ఆ మందుల వల్ల ఒళ్లు నల్లబడే అవకాశం ఉంది! | body that the board is likely to be due to the drugs! | Sakshi
Sakshi News home page

ఆ మందుల వల్ల ఒళ్లు నల్లబడే అవకాశం ఉంది!

Published Wed, Dec 30 2015 7:50 AM | Last Updated on Sun, Sep 3 2017 2:46 PM

ఆ మందుల వల్ల ఒళ్లు నల్లబడే అవకాశం ఉంది!

ఆ మందుల వల్ల ఒళ్లు నల్లబడే అవకాశం ఉంది!

హోమియో కౌన్సెలింగ్
 
 ఒత్తై జుట్టు కోసం...
 నా వయసు 28. ఇటీవలే నాకు బాబు పుట్టాడు. అయితే గత కొద్దికాలంగా నా జుట్టు విపరీతంగా రాలిపోతోంది. మాడంతా పలచబడి పోయి, చూడటానికి అందవికారంగా తయారవుతోంది. దీనికి హోమియో చికిత్స ఉంటే తెలపగలరు.
 -వనజ, విజయనగరం

 జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. దీర్ఘకాలంపాటు అనారోగ్యంతో బాధపడివారిలోనూ, మేజర్ శస్త్రచికిత్స జరిగిన వారిలోనూ జుట్టు రాలచ్చు. అలాగే ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు, హార్మోనుల మార్పుల వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది. థైరాయిడ్ సమస్య కూడా జుట్టు రాలేందుకు కారణాలలో ఒకటి. అయితే తగిన చికిత్సతో దాన్ని అదుపు చేయవచ్చు. పురుషుల్లో ఆండ్రోజెన్, మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోనుల్లో మార్పుల వల్ల కూడా జుట్టు రాలుతుంది. కొందరు మహిళల్లో బిడ్డ పుట్టిన మూడు నెలల తర్వాత జుట్టు రాలడం చాలా సాధారణం. గర్భధారణ సమయంలో జరిగిన హార్మోన్ మార్పులతో ఈ పరిణామం సంభవిస్తుంది. ఆ తర్వాత హార్మోనులన్నీ సాధారణ స్థితికి వచ్చాక జుట్టు రాలడం ఆగిపోయి, మళ్లీ  మామూలుగా పెరుగుతుంది. కొన్ని మందుల వాడకం, కొన్ని ఇన్ఫెక్షన్స్ (ఫంగల్), లూపస్, డయాబెటిస్ లాంటి వ్యాధుల వల్ల కూడా జుట్టు రాలవచ్చు. పైన పేర్కొన్న కారణాలను కనుగొని, చికిత్స చేస్తే జుట్టు రావచ్చు.

స్టార్ హోమియోపతి చికిత్స...
జుట్టు రాలడానికి తగిన కారణాన్ని కనుగొని దానికి అనుగుణంగా చికిత్స చేయడం వల్ల మళ్లీ జుట్టు వచ్చేలా చేయవచ్చు. అయితే ఈ విధానంలో అల్లోపతిలో ఉపయోగించే మందులు సైడ్ ఎఫెక్ట్స్ కలిగించడంతో పాటు... హార్మోన్‌ల క్రమాన్ని మార్చి, దాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కానీ... హోమియో మందులు   ఆరోగ్యానికి ఎలాంటి హానీ చేయకుండా జుట్టు రాలడాన్ని ఆపగలవు. హోమియో వైద్య విధానంలో నేట్రమ్‌మూర్, ఫ్లోరిక్ యాసిడ్, సెపియా, తూజా, ఫాస్ఫరస్, గ్రాఫైటిస్, కార్బోవెజ్ వంటివి మంచి ప్రభావాన్ని చూపుతాయి. అయితే జుట్టు రాలుతున్న వ్యక్తి రుగ్మతలు, స్వరూప-స్వభావాలు, ప్రవర్తన వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని వీటిని నిర్ణయించాల్సి ఉంటుంది. ఉదాహరణకు నేట్రమ్‌మూర్ అనే మందు... పాలిచ్చే తల్లుల్లో జుట్టు రాలడాన్ని ఆపుతుంది. మీరు నిపుణులైన హోమియో వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స తీసుకోండి.
 
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి
హైదరాబాద్
 
న్యూరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 43. నాకు కాళ్లూ చేతులు తిమ్మిరిగా ఉండటం, మొద్దు బారటం, మంటలు, నొప్పులు రావటంతో న్యూరో ఫిజిషియన్‌ను కలిశాను. అన్ని టెస్ట్‌లు చేసి కొన్ని మందులు ఇచ్చి, అవి వాడమన్నారు. సంవత్సరం నుండి వాడుతున్నాను. మందులు వాడకపోతే నడవలేకపోతున్నాను. ఏ పని చేయలేకపోతున్నాను. అంగస్తంభన సమస్య కూడ ఉంది. ఈ మందులు ఎంతకాలం వాడాలి?  ఎక్కువకాలం వాడితే సైడ్ ఎఫెక్టులు ఏమైనా ఉంటాయా?
 -ఎస్.ఎం. రావు, కనిగిరి


 మీరు తెలిపిన వివరాల ప్రకారం న్యూరోపతితో బాధపడుతున్నారు. కానీ ఏ విధమైన న్యూరోపతి అనేది మీరు రాయలేదు. ముందుగా న్యూరోపతి నిర్ధారణ చేసుకొనడానికి మీరు డాక్టర్ సలహా మేరకు కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. వాటిల్లో సీరమ్ బి12, 7ఎస్‌హెచ్, నెర్వ్ కండక్షన్ స్టడీ పరీక్షల అనంతరం మీరు ఎటువంటి జబ్బుతో బాధపడుతున్నారో నిర్ధారణ అవుతుంది. తరువాత మీకు కావాల్సిన మందులు వాడితే మీరు మళ్లీ మామూలు పరిస్థితికి రాగలుగుతారు.
 
నాకు 23 ఏళ్లు. నేనొక చిరుద్యోగిని. నేను గత 3 సంవత్సరాలుగా చేతులలో వణుకుతో బాధ పడుతున్నాను.  నా కుడి చేతికి వణుకు ఎక్కువగా ఉంది, ఎడమ చేతికి కొంచెం తక్కువ. ఎక్కడికి వెళ్లినా టెన్షన్ వచ్చి, తరువాత బాడీ మొత్తం వణుకు వస్తుంది. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. ప్రస్తుతం మందులు వాడుతున్నాను. అవి వాడిన రోజు కొద్దిగా నార్మల్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాకు ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదు. నాకు ఏదైనా పరిష్కారం ఉందా? నేను మ్యారేజ్ ఎలా ఫేస్ చెయ్యాలో అర్థం కావడం లేదు. దయచేసి దీనికి పరిష్కారం చెప్పండి.
 - కుమార్, హైదరాబాద్


 మీరు తెలిపిన వివరాల ప్రకారం మీ లక్షణాలను బట్టి చూస్తే దీనిని యాంగ్జైటీ నెర్వోసిస్ అని వైద్య పరిభాషలో అంటాము. దీనికి మీరు పెద్దగా ఆందోళన పడ వలసిన అవసర ం లేదు. కొంతమందిలో ఇది థైరాయిడ్ డిజార్డర్ వల్ల వస్తుంది. కాబట్టి మీరు ఒకసారి థైరాయిడ్‌కు సంబంధించిన పరీక్షలు చేయించుకొని దగ్గరలోని న్యూరాలజిస్టును కలవండి. చాలామందిలో ఇటువంటి సమస్య మానసిక ఒత్తిడి వల్ల ఏర్పడుతుంది. దీనిని జయించేందుకు యోగా, మెడిటేషన్ చేయాలి. రిలాక్స్‌డ్‌గా ఉండేందుకు ప్రయత్నించాలి. దానికి జీవనశైలి, ఒత్తిడి, అందోళన, నిద్రలేమితో పాటు పౌష్టికాహార లోపం వంటివి కూడా కారణాలు. మీ జీవనశైలిని సరైన దారిలో పెట్టుకుంటే మీ సమస్యలకు మీరే చెక్ పెట్టవచ్చు.
 
 డాక్టర్ నీలేష్ విజయ్ చౌదరి
 కన్సల్టెంట్ - న్యూరాలజిస్ట్
 కేర్ హాస్పిటల్స్
 బంజారాహిల్స్
 హైదరాబాద్
 
పీడియాట్రిక్ కౌన్సెలింగ్

 
మా పాపకు ఆరేళ్లు. ఈమధ్య మలేరియా జ్వరం వచ్చింది. డాక్టర్‌ను సంప్రదిస్తే మందులు రాశారు. వాటిని వాడాక జ్వరం తగ్గింది. అయితే పాప కొద్దిగా నల్లబడింది. మలేరియా మందులు వాడటం వల్ల పాప నల్లబడిందా? పాపకు ఇదివరకటి కలర్ రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా మందులు వాడాలి?
 - స్వప్న, చెన్నై

 మీరు మలేరియాకు ఏయే మందులు వాడారన్న సమాచారం లేదు. పిల్లలకు కొన్ని మందులు వాడటం వల్ల... ముఖ్యంగా క్వినాక్విన్ మందు వాడి ఉంటే మీ పాప రంగుమారడానికి (పిగ్మెంటేషన్‌కు) అది ఒక కారణంగా చెప్పవచ్చు. మనం సాధారణంగానే క్లోరోక్విన్, మెఫ్లోక్విన్ మందులు వాడితే కొంత హైపోపిగ్మెంటేషన్ కనిపించే అవకాశం ఉంది.

 ఇక పిల్లల విషయంలో శరీరం రంగు మారడం అన్నది మందుల వల్లే కాకుండా సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ కావడం, కొన్నిసందర్భాల్లో విటమిన్ లోపాల వల్ల కూడా జరగవచ్చు. ఒకవేళ మందుల వల్ల రంగు మారితే తక్షణం వాటిని ఆపేయాల్సి ఉంటుంది. ఎక్కువగా సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ కాకుండా చూసుకోవడం, పైపూతగా వాడే కొన్ని క్రీమ్స్‌తో తాత్కాలికంగా నల్లబడ్డ చర్మం నార్మల్‌కు వస్తుంది. కాబట్టి మీరు పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటూ, చర్మవ్యాధుల నిపుణులను కలిసి చికిత్స తీసుకోండి.
 
మా బాబుకు మూడేళ్లు. వాడికి మాటిమాటికీ జ్వరం వస్తూ పోతూ ఉంటుంది. డాక్టర్‌ను సంప్రదిస్తే మందులు, సిరప్ ఇచ్చారు. వాడినప్పుడు తగ్గి మళ్లీ వస్తోంది. వాడికి ఇలా తరచు జ్వరం రావడం మాకు ఆందోళన కలిగిస్తోంది. తగిన సలహా ఇవ్వండి.
 - సుబ్బలక్ష్మి, చిత్తూరు

 మీరు ఇచ్చిన కొద్దిపాటి సమాచారంతో మీ బాబుకు జ్వరం ఎందుకు వస్తోందనేది నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాకపోయినా... ఒకసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన పరీక్షలు, దీర్ఘకాలికమైన జబ్బులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అని పరీక్షలు చేయించ ండి.  జ్వరం వచ్చిన ప్రతీసారీ కారణం తెలుసుకోకుండా మందులు - మరీ ముఖ్యంగా యాంటీబయాటిక్స్, ఎన్‌ఎస్‌ఏఐడీ వంటివి వాడటం చాలా హానికరం. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి తగు చికిత్స తీసుకోండి.
 
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్
రోహన్ హాస్పిటల్స్
విజయనగర్ కాలనీ
హైదరాబాద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement