి ఏడాది మాత్రమే.
- నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి
మేనికి మెరుగులు...ఉపద్రవాలకు ఉపశమనాలు
Published Mon, Jul 7 2014 11:08 PM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM
Advertisement
Advertisement