How to Stop Hair Fall Naturally, in Telugu | జుట్టు రాలుతోంది... నివారణ ఎలా? - Sakshi
Sakshi News home page

జుట్టు  రాలుతోంది... నివారణ  ఎలా? 

Published Wed, Oct 24 2018 12:27 AM | Last Updated on Wed, Oct 24 2018 3:36 PM

Family health counseling spcial - Sakshi

నా వయసు 24 ఏళ్లు. నాకు విపరీతంగా జుట్టు రాలిపోతోంది. బట్టతల వస్తుందేమో అన్న ఆందోళన కూడా పెరుగుతోంది. జుట్టు రాలకుండా ఉండేందుకు దయచేసి ఏవైనా మార్గాలుంటే చెప్పండి. అలాగే జుట్టు పెరగడానికి ఏమైనా చికిత్సలు ఉన్నాయా?  – ఒక సోదరి, సంగారెడ్డి 

జుట్టు జీవితచక్రంలో పెరగడం, రాలిపోవడం, జుట్టు అంకురం కొంతకాలం విశ్రాంతి తీసుకొని మళ్లీ పెరగడం అన్నది నిరంతరం జరుగుతుంటుంది. ఇందులో భాగంగా  మనందరిలోనూ రోజూ 60 – 100 వెంట్రుకలు (స్ట్రాండ్స్‌) రాలిపోతూ ఉంటాయి. ఇవన్నీ మళ్లీ వస్తూ ఉంటాయి. అయితే దాని కంటే ఎక్కువగా రాలిపోతూ... రాలేవాటి కంటే పెరిగేవి తగ్గుతూ పోతుంటే మాత్రం కాస్తంత ఆలోచించాల్సిందే. జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్, వాహనాల నుంచి విచ్చలవిడిగా వెలువడే  కాలుష్యాలతో వెంట్రుకలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. శారీరక ఒత్తిడులు లేదా  తీవ్రంగా జబ్బు పడటం కూడా జుట్టు రాలిపోయేలా చేస్తాయి. ఇలా జుట్టు రాలడాన్ని ‘టిలోజెన్‌ ఎఫ్లూవియమ్‌’ అంటారు. కానీ ఇలా రాలిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది. ఇక మహిళల విషయానికి వస్తే వారిలో ప్రసవం తర్వాత తలపై జుట్టు రాలి ఎక్కువగా పలచబారిపోతుంది. దీనికి వారు అనుభవించే శారీరక ఒత్తిడి కూడా ఒక కారణం. పైగా జుట్టుకు అందాల్సిన పోషకాలు అందకుండా పోవడం కూడా మరో కారణం. ఆ సమయంలో జుట్టుకు అవసరమైన ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, ఇతర విటమిన్లు దారిమళ్లి కడుపులోని బిడ్డకు అందడమే  ఇందుకు కారణం. మరికొందరిలో ప్రోటీన్‌తో కూడిన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు రాలుతుంది. ఇంకొందరిలో హార్మోన్ల లోపం జుట్టు రాలడానికి కారణమవుతుంది.  సాధారణంగా హార్మోన్‌ లోపాల సమస్య మహిళల్లో ఎక్కువ. మహిళల్లోనూ కొద్దిపాటి పురుష హార్మోన్‌ అయిన టెస్టోస్టెరాన్‌ స్రవిస్తుంటుంది. పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌) ఉన్నవారిలో టెస్టోస్టెరాన్‌ స్రావం ఎక్కువ. దీంతో జుట్టు రాలుతుంది. ఇక హైపోథైరాయిడిజమ్‌ కండిషన్‌ కూడా జుట్టు రాలడానికి దోహదం చేస్తుంది. ఒక్కోసారి ఆటోఇమ్యూన్‌ జబ్బుల వల్ల జుట్టు రాలుతుంది.  మన రోగనిరోధకశక్తే మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే జబ్బులను ఆటోఇమ్యూన్‌గా పేర్కొంటుంటారు. ఉదాహరణకు... ∙పేనుకొరుకుడు (అలొపేషియా ఏరేటా) వల్ల మన మాడు, కనుబొమలు, మీసం, గడ్డం, శరీరంలో ఏ భాగంలోనైనా వెంట్రుకలన్నీ రాలిపోయి ప్యాచ్‌లుగా కనిపిస్తుంటాయి  లైకెన్‌ ప్లానస్‌ అనే ఆటోఇమ్యూన్‌ కండిషన్‌ వల్ల జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది ∙లూపస్‌ అనే మరో ఆటో ఇమ్యూన్‌ కండిషన్‌ వల్ల కూడా జుట్టు రాలిపోవచ్చు. ఇంకొందరిలో రకరకాల రుగ్మతలకు మందులు వాడుతున్నప్పుడు  వాటి దుష్ప్రభావం వల్ల జుట్టు రాలడం మామూలే. ఏ కారణం వల్ల జుట్టు రాలుతుందో గ్రహించి, దానికి దూరంగా ఉండటం వల్ల జుట్టు రాలడం చాలా తగ్గుతుంది. అలాగే ఏదైనా జబ్బు కారణంగా ఇలా జరుగుతుంటే... ఆ జబ్బును నయం చేసుకుంటే (అండర్‌లైయింగ్‌ కారణానికి చికిత్స తీసుకుంటే) జుట్టు రాలడం తగ్గుతుంది. వీటన్నింటినీ గుర్తించి త్వరగా మందులు వాడితే రాలిన జుట్టు మళ్లీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. 

సాధారణంగా జుట్టు రాలిపోయే సమస్య ‘టీలోజెన్‌ ఎఫ్లూవియమ్‌’ అనే సమస్య కారణంగా వస్తుంది. ఈ కారణంగా మామూలు కంటే ఎక్కువగా జుట్టు రాలిపోతుంది. అయితే... మహిళల్లో బట్టతల రాదని కొందరు అనుకుంటారు. కానీ అరుదుగా మహిళల్లోనూ బట్టతల వస్తుంది. దీన్ని ‘ప్యాటర్న్‌ హెయిర్‌లాస్‌’ అంటారు. ఇలాంటి వారిలో పాపిట క్రమక్రమంగా వెడల్పుగా అవుతుండటం కనిపిస్తుంది. దీంతో మహిళల్లో బట్టతల వచ్చే అవకాశాలను గుర్తించవచ్చు. ఇలాంటివారు వైద్యులను కలిస్తే బట్టతలను చాలావరకు నివారించవచ్చు. ఇక మిగతా వారు తమ జుట్టు రాలే సమస్యల కోసం కింద పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అలా తీసుకున్న తర్వాత కూడా జుట్టు ఇంకా రాలుతుంటే అప్పుడు మాత్రం వైద్యులను తప్పనిసరిగా సంప్రదించాలి. 

వెంట్రుకలను కాపాడుకునే  సాధారణ పద్ధతులు... 
∙వెంట్రుకలకు మంచి పోషకాలు అందేలా యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్న పదార్థాలు అంటే ఆకుపచ్చని కూరలు (గ్రీన్‌ లీఫీ వెజిటబుల్స్‌), తాజా పళ్లు,  విటమిన్‌ ఏ, సీ, ఈ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్, జింక్‌ పాళ్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు, తాజా పండ్లు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వెంట్రుకలను షాంపూతో శుభ్రం చేసుకోవాలి. అయితే మరీ ఎక్కువగా వెంట్రుకలను కడగటం కూడా అంత మంచిది కాదని గుర్తుంచుకోవాలి. దీనివల్ల వెంట్రుకలు పొడిబారవచ్చు. అలర్జెన్స్, కాలుష్యాలు నేరుగా వెంట్రుకలు తాకకుండా స్కార్ఫ్‌ కట్టుకోవడం, హాట్‌ పెట్టుకోవడం చేయాలి. 

ఏయే  ఆహారాలతో మేనికి మెరుపు వస్తుంది? 
నా వయసు 23 ఏళ్లు. నా చర్మం ఎండిపోయినట్లుగా ఉంటోంది. కాస్మెటిక్స్‌ పెద్దగా ఇష్టం ఉండదు. నేచురల్‌గా నేను తీసుకునే ఆహారంలో మార్పులతో మేను మెరిసేలా చేయడానికి సూచనలు ఇవ్వండి. 
– ఎల్‌. సౌందర్య, ఖమ్మం
చర్మానికి మేలు చేసే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మేని సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. తాజా చేపలు, అవిశెలు, బాదం... వీటిల్లో ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువ. ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉండేలా చేస్తాయి. ముడిబియ్యం, పొట్టుతీయని ధాన్యాలు, బార్లీ, పొట్టు తీయని గోధుమలతో చేసిన ఆహారాల్లో పీచు పదార్థాలు ఎక్కువ. ఇవి శరీరంలోని విషాలను తొలగించి బయటకు పంపడానికి సహాయపడతాయి. ఇందులోని పీచు పదార్థాలు చర్మం బిగుతుదనాన్ని కాపాడతాయి. విటమిన్‌–బి6 ఎక్కువగా ఉండే ఆహారమైన కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్‌నట్, అవకాడో వల్ల  హార్మోన్లలోని అసమతౌల్యత వల్ల వచ్చే మొటిమలను నివారించవచ్చు. అరటి, నారింజ, జామ వంటి అన్ని రకాల తాజా పండ్లలో విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. ఇవి చర్మానికి హానిచేసే ఫ్రీరాడికల్స్‌ అనే విషాలను తొలగించి మేనిని మెరిసేలా చేస్తుంది. కాఫీ, టీలు, బేకరీ ఐటమ్స్, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, చాలా ఎక్కువగా ఫ్రై చేసిన పదార్థాలు వద్దు. అవి మీకు బాగా ఇష్టమైతే చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. చర్మం మెరుపును ఇవి తగ్గిస్తాయి.
డాక్టర్‌ స్వప్నప్రియ
డర్మటాలజిస్ట్, కేర్‌ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement