జానకి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. కొంతకాలం హైదరాబాద్‌లో పనిచేశాక అమెరికా వెళ్లింది. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో కలసి పబ్‌కు వెళ్లేది. అమెరికా వెళ్లాక అది అలవాటుగా మారింది. రోజూ పబ్, క్లబ్, ఆల్కహాల్ ఆమె జీవితంలో భాగంగా మారిపోయాయి. ఏదైనా ఒకరోజు ఆల్కహాల్ తాగకపోతే పిచ్చెక్కినట్లు ఉండేది. దాంతో ఇంట్లోనే బార్ ఏర్పాటు చేసుకుంది. ఆఫీస్ నుంచి రాగానే నాలుగైదు పెగ్గులు వేయందే నిద్రపట్టేది కాదు. అలా అలా ఆల్కహాల్ వ్యసనంగా మారింది.
అయితే వివాహం తర్వాత ఆమెకు సమస్య మొదలైంది. నెలరోజులు ఎలాగోలా ఓపిక పట్టినా ఆ తర్వాత ఆగలేక తాగడం మొదలు పెట్టింది. దాంతో భర్తతో పెద్ద గొడవైంది. సోషల్ డ్రింకింగ్ విషయంలో తనకూ అభ్యంతరం లేదని, కానీ రోజూ స్పృహ తప్పేంతగా తాగుతానంటే భరించలేనని భర్త తేల్చి చెప్పేశాడు. ఈ విషయం ఇరువైపులా పేరెంట్స్‌కు తెలిసి పంచాయతీ పెట్టారు. చివరకు విడాకుల వరకూ దారితీసింది.
అలవాటు కాదు.. జబ్బు
జానకిలా మద్యం వ్యసనంతో ఇల్లూ, ఒళ్లూ గుల్ల చేసుకున్నవారు, చేసుకుంటున్నవారూ మన చుట్టూ చాలామంది కనిపిస్తారు. మద్యం తాగడం పాపమని కొందరు వారికి హితబోధలు చేస్తే, బలహీన మనస్తత్వమున్నవారే తాగుతారని మరి కొందరు వాదిస్తుంటారు. నిజానికి మద్యానికి బానిసవ్వడం, విపరీతంగా మద్యం సేవించడం, మద్యం వల్ల జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ తాగకుండా ఉండలేకపోవడం ఒక మానసిక రుగ్మత. దానివల్ల అనేకానేక శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. హఠాత్తుగా మద్యం తాగడం తగ్గించినా, ఆపేసినా కూడా సమస్యలు వస్తాయి. మద్యం వ్యసనం నుంచి శాశ్వతంగా విముక్తి లభించాలంటే చికిత్స అవసరం.
తిడితే సరిపోదు.. చికిత్స అవసరం..
మద్యానికి బానిసైన వారిని చులకనగా చూడటం, తిట్టడం సమస్యను పరిష్కరించవు. అలాంటివారిని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ లేదా క్లినికల్ సైకాలజిస్ట్ లేదా అడిక్షన్ ఎక్స్‌పర్ట్ దగ్గరకు తీసుకువెళ్లాలి. అవసరమైతే కొంతకాలం రీహాబిలిటేషన్ సెంటర్లోనే ఉంచి మద్యపాన వ్యసనం నుంచి బయట పడేయవచ్చు. మద్యపాన వ్యసనం ఉన్నవారు తమకు సమస్య ఉందని గుర్తించక చికిత్స పొందడానికి వెనుకాడతారు. అందువల్ల కుటుంబసభ్యులే వారిని చికిత్సకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
వివిధ దశల్లో చికిత్స
మద్యపాన వ్యసనానికి వివిధ దశల్లో వివిధ రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ దశల్లో వ్యక్తిగత, గ్రూప్ కౌన్సెలింగ్.. సమస్యను బాగా అర్థంచేసుకోవడంలో సహాయపడతాయి. మద్యపాన వ్యసనం వల్ల వచ్చిన మానసిక సమస్యల నుంచి కోలుకోవడానికి మద్దతునిస్తాయి.
- ఆల్కహాల్ చికిత్స నిపుణుల పర్యవేక్షణలో గోల్ సెట్టింగ్, ప్రవర్తనలో మార్పు తెచ్చే పద్ధతులు, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం వంటివన్నీ వ్యసనం నుంచి బయటపడేందుకు సహాయపడతాయి
- కొన్ని టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ తాగితే వికారం, వాంతులు, తలనొప్పి వంటివి కలుగుతాయి. మరికొన్ని మందులు ఆల్కహాల్ తాగాలనే కోరికను తగ్గిస్తాయి · మద్యపాన వ్యసనం నుంచి కోలుకుంటున్న వ్యక్తులు మళ్లీ మద్యం వైపు మళ్లకుండా కొన్నిరకాల మందులు, ఇంజెక్షన్లు సహాయపడతాయి
- ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమవ్వడం వ్యసనాల నుంచి కోలుకునేందుకు సహాయపడుతుంది
- రీహాబిలిటేషన్ సెంటర్ లేదా సైకియాట్రిక్ ఆస్పత్రిలో వారం రోజులపాటు డిటాక్స్ అండ్ విత్ డ్రాయల్ చికిత్స అందిస్తారు. విత్ డ్రాయల్ లక్షణాలను నివారించడానికి మందులు తీసుకోవాల్సి రావచ్చు
- మద్యపాన వ్యసనం తీవ్రంగా ఉన్నవారు కొన్ని నెలలపాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉండాల్సి రావచ్చు. అక్కడ ఆల్కహాల్, డ్రగ్ కౌన్సెలర్లు, సోషల్ వర్కర్లు, నర్సులు, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తారు.
మద్యపాన వ్యసనం లక్షణాలు
మద్యం తాగడం, వ్యసనంగా మారడం, దానికి బానిసవ్వడం మూడూ వేర్వేరు. రెండు గంటల్లో నాలుగైదు పెగ్గులు అంతకంటే ఎక్కువ తాగడాన్ని అనారోగ్యకరమైన డ్రింకింగ్‌గా పరిగణిస్తారు. మద్యపాన వ్యసనానికి ఈ కింది లక్షణాలు ఉంటాయి.
- ఆల్కహాల్ తాగాలనే బలమైన కోరిక, తాగకుండా ఉండలేకపోవడం ·
- తాగే పరిమాణాన్ని పరిమితం చేయలేకపోవడం
- తాగడం తగ్గించుకోవడానికి విఫల యత్నాలు చేయడం
- తాగడంలోనే ఎక్కువ సమయం గడపడం, ఇతర పనులను పక్కన పెట్టడం
- మద్యం వల్ల బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమవడం
- జీవితంలో సమస్యలకు కారణమవుతుందని తెలిసినప్పటికీ కొనసాగించడం
- డ్రైవింగ్, ఈత లాంటి సందర్భాల్లో కూడా మద్యం తాగడం
కారణాలు..
మద్యపాన వ్యసనానికి సామాజిక, మానసిక, జన్యు కారణాలున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. మద్యం వినియోగం సాధారణమైన సమాజంలో, కుటుంబంలో పుట్టి పెరిగిన వారికి అది తప్పుగా అనిపించదు. సరదాగా మొదలుపెట్టినా చివరకు వ్యసనంగా మారుతుంది. కాలక్రమేణా ఆల్కహాల్ తాగడం మెదడులోని ఆనందం, పనితీరు, ప్రవర్తనపై నియంత్రణ సాధించే భాగాలతో అనుసంధానమవుతుంది. ఇది మంచి భావాలను పునరుద్ధరించడానికి లేదా ప్రతికూల భావాలను తగ్గించడానికి ఆల్కహాల్ కోరికను కలిగిస్తుంది. అలా మద్యానికి బానిసను చేస్తుంది. కొందరు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనలేక మద్యం మత్తులో సేద తీరుతూ వాస్తవికత నుంచి తప్పించుకుంటారు.
--సైకాలజిస్ట్ విశేష్
psy.vishesh@gmail.com
(చదవండి: ఆ టైంలోనే అతిపెద్ద అండర్‌గ్రౌండ్ ఎయిర్‌పోర్టు..కానీ ఇప్పుడది..)
Comments
Please login to add a commentAdd a comment