మేలైన కురులకు...ఆరోగ్య సిరులకు! | Preferably pocket ... health Caerulea! | Sakshi
Sakshi News home page

మేలైన కురులకు...ఆరోగ్య సిరులకు!

Published Tue, Feb 11 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM

Preferably pocket ... health Caerulea!

వెంట్రుక అంటే చాలా మందికి కాస్త తేలిక అభిప్రాయం. అందుకే కొండకు వెంట్రుక కట్టడం వంటి సామెతలు వచ్చాయి. కానీ జుట్టుతో వ్యవహారం కనపడేంత తేలికైనది కాదు. వాణిజ్యపరంగా రోజూ లక్షల కోట్ల రూపాయల వ్యవహారాలు వెంట్రుకల కారణంగానే జరుగుతుంటాయి. ఇలా వ్యవహారపరంగానే కాదు... నిర్మాణపరంగానూ అంతే సంక్లిష్టమైనది కేశం. కోట్ల కొద్దీ వ్యక్తులు కురుల గురించే ఆలోచిస్తూ దాన్ని జీవితమంత సమస్యగా పరిగణిస్తుంటారంటే అతిశయోక్తి కాదు. అందుకే అంతటి విలువైన పట్టులాంటి జుట్టు కోసం, జుట్టుపై పట్టు కోసం ఈ కథనం.
 
చూడటానికి వెంట్రుక నల్లటి, సన్నటి తీగలాగా అనిపిస్తుంటుంది. కానీ అంతర్గతంగా దీని నిర్మాణం చాలా సంక్లిష్టం. చూసీచూడగానే జెండర్ తేడాను గుర్తించేది దానివల్లనే. మన శరీరంలో ఎప్పటికప్పుడు తనను తాను నిత్యనూతనంగా తీర్చిదిద్దుకోగల ఏకైక భాగం వెంట్రుక.
 
ఎలా పుడుతుంది...?
బిడ్డ తన తల్లి కడుపులో ఉన్నప్పుడు పిండం తాలూకు 22వ వారంలోనే వెంట్రుక మూలాలు శరీరంపై ఆవిర్భవిస్తాయి. వాటిని ఫాలికిల్స్ అంటారు. అంటే పుట్టకముందే బిడ్డ శరీరంపై 50 లక్షల ఫాలికిల్స్ ఉంటాయి. వీటిల్లో పదిలక్షలు తల (మాడు) మీద ఉంటాయి. పుట్టుకకు ముందు ఈ ఫాలికిల్స్ ఎన్ని ఉంటాయో జీవితాంతం అన్నే ఉంటాయి. అంతేతప్ప వీటి సంఖ్య జీవితకాలంలో ఎప్పుడూ పెరగదు. పైగా మనం పెరుగుతున్నకొద్దీ వీటి సంఖ్య తగ్గుతుంది.
 
నిర్మాణం ఎలా ఉంటుంది?
వెంట్రుకను ప్రధానంగా రెండు భాగాలుగా చెప్పవచ్చు. అదే మాడు మీది చర్మం లోపల ఉండే ‘అంకురం’ (ఫాలికిల్). మనకు కనిపించే భాగాన్ని ‘వెంట్రుక’ (షాఫ్ట్) అంటారు.
 
ఫాలికిల్‌లో అనేక పొరలు ఉంటాయి. అంకురం లోపల ఒక మొలక (ప్రొజెక్షన్)లా ఉండే భాగాన్ని పాపిల్లా అంటారు. దీనికి రక్తసరఫరా ఉంటుంది. వెంట్రుకలో జీవంతో ఉండే భాగం ఇదే. ఈ పాపిల్లా చుట్టూ ఉబ్బెత్తుగా ఉండే భాగాన్ని బల్బ్ అంటారు. ఈ బల్బ్‌లో నిరంతరం కణవిభజన జరుగుతూ ఉంటుంది. శరీరంలోని మరే ప్రాంతంలోనూ ఇంత వేగంగా కణవిభజన జరగదు. ప్రతి 23 నుంచి 72 గంటలకు ఒకసారి కణాలు విభజితమవుతూ పోతుండటం వల్ల అది వెంట్రుకల పెరుగుదలకు దారితీస్తుంది. అలాగే ప్రతి ఫాలికిల్‌తో పాటు ఒక గ్రంథి ఉంటుంది. దాన్ని ‘సబేషియస్ గ్రంథి’ అంటారు. ఇది నూనెలాంటి ద్రవాన్ని స్రవిస్తూ ఉంటుంది. ఈ స్రావమే జుట్టుకు నేచురల్ కండిషనర్. పిల్లలు యుక్తవయస్కులయ్యాక ఈ గ్రంథి నుంచి స్రావం ఎక్కువై జుట్టులో మెరుపును పెంచి, ఆ వయసు పిల్లలు మరింత అందంగా కనిపించేలా దోహదం చేస్తుంది.
 
వెంట్రుకల ఆకృతి
స్థూలంగా వెంట్రుకలన్నీ ఒకేలా ఉన్నా... అవి గుంపుగా పెరిగాక తలపై కనిపించే షేప్‌లు... వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుండటం అందరికీ తెలిసిందే. వెంట్రుకను అడ్డుగా కోసినప్పుడు ఆ అడ్డుకోత గుండ్రంగా ఉంటే అది సాఫీగా (స్ట్రెయిట్)గా పెరుగుతుంది. ఒకవేళ ఆ అడ్డుకోత దీర్ఘవృత్తంలా ఉంటే అది రింగులుగా పెరుగుతుంది. తిన్నగా సాఫీగా ఉండే జుట్టుకు... అడుగున ఉండే సబేషియస్ గ్రంథి నుంచి పోషకాలు సాఫీగా అందుతాయి. కాబట్టి ఇవి మరింత జీవంతో ఉంటాయి. ఇలా కనిపించడం కోసమే చాలామంది జుట్టును తిన్నగా ఉండేలా (హెయిర్ స్రెయిటెనింగ్) చేయించుకుంటూ ఉంటారు. అదే ఉంగరాల్లా తిరిగే జుట్టు వారిలో పోషకాలు చివరివరకూ చేరడానికి కాస్త ప్రతిబంధకంగా ఉండటంతో పొడవు జుట్టు ఉన్నవారి కంటే ఉంగరాల జుట్టు కాస్తంత మెరుపు తక్కువగా ఉంటుంది.
 
మందులతో...
రకరకాల రుగ్మతలకు మందులు వాడుతున్న కొందరిలో వాటి దుష్ర్పభావం వల్ల జుట్టు రాలడం మామూలే. ఇక కొందరిలోనైతే ఇది అవాంఛిత రోమాల పెరుగుదలకూ దారితీస్తుంది. ఈ మందులతో టిలోజెన్ ఎఫ్లువియమ్, అనాజెన్ ఎఫ్లూవియమ్ అనే రెండు రకాల మార్పులు వచ్చి జుట్టు రాలేలా చేస్తాయి.
 
టిలోజెన్ ఎఫ్లూవియమ్ : ఏదైనా రుగ్మతకు మందులు వాడటం మొదలుపెట్టాక  2 నుంచి 4 నెలల్లో మందు ప్రభావంతో వెంట్రుక ఫాలికిల్ విశ్రాంతి దశలోకి  వెళ్తుంది. ఫలితంగా జుట్టు రాలి మళ్లీ మొలవడం ఆలస్యం అవుతుంది.
 
అనాజెన్ ఎఫ్లూవియమ్: ఇందులో వెంట్రుకలు పెరిగే దశలోనే రాలిపోతుంటాయి. ఉదాహరణకు కీమోథెరపీ తీసుకునేవారిలో అనాజెన్ ఎఫ్లూవియమ్ వల్లనే జుట్టురాలడం సంభవిస్తుంది. ఈ మందుల వల్ల కేవలం తలపైని జుట్టే కాకుండా కనుబొమలు, కనురెప్పల వెంట్రుకలూ రాలిపోతాయి.
 
ఏయే మందులతో జుట్టు రాలవచ్చు...  మొటిమలకు వాడే మందులు  కొన్ని యాంటీబయాటిక్స్  కొన్ని యాంటీ ఫంగల్ మందులు,  యాంటీ డిప్రెసెంట్స్  నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మందులు,  రక్తాన్ని పలచబార్చే బ్లడ్ థిన్నర్స్  యాంటీకొలెస్ట్రాల్ మందులు  ఇమ్యునోసప్రెసెంట్స్  కీమోథెరపీ మందులు  మూర్చ చికిత్సలో వాడే ఎపిలెప్సీ మందులు  హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీలో వాడే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, పురుషులకు వాడే టెస్టోస్టెరాన్, యాండ్రోజెన్  ఇంటర్‌ఫెరాన్స్  కొన్ని నొప్పినివారణ మందులు  స్టెరాయిడ్స్  థైరాయిడ్ మందులు.
 
అరికట్టడం ఇలా...  మందులు వాడటం మానేయగానే సాధారణంగా జుట్టు మళ్లీ రావచ్చు  జుట్టు రాలడం విపరీతంగా ఉంటే ప్రత్యామ్నాయ మందులు వాడటం ద్వారా  జుట్టు రాలడాన్ని అరికట్టే మందులు వాడటం ద్వారా  కీమోథెరపీ ఇచ్చే సమయంలో హైపోథెర్మియా అనే ప్రక్రియను ఉపయోగించడం ద్వారా.  ఇందులో కీమోథెరపీ ఇచ్చే ముందర... ఇచ్చిన అరగంట తర్వాత మాడుపై ఐస్‌తో రుద్దుతారు. ఫలితంగా ఫాలికిల్‌లోకి మందు అంతగా వెళ్లదు. దాంతో జుట్టు రాలడం   తగ్గుతుంది.
 
జుట్టును రాల్చే ఇన్ఫెక్షన్లు...
రింగ్‌వార్మ్ : ఇది ఒక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్. ఈ కండిషన్‌ను టీనియా కాపిటిస్ అంటారు. ఇది మాడుపై మొదట చిన్న మొటిమలా వచ్చి క్రమంగా పెరుగుతూ పోతుంది. విస్తరించిన చోట పొలుసుల్లా వచ్చి... ఆ ప్రదేశంలో తాత్కాలికంగా జుట్టు మొలవదు.
 
చికిత్స: టెర్బినఫిన్, ఫ్లుకోనజోల్, గ్రీషియోఫల్విన్, ఇట్రాకొనజోల్ వంటి యాంటీఫంగల్ మందులతో చికిత్స చేయవచ్చు.
 
ఫాలిక్యులైటిస్ : ఇది జుట్టు ఫాలికిల్ (అంకురాల్లో) ఇన్‌ఫ్లమేషన్ (వాపు, నొప్పి) వచ్చే కండిషన్. ఇది వచ్చినవారిలో వెంట్రుక మొదల్లో ఎర్రటి పొక్కులు వచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. ఇది స్టెఫలోకాకస్, సూడోమొనాస్ వంటి బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. చికిత్స : యాంటీబయాటిక్ మందులతో.

పీడ్రా : ఇది వెంట్రుకకు వచ్చే ఒక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్.
 
డెమోడెక్స్ ఫాలిక్యులోరమ్ : ఇది కనురెప్పల వెంట్రుకలను ప్రభావితం చేసే కండిషన్.  ఈ జబ్బుకు దారితీసే సూక్ష్మజీవి కనురెప్పలను మెరిసేలా చేసే నూనెను ఎక్కువగా స్రవించేలా చేయడం వల్ల ఈ రుగ్మత వస్తుంది.
 
వెంట్రుక తీగ (షాఫ్ట్)కు వచ్చే లోపాలు...
వెంట్రుకలో మనకు పైకి కనిపించే తీగ వంటి భాగాన్ని షాఫ్ట్ అంటారు. ఈ లోపాలకు ప్రధాన కారణం జన్యుపరమైనవి. వాటిలో కొన్ని...
 
లూజ్ అనాజెన్ సిండ్రోమ్: దీన్నే లూజ్ హెయిర్ సిండ్రోమ్ అంటారు. దీని పేరే దీని వల్ల కలిగే లోపాన్ని చెప్పకనే చెబుతుంది. అంటే అనాజెన్ దశలో వెంట్రుక వదులుగా అయి చిన్నగా లాగినా ఊడి వచ్చేస్తుంది. ప్రధానంగా యుక్తవయస్కులైన బాలికల్లో ఈ తరహా లోపం కనిపిస్తుంది. ఇలా ఊడిన జుట్టు ఒకపట్టాన తేలిగ్గా మొలవదు. అందుకే మాడుపై జుట్టు పలచబారే అవకాశం ఉంది.
 
అధిగమించడం/అరికట్టడం: సాధారణంగా ఇలా ఊడిన జుట్టు దానంతట అదే రావాల్సిందే. చికిత్సతో పెద్దగా ప్రభావం ఉండదు.
 
ట్రాక్షన్ అలొపేషియా అండ్ ట్రైకో టిల్లోమేనియా : చాలామంది తల్లులు జడవేసే సమయంలో తమ పిల్లలకు జుట్టును బాగా లాగి టైట్‌గా జడవేస్తుంటారు. ఇలా దీర్ఘకాలం పాటు జరుగుతుండటం వల్ల జుట్టు శాశ్వతంగా దెబ్బతింటుంది. ఇక ట్రైకో టిల్లోమేనియా అనే కండిషన్‌లో కొందరు తమ జుట్టును తామే బలంగా పీకేసుకుంటుంటారు. అంటే బాగా ఒత్తిడితో ఉండేవారు తమ గోళ్లు విపరీతంగా కొరుక్కున్న తరహాలోనే ఇలా పీకేసుకుంటుంటారు. దాంతో వారి తల బట్టతలగా మారిపోతుంది. ఇక కొందరైతే తల పూర్తిగా ప్యాచ్‌లు ప్యాచ్‌లుగా బట్టతలగా మారిపోయాక... కనురెప్పల వెంట్రుకలు, కనుబొమల వెంట్రుకలు కూడా లాగుతూ ఉంటారు.
 
 ట్రైకోఫేజియా : ఇది కూడా తమ జుట్టు తాము లాక్కోవడం లాంటిదే. అయితే ఈ రుగ్మత ఉన్నవారు అలా లాగిన జుట్టును తినేస్తుంటారు. ఇది చాలా తీవ్రమైన జబ్బు. ఇలాంటి వారికి తక్షణమే ఎమర్జెన్సీ ప్రాతిపదికన చికిత్స అవసరం.
 
 కాలుష్యం ప్రభావం!
 ఆధునిక జీవనశైలిలో జుట్టును పీడిస్తున్న సమస్య వాతావరణ కాలుష్యం. పొగ, ధూళి కారణంగా జుట్టు పొడిబారి నిర్జీవమవుతుంది. కుదుళ్లు బలహీన పడి జుట్టురాలి పోతుంది, ఉన్న వెంట్రుక కూడా బలహీనమై మధ్యలోకి తెగిపోతుంది.
 
 కాలుష్యం నుంచి రక్షణ...

 బయటకు వెళ్లేటప్పుడు జుట్టు కవర్ అయ్యేటట్లు క్యాప్ లేదా స్కార్ఫ్ వాడాలి.
 తలస్నానం చేయడానికి ముందు నూనెతో తలంటుకోవాలి. తలస్నానానికి శీకాయ, కుంకుడుకాయలను వాడాలి. అవి సాధ్యం కాకపోతే నాణ్యమైన షాంపూలను వాడాలి.
 
 జుట్టు ఎందుకు రాలుతుంది?
 జట్టు రాలడానికి అనేక కారణాలు దోహదపడుతుంటాయి. అందులో ముఖ్యమైనవి...
 శారీరక ఒత్తిడి: నిత్యం ఉండే శారీరక ఒత్తిడులు లేదా తీవ్రంగా జబ్బు పడటం వంటి అంశాలు మనలో భౌతికంగా మార్పులు తెచ్చి జుట్టు రాలిపోయేలా చేస్తాయి. ఇలా జుట్టు రాలడాన్ని ‘టిలోజెన్ ఎఫ్లూవియమ్’ అంటారు. అంటే ఈ దశలో జుట్టు ఊడిపోయే దశ అయిన టిలోజెన్ దీర్ఘకాలం కొనసాగుతుంది. ఫలితంగా మాడుపైన జుట్టు పలచబడినట్లుగా కనిపిస్తుంది. ఈ దశలో రాలిన జుట్టు చివరి భాగంలోని తెల్లని పదార్థం పచ్చిగా కాకుండా ఎండిపోయినట్లుగా ఉండటం గమనించవచ్చు.
 
అరికట్టడం ఇలా: ఇలా రాలిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది.
 
గర్భధారణ తర్వాత: చాలామంది మహిళల్లో ప్రసవం తర్వాత తలపై జుట్టు ఎక్కువగా రాలి పలచబారిపోతుంది. దీనికి వారు అనుభవించే శారీరక ఒత్తిడి కూడా ఒక కారణం. పైగా జుట్టుకు అందాల్సిన పోషకాలు అందకుండా కడుపులోని బిడ్డకు అందుతుంటాయి.
 
 అరికట్టడం ఇలా: తగినంత ఐరన్ సప్లిమెంట్లు, మల్టీవిటమిన్‌లు జుట్టుకూ అందేలా చూసి దీన్ని అరికట్టవచ్చు.
 
 ప్రోటీన్ లోపాల వల్ల: ప్రోటీన్‌తో కూడిన ఆహారం తగినంతగా  తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు రాలుతుంది. ఈ ప్రోటీన్లే అమైనో ఆసిడ్స్‌గా విభజితమై జుట్టు పెరుగుదలకూ, రిపేర్లకూ దోహదపడతాయి.
 
 అరికట్టడం ఇలా: ఇలా జుట్టు ఎక్కువగా రాలుతున్నవారు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారమైన చేపలు, గుడ్లు, మాంసాహారం పుష్కలంగా తీసుకోవాలి. శాకాహారులైతే ఆకుకూరలు,  గ్రీన్‌పీస్, నట్స్, శనగలు, పప్పుధాన్యాలు, సోయా తీసుకోవాలి.
 
హార్మోన్ లోపాల వల్ల :
సాధారణంగా హార్మోన్ లోపాల సమస్య మహిళల్లో ఎక్కువ. మహిళల్లోనూ కొద్దిగా పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ స్రవిస్తుంటుంది. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉన్నవారిలో టెస్టోస్టెరాన్ స్రావం ఎక్కువ. దీంతో జుట్టు రాలుతుంది. ఇక హైపోథైరాయిడిజమ్ కండిషన్ వల్ల కూడా జుట్టు రాలుతుంది.
 
 అరికట్టడం ఇలా: పీసీఓఎస్‌తో బాధపడే మహిళలు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ద్వారానూ, హైపోథైరాయిడిజమ్ ఉన్నవారు థైరాక్సిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా.  
 
 కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్ల వల్ల : మన రోగనిరోధకశక్తే మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే జబ్బులను ఆటోఇమ్యూన్ జబ్బులుగా పేర్కొంటుంటారు. ఉదా:   పేనుకొరుకుడు (అలొపేషియా ఏరేటా) వల్ల మాడు, కనుబొమలు, మీసం, గడ్డం, శరీరంలో ఏభాగంలోనైనా వెంట్రుకలన్నీ రాలిపోయి ప్యాచ్‌లుగా కనిపిస్తుంటాయి.  లెకైన్ ప్లానస్  వల్ల జుట్టు శాశ్వతంగా ఊడిపోయే అవకాశం ఉంది.  లూపస్ అనే కండిషన్ వల్ల కూడా శాశ్వతంగా జుట్టు రాలిపోవచ్చు.
 
 అరికట్టడం ఇలా: ఆటోఇమ్యూన్ జబ్బుల వల్ల జుట్టు రాలుతుంటే డాక్టర్‌ను సంప్రదించి నోటిద్వారా లేదా ఇంజెక్షన్ రూపంలో స్టెరాయిడ్స్ తీసుకోవాలి. ఆటోఇమ్యూన్ కారణాల వల్ల జుట్టు రాలడం నివారించడానికి డ్యాప్సోన్ అనే మందులు మరి కాస్త మెరుగ్గా పనిచేస్తాయి.

ఎంత పెరుగుతుంది,ఎలా పెరుగుతుంది?
ప్రతిరోజూ వెంట్రుక 0.3 మి.మీ. నుంచి 0.4 మి.మీ. వరకు పెరుగుతుంది. మరో మాటలో చెప్పాలంటే ఏడాదికి ఆరు అంగుళాల పొడవు పెరుగుతుంది. వెంట్రుక పెరుగుదలలో కెటాజెన్, టిలోజెన్, అనాజెన్ అనే దశలు ఉంటాయి.
 
కెటాజన్:
మొత్తం జుట్టులో కనీసం మూడు శాతం ఎప్పుడూ ఈ దశలో ఉంటుంది.  2-3 వారాలుండే ఈ దశ నిజానికి వెంట్రుక పెరుగుదలలో సంధి దశ. ఈ దశలో వెంట్రుక నిద్రాణంగా ఉంటుంది. పెరుగుదల ఏమాత్రం ఉండదు.
 
 టిలోజెన్:
మన మొత్తం జుట్టులో 10-15 శాతం ఎప్పుడూ ఈ దశ 100 రోజులు కొనసాగుతుంది. కనుబొమలు, కనురెప్పలు, బాహుమూలాల్లో ఉండే వెంట్రుకల్లో ఈ దశ మరింత దీర్ఘకాలం ఉంటుంది. ఈ దశలో వెంట్రుకను పీకితే వెంట్రుక కింద గసగసాల్లా ఉండే గుండ్రటి, తెల్లటి భాగం కనిపిస్తుంది.
 
 అనాజెన్: వెంట్రుక పెరుగుదల దశలన్నింటిలోనూ అనాజెన్ అనేది చురుకైనది. ఈ దశలో వెంట్రుక మూలంలో కణవిభజన వేగంగా జరుగుతుంటుంది. కింద కొత్త కణాలు వస్తున్న కొద్దీ పాత కణాలు ముందుకు వెళ్తుంటాయి. దాంతో కింది నుంచి వేగంగా వెంట్రుక పెరుగుతూ పోతుంది. ఈ దశలో ప్రతి 28 రోజులకు వెంట్రుక ఒక సెం.మీ. పెరుగుతుంది. ఈ పెరుగుదల 2-6 ఏళ్లుంటుంది.
 
బట్టతల... ఈ సమస్యను అధిగమించడం ఇలా...


ఇందులో రెండు రకాల బట్టతలలు ఉంటాయి. మొదటిది పురుషుల్లో వచ్చే బట్టతల. దీన్నే ‘మేల్ ప్యాట్రన్ హెయిర్‌లాస్’ అంటారు. ఇక రెండోది మహిళల్లో వచ్చే ‘ఫిమేల్ ప్యాట్రన్ హెయిర్‌లాస్’. బట్టతలను ‘యాండ్రోజెనిక్ అలొపేషియా’ అంటారు. అయితే నిన్నమొన్నటివరకూ పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్ల ఇది వచ్చేదన్న అపోహ ఉండేది. కానీ అత్యాధునిక పరిశోధనల ప్రకారం దీనికి టెస్టోస్టెరాన్ కారణం కాదనీ... ‘డీహెచ్‌టీ’ (డిహైడ్రో టెస్టోస్టెరాన్) కారణమని తేలింది. పురుషుల్లో వచ్చే బట్టతలలో నుదురు మీద ఉండే హెయిర్‌లైన్ క్రమంగా వెనక్కిపోతూ ఉంటుంది. ఇక మహిళల్లో వచ్చే ఫిమేల్ పాట్రన్ హెయిర్‌లాస్ అనే బట్టతలలో ముందున్న హెయిర్‌లైన్ అలాగే ఉండి, మాడు మీద జుట్టు పలచబారుతూ పోతుంటుంది. బట్టతలను నిర్ధారణ చేయడానికి పుల్‌టెస్ట్, ప్లక్‌టెస్ట్, స్కాల్ప్ బయాప్సీ, డెయిలీ హెయిర్ కౌంట్ (ఒకరోజు రాలిపోయే వెంట్రుకల సంఖ్య), ట్రైకోస్కోపీ అనే పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అలాగే బట్టతల వస్తోందని నిర్ధారణ చేశాక... తొలుత మినాక్సిడిల్, ఫెనస్టెరైడ్, డ్యూటస్టెరైడ్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. వాటితో ప్రయోజనం లేకపోతే హెయిర్‌ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి చికిత్సలతో పాటు మీసోథెరపీ, స్టెమ్‌సెల్ థెరపీ, ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా అండ్ డర్మారోలర్ వంటి అత్యాధునిక ప్రక్రియలను ఉపయోగించి చికిత్స తీసుకోవచ్చు. ఇక లేజర్ సహాయంతో చేసే ఇన్‌ఫ్రారెడ్ లైట్ థెరపీ, లేజర్ కోంబింగ్ కూడా బాగా ఉపయోగపడతాయి.
 
 హెయిర్ స్ల్పిట్స్

కరణాలు...
జుట్టు చివర్లు చిట్లడానికి కారణాలు అనేకం. తగినంత తేమ లేకపోవడం, ఎండకు ఎక్కువగా తిరగడం, గాఢత కలిగిన షాంపూల వాడకం, హెయిర్ డ్రయర్‌తో ఎక్కువ సేపు ఆరబెట్టడం, హెయిర్ స్ట్రెయిటెన్ చేయడం, రంగు వేయడం, హెయిర్ బ్లీచ్ చేయించడం... వంటివన్నీ జుట్టు చిట్లడానికి దారితీస్తాయి.
 
 చిట్ల కుండా ఏం చేయాలి?
 వారానికి మూడుసార్లకు మించి తలస్నానం చేయరాదు, బాగా వేడిగా ఉన్న నీరు మంచిది కాదు. దేహం భరించగలిగినంత వేడి నీటిని వాడాలి.
     
 తడిజుట్టు మీద నేరుగా డ్రయర్‌తో ఆరబెట్టరాదు. ముందుగా టవల్‌తో తుడిచిన తర్వాత డ్రయర్‌తో ఆరబెట్టాలి. వీలయితే హెయిర్ డ్రయర్ వాడకాన్ని పూర్తిగా మానేసి జుట్టుని సహజంగా ఆరనివ్వాలి.
 
 చిట్లితే ఏం చేయాలి?
 జుట్టు చివర్లను నెలకోసారి, కనీసం రెండు నెలలకోసారి అయినా కత్తిరించాలి. రెండుగా చిట్లిన వెంట్రుక వేగంగా పైకి చీలిపోతుంది, చివర్లను కత్తిరిస్తే ఆగిపోతుంది.
 
 కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, బాదం నూనెలను సమపాళ్లలో తీసుకుని గోరువెచ్చ చేసి జుట్టుకు పట్టించి మసాజ్ చేయాలి. రాత్రంతా ఉంచి ఉదయం తలస్నానం చేయాలి. రాత్రంతా ఉంచుకోవడం సాధ్యం కాకపోతే గంట తర్వాత స్నానం చేయవచ్చు.
     
 కోడిగుడ్డుసొనలో మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి.
     
 కప్పు బొప్పాయి గుజ్జు. అరకప్పు పెరుగు కలిపి మాడుకు, జుట్టు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
 
 గ్రే హెయిరా! తెల్లజుట్టా!!


 తెల్లజుట్టుని గ్రేహెయిర్‌గా వ్యవహరిస్తారు. ఎందుకంటే జుట్టు తన సహజమైన రంగును కోల్పోయే ముందు బూడిదరంగులోకి మారుతుంది. జుట్టు రంగు మారి గ్రే షేడ్‌లోకి వస్తోందని చెప్తూ తెల్లజుట్టుని కూడా గ్రేహెయిర్‌గానే వ్యవహరించడం అలవాటైంది. ఇంకోమాటలో చెప్పాలంటే ‘జుట్టు తెల్లబడింది’ అని చెప్పుకోవడానికి మనసు అంగీకరించక ‘గ్రే అవుతోంది’ అనే ఈ మధ్యేమార్గాన్ని వెతుక్కోవడమే.
 
 పేలు పోవాలంటే..!


 వేప ఆకుల పొడి టేబుల్ స్పూన్, సీతాఫల గింజల పొడి టేబుల్ స్పూన్, బావంచాల పొడి టీ స్పూన్, తులసి పొడి టీ స్పూన్, కచూర్ సుగంధి పొడి టీ స్పూన్, మోతీ ఆరోస్య నాలుగు చుక్కలు, అలోవెరా హెయిర్‌జెల్ తీసుకోవాలి. అవసరమైనంత మోతాదులో నీటిని వేస్తూ కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చొప్పున మూడువారాలు చేస్తే పేలు పూర్తిగా పోతాయి.
 
 హెయిర్ ఫాల్ తగ్గాలంటే..!


 జుట్టుకు గోరువెచ్చటి నూనె పట్టించి మసాజ్ చేయాలి. తర్వాత వేడి టవల్ లేదా స్టీమింగ్ మెషీన్‌తో ఆవిరి పట్టాలి.  మాడుకు, జుట్టుకు హెన్నా పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి.  
 
 హెన్నా మిక్స్ ఇలా..!
 గోరింటాకు పొడి టేబుల్ స్పూను, ఉసిరిక పొడి టేబుల్ స్పూన్, మెంతి పొడి టీ స్పూన్, మందార ఆకుల పొడి టీ స్పూన్, మందార పువ్వుల పొడి టీ స్పూన్, నిమ్మరసం టేబుల్ స్పూన్, కోడిగుడ్డు సొన (ఒక గుడ్డుది), కాఫీ లేదా టీ డికాషన్ టేబుల్ స్పూన్, పెరుగు టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇందులో బ్రాహ్మి, భృంగరాజ్, మహాభృంగరాజ్, నీలి భృంగరాజ్, మడ్డిపాల, త్రిఫల, తుంగముస్త, పొన్నగంటి ఆకుల పొడి ఒక్కొక్క టీ స్పూన్ వేయాలి. సువాసన కోసం దవనం పొడి, మరువం పొడి కలుపుకోవచ్చు.
 
 డాండ్రఫ్ ట్రీట్‌మెంట్!


 తలకు గోరు వెచ్చటి నూనె పట్టించి మసాజ్ చేసి బాగా దువ్వాలి. స్టీమింగ్ మెషీన్‌తో ఆవిరి పట్టాలి (వేడినీటిలో ముంచిన టవల్ చుట్టవచ్చు). తలకు హెన్నా ప్యాక్ వేసి రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి.
 హెన్నా ప్యాక్... గోరింటాకు పొడి టేబుల్ స్పూన్, ఉసిరిక పొడి టేబుల్ స్పూన్, మెంతిపొడి టీ స్పూన్, మందార పూల పొడి టీ స్పూన్, నిమ్మరసం టేబుల్ స్పూన్, కోడిగుడ్డు సొన(ఒక గుడ్డు), టీ లేదా కాఫీ డికాషన్ టేబుల్ స్పూన్, పెరుగు కప్పు, కరివేపాకు పొడి టీ స్పూన్, ఆరెంజ్‌పీల్ పౌడర్ టీ స్పూన్, లెమన్ పీల్ పౌడర్ టీ స్పూన్, రోజ్ పెటల్ పౌడర్ టీ స్పూన్ వేసి నీటితో కలపాలి. గంట తర్వాత తలకు పట్టించాలి.
 
 రసాయనాల ప్రభావం..!


 జుట్టుకు రంగువేయడం, స్ట్రెయిటెన్ చేసుకోవడం, బ్లీచింగ్ వంటి ప్రక్రియల్లో వెంట్రుకలు... రసాయనాలకు ఎక్స్‌పోజ్ అవుతుంటాయి. ఫలితంగా వాటిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒక్కోసారి వెంట్రుకలు  బాగుచేయలేని విధంగా దెబ్బతినవచ్చు. వెంట్రుక పై పొర క్యూటికిల్ పూర్తిగా దెబ్బతినవచ్చు. క్యూటికిల్ దెబ్బతింటే లోపల ఉండే కార్టెక్స్ అనే భాగం బయటకు కనిపిస్తుంది. ఇది గరుకుగా ఉంటుంది. కార్టెక్స్ బయటపడిన జుట్టు నిర్జీవంగా, గజిబిజిగా కనిపిస్తుంటుంది. ఇక నీళ్లలో, వాతావరణంలో, షాంపూల్లో, హెయిర్‌స్ప్రేలలోని రసాయనాలు క్యూటికిల్‌నీ, కార్టెక్స్‌నీ దెబ్బతీస్తాయి. అప్పుడు వెంట్రుక విరిగిపోతుంది.
 
 ఆహారం


 జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే పైన తీసుకునే జాగ్రత్తలతోపాటు ఆహారం కూడా ముఖ్యమే.
 
 తాజా కూరగాయలు, పండ్లు, పొట్టు తీయని తృణధాన్యాలతోపాటు, ప్రోటీన్లు మెండుగా ఉంటే చేపలు, చికెన్, లేత మాంసం తీసుకోవాలి.
 
 దేహానికి తగినంత నీరు అందితేనే జుట్టు కుదుళ్లు పటిష్టంగా ఉంటాయి. రోజుకు రెండు లీటర్ల నీటిని తాగాలి.
 
 అవసరమైతే మల్టీవిటమిన్‌లు, ఖనిజలవణాల క్యాప్సూల్స్ తీసుకోవాలి.
 
 ఆహారంలో కొవ్వు, ఉప్పు, చక్కెరలు పెరగకుండా చూసుకోవాలి.
 
 బలంగా వద్దు...


 విపరీతంగా దువ్వడం, బలంగా దువ్వడం, తడిగా ఉన్నప్పుడే దువ్వడం, వెనక్కు దువ్వడం, బలమైన వేడిగాలి తగిలేలా డ్రైయర్‌ను ఉపయోగించడం వంటి ప్రక్రియలు సైతం వెంట్రుకలను దెబ్బతీస్తాయి. ఇలా భౌతికపద్ధతుల ద్వారా దెబ్బతిన్న వెంట్రుక సాఫీగా లేకుండా ఒకచోట ఉబ్బుగా మరోచోట పలచబారినట్లుగా ఉంటుంది. దీనిని ‘బబుల్‌డ్ హెయిర్’ అంటారు. ఇలాంటి వెంట్రుకలు బలహీనంగా, తేలిగ్గా విరిగిపోయేలా ఉంటాయి.
 
 చేయాల్సినవి... చేయకూడనివి...


 చేయాల్సినవి...
 రోజూ చిక్కులు వదిలే వరకు దువ్వాలి.
     
 ఎక్కువగా చిక్కు పడిపోయినప్పుడు తలలో నేరుగా దువ్వెన పెట్టకూడదు. వేళ్లతో చిక్కును తొలగించిన తర్వాత దువ్వెనతో దువ్వాలి.
     
 వారానికి రెండు లేదా మూడుసార్లు తలస్నానం చేయాలి. దుమ్మూ ధూళిలోకి వెళ్తే... ఇంటికి వచ్చిన వెంటనే తలస్నానం చేయాలి.
 
ఏం చేయకూడదు?

తల తడిగా ఉన్నప్పుడు దువ్వకూడదు. జడ, ముడి కాని వేయరాదు.
     
 ఇతరుల దువ్వెనలను వాడరాదు.
     
 తలస్నానం చేసిన తర్వాత కేశాలు ఆరడానికి ఎండలో నిలబడకూడదు. టవల్‌తో మెల్లగా తుడుస్తూ జుట్టును ఆరనివ్వాలి.
 
 సౌందర్యసాధనాలు ఎక్కువైతే!


 హెయిర్‌జెల్, హెయిర్ స్ప్రే, కండిషనర్‌ల వంటివి జుట్టుని అందంగా కనిపించేలా చేస్తాయి. అయితే వీటి వాడకం ఎక్కువైతే జుట్టు పాలిపోవడం, రాలిపోవడం కూడా అదే స్థాయిలో ఉంటుంది. వెంట్రుకలు బలహీనపడి తెగిపోతాయి. కొన్ని హెయిర్‌స్టయిల్‌లు నిలవాలంటే జెల్, స్ప్రేల వాడక తప్పదు. అలాంటప్పుడు వారంలో కనీసం ఒకటి - రెండు రోజులైనా విరామం ఇస్తే జుట్టు దానంతట అదే ఆరోగ్యవంతమవుతుంది.
 
 స్విమ్మింగ్ పూల్‌లో..!


 స్విమ్మింగ్ దేహానికి చక్కటి వ్యాయామమే, కానీ జుట్టుకి పెద్ద ప్రతిబంధకం. స్విమ్మింగ్‌పూల్ నీటిలో క్లోరిన్ కలుపుతారు. దీని వల్ల జుట్టు పొడిబారడం, పెళుసుబారడం, తెగిపోవడం... ఇలా రకరకాలుగా దెబ్బతింటుంది. కాబట్టి తలకు క్యాప్ వాడి తీరాల్సిందే. అలాగే పూల్‌లో దిగిన ప్రతిసారీ తలస్నానం చేయాలి.
 
 కండిషనింగ్ ట్రీట్‌మెంట్!


 జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే వారానికోసారి కండిషనింగ్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలి. తలకు బాగా నూనె పట్టించి మసాజ్ చేసి, స్టీమ్ ఇవ్వాలి. ఇలా చేస్తే జుట్టు పొడిబారదు, కేశాలు ఆరోగ్యంగా నిగనిగలాడుతాయి.
 
 అపోహ-వాస్తవం


 అపోహ: కలరింగ్ చేయిస్తే తెల్లజుట్టు వస్తుంది.
 వాస్తవం: కొంతమందికి హెయిర్ కలరింగ్ సరిపడదు. అలర్జీ ఉన్నప్పటికీ కలరింగ్ చేయిస్తుంటారు. అలాంటి వారికి జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గి జుట్టు తెల్లబడుతుంది.
 అపోహ: తేనె తగిలితే వెంట్రుకలు తెల్లబడతాయి.
 వాస్తవం: ఒకటి రెండు సార్లు తగిలితే ఏం కాదు, అదీ కొద్దిమోతాదులో తేనె కలిసినా ఏమీ కాదు. ఎక్కువ మోతాదులో కంటిన్యూయస్‌గా తగిలితే తెల్లబడే  ప్రమాదం ఉండవచ్చు.
 అపోహ: హెన్నా పెడితే జుట్టు పాడవుతుంది.
 వాస్తవం: హెన్నా వాడితే జుట్టు పాడుకాదు.
 
 - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి
 
 పాఠకులకు మనవి: మీ ఆరోగ్య సమస్యలను,

 ఈ పేజీకి సలహాలు, సూచనలను మాకు తెలియచేయండి. మీరు పంపవలసిన చిరునామా: డాక్టర్ సలహా, హస్తవాసి, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,  రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్ -34.
 e-mail: health.sakshi@gmail.com

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement