ప్రపంచానికే...చలిజ్వరం! | Ague the world ...! | Sakshi
Sakshi News home page

ప్రపంచానికే...చలిజ్వరం!

Published Mon, Apr 21 2014 11:28 PM | Last Updated on Fri, Mar 22 2019 7:18 PM

ప్రపంచానికే...చలిజ్వరం! - Sakshi

ప్రపంచానికే...చలిజ్వరం!

‘దోమ కొంచెం... వ్యాధి తీవ్రం’ అనే మాట మలేరియాకు సరిగ్గా సరిపోతుంది.  ఎందుకంటే... ఐక్యరాజ్యసమితిలో నమోదైన దేశాల సంఖ్య 192 అయితే ఇందులో 109 దేశాల్లో మలేరియా విజృంభిస్తోంది. అంటే... ప్రపంచంలోని సగానికి పైగా దేశాలను ఈ వ్యాధి భయపెడుతోందన్నమాట. ఇక మన దేశంలో ప్రతి ఏడాదీ మూడు కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్రంలోనూ ఏజెన్సీ ఏరియాలు అని మనం పిలుచుకునే అనేక కొండ ప్రాంతాల్లోని, అటవీ ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద సంఖ్యలో మలేరియా దెబ్బకు కునారిల్లుతున్నారు. సత్వర వైద్య సహాయం అందక అల్లాడుతున్నారు. ఈ నెల 25న ప్రపంచ మలేరియా దినం. ఈ సందర్భంగా ఇంత చిన్న దోమ కాటుతో అంత పెద్ద మనిషికి ప్రాణహాని సైతం కల్పించే ‘మలేరియా’పై అవగాహన కోసం ఈ కథనం.
 
మలేరియా వ్యాధి ప్లాస్మోడియమ్ అనే ఏకకణ పరాన్న జీవి వల్ల వస్తుంది. దీన్ని ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి దోమలు వ్యాప్తి చేస్తాయి. దోమల్లోనూ ఆడ అనాఫిలిస్ దోమ దీని వ్యాప్తికి దోహదపడుతుంది. ప్లాస్మోడియం పరాన్నజీవి కూడా నాలుగు ప్రధాన ప్రజాతులుగా ఉంటుంది. అవి... ప్లాస్మోడియం ఫ్యాల్సిపేరమ్, ప్లాస్మోడియం ఒవ్యులా, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరీ. ప్లాస్మోడియం నోవిసై అనే మరో ప్రజాతి కూడా ఉంది గానీ దీని వ్యాప్తి కొద్ది దేశాలకే పరిమితం.
 
దోమానవ బంధం
 
మలేరియా ఇంతగా బాధించే వ్యాధి కదా. మరి దోమలన్నింటినీ నిర్మూలిస్తే మలేరియాను పూర్తిగా నివారించవచ్చు కదా అన్నది చాలామందిలోని భావన. మలేరియా వ్యాధిని కలగజేసే పరాన్నజీవులను వ్యాప్తి చేసే దోమలు ఒక ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతాయి. అదేమిటంటే... తీవ్రమైన వేడిమి, చాలా ఎక్కువ తేమ, దాంతో పాటు నీళ్ల లభ్యత ఉండటం. ఈ మూడూ వర్షారణ్య ప్రాంతాల్లో ఉండే పరిస్థితులు. చిత్రంగా ఇవే పరిస్థితులు వరి పండించే ప్రాంతాల్లోనూ ఉంటాయి. అంటే తీవ్రమైన వేడిమి, తేమతో పాటు వర్షం ఎక్కువగా కురవడం అన్నది వరి పంటకు అనువైన పరిస్థితులు. అందుకే ఒక్కమాటలో బండగుర్తుగా చెప్పాలంటే వర్షారణ్య ప్రాంతాలతో పాటు వరి పండేందుకు అనువైన అన్ని చోట్లా మలేరియా సోకడానికి కారణమయ్యే దోమలూ పెరుగుతాయి. అందుకే వరి పంట ఉన్నంత కాలం దోమలూ... అవి ఉన్నంత కాలం మలేరియా జ్వరాలు ఉంటాయన్నది కొందరు ఎంటమాలజిస్టుల అభిప్రాయం. ఇక ఒక దోమ జీవన వ్యవధి (ఆయుఃప్రమాణం) 30 రోజులు. ఈ కాలంలో అది రోజు విడిచి రోజు 150 నుంచి 200 వరకు గుడ్లు పెడుతుంది. అది గుడ్లు పెట్టడానికి చిన్న కొబ్బరి చిప్పలో నిల్వ ఉన్న 50 ఎం.ఎల్. నీళ్లు చాలు. దాంతో ఇలా చిన్న పాటి గుంటలూ, కొబ్బరి చిప్పలూ, చెడిపోయిన టైర్లు, వాడి ఆపేసిన కూలర్లు వంటి చోట్ల ఉండే ‘మిగులు జలాల్లో’నూ దోమలు గుడ్లు పెట్టి తమ సంతతిని అభివృద్ధి చేసుకుంటాయి. వాటిని తరమడానికి మనం ఎన్ని దార్లు వాడుతుంటామో, వాటి పట్ల తమ నిరోధకతను పెంపొందించుకోడానికి అవి కూడా అన్ని దార్లు వెతుకుతుంటాయి. తద్వారా తమ మనుగడను సాగిస్తుంటాయి. ఇలా అవి బలపడటానికి పరోక్షంగా మనమూ దోహదపడుతున్నామన్నమాట. అయితే ఒక్క మాట... పారే నీరు ఉన్న చోట అవి గుడ్లు పెట్టలేవు. అందుకే వాటిని నివారించాలంటే పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవడంతో పాటు, మురుగుకాల్వల వంటి చోట్ల నీరు పారేలా శుభ్రంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవడం మంచి మార్గం.
 
ప్లాస్మోడియమ్జీవిత చక్రం సాగుతుందిలా...
 
అంతకు ముందే మలేరియా వ్యాధి ఉన్న రోగిని కుట్టిన దోమ... మళ్లీ ఆరోగ్యవంతుడిని కుట్టగానే ‘మలేరియా’ వ్యాధిని కల్పించే కారకాలు ఆరోగ్యవంతుడైన మనిషి రక్తంలోకి ప్రవేశిస్తాయి. ఈ వ్యాధి కారకాలను ‘స్పోరోజువైట్స్’ అంటారు. ఆరోగ్యవంతుడి రక్తప్రవాహంలోకి చేరిన అవి... నేరుగా ఆ వ్యక్తి కాలేయంలోకి చేరి అక్కడ ఆశ్రయం ఏర్పరచుకుంటాయి. అక్కడ అవి తమ సంఖ్యను అలైంగిక మార్గంలో పెంపొందించుకుంటాయి. ఆ తర్వాత అవి ఎర్రరక్తకణాల్లోకి ప్రవేశిస్తాయి. కాలేయం నుంచి ఎర్రరక్తకణాల్లోకి ప్రవేశించే వ్యాధి కారకాలను ‘మెరోజువైట్స్’ అంటారు. కొన్ని పరాన్న జీవులు ఎర్రరక్తకణాల నుంచి గ్యామెటోసైట్స్ అని పిలిచే కణాలుగా మారి మళ్లీ దోమ రక్తంలోకి ప్రవేశిస్తాయి. దోమ కడుపులో అవి లైంగిక చర్య ద్వారా తమ సంఖ్యను పెద్ద సంఖ్యలో అభివృద్ధిపరచుకుంటాయి. దోమ కడుపులో ఉన్న వ్యాధి కారకాలు తొలుత ఊకైనేట్స్‌గా... ఆ తర్వాత ‘ఊసిస్ట్స్’గా అభివృద్ధి చెందాక చివరగా ‘స్పోరోజువైట్స్’గా మారి దోమ లాలాజలంలోకి ప్రవేశిస్తాయి. ఇవి మళ్లీ మరో ఆరోగ్యవంతుడిని చేరగానే... పైన పేర్కొన్న జీవిత చక్రం (లైఫ్ సైకిల్) మళ్లీ మళ్లీ పునరావృతమవుతూ, అలా వ్యాధిని వ్యాప్తి చేస్తూ ఉంటుందన్నమాట. వ్యాధి కారకాలైన ప్లాస్మోడియమ్ మనిషిలో ఆశ్రయం తీసుకున్నప్పుడు అవి మనిషిలో అలైంగిక చర్య ద్వారా అభివృద్ధి చెందుతాయి కాబట్టి మనిషిని ‘ఇంటర్మీడియట్ హోస్ట్’ అని అంటారు. అయితే చిత్రం ఏమిటంటే... ప్లాస్మోడియమ్ పరాన్నజీవులు మనిషికి వ్యాధిని కలిగిస్తాయి. దోమకు ఎలాంటి హానీ చేయవు. కాబట్టి దోమను ‘క్యారియర్’ (వ్యాధి వ్యాప్తికి దోహదపడే వాహకం) గా అభివర్ణిస్తారు.
 
వ్యాక్సిన్లు
 
ప్రస్తుతానికి మలేరియాకు లెసైన్స్‌డ్ వ్యాక్సిన్ ఏదీ లభ్యం కావడం లేదు. అయితే ఆర్‌టీఎస్.ఎస్/ఏఎస్‌ఓ1 అనే వ్యాక్సిన్లు పరీక్ష దశల్లో చాలా పురోగతి సాధించాయి. ప్రస్తుతానికి ఇవి ‘క్లినికల్ ట్రయల్’ దశలో ఉన్నాయి. అందుకే త్వరలోనే మలేరియాకు మంచి వ్యాక్సిన్ లభ్యమవుతుందనే ఆశాకిరణం కనిపిస్తోంది.
 
మలేరియా అంటే...?

క్రీస్తుపూర్వం దాదాపు ఐదు శతాబ్దాల కిందటే ఈ వ్యాధిని గుర్తించారు. అయితే అప్పట్లో మలేరియా అన్న వ్యాధి చెడు పరిసరాల వల్ల, చెడు గాలి వల్ల వచ్చేదని భావించేవారు. ‘మాల్’ అంటే చెడు అనీ... ‘ఏరియా’ అంటే పరిసరాలు అని అర్థం. ఈ భావన వల్లనే ఆ వ్యాధికి మలేరియా అనే పేరు పెట్టారు. కానీ ఆ తర్వాత ఇది దోమల కారణంగా వ్యాప్తి చెందుతుందని తేలింది. దోమ కడుపులో జరిగే జీవిత చరిత్రను సర్ రొనాల్డ్ రాస్ అనే పరిశోధకుడు మన సికింద్రాబాద్ లోనే కనుక్కున్నారు. అంటే ప్రపంచానికి ఉపయోగపడే ఒక కీలకమైన పరిశోధన ఫలితాలు మన సికింద్రాబాద్‌లోనే ఆవిష్కృతమయ్యాయన్నమాట.
 
 వ్యాధి తీవ్రత ఎవరెవరిలో ఎక్కువ ?
 వృద్ధుల్లో, చిన్నారుల్లో, గర్భిణుల్లో
 
 జబ్బు గుర్తించడంలో జాప్యం జరిగి చికిత్స అందడం ఆలస్యం అయిన వారిలో
 
 పారసైటిక్ లోడ్ ఎక్కువగా ఉన్నవారిలో
 
 మలేరియా లేని దేశాల నుంచి మలేరియా ఉన్న ప్రాంతంలోకి వచ్చిన వారికి ఈ వ్యాధి పట్ల నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దాంతో వారిలో తీవ్రత ఎక్కువ.
 
 లక్షణాలు  
 మలేరియా జ్వరం ప్రధాన లక్షణంగా కనిపించే వ్యాధి. రోగాన్ని కలిగించే పరాన్నజీవులు శరీరంలోకి ప్రవేశించగానే లక్షణాలు కనిపించవు. అవి ప్రవేశించిన నాటి నుంచి వ్యాధి లక్షణాలు బయటపడేవరకు పట్టే వ్యవధిని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. దోమ కుట్టిన తర్వాత 7 నుంచి 14 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయి. మలేరియా లక్షణాలు ఇవి...
 
 చలితో పాటు తలనొప్పి ఉండి జ్వరం కనిపిస్తుండటం మలేరియా సాధారణ లక్షణం.  మలేరియా వ్యాధిని కలిగించే పరాన్న జీవి ప్రజాతిని బట్టి లక్షణాలూ కొద్దిగా మారతాయి. భారత్‌లో ప్రధానంగా రెండు రకాలు ఎక్కువ. వాటిల్లో ప్లాస్మోడియమ్ వైవాక్స్ కంటే ప్లాస్మోడియమ్ ఫ్యాల్సిపేరమ్ తీవ్రత చాలా ఎక్కువ. ఎందుకంటే ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందిన పరాన్నజీవులు ఎర్రరక్తకణాల్లో తమ అభివృద్ధిని చాలా వేగంగా సాగిస్తాయి. దాంతో రోగి కోమాలోకి వెళ్లడానికి అవకాశాలు ఎక్కువ. ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందిన మలేరియా వల్ల శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, కామెర్లు, మూత్రపిండాలు విఫలం కావడంతో పాటు ఒక్కోసారి అది మృత్యువుకు కూడా దారితీయవచ్చు.
 
 స్థూలంగా కనిపించే అన్ని లక్షణాలు...
 జ్వరం  
 తలనొప్పి  
 తీవ్రమైన ఒళ్లునొప్పులు
 
 జ్వరం: ఎర్రరక్తకణాల్లో ప్రత్యుత్పత్తి తర్వాత కణాలు పెరిగి ఎర్రరక్తకణాలు విచ్ఛిన్నమై మెరోజువైట్స్‌ను విడుదల చేసినప్పుడు జ్వరం వస్తుంది.
 
 చలి: మొదట చలి వచ్చి ఆ తర్వాత విపరీతమైన చెమటలు వస్తాయి.
 
 లక్షణాల్లో తేడాలిలా...
 ఎర్రరక్తకణాల నుంచి వచ్చే మెరోజువైట్స్ విడుదల అనే అంశం వేర్వేరు రకాలు ప్రజాతుల్లో వేర్వేరు వ్యవధుల్లో ఉంటుంది. అందుకే జ్వరం వచ్చే తీరు, వ్యవధి ఒక్కొక్క ప్రజాతిలో ఒకలా ఉంటుంది. ఫ్యాల్సిపేరమ్, వైవాక్స్, ఒవ్యులాలో ప్రతి 48 గంటలకు ఒకసారి జ్వరం వస్తుంది. మలేరియా ప్రజాతి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు జ్వరం ప్రతి 72 గంటలకు ఒకసారి వస్తుంది.
 
 నిర్ధారణ... ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ధి
 మలేరియా నిర్ధారణ కోసం రక్తపరీక్షపై ఆధారపడటం అన్నది సాధారణంగా ఇప్పటివరకూ జరుగుతూ వస్తున్న ప్రక్రియ. అయితే ఇటీవల ఈ రంగంలో చోటు చేసుకున్న అభివృద్ధి కారణంగా చాలా చవకగానూ, విస్తృతంగానూ లభ్యమవుతున్న ‘డిప్-స్టిక్’ పద్ధతి ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ కేవలం 15 నిమిషాల్లోనే జరుగుతోంది. పైగా ఇంత వేగంగా చేయగలిగే ఈ పరీక్ష ఫలితాలు చాలా ఖచ్చితమైనవి కూడా.
 
 గతంలోని పరీక్షలు...
 రక్త పరీక్ష: థిక్ అండ్ థిన్ స్మియర్, జిమ్మ్సా స్టెయిన్ పరీక్షలు. ఒకసారి పరీక్షలు చేసిన వెంటనే మలేరియా పరాన్నజీవి కనుగొనకపోతే... రెండు, మూడు రోజుల పాటు వరసగా రక్తపరీక్ష చేయాల్సి ఉంటుంది.
 
 ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్: మలేరియా యాంటిజెన్‌ను త్వరగా గుర్తించగలిగే పరీక్షలు, పారసైట్-ఎఫ్, ఆప్టిమల్ టెస్ట్స్... ఇవన్నీ ర్యాపిడ్ డయాగ్నస్టిక్ తరహాకు చెందినవి. అయితే పీసీఆర్ టెస్ట్, మలేరియా యాంటీబాడీస్ టెస్ట్ అనే తరహా పరీక్షలు కూడా ఉన్నాయి గాని వీటిని పెద్దగా వాడటం లేదు.
 
 చికిత్సలోనూ ఇప్పుడు విప్లవాత్మక పురోగతి...
 గతంలో మలేరియా చికిత్స క్వినైన్, క్లోరోక్విన్ వంటి సంప్రదాయ మందులతో చేసేవారు. కానీ డాక్టర్లు అందుబాటులో లేని చోట కూడా ఒకనాడు విస్తృతంగా లభ్యమయ్యే ఆ మందుల పట్ల మలేరియా పరాన్నజీవులు తమ నిరోధక శక్తిని పెంచుకున్నాయి. దాంతో ఆ మందుల లభ్యతపై కొంత నియంత్రణ విధించాల్సి వచ్చింది.
 

సాధారణ చికిత్సా ప్రక్రియలు
 మలేరియా వ్యాధి అని నిర్ధారణ చేసుకున్న తర్వాత అది తీవ్రత తక్కువగా ఉండే వైవాక్స్ లాంటిదా లేక తీవ్రమైన ఫ్యాల్సిపేరమ్ తరహాదా అని పరిశీలిస్తారు. వైవాక్స్ లాంటి సాధారణ మలేరియాకు రోగిని ఇంట్లో ఉంచే చికిత్స చేయవచ్చు. సాధారణ క్లోరోక్విన్ మందులతో పాటు పుష్టికరమైన ఆహారం, విశ్రాంతితో ఈ తరహా మలేరియా త్వరగానే అదుపులోకి వస్తుంది. ఇక కేవలం మందుల విషయానికి వస్తే... ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ఫెక్షన్ సోకితే చికిత్స అనంతరం ప్రైమాక్వైన్ టాబ్లెట్స్ (15 ఎంజీ) రెండు వారాల కోర్సు వాడాల్సి ఉంటుంది.
 

ఫ్యాల్సిపేరమ్ అయితే...
తీవ్రప్రభావం చూపించే ఫ్యాల్సిపేరమ్ రకానికి చెందినదైతే ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయాలి. ఎందుకంటే ఈ తరహా మలేరియా జ్వరంలో రోగికి కాలేయం, మూత్రపిండాలు, మెదడు, ఊపిరితిత్తులు వంటి అవయవాలకు సంబంధించిన దుష్ర్పభావాలు కనిపించే అవకాశం ఎక్కువ. అంటే కామెర్లు రావడం, స్పృహతప్పిపోవడం, ఫిట్స్ రావడంతో పాటు శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బందులు, మూత్రపిండాలు విఫలం కావడం, మూత్రం తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయడం తప్పనిసరి.


 ఇలాంటి స్థితిలో మలేరియా చికిత్స కోసం క్వినైన్ సల్ఫేట్, ఆర్టెసునేట్, టెట్రాసైక్లిన్, డాక్సిసైకర్టిన్, మెఫ్లోక్విన్, క్లిండోమైసిన్, అమోడయాక్విన్, ల్యూమెఫ్యాంట్రైన్ లాంటి మందులు వివిధ కాంబినేషన్స్‌లో వాడతారు. ఇతర శారీరక దుష్ర్పభావాలు (కాంప్లికేషన్స్) ఉన్నవారిలో తొలుత ఇంజెక్షన్స్ వాడి తర్వాత నోటి ద్వారా తీసుకునే మందులు ఉపయోగిస్తారు. రోగి అంతర్గత అవయవాలు దెబ్బతింటే... ఆ దెబ్బతిన్న అవయవాన్ని బట్టి చికిత్స చేయాలి. అంటే... మూత్రపిండాల పనితీరు దెబ్బతింటే డయాలిసిస్, శ్వాస సరిగా అందకపోతే వెంటిలేషన్ వంటి సౌకర్యాలు అవసరమవుతాయి. ఫ్యాల్సిపేరమ్ రకానికి ఈ తరహా చికిత్స దొరకకపోతే రోగి మరణానికి కూడా దారితీయవచ్చు.
 

చికిత్సల్లో ఇప్పుడు చోటు చేసుకున్న పురోగతి
ఇటీవల మలేరియా చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులు, పురోగతి చోటు చేసుకున్నాయి. ‘ఆర్టిమిసినిన్’ గ్రూపునకు చెందిన మందులను కనుగొన్న తర్వాత ఈ చికిత్స మరింత సులభం అయ్యింది. ‘ఆర్టిమిసినిన్’ అన్నది ‘స్వీట్ వార్మ్‌వుడ్’ అని పిలిచే ఒక రకం చైనీస్ జాతి మొక్క. దీని నుంచి తయారు చేసిన ‘ఆర్టిమిసినిన్’ మందులతో రోగిలో గుణం కనిపించడం చాలా మెరుగ్గానూ, వేగంగానూ జరుగుతుంది. అయితే ఒకే ఒక మందుగా (అంటే మోనో థెరపీగా) దీన్ని ఇచ్చినప్పుడు  రోగిలోని మలేరియా క్రిములు ఆ మందు పట్ల నిరోధకతను వేగంగా అభివృద్ధి చేసుకుంటాయి. ఇదే విషయం మయన్మార్, కాంబోడియా, థాయిలాండ్ దేశాల్లో నిరూపితమైంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు ఈ తరహా మందుల లభ్యత పట్ల ప్రపంచ మార్కెట్‌లో కొన్ని నియంత్రణలను విధించింది. దాంతో కేవలం ఆర్టిమిసినిన్ గ్రూపు మందులే కాకుండా వాటితో పాటు మరికొన్ని కాంబినేషన్ మందులను వాడటం అన్నది ఫ్యాల్సిపేరమ్ తరహా మలేరియా చికిత్సలో ఒక భాగం అయ్యింది. దీన్నే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆర్టిమిసినిన్ బేస్‌డ్ కాంబినేషన్ థెరపీలు (ఏసీటీస్)గా పేర్కొంటోంది.
 

మలేరియా రోగాన్ని కలిగించే పరాన్న జీవులు మందుల పట్ల తమ నిరోధకతను పెంచుకోవడాన్ని గమనించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చికిత్సలో ఒక ప్రామాణికతను నిర్ణయించింది. దాన్ని ‘డబ్ల్యూహెచ్‌ఓ టీ3’గా అభివర్ణిస్తారు. టీ3 అంటే... టెస్ట్, ట్రీట్, ట్రాక్ ఇనిషియేషన్ అన్నమాట. అంటే నిర్ధారణ పరీక్ష, చికిత్స, అవి కొనసాగే తీరు.
 
 నివారణ
 దోమల నివారణే మలేరియా నివారణకు మంచి మార్గం. దోమ కాటు నుంచి మనల్ని మనం ఎంతగా రక్షించుకుంటే మలేరియా నుంచి అంత సమర్థంగా మనల్ని మనం కాపాడుకోవచ్చన్నమాట.
     
 వ్యక్తిగతమైన నివారణలో భాగంగా మనం ఉండే ఇంటిలో, గదిలో దోమలు రాకుండా చూసుకోడానికి అవసరమైన రిపెల్లెంట్లు, దోమతెరలు వాడటం ఒక పద్ధతి.
     
 దోమలు కుట్టకుండా పొడువు చేతుల చొక్కాలు ధరించడం, ఒంటినిండా బట్టలు ఉండి, ఒంటినంతా అవి కప్పి ఉంచేలా చూసుకోవడం.
     
 దోమలు కుట్టకుండా ఉండేందుకు శరీరంపైన పూత మందులు వాడటం కూడా ఒక మార్గం.
     
 ఇక సామాజిక నివారణలో భాగంగా మన ఇళ్ల సరిసరాల్లో మురుగు నీరు లేకుండా, నిల్వ నీరు లేకుండా చూసుకోవడం మంచిది. దీనితో పాటు కాల్వల్లో నీరు ఒకేచోట చేరి ఉండకుండా శుభ్రం చేసుకోవడం అవసరం.
     
 దూరప్రాంతాలకు ప్రయాణమయ్యేవారు ముందు జాగ్రత్తగా సల్ఫాడోక్సిన్ - పైరిమిథమైన్ వంటి యాంటీ మలేరియల్  (కీమో-ప్రొఫిలాక్సిస్) మందులు తీసుకోవడం చాలా మేలు చేస్తుంది.
 
 వ్యాధి నిర్ధారణ ప్రక్రియల్లో, చికిత్స పద్ధతుల్లో ఇంతగా పురోగతి చోటు చేసుకుంటున్నా చాలా ప్రాంతాల్లో ఇదో తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా ఉంది. మన రాష్ట్రంలోనూ అనేక గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఇది తీవ్రంగా బాధిస్తోంది. అందుకే చవగ్గా లభ్యమయ్యే మరిన్ని మందులు, నివారణ ప్రక్రియల కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. అవి అవసరం కూడా.
 
 - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement