Yasina - manjulareddi
-
మేనికి మెరుగులు...ఉపద్రవాలకు ఉపశమనాలు
ఈ మధ్య ఓ మహిళ తన అందాన్ని ఇనుమడింపచేసుకోడానికి వెళ్తే ఆ చికిత్సకులు కాస్తా ముఖాన్ని అందవికారంగా మార్చారన్న వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మంచి చేసుకోబోతే చెడు ఎదురైనట్లుగా అందరూ ఉలిక్కిపడ్డారు. అందం కోసం అతివలు ఆకాంక్షించడం, అందాలకు మెరుగులు పెట్టుకునేందుకు ప్రయత్నించడం చాలా సాధారణమైన విషయం. అందంగా కనపడాలనే ఆకాంక్షతో ఎన్నో ప్రక్రియలను అనుసరిస్తుంటారు. అయితే ఏ చికిత్స చేయించుకుంటే... మరే ప్రక్రియను అనుసరిస్తే అది ఎలా పరిణమిస్తుందోనని చాలామంది ఆందోళన పడుతుంటారు. అలాంటి అనుమానాలను నివృత్తి చేసే ప్రత్యేక కథనం ఇది. పెరుగుతున్న సౌందర్యకాంక్ష...తరుగుతున్న చికిత్సాప్రమాణాలు ఇటీవల మహిళల్లో సౌందర్య కాంక్ష పెరుగుతోంది. దానికి తోడు వివిధ సౌందర్యసాధనాలు, ప్రక్రియలు, చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. అనేక ప్రకటనలు వారిని ప్రలోభపెట్టే విధంగా హోరెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌందర్యసాధనాల వాడకం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలి, చికిత్సల కోసం సరైన విద్యార్హతలు, నిపుణులూ అయిన వారిని ఎలా ఎంచుకోవాలి వంటి అనేక అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ తమ లుక్స్‌కు ప్రాధాన్యం ఇస్తుండడంతో సౌందర్యరంగంలో వాణిజ్యానికి అవకాశాలు పెరిగాయి. దాంతో నిపుణులు కానివారు, ఎలాంటి అర్హతలూ లేనివారు కూడా ఈ రంగంలోకి వస్తున్నారు. ఫలితంగా సౌందర్యాన్ని ఇనుమడింపజేసుకునేందుకు భారీగానే మూల్యాన్ని చెల్లించాల్సివస్తోంది. క్లినిక్కుల ప్రకటనలే చాలా?...మరి కావాల్సిందేమిటి? సౌందర్యం పట్ల అభిలాష, దాన్ని ఇనుమడింపజేసుకోవాలనే కోరిక పెరగడంతో తమ ప్రత్యేకతలను తెలుపుతూ చాలా క్లినిక్స్ వెలుస్తున్నాయి. వారు తమ వద్ద లభించే ప్రత్యేకమైన ప్రక్రియలూ, ఉపకరణాలూ, ఇతరత్రా సాధనాల గురించి విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే... కేవలం ప్రత్యేకమైన సామగ్రి, ఉపకరణాలు, యంత్రపరికరాలు ఉండటం మాత్రమే ఒక సంస్థ తాలూకు చికిత్స సామర్థ్యాన్ని నిర్ణయించదు. వాటిని ఉపయోగించడంలో సమర్థులైన వైద్యులు ఉండాలి. వారు తప్పనిసరిగా ఆ సామగ్రిని లేదా చికిత్సాప్రక్రియను చేపట్టడానికి గల విద్యార్హతను కలిగి ఉండాలి. అప్పుడే వాటికి సార్థకత. నూరు శాతం ఫలితాలంటే నమ్మకండి... మీ కురుల విషయంలో... అవి పూర్తిగా నూరు శాతం పెరుగుతాయని నమ్మబలికినా లేదా అవాంఛిత రోమాల విషయంలో అవి నూరు శాతం తొలగిస్తామనంటూ చెప్పినా పూర్తిగా నమ్మకండి. ఎందుకంటే చికిత్స అన్నది ఎప్పుడూ నూరు శాతం ఫలితాలు ఇవ్వకపోవచ్చు. చాలా సందర్భాల్లో మెరుగైన ఫలితాలను మాత్రమే ఇస్తుందన్న చేదు నిజాన్ని అంగీకరించాకే చికిత్సకోసం ముందుకు వెళ్లండి. హక్కుగా అడగవచ్చు... ఏదైనా డెర్మటాలజిస్టు స్పెషలిస్టుగా ఉన్న ఆసుపత్రికి వెళ్లినప్పుడు అక్కడి డాక్టర్ విద్యార్హతలను అడిగి తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. వారి పేరు, విద్యార్హత, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) రిజిష్టర్డ్ నెంబరు వంటివి గల ఐడి కార్డును చూపమని అడిగి, వారి అర్హతలను నిర్థరించుకోవచ్చు. విద్యార్హతలు లేని వైద్యులూ ఉంటారు... చర్మవైద్యానికీ, సౌందర్యాలను మెరుగుపరిచే ప్రక్రియలను అనుసరించే రంగంలోకి సరైన విద్యార్హతలు, అనుభవం, నైపుణ్యం లేనివారు సైతం వస్తున్నారు. వారు వైద్యవిద్యను చదవకుండానే, అందులో స్పెషలైజేషన్స్ సాధించకుండానే తమను బ్యూటీషియన్లుగా/కాస్మటాలజిస్టులుగా చెప్పుకునేవారు ఎక్కువవుతున్నారు. దాంతో బ్యూటీపార్లర్కూ, అర్హత గల డెర్మటాలజిస్ట్ నడిపే క్లినిక్‌కూ మధ్య తేడా తగ్గిపోతోంది. అందువల్ల రోగులు పొరబడే అవకాశాలు ఎక్కువ. ఇలా సరైన విద్యార్హతలూ, అదే రంగంలోని ఉన్నత విద్య లేకుండానే చికిత్సలో పాలుపంచుకునేవారిని ‘క్వాక్స్’గా పేర్కొంటుంటారు. మెడికల్షాపులూ వైద్యచికిత్స కేంద్రాల్లా... కొన్ని చోట్ల మందుల దుకాణాలే ఒక క్లినిక్ భూమికను పోషిస్తుంటాయి. క్లినిక్ యజమాని ఇచ్చిన మందులు వాడేస్తుంటారు. ఇలా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడే మందులనే ‘ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్’గా చెబుతుంటాం. ఒక్కోసారి వాళ్లిచ్చే కొన్ని మందులు వికటించి మరిన్ని ఆరోగ్య సమస్యలూ వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు మందుల షాపు యజమానులు ఇచ్చే మందులూ తొలుత కొంత నయం చేసి ఆ తర్వాత చాలా తీవ్రమైన సమస్యల్లోకి నెట్టేసే ప్రమాదమూ ఉంది. ఇతర సాధారణ మందులూ.. చర్మంపై వాటి దుష్ర్పభావం.. కొన్నిచోట్ల ఒళ్లు నొప్పులు అనగానే ‘ఓవర్ ద కౌంటర్’ మందుగా నిమ్యులిసైడ్ అనే మందును ఇవ్వడం ఆనవాయితీ. కానీ ఆ మందు వాడటం వల్ల దీర్ఘకాలంలో వారి మూత్రపిండాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. దీన్నే వైద్య పరిభాషలో ‘డ్రగ్ ఇండ్యూస్డ్ నెఫ్రోపతి’గా పేర్కొంటారు. పైగా ఆ మందు ప్రభావం వల్ల ‘స్టీవెన్ జాన్సన్స్ సిండ్రోమ్’ అనే మెడికల్ ఎమర్జన్సీ కండిషన్ ఏర్పడవచ్చు. ఈ చర్మసమస్య ఒక్కోసారి ప్రాణాంతకమూ అయ్యే అవకాశం ఉంది. అందుకే మందుల షాపుల్లోనూ, సొంతవైద్యంతోనూ మందులు వాడకూడదు. సమస్య చిన్నదైనా ఒకసారి అర్హత కలిగిన చర్మవైద్య నిపుణులను కలిసి మాత్రమే మందులు వాడాలి. పెద్ద సెంటర్లలో ఇలాంటి మోసాలు జరగవా? చర్మవ్యాధుల చికిత్స రంగంలో కొన్ని చాలా పెద్ద పెద్ద సంస్థలూ ఆర్భాటంగా, అట్టహాసంగా తమను తాము ప్రమోట్ చేసుకుంటుంటాయి. పేరుకు పెద్ద సంస్థలే అయినా అక్కడి డాక్టర్లు కేవలం వైద్య విద్యను మాత్రమే అభ్యసించిన (ఎంబీబీఎస్) వారై ఉండవచ్చు. వారు డెర్మటాలజీని ఒక కోర్సుగా చదివి ఉండకపోవడం వల్ల వారికి చర్మవ్యాధుల చికిత్స విషయంలో అత్యంత సూక్ష్మస్థాయి పరిజ్ఞానం పూర్తిగా ఉండకపోవచ్చు. కొన్ని పెద్ద సంస్థలు సైతం ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాయి. అందుకే చర్మవైద్యచికిత్స ప్రక్రియలకు వెళ్లాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఒక సంస్థలోని అత్యున్నత ప్రమాణాలను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. ఒకేలా కనిపించే వేర్వేరు సమస్యలు.. చికిత్సలు చర్మానికి లేదా కురులకు సంబంధించిన అనేక సమస్యలు ఒకేలా కనిపిస్తాయి. కానీ ఒక డెర్మటాలజిస్టే వాటిని నిర్దిష్టంగా గుర్తుపట్టగలరు. ఉదాహరణకు పిగ్మెంటేషన్ అనే కండిషన్లో చర్మంపై ఒకచోట మెలనిన్ అనే చర్మపు రంగు నల్లగా పోగుపడినట్లుగా ఉంటుంది. ఈ కండిషన్‌ను సాధారణంగా ‘మెలాస్మా’ అంటారు. ఈ కండిషన్‌తో పోలి ఉంటే ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఉదాహరణకు... పిటీరియాసిస్ వెర్సికొలర్, టీనియా ఫేసీ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో కొన్ని సందర్భాల్లో లెప్రసీలో లెకైన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే కండిషన్లో ఎరిథ్రాస్మా అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో ఎకాంథోసిస్ నైగ్రికాన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పై కండిషన్లు అన్నీ దాదాపుగా ఒకేలా కనిపిస్తూ ఒకదాన్ని మరోటి పోలి ఉంటాయి. అప్పుడు అది నిర్దిష్టంగా ఏ సమస్య అన్న విషయాన్ని కేవలం డెర్మటాలజిస్టు గుర్తుపట్టి, దేనికి ఇవ్వాల్సిన చికిత్సను దానికి ఇస్తారు. ఒకవేళ ఒక సమస్యను తప్పుగా గుర్తిస్తే దాని వల్ల ఒనగూరే నష్టం చాలా తీవ్రంగా ఉండవచ్చు, ఒక్కోసారి వెనక్కు తీసుకోలేనిది కూడా కావచ్చు. ఇక మహిళల్లో ముఖంపైన అవాంఛిత రోమాల విషయానికి వస్తే దీనికి కారణమైన అంశాన్ని ముందుగా వివరంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎన్నో కారణాల వల్ల మహిళల్లో అవాంఛిత రోమాలు ఒక లక్షణంగా కనిపిస్తాయి. ముఖంపై అవాంఛిత రోమాలు లేదా హిర్సుటిజమ్ అనే సమస్యకు ఉన్న అనేక కారణాల్లో పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఒకటి. దీనివల్ల కలిగే హైపర్యాండ్రోజెనిసిస్ లేదా ఒవేరియన్ గడ్డల వల్లగానీ, అడ్రినల్ గడ్డల వల్లగానీ, పిట్యూటరీ గడ్డల వల్లగానీ యాండ్రోజెన్ హార్మోన్ ఎక్కువగా స్రవించడం... ఇలా ఎన్నో కారణాలు ఉండవచ్చు. అందుకే ముఖంపై అవాంఛిత రోమాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఒకేలాంటి చికిత్స ఉండదు. కారణాన్ని బట్టి చికిత్స మారుతుంది. కురుల సమస్యలకుటైకోస్కోప్ సహాయమిలా.. ట్రైకోస్కోప్ సహాయంతో కురులను మరింత పెద్దవిగా చూస్తూ వాటి చిత్రాలు (మేగ్నిఫైడ్ ఇమేజెస్ విత్ ట్రైకోస్కోప్) తీసుకుంటారు. వాటిని పేషెంట్‌కు చూపిస్తూ వారి అసలు సమస్యను వివరంగా చెబుతారు. ఇలా మీకు మీ సమస్యలను వివరంగా చెప్పేవారినే నమ్మండి. వెంట్రుకల చికిత్సలో జాగ్రత్తలిలా... ఇటీవల చాలామంది తమ కురుల అందాలను ఇనుమడింపజేసుకోడానికి ట్రైకాలజిస్టులు అనే నిపుణులను సంప్రదిస్తున్నారు. అయితే చాలా సెంటర్లలో కొందరు తమను తాము ట్రైకాలజిస్టులుగా అభివర్ణించుకుంటున్నారు. వాస్తవానికి డెర్మటాలజీలో సూపర్‌స్పెషాలిటీ చేసి, ఆ రంగంలో శిక్షణ పొందినవారే ఆ తర్వాత ట్రైకాలజీ అనే వెంట్రుకలకు సంబంధించిన సబ్స్పెషాలిటీలో మరింత శిక్షణ పొందుతారు. కాబట్టి ట్రైకాలజిస్టులను సంప్రదించేవారు... సదరు వ్యక్తి డెర్మటాలజీ సూపర్‌స్పెషాలిటీ చదివాక ట్రైకాలజీ అనే సబ్స్పెషాలిటీలో శిక్షణ తీసుకున్నారా లేదా అన్నది నిర్ధారణ చేసుకున్న తర్వాతే వారి నుంచి సేవలు పొందాలి. లేజర్ విషయంలో నైపుణ్యం ఎంత అవసరమంటే... లేజర్ చికిత్సలో అది రోమం మూలంలో ఉండే మెలనిన్‌పై ప్రభావం చూపుతుంది కాబట్టి తాము ఏ అవసరం కోసం లేజర్ చికిత్స చేస్తున్నామన్న అంశం ఆధారంగా ఎంత మేరకు లేజర్‌ను వెలువరించాలి, దాని ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి అన్నది స్పష్టంగా మానిటర్ చేస్తూ ఉండాలి. ఇది కేవలం అందరికీ ఒకేలా ఉండదు. కొందరి చర్మం నల్లగా ఉండవచ్చు. మరికొందరు కాస్త ఫెయిర్ ఉండవచ్చు. వాళ్ల చర్మపురంగు, చర్మపు తీరుతెన్నులు, దాని తరహాను బట్టి కూడా ఈ ఫ్రీక్వెన్సీ మారుతుంది. పొరబాట్లు ఎలా జరుగుతాయంటే..? ఉదాహరణకు కొన్ని వాస్తవ సంఘటనలు చుండ్రు ఎంత చిన్న సమస్యో అందరికీ తెలిసిందే. ఒక సెంటర్లో ఈ సమస్యను సోరియాసిస్ అనే సమస్యగా చూపి పేషెంట్‌ను భయపెట్టారు. దాన్ని తాము పూర్తిగా తగ్గిస్తామనీ, భవిష్యత్తులో మళ్లీ రాకుండా చూస్తామంటూ పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేశారు. దీంతో పేషెంట్ తీవ్రమైన షాక్‌కు గురై... ఒకదశలో ఐసీయూలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని చర్మసమస్యలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. అలాంటప్పుడు అక్కడి చర్మం ముక్కను సేకరించి బయాప్సీ పరీక్షకు పంపాల్సి రావచ్చు. మరింత నిశితంగా పరిశీలించాల్సి రావచ్చు. ఎందుకంటే చిన్న పుట్టుమచ్చలా ఉన్న సమస్య నిజానికి కార్సినోమా లేదా క్యాన్సర్ కావచ్చు. అందుకే సమస్య తీవ్రతను బట్టి చికిత్స ఉండాలి. అంతేగాని ఒకేలా కనిపించే లక్షణాలన్నింటికీ ఒకే చికిత్స సరిపోదని గుర్తించాలి. ఒక్కోసారి కొందరిలో చాలా పుట్టుమచ్చలు ఒకేసారి వస్తుంటాయి. ఇలాంటి పుట్టుమచ్చలు చాలా సాధారణమే కాబట్టి వాటిని చాలామంది తీవ్రంగా పరిగణించరు. కానీ ఒక్కోసారి అవి కడుపు లేదా పేగుల్లోని క్యాన్సర్లకు సూచన కావచ్చు. చర్మ, కురుల సమస్యలకు ఇచ్చే కొన్ని మందులు ఇతరత్రా మందులు వాడుతున్నప్పుడు ప్రతికూల ఫలితాలు ఇవ్వవచ్చు. అందుకే చర్మవైద్య నిపుణులు అనేక అంశాలను రోగిని అడిగి తెలుసుకుని, మందులను సూచిస్తుంటారు. అందుకే మీ డెర్మటాలజిస్ట్‌తో మీ విశ్వసనీయత చికిత్స విషయంలో కీలక భూమిక పోషిస్తుంది. లేజర్లు... రకాలు... సాధారణ ప్రజలకు లేజర్ అనగానే అదేదో ఒక్కటే యంత్రం అనుకుంటారు. కానీ ఇందులోనూ చాలా రకాల లేజర్ ఉపకరణాలు ఉంటాయి. ఉదాహరణకు ఎన్డీ యాగ్, సోప్రానో, ఎస్హెచ్ఆర్ ( ఐపీఎల్), డయోడ్ లేజర్ లాంటివి. ఇవన్నీ వేర్వేరు తరహా చికిత్సల కోసం ఉద్దేశించిన లేజర్ ఉపకరణాలు. వీటిలో అన్నీ కురుల మూలం వద్ద ఉన్న మెలనిన్ పిగ్మెంట్ను తొలగించేలా పనిచేస్తాయి. అయితే ఇదే టెక్నాలజీ తెల్లవెంట్రుకల విషయంలో పనిచేయదు. అయితే కొన్ని సెంటర్లలో అక్కడి సిబ్బంది తెల్లవెంట్రుకల విషయంలోనూ తాము సమర్థమైన చికిత్స అందిస్తామని తప్పుడు వాగ్దానాలు చేస్తుంటారు. నిజానికి అది సాధ్యం కాదు. ప్రస్తుతం ఉన్న అధునాతన వైద్యవిజ్ఞానంలో మనకు ప్రధానంగా అందుబాటులో ఉన్న లేజర్లు ఆరు రకాలు. వాటితో ప్రయోజనాలివి... 1) అవాంఛిత రోమాలను తొలగించేవి 2) పిగ్మెంటేషన్‌కు చికిత్స చేసేవి 3) పచ్చబొట్టు తొలగించడం కోసం 4) వాస్క్యులార్ ట్యూమర్స్ తొలగించడం కోసం 5) మొటిమలు వాటి వల్ల చర్మంపై ఏర్పడ్డ గుంటల వంటివాటిని సరిచేసేవి. 6) చర్మాన్ని మరింతగా తేజోవంతం (రీజూవినేషన్) చేయడం కోసం, చర్మాన్ని బిగుతుగా చేయడం కోసం. ఇలాంటి లేజర్లు పెద్ద కేంద్రాల్లో చాలా చోట్ల ఉన్నాయి. వాటిని ఉపయోగించడంలో డాక్టర్లు నిర్దిష్టమైన ప్రోటోకాల్స్ (క్రమబద్ధంగా లేదా నియమబద్ధంగా అనుసరించాల్సిన ప్రక్రియలు) ఉన్నాయి. ఆ ప్రోటోకాల్స్ ఆధారంగానే వాటిని ఉపయోగించాలి. అందానికి చికిత్స చేసేవారు... అన్నింట్లోనూ నిష్ణాతులై ఉండాలి అందాన్ని ఇనుమడింపజేసే చికిత్సకులను ‘కాస్మటాలజిస్ట్’లు అంటారు. వీరు కూడా డెర్మటాలజీ తర్వాత ఈ సబ్స్పెషాలిటీలో మరింత లోతుగా అధ్యయనం చేసినవారై ఉంటారు. అందానికి చికిత్స చేసే ప్రతివారూ కాస్మటాలజిస్ట్ కాలేరు. కాస్మటాలజిస్ట్ అంటే... ఒక చికిత్స చేసేటప్పుడు అక్కడి కండరాలు, అక్కడి నరాల తీరుతెన్నులు, వాటికి రక్తసరఫరా జరుగుతున్న తీరు, అక్కడ వ్యాపించి ఉన్న రక్తనాళాల నెట్వర్క్, అక్కడి లింఫాటిక్ డ్రైనేజీ వ్యవస్థ... ఇలా ఎన్నో విషయాలపై పూర్తి అవగాహన, పట్టు కలిగినవారై ఉంటారు. కొందరు ఎలాంటి అర్హత లేకుండానే లేదా కొంతమంది సినిమా రంగానికి చెందిన సెలిబ్రిటీలకు, మోడల్స్‌కు చికిత్స చేశామని చెప్పుకుంటూనో తమను తాము కాస్మటాలజిస్టులుగా అభివర్ణించుకుంటూ ఉంటారు. కానీ నిజమైన కాస్మటాలజిస్టుకు పైన పేర్కొన్న అన్ని అంశాలపై లోతైన పరిజ్ఞానం ఉండాలని గుర్తించండి. ఇటీవల బొటాక్స్ ఇంజెక్షన్‌తో ముఖాన్ని అందంగా చేసుకోవడం, ముఖంపైన ముడతలను తొలగించుకోవడం చేస్తున్నారు. బొటాక్స్ అనే ఆ మందు న్యూరో-మస్క్యులార్ జంక్షన్స్‌ను రిలాక్స్ చేసి ముఖంపై ముడుతలు తొలగిపోయేలా చేస్తుంది. ఒకసారి రిలాక్స్ అయిన న్యూరో-మస్క్యులార్ కండరాలు 4 - 6 నెలల పాటు అలాగే ఉండిపోతాయి. ఆ వ్యవధిలో పేషెంట్ తనను తాను చాలా ఫ్రెష్‌గా, యౌవనంగా (యంగ్ లుక్స్‌తో) ఉన్నట్లు ఫీలవుతాడు. కానీ మందు ప్రభావం తొలగిపోయాక మళ్లీ కండరాలన్నీ యథాతథ స్థితికి వస్తాయి. ఒకవేళ ఇదే బొటాక్స్ చికిత్సను తప్పుగా (రాంగ్ వేలో) చేస్తే, ఒక్కోసారి ముఖానికి పక్షవాతం (ఫేషియల్ పెరాలసిస్) రావచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ముఖంలో గుంటలు, నొక్కులు ఉన్నప్పుడు ఫిల్లింగ్ అనే ప్రక్రియను అనుసరిస్తుంటారు. కానీ ఫిల్లర్స్ అన్నవి పూర్తిగా శాశ్వత ఫలితాలు ఇవ్వవనే విషయాన్ని గుర్తుంచుకునే చికిత్సకు వెళ్లాలి. వీటి ప్రభావం 9 నెలల నుంచి ఏడాది మాత్రమే. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
ప్రపంచానికే...చలిజ్వరం!
‘దోమ కొంచెం... వ్యాధి తీవ్రం’ అనే మాట మలేరియాకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే... ఐక్యరాజ్యసమితిలో నమోదైన దేశాల సంఖ్య 192 అయితే ఇందులో 109 దేశాల్లో మలేరియా విజృంభిస్తోంది. అంటే... ప్రపంచంలోని సగానికి పైగా దేశాలను ఈ వ్యాధి భయపెడుతోందన్నమాట. ఇక మన దేశంలో ప్రతి ఏడాదీ మూడు కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్రంలోనూ ఏజెన్సీ ఏరియాలు అని మనం పిలుచుకునే అనేక కొండ ప్రాంతాల్లోని, అటవీ ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద సంఖ్యలో మలేరియా దెబ్బకు కునారిల్లుతున్నారు. సత్వర వైద్య సహాయం అందక అల్లాడుతున్నారు. ఈ నెల 25న ప్రపంచ మలేరియా దినం. ఈ సందర్భంగా ఇంత చిన్న దోమ కాటుతో అంత పెద్ద మనిషికి ప్రాణహాని సైతం కల్పించే ‘మలేరియా’పై అవగాహన కోసం ఈ కథనం. మలేరియా వ్యాధి ప్లాస్మోడియమ్ అనే ఏకకణ పరాన్న జీవి వల్ల వస్తుంది. దీన్ని ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి దోమలు వ్యాప్తి చేస్తాయి. దోమల్లోనూ ఆడ అనాఫిలిస్ దోమ దీని వ్యాప్తికి దోహదపడుతుంది. ప్లాస్మోడియం పరాన్నజీవి కూడా నాలుగు ప్రధాన ప్రజాతులుగా ఉంటుంది. అవి... ప్లాస్మోడియం ఫ్యాల్సిపేరమ్, ప్లాస్మోడియం ఒవ్యులా, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరీ. ప్లాస్మోడియం నోవిసై అనే మరో ప్రజాతి కూడా ఉంది గానీ దీని వ్యాప్తి కొద్ది దేశాలకే పరిమితం. దోమానవ బంధం మలేరియా ఇంతగా బాధించే వ్యాధి కదా. మరి దోమలన్నింటినీ నిర్మూలిస్తే మలేరియాను పూర్తిగా నివారించవచ్చు కదా అన్నది చాలామందిలోని భావన. మలేరియా వ్యాధిని కలగజేసే పరాన్నజీవులను వ్యాప్తి చేసే దోమలు ఒక ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతాయి. అదేమిటంటే... తీవ్రమైన వేడిమి, చాలా ఎక్కువ తేమ, దాంతో పాటు నీళ్ల లభ్యత ఉండటం. ఈ మూడూ వర్షారణ్య ప్రాంతాల్లో ఉండే పరిస్థితులు. చిత్రంగా ఇవే పరిస్థితులు వరి పండించే ప్రాంతాల్లోనూ ఉంటాయి. అంటే తీవ్రమైన వేడిమి, తేమతో పాటు వర్షం ఎక్కువగా కురవడం అన్నది వరి పంటకు అనువైన పరిస్థితులు. అందుకే ఒక్కమాటలో బండగుర్తుగా చెప్పాలంటే వర్షారణ్య ప్రాంతాలతో పాటు వరి పండేందుకు అనువైన అన్ని చోట్లా మలేరియా సోకడానికి కారణమయ్యే దోమలూ పెరుగుతాయి. అందుకే వరి పంట ఉన్నంత కాలం దోమలూ... అవి ఉన్నంత కాలం మలేరియా జ్వరాలు ఉంటాయన్నది కొందరు ఎంటమాలజిస్టుల అభిప్రాయం. ఇక ఒక దోమ జీవన వ్యవధి (ఆయుఃప్రమాణం) 30 రోజులు. ఈ కాలంలో అది రోజు విడిచి రోజు 150 నుంచి 200 వరకు గుడ్లు పెడుతుంది. అది గుడ్లు పెట్టడానికి చిన్న కొబ్బరి చిప్పలో నిల్వ ఉన్న 50 ఎం.ఎల్. నీళ్లు చాలు. దాంతో ఇలా చిన్న పాటి గుంటలూ, కొబ్బరి చిప్పలూ, చెడిపోయిన టైర్లు, వాడి ఆపేసిన కూలర్లు వంటి చోట్ల ఉండే ‘మిగులు జలాల్లో’నూ దోమలు గుడ్లు పెట్టి తమ సంతతిని అభివృద్ధి చేసుకుంటాయి. వాటిని తరమడానికి మనం ఎన్ని దార్లు వాడుతుంటామో, వాటి పట్ల తమ నిరోధకతను పెంపొందించుకోడానికి అవి కూడా అన్ని దార్లు వెతుకుతుంటాయి. తద్వారా తమ మనుగడను సాగిస్తుంటాయి. ఇలా అవి బలపడటానికి పరోక్షంగా మనమూ దోహదపడుతున్నామన్నమాట. అయితే ఒక్క మాట... పారే నీరు ఉన్న చోట అవి గుడ్లు పెట్టలేవు. అందుకే వాటిని నివారించాలంటే పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవడంతో పాటు, మురుగుకాల్వల వంటి చోట్ల నీరు పారేలా శుభ్రంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవడం మంచి మార్గం. ప్లాస్మోడియమ్జీవిత చక్రం సాగుతుందిలా... అంతకు ముందే మలేరియా వ్యాధి ఉన్న రోగిని కుట్టిన దోమ... మళ్లీ ఆరోగ్యవంతుడిని కుట్టగానే ‘మలేరియా’ వ్యాధిని కల్పించే కారకాలు ఆరోగ్యవంతుడైన మనిషి రక్తంలోకి ప్రవేశిస్తాయి. ఈ వ్యాధి కారకాలను ‘స్పోరోజువైట్స్’ అంటారు. ఆరోగ్యవంతుడి రక్తప్రవాహంలోకి చేరిన అవి... నేరుగా ఆ వ్యక్తి కాలేయంలోకి చేరి అక్కడ ఆశ్రయం ఏర్పరచుకుంటాయి. అక్కడ అవి తమ సంఖ్యను అలైంగిక మార్గంలో పెంపొందించుకుంటాయి. ఆ తర్వాత అవి ఎర్రరక్తకణాల్లోకి ప్రవేశిస్తాయి. కాలేయం నుంచి ఎర్రరక్తకణాల్లోకి ప్రవేశించే వ్యాధి కారకాలను ‘మెరోజువైట్స్’ అంటారు. కొన్ని పరాన్న జీవులు ఎర్రరక్తకణాల నుంచి గ్యామెటోసైట్స్ అని పిలిచే కణాలుగా మారి మళ్లీ దోమ రక్తంలోకి ప్రవేశిస్తాయి. దోమ కడుపులో అవి లైంగిక చర్య ద్వారా తమ సంఖ్యను పెద్ద సంఖ్యలో అభివృద్ధిపరచుకుంటాయి. దోమ కడుపులో ఉన్న వ్యాధి కారకాలు తొలుత ఊకైనేట్స్గా... ఆ తర్వాత ‘ఊసిస్ట్స్’గా అభివృద్ధి చెందాక చివరగా ‘స్పోరోజువైట్స్’గా మారి దోమ లాలాజలంలోకి ప్రవేశిస్తాయి. ఇవి మళ్లీ మరో ఆరోగ్యవంతుడిని చేరగానే... పైన పేర్కొన్న జీవిత చక్రం (లైఫ్ సైకిల్) మళ్లీ మళ్లీ పునరావృతమవుతూ, అలా వ్యాధిని వ్యాప్తి చేస్తూ ఉంటుందన్నమాట. వ్యాధి కారకాలైన ప్లాస్మోడియమ్ మనిషిలో ఆశ్రయం తీసుకున్నప్పుడు అవి మనిషిలో అలైంగిక చర్య ద్వారా అభివృద్ధి చెందుతాయి కాబట్టి మనిషిని ‘ఇంటర్మీడియట్ హోస్ట్’ అని అంటారు. అయితే చిత్రం ఏమిటంటే... ప్లాస్మోడియమ్ పరాన్నజీవులు మనిషికి వ్యాధిని కలిగిస్తాయి. దోమకు ఎలాంటి హానీ చేయవు. కాబట్టి దోమను ‘క్యారియర్’ (వ్యాధి వ్యాప్తికి దోహదపడే వాహకం) గా అభివర్ణిస్తారు. వ్యాక్సిన్లు ప్రస్తుతానికి మలేరియాకు లెసైన్స్డ్ వ్యాక్సిన్ ఏదీ లభ్యం కావడం లేదు. అయితే ఆర్టీఎస్.ఎస్/ఏఎస్ఓ1 అనే వ్యాక్సిన్లు పరీక్ష దశల్లో చాలా పురోగతి సాధించాయి. ప్రస్తుతానికి ఇవి ‘క్లినికల్ ట్రయల్’ దశలో ఉన్నాయి. అందుకే త్వరలోనే మలేరియాకు మంచి వ్యాక్సిన్ లభ్యమవుతుందనే ఆశాకిరణం కనిపిస్తోంది. మలేరియా అంటే...? క్రీస్తుపూర్వం దాదాపు ఐదు శతాబ్దాల కిందటే ఈ వ్యాధిని గుర్తించారు. అయితే అప్పట్లో మలేరియా అన్న వ్యాధి చెడు పరిసరాల వల్ల, చెడు గాలి వల్ల వచ్చేదని భావించేవారు. ‘మాల్’ అంటే చెడు అనీ... ‘ఏరియా’ అంటే పరిసరాలు అని అర్థం. ఈ భావన వల్లనే ఆ వ్యాధికి మలేరియా అనే పేరు పెట్టారు. కానీ ఆ తర్వాత ఇది దోమల కారణంగా వ్యాప్తి చెందుతుందని తేలింది. దోమ కడుపులో జరిగే జీవిత చరిత్రను సర్ రొనాల్డ్ రాస్ అనే పరిశోధకుడు మన సికింద్రాబాద్ లోనే కనుక్కున్నారు. అంటే ప్రపంచానికి ఉపయోగపడే ఒక కీలకమైన పరిశోధన ఫలితాలు మన సికింద్రాబాద్‌లోనే ఆవిష్కృతమయ్యాయన్నమాట. వ్యాధి తీవ్రత ఎవరెవరిలో ఎక్కువ ? వృద్ధుల్లో, చిన్నారుల్లో, గర్భిణుల్లో జబ్బు గుర్తించడంలో జాప్యం జరిగి చికిత్స అందడం ఆలస్యం అయిన వారిలో పారసైటిక్ లోడ్ ఎక్కువగా ఉన్నవారిలో మలేరియా లేని దేశాల నుంచి మలేరియా ఉన్న ప్రాంతంలోకి వచ్చిన వారికి ఈ వ్యాధి పట్ల నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దాంతో వారిలో తీవ్రత ఎక్కువ. లక్షణాలు మలేరియా జ్వరం ప్రధాన లక్షణంగా కనిపించే వ్యాధి. రోగాన్ని కలిగించే పరాన్నజీవులు శరీరంలోకి ప్రవేశించగానే లక్షణాలు కనిపించవు. అవి ప్రవేశించిన నాటి నుంచి వ్యాధి లక్షణాలు బయటపడేవరకు పట్టే వ్యవధిని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. దోమ కుట్టిన తర్వాత 7 నుంచి 14 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయి. మలేరియా లక్షణాలు ఇవి... చలితో పాటు తలనొప్పి ఉండి జ్వరం కనిపిస్తుండటం మలేరియా సాధారణ లక్షణం. మలేరియా వ్యాధిని కలిగించే పరాన్న జీవి ప్రజాతిని బట్టి లక్షణాలూ కొద్దిగా మారతాయి. భారత్‌లో ప్రధానంగా రెండు రకాలు ఎక్కువ. వాటిల్లో ప్లాస్మోడియమ్ వైవాక్స్ కంటే ప్లాస్మోడియమ్ ఫ్యాల్సిపేరమ్ తీవ్రత చాలా ఎక్కువ. ఎందుకంటే ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందిన పరాన్నజీవులు ఎర్రరక్తకణాల్లో తమ అభివృద్ధిని చాలా వేగంగా సాగిస్తాయి. దాంతో రోగి కోమాలోకి వెళ్లడానికి అవకాశాలు ఎక్కువ. ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందిన మలేరియా వల్ల శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, కామెర్లు, మూత్రపిండాలు విఫలం కావడంతో పాటు ఒక్కోసారి అది మృత్యువుకు కూడా దారితీయవచ్చు. స్థూలంగా కనిపించే అన్ని లక్షణాలు... జ్వరం తలనొప్పి తీవ్రమైన ఒళ్లునొప్పులు జ్వరం: ఎర్రరక్తకణాల్లో ప్రత్యుత్పత్తి తర్వాత కణాలు పెరిగి ఎర్రరక్తకణాలు విచ్ఛిన్నమై మెరోజువైట్స్ను విడుదల చేసినప్పుడు జ్వరం వస్తుంది. చలి: మొదట చలి వచ్చి ఆ తర్వాత విపరీతమైన చెమటలు వస్తాయి. లక్షణాల్లో తేడాలిలా... ఎర్రరక్తకణాల నుంచి వచ్చే మెరోజువైట్స్ విడుదల అనే అంశం వేర్వేరు రకాలు ప్రజాతుల్లో వేర్వేరు వ్యవధుల్లో ఉంటుంది. అందుకే జ్వరం వచ్చే తీరు, వ్యవధి ఒక్కొక్క ప్రజాతిలో ఒకలా ఉంటుంది. ఫ్యాల్సిపేరమ్, వైవాక్స్, ఒవ్యులాలో ప్రతి 48 గంటలకు ఒకసారి జ్వరం వస్తుంది. మలేరియా ప్రజాతి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు జ్వరం ప్రతి 72 గంటలకు ఒకసారి వస్తుంది. నిర్ధారణ... ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ధి మలేరియా నిర్ధారణ కోసం రక్తపరీక్షపై ఆధారపడటం అన్నది సాధారణంగా ఇప్పటివరకూ జరుగుతూ వస్తున్న ప్రక్రియ. అయితే ఇటీవల ఈ రంగంలో చోటు చేసుకున్న అభివృద్ధి కారణంగా చాలా చవకగానూ, విస్తృతంగానూ లభ్యమవుతున్న ‘డిప్-స్టిక్’ పద్ధతి ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ కేవలం 15 నిమిషాల్లోనే జరుగుతోంది. పైగా ఇంత వేగంగా చేయగలిగే ఈ పరీక్ష ఫలితాలు చాలా ఖచ్చితమైనవి కూడా. గతంలోని పరీక్షలు... రక్త పరీక్ష: థిక్ అండ్ థిన్ స్మియర్, జిమ్మ్సా స్టెయిన్ పరీక్షలు. ఒకసారి పరీక్షలు చేసిన వెంటనే మలేరియా పరాన్నజీవి కనుగొనకపోతే... రెండు, మూడు రోజుల పాటు వరసగా రక్తపరీక్ష చేయాల్సి ఉంటుంది. ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్: మలేరియా యాంటిజెన్‌ను త్వరగా గుర్తించగలిగే పరీక్షలు, పారసైట్-ఎఫ్, ఆప్టిమల్ టెస్ట్స్... ఇవన్నీ ర్యాపిడ్ డయాగ్నస్టిక్ తరహాకు చెందినవి. అయితే పీసీఆర్ టెస్ట్, మలేరియా యాంటీబాడీస్ టెస్ట్ అనే తరహా పరీక్షలు కూడా ఉన్నాయి గాని వీటిని పెద్దగా వాడటం లేదు. చికిత్సలోనూ ఇప్పుడు విప్లవాత్మక పురోగతి... గతంలో మలేరియా చికిత్స క్వినైన్, క్లోరోక్విన్ వంటి సంప్రదాయ మందులతో చేసేవారు. కానీ డాక్టర్లు అందుబాటులో లేని చోట కూడా ఒకనాడు విస్తృతంగా లభ్యమయ్యే ఆ మందుల పట్ల మలేరియా పరాన్నజీవులు తమ నిరోధక శక్తిని పెంచుకున్నాయి. దాంతో ఆ మందుల లభ్యతపై కొంత నియంత్రణ విధించాల్సి వచ్చింది. సాధారణ చికిత్సా ప్రక్రియలు మలేరియా వ్యాధి అని నిర్ధారణ చేసుకున్న తర్వాత అది తీవ్రత తక్కువగా ఉండే వైవాక్స్ లాంటిదా లేక తీవ్రమైన ఫ్యాల్సిపేరమ్ తరహాదా అని పరిశీలిస్తారు. వైవాక్స్ లాంటి సాధారణ మలేరియాకు రోగిని ఇంట్లో ఉంచే చికిత్స చేయవచ్చు. సాధారణ క్లోరోక్విన్ మందులతో పాటు పుష్టికరమైన ఆహారం, విశ్రాంతితో ఈ తరహా మలేరియా త్వరగానే అదుపులోకి వస్తుంది. ఇక కేవలం మందుల విషయానికి వస్తే... ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ఫెక్షన్ సోకితే చికిత్స అనంతరం ప్రైమాక్వైన్ టాబ్లెట్స్ (15 ఎంజీ) రెండు వారాల కోర్సు వాడాల్సి ఉంటుంది. ఫ్యాల్సిపేరమ్ అయితే... తీవ్రప్రభావం చూపించే ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందినదైతే ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయాలి. ఎందుకంటే ఈ తరహా మలేరియా జ్వరంలో రోగికి కాలేయం, మూత్రపిండాలు, మెదడు, ఊపిరితిత్తులు వంటి అవయవాలకు సంబంధించిన దుష్ర్పభావాలు కనిపించే అవకాశం ఎక్కువ. అంటే కామెర్లు రావడం, స్పృహతప్పిపోవడం, ఫిట్స్ రావడంతో పాటు శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బందులు, మూత్రపిండాలు విఫలం కావడం, మూత్రం తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయడం తప్పనిసరి. ఇలాంటి స్థితిలో మలేరియా చికిత్స కోసం క్వినైన్ సల్ఫేట్, ఆర్టెసునేట్, టెట్రాసైక్లిన్, డాక్సిసైకర్టిన్, మెఫ్లోక్విన్, క్లిండోమైసిన్, అమోడయాక్విన్, ల్యూమెఫ్యాంట్రైన్ లాంటి మందులు వివిధ కాంబినేషన్స్‌లో వాడతారు. ఇతర శారీరక దుష్ర్పభావాలు (కాంప్లికేషన్స్) ఉన్నవారిలో తొలుత ఇంజెక్షన్స్ వాడి తర్వాత నోటి ద్వారా తీసుకునే మందులు ఉపయోగిస్తారు. రోగి అంతర్గత అవయవాలు దెబ్బతింటే... ఆ దెబ్బతిన్న అవయవాన్ని బట్టి చికిత్స చేయాలి. అంటే... మూత్రపిండాల పనితీరు దెబ్బతింటే డయాలిసిస్, శ్వాస సరిగా అందకపోతే వెంటిలేషన్ వంటి సౌకర్యాలు అవసరమవుతాయి. ఫ్యాల్సిపేరమ్ రకానికి ఈ తరహా చికిత్స దొరకకపోతే రోగి మరణానికి కూడా దారితీయవచ్చు. చికిత్సల్లో ఇప్పుడు చోటు చేసుకున్న పురోగతి ఇటీవల మలేరియా చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులు, పురోగతి చోటు చేసుకున్నాయి. ‘ఆర్టిమిసినిన్’ గ్రూపునకు చెందిన మందులను కనుగొన్న తర్వాత ఈ చికిత్స మరింత సులభం అయ్యింది. ‘ఆర్టిమిసినిన్’ అన్నది ‘స్వీట్ వార్మ్వుడ్’ అని పిలిచే ఒక రకం చైనీస్ జాతి మొక్క. దీని నుంచి తయారు చేసిన ‘ఆర్టిమిసినిన్’ మందులతో రోగిలో గుణం కనిపించడం చాలా మెరుగ్గానూ, వేగంగానూ జరుగుతుంది. అయితే ఒకే ఒక మందుగా (అంటే మోనో థెరపీగా) దీన్ని ఇచ్చినప్పుడు రోగిలోని మలేరియా క్రిములు ఆ మందు పట్ల నిరోధకతను వేగంగా అభివృద్ధి చేసుకుంటాయి. ఇదే విషయం మయన్మార్, కాంబోడియా, థాయిలాండ్ దేశాల్లో నిరూపితమైంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు ఈ తరహా మందుల లభ్యత పట్ల ప్రపంచ మార్కెట్లో కొన్ని నియంత్రణలను విధించింది. దాంతో కేవలం ఆర్టిమిసినిన్ గ్రూపు మందులే కాకుండా వాటితో పాటు మరికొన్ని కాంబినేషన్ మందులను వాడటం అన్నది ఫ్యాల్సిపేరమ్ తరహా మలేరియా చికిత్సలో ఒక భాగం అయ్యింది. దీన్నే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆర్టిమిసినిన్ బేస్డ్ కాంబినేషన్ థెరపీలు (ఏసీటీస్)గా పేర్కొంటోంది. మలేరియా రోగాన్ని కలిగించే పరాన్న జీవులు మందుల పట్ల తమ నిరోధకతను పెంచుకోవడాన్ని గమనించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చికిత్సలో ఒక ప్రామాణికతను నిర్ణయించింది. దాన్ని ‘డబ్ల్యూహెచ్ఓ టీ3’గా అభివర్ణిస్తారు. టీ3 అంటే... టెస్ట్, ట్రీట్, ట్రాక్ ఇనిషియేషన్ అన్నమాట. అంటే నిర్ధారణ పరీక్ష, చికిత్స, అవి కొనసాగే తీరు. నివారణ దోమల నివారణే మలేరియా నివారణకు మంచి మార్గం. దోమ కాటు నుంచి మనల్ని మనం ఎంతగా రక్షించుకుంటే మలేరియా నుంచి అంత సమర్థంగా మనల్ని మనం కాపాడుకోవచ్చన్నమాట. వ్యక్తిగతమైన నివారణలో భాగంగా మనం ఉండే ఇంటిలో, గదిలో దోమలు రాకుండా చూసుకోడానికి అవసరమైన రిపెల్లెంట్లు, దోమతెరలు వాడటం ఒక పద్ధతి. దోమలు కుట్టకుండా పొడువు చేతుల చొక్కాలు ధరించడం, ఒంటినిండా బట్టలు ఉండి, ఒంటినంతా అవి కప్పి ఉంచేలా చూసుకోవడం. దోమలు కుట్టకుండా ఉండేందుకు శరీరంపైన పూత మందులు వాడటం కూడా ఒక మార్గం. ఇక సామాజిక నివారణలో భాగంగా మన ఇళ్ల సరిసరాల్లో మురుగు నీరు లేకుండా, నిల్వ నీరు లేకుండా చూసుకోవడం మంచిది. దీనితో పాటు కాల్వల్లో నీరు ఒకేచోట చేరి ఉండకుండా శుభ్రం చేసుకోవడం అవసరం. దూరప్రాంతాలకు ప్రయాణమయ్యేవారు ముందు జాగ్రత్తగా సల్ఫాడోక్సిన్ - పైరిమిథమైన్ వంటి యాంటీ మలేరియల్ (కీమో-ప్రొఫిలాక్సిస్) మందులు తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. వ్యాధి నిర్ధారణ ప్రక్రియల్లో, చికిత్స పద్ధతుల్లో ఇంతగా పురోగతి చోటు చేసుకుంటున్నా చాలా ప్రాంతాల్లో ఇదో తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా ఉంది. మన రాష్ట్రంలోనూ అనేక గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఇది తీవ్రంగా బాధిస్తోంది. అందుకే చవగ్గా లభ్యమయ్యే మరిన్ని మందులు, నివారణ ప్రక్రియల కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. అవి అవసరం కూడా. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
మేలైన కురులకు...ఆరోగ్య సిరులకు!
వెంట్రుక అంటే చాలా మందికి కాస్త తేలిక అభిప్రాయం. అందుకే కొండకు వెంట్రుక కట్టడం వంటి సామెతలు వచ్చాయి. కానీ జుట్టుతో వ్యవహారం కనపడేంత తేలికైనది కాదు. వాణిజ్యపరంగా రోజూ లక్షల కోట్ల రూపాయల వ్యవహారాలు వెంట్రుకల కారణంగానే జరుగుతుంటాయి. ఇలా వ్యవహారపరంగానే కాదు... నిర్మాణపరంగానూ అంతే సంక్లిష్టమైనది కేశం. కోట్ల కొద్దీ వ్యక్తులు కురుల గురించే ఆలోచిస్తూ దాన్ని జీవితమంత సమస్యగా పరిగణిస్తుంటారంటే అతిశయోక్తి కాదు. అందుకే అంతటి విలువైన పట్టులాంటి జుట్టు కోసం, జుట్టుపై పట్టు కోసం ఈ కథనం. చూడటానికి వెంట్రుక నల్లటి, సన్నటి తీగలాగా అనిపిస్తుంటుంది. కానీ అంతర్గతంగా దీని నిర్మాణం చాలా సంక్లిష్టం. చూసీచూడగానే జెండర్ తేడాను గుర్తించేది దానివల్లనే. మన శరీరంలో ఎప్పటికప్పుడు తనను తాను నిత్యనూతనంగా తీర్చిదిద్దుకోగల ఏకైక భాగం వెంట్రుక. ఎలా పుడుతుంది...? బిడ్డ తన తల్లి కడుపులో ఉన్నప్పుడు పిండం తాలూకు 22వ వారంలోనే వెంట్రుక మూలాలు శరీరంపై ఆవిర్భవిస్తాయి. వాటిని ఫాలికిల్స్ అంటారు. అంటే పుట్టకముందే బిడ్డ శరీరంపై 50 లక్షల ఫాలికిల్స్ ఉంటాయి. వీటిల్లో పదిలక్షలు తల (మాడు) మీద ఉంటాయి. పుట్టుకకు ముందు ఈ ఫాలికిల్స్ ఎన్ని ఉంటాయో జీవితాంతం అన్నే ఉంటాయి. అంతేతప్ప వీటి సంఖ్య జీవితకాలంలో ఎప్పుడూ పెరగదు. పైగా మనం పెరుగుతున్నకొద్దీ వీటి సంఖ్య తగ్గుతుంది. నిర్మాణం ఎలా ఉంటుంది? వెంట్రుకను ప్రధానంగా రెండు భాగాలుగా చెప్పవచ్చు. అదే మాడు మీది చర్మం లోపల ఉండే ‘అంకురం’ (ఫాలికిల్). మనకు కనిపించే భాగాన్ని ‘వెంట్రుక’ (షాఫ్ట్) అంటారు. ఫాలికిల్‌లో అనేక పొరలు ఉంటాయి. అంకురం లోపల ఒక మొలక (ప్రొజెక్షన్)లా ఉండే భాగాన్ని పాపిల్లా అంటారు. దీనికి రక్తసరఫరా ఉంటుంది. వెంట్రుకలో జీవంతో ఉండే భాగం ఇదే. ఈ పాపిల్లా చుట్టూ ఉబ్బెత్తుగా ఉండే భాగాన్ని బల్బ్ అంటారు. ఈ బల్బ్‌లో నిరంతరం కణవిభజన జరుగుతూ ఉంటుంది. శరీరంలోని మరే ప్రాంతంలోనూ ఇంత వేగంగా కణవిభజన జరగదు. ప్రతి 23 నుంచి 72 గంటలకు ఒకసారి కణాలు విభజితమవుతూ పోతుండటం వల్ల అది వెంట్రుకల పెరుగుదలకు దారితీస్తుంది. అలాగే ప్రతి ఫాలికిల్తో పాటు ఒక గ్రంథి ఉంటుంది. దాన్ని ‘సబేషియస్ గ్రంథి’ అంటారు. ఇది నూనెలాంటి ద్రవాన్ని స్రవిస్తూ ఉంటుంది. ఈ స్రావమే జుట్టుకు నేచురల్ కండిషనర్. పిల్లలు యుక్తవయస్కులయ్యాక ఈ గ్రంథి నుంచి స్రావం ఎక్కువై జుట్టులో మెరుపును పెంచి, ఆ వయసు పిల్లలు మరింత అందంగా కనిపించేలా దోహదం చేస్తుంది. వెంట్రుకల ఆకృతి స్థూలంగా వెంట్రుకలన్నీ ఒకేలా ఉన్నా... అవి గుంపుగా పెరిగాక తలపై కనిపించే షేప్‌లు... వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుండటం అందరికీ తెలిసిందే. వెంట్రుకను అడ్డుగా కోసినప్పుడు ఆ అడ్డుకోత గుండ్రంగా ఉంటే అది సాఫీగా (స్ట్రెయిట్)గా పెరుగుతుంది. ఒకవేళ ఆ అడ్డుకోత దీర్ఘవృత్తంలా ఉంటే అది రింగులుగా పెరుగుతుంది. తిన్నగా సాఫీగా ఉండే జుట్టుకు... అడుగున ఉండే సబేషియస్ గ్రంథి నుంచి పోషకాలు సాఫీగా అందుతాయి. కాబట్టి ఇవి మరింత జీవంతో ఉంటాయి. ఇలా కనిపించడం కోసమే చాలామంది జుట్టును తిన్నగా ఉండేలా (హెయిర్ స్రెయిటెనింగ్) చేయించుకుంటూ ఉంటారు. అదే ఉంగరాల్లా తిరిగే జుట్టు వారిలో పోషకాలు చివరివరకూ చేరడానికి కాస్త ప్రతిబంధకంగా ఉండటంతో పొడవు జుట్టు ఉన్నవారి కంటే ఉంగరాల జుట్టు కాస్తంత మెరుపు తక్కువగా ఉంటుంది. మందులతో... రకరకాల రుగ్మతలకు మందులు వాడుతున్న కొందరిలో వాటి దుష్ర్పభావం వల్ల జుట్టు రాలడం మామూలే. ఇక కొందరిలోనైతే ఇది అవాంఛిత రోమాల పెరుగుదలకూ దారితీస్తుంది. ఈ మందులతో టిలోజెన్ ఎఫ్లువియమ్, అనాజెన్ ఎఫ్లూవియమ్ అనే రెండు రకాల మార్పులు వచ్చి జుట్టు రాలేలా చేస్తాయి. టిలోజెన్ ఎఫ్లూవియమ్ : ఏదైనా రుగ్మతకు మందులు వాడటం మొదలుపెట్టాక 2 నుంచి 4 నెలల్లో మందు ప్రభావంతో వెంట్రుక ఫాలికిల్ విశ్రాంతి దశలోకి వెళ్తుంది. ఫలితంగా జుట్టు రాలి మళ్లీ మొలవడం ఆలస్యం అవుతుంది. అనాజెన్ ఎఫ్లూవియమ్: ఇందులో వెంట్రుకలు పెరిగే దశలోనే రాలిపోతుంటాయి. ఉదాహరణకు కీమోథెరపీ తీసుకునేవారిలో అనాజెన్ ఎఫ్లూవియమ్ వల్లనే జుట్టురాలడం సంభవిస్తుంది. ఈ మందుల వల్ల కేవలం తలపైని జుట్టే కాకుండా కనుబొమలు, కనురెప్పల వెంట్రుకలూ రాలిపోతాయి. ఏయే మందులతో జుట్టు రాలవచ్చు... మొటిమలకు వాడే మందులు కొన్ని యాంటీబయాటిక్స్ కొన్ని యాంటీ ఫంగల్ మందులు, యాంటీ డిప్రెసెంట్స్ నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మందులు, రక్తాన్ని పలచబార్చే బ్లడ్ థిన్నర్స్ యాంటీకొలెస్ట్రాల్ మందులు ఇమ్యునోసప్రెసెంట్స్ కీమోథెరపీ మందులు మూర్చ చికిత్సలో వాడే ఎపిలెప్సీ మందులు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలో వాడే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, పురుషులకు వాడే టెస్టోస్టెరాన్, యాండ్రోజెన్ ఇంటర్‌ఫెరాన్స్ కొన్ని నొప్పినివారణ మందులు స్టెరాయిడ్స్ థైరాయిడ్ మందులు. అరికట్టడం ఇలా... మందులు వాడటం మానేయగానే సాధారణంగా జుట్టు మళ్లీ రావచ్చు జుట్టు రాలడం విపరీతంగా ఉంటే ప్రత్యామ్నాయ మందులు వాడటం ద్వారా జుట్టు రాలడాన్ని అరికట్టే మందులు వాడటం ద్వారా కీమోథెరపీ ఇచ్చే సమయంలో హైపోథెర్మియా అనే ప్రక్రియను ఉపయోగించడం ద్వారా. ఇందులో కీమోథెరపీ ఇచ్చే ముందర... ఇచ్చిన అరగంట తర్వాత మాడుపై ఐస్‌తో రుద్దుతారు. ఫలితంగా ఫాలికిల్‌లోకి మందు అంతగా వెళ్లదు. దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టును రాల్చే ఇన్ఫెక్షన్లు... రింగ్వార్మ్ : ఇది ఒక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్. ఈ కండిషన్‌ను టీనియా కాపిటిస్ అంటారు. ఇది మాడుపై మొదట చిన్న మొటిమలా వచ్చి క్రమంగా పెరుగుతూ పోతుంది. విస్తరించిన చోట పొలుసుల్లా వచ్చి... ఆ ప్రదేశంలో తాత్కాలికంగా జుట్టు మొలవదు. చికిత్స: టెర్బినఫిన్, ఫ్లుకోనజోల్, గ్రీషియోఫల్విన్, ఇట్రాకొనజోల్ వంటి యాంటీఫంగల్ మందులతో చికిత్స చేయవచ్చు. ఫాలిక్యులైటిస్ : ఇది జుట్టు ఫాలికిల్ (అంకురాల్లో) ఇన్ఫ్లమేషన్ (వాపు, నొప్పి) వచ్చే కండిషన్. ఇది వచ్చినవారిలో వెంట్రుక మొదల్లో ఎర్రటి పొక్కులు వచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. ఇది స్టెఫలోకాకస్, సూడోమొనాస్ వంటి బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. చికిత్స : యాంటీబయాటిక్ మందులతో. పీడ్రా : ఇది వెంట్రుకకు వచ్చే ఒక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్. డెమోడెక్స్ ఫాలిక్యులోరమ్ : ఇది కనురెప్పల వెంట్రుకలను ప్రభావితం చేసే కండిషన్. ఈ జబ్బుకు దారితీసే సూక్ష్మజీవి కనురెప్పలను మెరిసేలా చేసే నూనెను ఎక్కువగా స్రవించేలా చేయడం వల్ల ఈ రుగ్మత వస్తుంది. వెంట్రుక తీగ (షాఫ్ట్)కు వచ్చే లోపాలు... వెంట్రుకలో మనకు పైకి కనిపించే తీగ వంటి భాగాన్ని షాఫ్ట్ అంటారు. ఈ లోపాలకు ప్రధాన కారణం జన్యుపరమైనవి. వాటిలో కొన్ని... లూజ్ అనాజెన్ సిండ్రోమ్: దీన్నే లూజ్ హెయిర్ సిండ్రోమ్ అంటారు. దీని పేరే దీని వల్ల కలిగే లోపాన్ని చెప్పకనే చెబుతుంది. అంటే అనాజెన్ దశలో వెంట్రుక వదులుగా అయి చిన్నగా లాగినా ఊడి వచ్చేస్తుంది. ప్రధానంగా యుక్తవయస్కులైన బాలికల్లో ఈ తరహా లోపం కనిపిస్తుంది. ఇలా ఊడిన జుట్టు ఒకపట్టాన తేలిగ్గా మొలవదు. అందుకే మాడుపై జుట్టు పలచబారే అవకాశం ఉంది. అధిగమించడం/అరికట్టడం: సాధారణంగా ఇలా ఊడిన జుట్టు దానంతట అదే రావాల్సిందే. చికిత్సతో పెద్దగా ప్రభావం ఉండదు. ట్రాక్షన్ అలొపేషియా అండ్ ట్రైకో టిల్లోమేనియా : చాలామంది తల్లులు జడవేసే సమయంలో తమ పిల్లలకు జుట్టును బాగా లాగి టైట్‌గా జడవేస్తుంటారు. ఇలా దీర్ఘకాలం పాటు జరుగుతుండటం వల్ల జుట్టు శాశ్వతంగా దెబ్బతింటుంది. ఇక ట్రైకో టిల్లోమేనియా అనే కండిషన్లో కొందరు తమ జుట్టును తామే బలంగా పీకేసుకుంటుంటారు. అంటే బాగా ఒత్తిడితో ఉండేవారు తమ గోళ్లు విపరీతంగా కొరుక్కున్న తరహాలోనే ఇలా పీకేసుకుంటుంటారు. దాంతో వారి తల బట్టతలగా మారిపోతుంది. ఇక కొందరైతే తల పూర్తిగా ప్యాచ్‌లు ప్యాచ్‌లుగా బట్టతలగా మారిపోయాక... కనురెప్పల వెంట్రుకలు, కనుబొమల వెంట్రుకలు కూడా లాగుతూ ఉంటారు. ట్రైకోఫేజియా : ఇది కూడా తమ జుట్టు తాము లాక్కోవడం లాంటిదే. అయితే ఈ రుగ్మత ఉన్నవారు అలా లాగిన జుట్టును తినేస్తుంటారు. ఇది చాలా తీవ్రమైన జబ్బు. ఇలాంటి వారికి తక్షణమే ఎమర్జెన్సీ ప్రాతిపదికన చికిత్స అవసరం. కాలుష్యం ప్రభావం! ఆధునిక జీవనశైలిలో జుట్టును పీడిస్తున్న సమస్య వాతావరణ కాలుష్యం. పొగ, ధూళి కారణంగా జుట్టు పొడిబారి నిర్జీవమవుతుంది. కుదుళ్లు బలహీన పడి జుట్టురాలి పోతుంది, ఉన్న వెంట్రుక కూడా బలహీనమై మధ్యలోకి తెగిపోతుంది. కాలుష్యం నుంచి రక్షణ... బయటకు వెళ్లేటప్పుడు జుట్టు కవర్ అయ్యేటట్లు క్యాప్ లేదా స్కార్ఫ్ వాడాలి. తలస్నానం చేయడానికి ముందు నూనెతో తలంటుకోవాలి. తలస్నానానికి శీకాయ, కుంకుడుకాయలను వాడాలి. అవి సాధ్యం కాకపోతే నాణ్యమైన షాంపూలను వాడాలి. జుట్టు ఎందుకు రాలుతుంది? జట్టు రాలడానికి అనేక కారణాలు దోహదపడుతుంటాయి. అందులో ముఖ్యమైనవి... శారీరక ఒత్తిడి: నిత్యం ఉండే శారీరక ఒత్తిడులు లేదా తీవ్రంగా జబ్బు పడటం వంటి అంశాలు మనలో భౌతికంగా మార్పులు తెచ్చి జుట్టు రాలిపోయేలా చేస్తాయి. ఇలా జుట్టు రాలడాన్ని ‘టిలోజెన్ ఎఫ్లూవియమ్’ అంటారు. అంటే ఈ దశలో జుట్టు ఊడిపోయే దశ అయిన టిలోజెన్ దీర్ఘకాలం కొనసాగుతుంది. ఫలితంగా మాడుపైన జుట్టు పలచబడినట్లుగా కనిపిస్తుంది. ఈ దశలో రాలిన జుట్టు చివరి భాగంలోని తెల్లని పదార్థం పచ్చిగా కాకుండా ఎండిపోయినట్లుగా ఉండటం గమనించవచ్చు. అరికట్టడం ఇలా: ఇలా రాలిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది. గర్భధారణ తర్వాత: చాలామంది మహిళల్లో ప్రసవం తర్వాత తలపై జుట్టు ఎక్కువగా రాలి పలచబారిపోతుంది. దీనికి వారు అనుభవించే శారీరక ఒత్తిడి కూడా ఒక కారణం. పైగా జుట్టుకు అందాల్సిన పోషకాలు అందకుండా కడుపులోని బిడ్డకు అందుతుంటాయి. అరికట్టడం ఇలా: తగినంత ఐరన్ సప్లిమెంట్లు, మల్టీవిటమిన్లు జుట్టుకూ అందేలా చూసి దీన్ని అరికట్టవచ్చు. ప్రోటీన్ లోపాల వల్ల: ప్రోటీన్‌తో కూడిన ఆహారం తగినంతగా తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు రాలుతుంది. ఈ ప్రోటీన్లే అమైనో ఆసిడ్స్గా విభజితమై జుట్టు పెరుగుదలకూ, రిపేర్లకూ దోహదపడతాయి. అరికట్టడం ఇలా: ఇలా జుట్టు ఎక్కువగా రాలుతున్నవారు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారమైన చేపలు, గుడ్లు, మాంసాహారం పుష్కలంగా తీసుకోవాలి. శాకాహారులైతే ఆకుకూరలు, గ్రీన్‌పీస్, నట్స్, శనగలు, పప్పుధాన్యాలు, సోయా తీసుకోవాలి. హార్మోన్ లోపాల వల్ల : సాధారణంగా హార్మోన్ లోపాల సమస్య మహిళల్లో ఎక్కువ. మహిళల్లోనూ కొద్దిగా పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ స్రవిస్తుంటుంది. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉన్నవారిలో టెస్టోస్టెరాన్ స్రావం ఎక్కువ. దీంతో జుట్టు రాలుతుంది. ఇక హైపోథైరాయిడిజమ్ కండిషన్ వల్ల కూడా జుట్టు రాలుతుంది. అరికట్టడం ఇలా: పీసీఓఎస్‌తో బాధపడే మహిళలు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ద్వారానూ, హైపోథైరాయిడిజమ్ ఉన్నవారు థైరాక్సిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా. కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్ల వల్ల : మన రోగనిరోధకశక్తే మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే జబ్బులను ఆటోఇమ్యూన్ జబ్బులుగా పేర్కొంటుంటారు. ఉదా: పేనుకొరుకుడు (అలొపేషియా ఏరేటా) వల్ల మాడు, కనుబొమలు, మీసం, గడ్డం, శరీరంలో ఏభాగంలోనైనా వెంట్రుకలన్నీ రాలిపోయి ప్యాచ్‌లుగా కనిపిస్తుంటాయి. లెకైన్ ప్లానస్ వల్ల జుట్టు శాశ్వతంగా ఊడిపోయే అవకాశం ఉంది. లూపస్ అనే కండిషన్ వల్ల కూడా శాశ్వతంగా జుట్టు రాలిపోవచ్చు. అరికట్టడం ఇలా: ఆటోఇమ్యూన్ జబ్బుల వల్ల జుట్టు రాలుతుంటే డాక్టర్‌ను సంప్రదించి నోటిద్వారా లేదా ఇంజెక్షన్ రూపంలో స్టెరాయిడ్స్ తీసుకోవాలి. ఆటోఇమ్యూన్ కారణాల వల్ల జుట్టు రాలడం నివారించడానికి డ్యాప్సోన్ అనే మందులు మరి కాస్త మెరుగ్గా పనిచేస్తాయి. ఎంత పెరుగుతుంది,ఎలా పెరుగుతుంది? ప్రతిరోజూ వెంట్రుక 0.3 మి.మీ. నుంచి 0.4 మి.మీ. వరకు పెరుగుతుంది. మరో మాటలో చెప్పాలంటే ఏడాదికి ఆరు అంగుళాల పొడవు పెరుగుతుంది. వెంట్రుక పెరుగుదలలో కెటాజెన్, టిలోజెన్, అనాజెన్ అనే దశలు ఉంటాయి. కెటాజన్: మొత్తం జుట్టులో కనీసం మూడు శాతం ఎప్పుడూ ఈ దశలో ఉంటుంది. 2-3 వారాలుండే ఈ దశ నిజానికి వెంట్రుక పెరుగుదలలో సంధి దశ. ఈ దశలో వెంట్రుక నిద్రాణంగా ఉంటుంది. పెరుగుదల ఏమాత్రం ఉండదు. టిలోజెన్: మన మొత్తం జుట్టులో 10-15 శాతం ఎప్పుడూ ఈ దశ 100 రోజులు కొనసాగుతుంది. కనుబొమలు, కనురెప్పలు, బాహుమూలాల్లో ఉండే వెంట్రుకల్లో ఈ దశ మరింత దీర్ఘకాలం ఉంటుంది. ఈ దశలో వెంట్రుకను పీకితే వెంట్రుక కింద గసగసాల్లా ఉండే గుండ్రటి, తెల్లటి భాగం కనిపిస్తుంది. అనాజెన్: వెంట్రుక పెరుగుదల దశలన్నింటిలోనూ అనాజెన్ అనేది చురుకైనది. ఈ దశలో వెంట్రుక మూలంలో కణవిభజన వేగంగా జరుగుతుంటుంది. కింద కొత్త కణాలు వస్తున్న కొద్దీ పాత కణాలు ముందుకు వెళ్తుంటాయి. దాంతో కింది నుంచి వేగంగా వెంట్రుక పెరుగుతూ పోతుంది. ఈ దశలో ప్రతి 28 రోజులకు వెంట్రుక ఒక సెం.మీ. పెరుగుతుంది. ఈ పెరుగుదల 2-6 ఏళ్లుంటుంది. బట్టతల... ఈ సమస్యను అధిగమించడం ఇలా... ఇందులో రెండు రకాల బట్టతలలు ఉంటాయి. మొదటిది పురుషుల్లో వచ్చే బట్టతల. దీన్నే ‘మేల్ ప్యాట్రన్ హెయిర్‌లాస్’ అంటారు. ఇక రెండోది మహిళల్లో వచ్చే ‘ఫిమేల్ ప్యాట్రన్ హెయిర్‌లాస్’. బట్టతలను ‘యాండ్రోజెనిక్ అలొపేషియా’ అంటారు. అయితే నిన్నమొన్నటివరకూ పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్ల ఇది వచ్చేదన్న అపోహ ఉండేది. కానీ అత్యాధునిక పరిశోధనల ప్రకారం దీనికి టెస్టోస్టెరాన్ కారణం కాదనీ... ‘డీహెచ్‌టీ’ (డిహైడ్రో టెస్టోస్టెరాన్) కారణమని తేలింది. పురుషుల్లో వచ్చే బట్టతలలో నుదురు మీద ఉండే హెయిర్‌లైన్ క్రమంగా వెనక్కిపోతూ ఉంటుంది. ఇక మహిళల్లో వచ్చే ఫిమేల్ పాట్రన్ హెయిర్‌లాస్ అనే బట్టతలలో ముందున్న హెయిర్‌లైన్ అలాగే ఉండి, మాడు మీద జుట్టు పలచబారుతూ పోతుంటుంది. బట్టతలను నిర్ధారణ చేయడానికి పుల్టెస్ట్, ప్లక్టెస్ట్, స్కాల్ప్ బయాప్సీ, డెయిలీ హెయిర్ కౌంట్ (ఒకరోజు రాలిపోయే వెంట్రుకల సంఖ్య), ట్రైకోస్కోపీ అనే పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అలాగే బట్టతల వస్తోందని నిర్ధారణ చేశాక... తొలుత మినాక్సిడిల్, ఫెనస్టెరైడ్, డ్యూటస్టెరైడ్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. వాటితో ప్రయోజనం లేకపోతే హెయిర్‌ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి చికిత్సలతో పాటు మీసోథెరపీ, స్టెమ్‌సెల్ థెరపీ, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండ్ డర్మారోలర్ వంటి అత్యాధునిక ప్రక్రియలను ఉపయోగించి చికిత్స తీసుకోవచ్చు. ఇక లేజర్ సహాయంతో చేసే ఇన్ఫ్రారెడ్ లైట్ థెరపీ, లేజర్ కోంబింగ్ కూడా బాగా ఉపయోగపడతాయి. హెయిర్ స్ల్పిట్స్ కరణాలు... జుట్టు చివర్లు చిట్లడానికి కారణాలు అనేకం. తగినంత తేమ లేకపోవడం, ఎండకు ఎక్కువగా తిరగడం, గాఢత కలిగిన షాంపూల వాడకం, హెయిర్ డ్రయర్‌తో ఎక్కువ సేపు ఆరబెట్టడం, హెయిర్ స్ట్రెయిటెన్ చేయడం, రంగు వేయడం, హెయిర్ బ్లీచ్ చేయించడం... వంటివన్నీ జుట్టు చిట్లడానికి దారితీస్తాయి. చిట్ల కుండా ఏం చేయాలి? వారానికి మూడుసార్లకు మించి తలస్నానం చేయరాదు, బాగా వేడిగా ఉన్న నీరు మంచిది కాదు. దేహం భరించగలిగినంత వేడి నీటిని వాడాలి. తడిజుట్టు మీద నేరుగా డ్రయర్‌తో ఆరబెట్టరాదు. ముందుగా టవల్‌తో తుడిచిన తర్వాత డ్రయర్‌తో ఆరబెట్టాలి. వీలయితే హెయిర్ డ్రయర్ వాడకాన్ని పూర్తిగా మానేసి జుట్టుని సహజంగా ఆరనివ్వాలి. చిట్లితే ఏం చేయాలి? జుట్టు చివర్లను నెలకోసారి, కనీసం రెండు నెలలకోసారి అయినా కత్తిరించాలి. రెండుగా చిట్లిన వెంట్రుక వేగంగా పైకి చీలిపోతుంది, చివర్లను కత్తిరిస్తే ఆగిపోతుంది. కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, బాదం నూనెలను సమపాళ్లలో తీసుకుని గోరువెచ్చ చేసి జుట్టుకు పట్టించి మసాజ్ చేయాలి. రాత్రంతా ఉంచి ఉదయం తలస్నానం చేయాలి. రాత్రంతా ఉంచుకోవడం సాధ్యం కాకపోతే గంట తర్వాత స్నానం చేయవచ్చు. కోడిగుడ్డుసొనలో మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి. కప్పు బొప్పాయి గుజ్జు. అరకప్పు పెరుగు కలిపి మాడుకు, జుట్టు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. గ్రే హెయిరా! తెల్లజుట్టా!! తెల్లజుట్టుని గ్రేహెయిర్గా వ్యవహరిస్తారు. ఎందుకంటే జుట్టు తన సహజమైన రంగును కోల్పోయే ముందు బూడిదరంగులోకి మారుతుంది. జుట్టు రంగు మారి గ్రే షేడ్‌లోకి వస్తోందని చెప్తూ తెల్లజుట్టుని కూడా గ్రేహెయిర్గానే వ్యవహరించడం అలవాటైంది. ఇంకోమాటలో చెప్పాలంటే ‘జుట్టు తెల్లబడింది’ అని చెప్పుకోవడానికి మనసు అంగీకరించక ‘గ్రే అవుతోంది’ అనే ఈ మధ్యేమార్గాన్ని వెతుక్కోవడమే. పేలు పోవాలంటే..! వేప ఆకుల పొడి టేబుల్ స్పూన్, సీతాఫల గింజల పొడి టేబుల్ స్పూన్, బావంచాల పొడి టీ స్పూన్, తులసి పొడి టీ స్పూన్, కచూర్ సుగంధి పొడి టీ స్పూన్, మోతీ ఆరోస్య నాలుగు చుక్కలు, అలోవెరా హెయిర్‌జెల్ తీసుకోవాలి. అవసరమైనంత మోతాదులో నీటిని వేస్తూ కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చొప్పున మూడువారాలు చేస్తే పేలు పూర్తిగా పోతాయి. హెయిర్ ఫాల్ తగ్గాలంటే..! జుట్టుకు గోరువెచ్చటి నూనె పట్టించి మసాజ్ చేయాలి. తర్వాత వేడి టవల్ లేదా స్టీమింగ్ మెషీన్‌తో ఆవిరి పట్టాలి. మాడుకు, జుట్టుకు హెన్నా పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి. హెన్నా మిక్స్ ఇలా..! గోరింటాకు పొడి టేబుల్ స్పూను, ఉసిరిక పొడి టేబుల్ స్పూన్, మెంతి పొడి టీ స్పూన్, మందార ఆకుల పొడి టీ స్పూన్, మందార పువ్వుల పొడి టీ స్పూన్, నిమ్మరసం టేబుల్ స్పూన్, కోడిగుడ్డు సొన (ఒక గుడ్డుది), కాఫీ లేదా టీ డికాషన్ టేబుల్ స్పూన్, పెరుగు టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇందులో బ్రాహ్మి, భృంగరాజ్, మహాభృంగరాజ్, నీలి భృంగరాజ్, మడ్డిపాల, త్రిఫల, తుంగముస్త, పొన్నగంటి ఆకుల పొడి ఒక్కొక్క టీ స్పూన్ వేయాలి. సువాసన కోసం దవనం పొడి, మరువం పొడి కలుపుకోవచ్చు. డాండ్రఫ్ ట్రీట్మెంట్! తలకు గోరు వెచ్చటి నూనె పట్టించి మసాజ్ చేసి బాగా దువ్వాలి. స్టీమింగ్ మెషీన్‌తో ఆవిరి పట్టాలి (వేడినీటిలో ముంచిన టవల్ చుట్టవచ్చు). తలకు హెన్నా ప్యాక్ వేసి రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి. హెన్నా ప్యాక్... గోరింటాకు పొడి టేబుల్ స్పూన్, ఉసిరిక పొడి టేబుల్ స్పూన్, మెంతిపొడి టీ స్పూన్, మందార పూల పొడి టీ స్పూన్, నిమ్మరసం టేబుల్ స్పూన్, కోడిగుడ్డు సొన(ఒక గుడ్డు), టీ లేదా కాఫీ డికాషన్ టేబుల్ స్పూన్, పెరుగు కప్పు, కరివేపాకు పొడి టీ స్పూన్, ఆరెంజ్‌పీల్ పౌడర్ టీ స్పూన్, లెమన్ పీల్ పౌడర్ టీ స్పూన్, రోజ్ పెటల్ పౌడర్ టీ స్పూన్ వేసి నీటితో కలపాలి. గంట తర్వాత తలకు పట్టించాలి. రసాయనాల ప్రభావం..! జుట్టుకు రంగువేయడం, స్ట్రెయిటెన్ చేసుకోవడం, బ్లీచింగ్ వంటి ప్రక్రియల్లో వెంట్రుకలు... రసాయనాలకు ఎక్స్పోజ్ అవుతుంటాయి. ఫలితంగా వాటిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒక్కోసారి వెంట్రుకలు బాగుచేయలేని విధంగా దెబ్బతినవచ్చు. వెంట్రుక పై పొర క్యూటికిల్ పూర్తిగా దెబ్బతినవచ్చు. క్యూటికిల్ దెబ్బతింటే లోపల ఉండే కార్టెక్స్ అనే భాగం బయటకు కనిపిస్తుంది. ఇది గరుకుగా ఉంటుంది. కార్టెక్స్ బయటపడిన జుట్టు నిర్జీవంగా, గజిబిజిగా కనిపిస్తుంటుంది. ఇక నీళ్లలో, వాతావరణంలో, షాంపూల్లో, హెయిర్స్ప్రేలలోని రసాయనాలు క్యూటికిల్నీ, కార్టెక్స్నీ దెబ్బతీస్తాయి. అప్పుడు వెంట్రుక విరిగిపోతుంది. ఆహారం జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే పైన తీసుకునే జాగ్రత్తలతోపాటు ఆహారం కూడా ముఖ్యమే. తాజా కూరగాయలు, పండ్లు, పొట్టు తీయని తృణధాన్యాలతోపాటు, ప్రోటీన్లు మెండుగా ఉంటే చేపలు, చికెన్, లేత మాంసం తీసుకోవాలి. దేహానికి తగినంత నీరు అందితేనే జుట్టు కుదుళ్లు పటిష్టంగా ఉంటాయి. రోజుకు రెండు లీటర్ల నీటిని తాగాలి. అవసరమైతే మల్టీవిటమిన్లు, ఖనిజలవణాల క్యాప్సూల్స్ తీసుకోవాలి. ఆహారంలో కొవ్వు, ఉప్పు, చక్కెరలు పెరగకుండా చూసుకోవాలి. బలంగా వద్దు... విపరీతంగా దువ్వడం, బలంగా దువ్వడం, తడిగా ఉన్నప్పుడే దువ్వడం, వెనక్కు దువ్వడం, బలమైన వేడిగాలి తగిలేలా డ్రైయర్‌ను ఉపయోగించడం వంటి ప్రక్రియలు సైతం వెంట్రుకలను దెబ్బతీస్తాయి. ఇలా భౌతికపద్ధతుల ద్వారా దెబ్బతిన్న వెంట్రుక సాఫీగా లేకుండా ఒకచోట ఉబ్బుగా మరోచోట పలచబారినట్లుగా ఉంటుంది. దీనిని ‘బబుల్‌డ్ హెయిర్’ అంటారు. ఇలాంటి వెంట్రుకలు బలహీనంగా, తేలిగ్గా విరిగిపోయేలా ఉంటాయి. చేయాల్సినవి... చేయకూడనివి... చేయాల్సినవి... రోజూ చిక్కులు వదిలే వరకు దువ్వాలి. ఎక్కువగా చిక్కు పడిపోయినప్పుడు తలలో నేరుగా దువ్వెన పెట్టకూడదు. వేళ్లతో చిక్కును తొలగించిన తర్వాత దువ్వెనతో దువ్వాలి. వారానికి రెండు లేదా మూడుసార్లు తలస్నానం చేయాలి. దుమ్మూ ధూళిలోకి వెళ్తే... ఇంటికి వచ్చిన వెంటనే తలస్నానం చేయాలి. ఏం చేయకూడదు? తల తడిగా ఉన్నప్పుడు దువ్వకూడదు. జడ, ముడి కాని వేయరాదు. ఇతరుల దువ్వెనలను వాడరాదు. తలస్నానం చేసిన తర్వాత కేశాలు ఆరడానికి ఎండలో నిలబడకూడదు. టవల్‌తో మెల్లగా తుడుస్తూ జుట్టును ఆరనివ్వాలి. సౌందర్యసాధనాలు ఎక్కువైతే! హెయిర్‌జెల్, హెయిర్ స్ప్రే, కండిషనర్ల వంటివి జుట్టుని అందంగా కనిపించేలా చేస్తాయి. అయితే వీటి వాడకం ఎక్కువైతే జుట్టు పాలిపోవడం, రాలిపోవడం కూడా అదే స్థాయిలో ఉంటుంది. వెంట్రుకలు బలహీనపడి తెగిపోతాయి. కొన్ని హెయిర్స్టయిల్లు నిలవాలంటే జెల్, స్ప్రేల వాడక తప్పదు. అలాంటప్పుడు వారంలో కనీసం ఒకటి - రెండు రోజులైనా విరామం ఇస్తే జుట్టు దానంతట అదే ఆరోగ్యవంతమవుతుంది. స్విమ్మింగ్ పూల్‌లో..! స్విమ్మింగ్ దేహానికి చక్కటి వ్యాయామమే, కానీ జుట్టుకి పెద్ద ప్రతిబంధకం. స్విమ్మింగ్‌పూల్ నీటిలో క్లోరిన్ కలుపుతారు. దీని వల్ల జుట్టు పొడిబారడం, పెళుసుబారడం, తెగిపోవడం... ఇలా రకరకాలుగా దెబ్బతింటుంది. కాబట్టి తలకు క్యాప్ వాడి తీరాల్సిందే. అలాగే పూల్‌లో దిగిన ప్రతిసారీ తలస్నానం చేయాలి. కండిషనింగ్ ట్రీట్మెంట్! జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే వారానికోసారి కండిషనింగ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. తలకు బాగా నూనె పట్టించి మసాజ్ చేసి, స్టీమ్ ఇవ్వాలి. ఇలా చేస్తే జుట్టు పొడిబారదు, కేశాలు ఆరోగ్యంగా నిగనిగలాడుతాయి. అపోహ-వాస్తవం అపోహ: కలరింగ్ చేయిస్తే తెల్లజుట్టు వస్తుంది. వాస్తవం: కొంతమందికి హెయిర్ కలరింగ్ సరిపడదు. అలర్జీ ఉన్నప్పటికీ కలరింగ్ చేయిస్తుంటారు. అలాంటి వారికి జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గి జుట్టు తెల్లబడుతుంది. అపోహ: తేనె తగిలితే వెంట్రుకలు తెల్లబడతాయి. వాస్తవం: ఒకటి రెండు సార్లు తగిలితే ఏం కాదు, అదీ కొద్దిమోతాదులో తేనె కలిసినా ఏమీ కాదు. ఎక్కువ మోతాదులో కంటిన్యూయస్‌గా తగిలితే తెల్లబడే ప్రమాదం ఉండవచ్చు. అపోహ: హెన్నా పెడితే జుట్టు పాడవుతుంది. వాస్తవం: హెన్నా వాడితే జుట్టు పాడుకాదు. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి పాఠకులకు మనవి: మీ ఆరోగ్య సమస్యలను, ఈ పేజీకి సలహాలు, సూచనలను మాకు తెలియచేయండి. మీరు పంపవలసిన చిరునామా: డాక్టర్ సలహా, హస్తవాసి, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్ -34. e-mail: health.sakshi@gmail.com