ఒంగోలు: ‘నాకు బతకాలని ఉంది.. కానీ నా పరిస్థితి దినదినగండంగా మారింది. ఏడాది నుంచి అనారోగ్యం నన్ను కబళించివేస్తుంటే.. చికిత్స చేయించేందుకు ఆర్థిక స్థోమత లేక నా కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. చికిత్సకు రూ.50 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దయచేసి నన్ను ఆదుకోండి’ అంటూ స్థానిక జిల్లా జైలు ఎదురుగా ఉన్న సిరి ఈవెంట్స్ హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొహైల్ అనే బాలిక ఆవేదన వ్యక్తం చేసింది.
ఆమె తెలిపిన వివరాల ప్రకారం... సొహైల్ తండ్రి మొయీన్ అహ్మద్ దంపతులకు ఇద్దరు సంతానం. రెండో సంతానమైన సొహైల్‌కు పుట్టినప్పటి నుంచి అనారోగ్యంగానే ఉండేది. వైద్యులు పరీక్షించి పలు మందులు రాసేవారు. వాటిని వాడుతూ వచ్చారు. 9వ తరగతి వరకు పాఠశాలకు పంపారు. అనారోగ్యం కారణంగా వారంలో మూడురోజులు మాత్రమే పాఠశాలకు వెళ్లేది. ఆ తర్వాత మరింత నీరసిస్తుండటంతో బడి మాన్పించేశారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. టేబుల్ మీద కనిపించే బొమ్మలను తానే తయారుచేస్తూ తాను ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ నుంచి విముక్తి కోసం, భగవంతుడి కృప కోసం ఎదురుచూస్తోంది.
తండ్రి చికెన్ పకోడీ బండి పెట్టుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తుంటే.. సోదరుడు ఇప్పుడిప్పుడే వెబ్‌డిజైనింగ్ చేస్తూ కుటుంబానికి అండగా నిలబడేందుకు కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఏడాది క్రితం స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు వైద్యశాలలో సొహైల్‌కు చూపించగా, వైద్యులు సొహైల్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ అపోలో హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. దీంతో ఆమెకు స్కానింగ్ తీసి పరిశీలించిన అపోలో వైద్యులు.. గుండెకు మూడు రంధ్రాలున్నట్లు నిర్ధారించారు. పల్మనరీ హైపర్ టెన్షన్, వెంట్రిక్యులర్ సెప్టిన్ డిఫెక్ట్, యెజెనెమెంజర్స్ సిండ్రోమ్ అనే మూడు రకాల సమస్యలు ఆమె హృదయానికి ఉన్నాయని, ఆమె జీవించాలంటే గుండె మార్పిడి తప్పనిసరని తెలిపారు.
ఆపరేషన్‌కు ముందు రూ.2 లక్షలు, ఆపరేషన్‌కు రూ.30 నుంచి 35 లక్షలు ఖర్చవుతాయని వెల్లడించారు. గుండెమార్పిడికి అవసరమైన ఆర్గాన్‌ను తెప్పించాలంటే ఫ్‌లైట్ చార్జీలు రూ.12 లక్షలు అవుతాయని పేర్కొన్నారు. మొత్తంగా దాదాపు రూ.50 లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు ఆర్థికసహాయం చేసి ఆదుకోవాలని సొహైల్ కోరుతోంది. సొహైల్‌ను ఆదుకోవాలని భావించే వారు ఆమె సోదరుడైన ‘షేక్ అతికూర్, ఎస్‌బీఐ అకౌంట్ నంబర్ 20351379362, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఎస్‌బీఐఎన్ 0010311’కు నగదు జమచేయవచ్చు. పూర్తి వివరాల కోసం 99492 99089 నంబర్‌ను సంప్రదించవచ్చు.
స్పందించిన సిరి ఈవెంట్స్...
సొహైల్ విషయం తెలుసుకున్న ఒంగోలు సిరి ఈవెంట్స్ ఆర్గనైజర్ ఎం.శ్రీనివాసులు స్పందించారు. తాను ఇటీవల హీరో సంపూర్ణేష్‌బాబును కలిసి సొహైల్ వృత్తాంతాన్ని వివరించగా, ఒంగోలులో ఒక ఈవెంట్‌ను ఉచితంగా నిర్వహించి వచ్చే నగదును సొహైల్‌కు కేటాయించేందుకు ఆయన ముందుకు వచ్చారన్నారు. ఆగస్టు 26న రక్షాబంధన్ రోజున ఒంగోలులో సొహైల్ ఆపరేషన్ కోసం 57 మంది సినీ, బుల్లితెర కళాకారులతో జబర్దస్త్ నవ్వుల హరివిల్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, విజయవంతం చేసి చిన్నారికి ప్రాణభిక్ష పెట్టాలని శ్రీనివాసులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment