శివానీ మధ్య తరగతి మహిళ. గతంలో ఒక కంపెనీలో ఉద్యోగం చేసింది. కానీ బస్సు లేదా మెట్రోలో వెళ్లాలంటే భయం ఏర్పడటంతో ఏడాది కిందట ఉద్యోగానికి రాజీనామా చేసింది. భర్త శివాజీ కూడా ఆమె సమస్యను అర్థం చేసుకుని మద్దతుగా నిలిచాడు. అయితే ఆమె ఆందోళన రోజురోజుకూ పెరిగిపోసాగింది. తోడు లేకుండా కనీసం పక్క వీథిలోని కొట్టుకి కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
అగ్రోఫోబియా లక్షణాలు
- ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేభయం
- జనం మధ్య ఉండాలన్నా లేదా క్యూలో వేచి ఉండాలన్నా భయం
- సినిమా థియేటర్లు, ఎలివేటర్లు, చిన్న దుకాణాలు వంటి మూసి ఉన్న ప్రదేశాలంటే భయం
- పార్కింగ్ స్థలాలు, వంతెనలు, మాల్స్ వంటి బహిరంగ ప్రదేశాలంటే భయం
- బస్సు, విమానం, రైలు వంటి ప్రజా రవాణాను ఉపయోగించాలన్నా భయం
- బయటకు వెళ్లాలంటే ఎవరైనా తోడు రావాలని కోరుకోవడం
- భయాందోళనల నుంచి తప్పించుకునేందుకు బయటకు వెళ్లకుండా ఇంటికే పరిమితం కావడం
- ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఈ లక్షణాలతో బాధపడటం.
అనేక కారణాలు
అగ్రోఫోబియాకు కారణమేమిటో కచ్చితంగా తెలియదు. అనువంశికంగా వస్తుందని వైద్యులు భావిస్తారు. జెనెటిక్స్, హెల్త్ కండిషన్, పర్సనాలిటీ, స్ట్రెస్, అనుభవాలు.. అన్నీ ఈ రుగ్మత అభివృద్ధిలో పాత్ర పోషిస్తాయి. సాధారణ జనాభాలో ఒక శాతం కంటే తక్కువమందిలో ఇది కనిపిస్తుంది. పురుషులకంటే స్త్రీలలో రెండు నుంచి∙ మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. యువతలో ఇది సర్వసాధారణం. పానిక్ డిజార్డర్, ఇతర ఫోబియాలు ఉన్నవారిలో, అగ్రోఫోబియాతో బాధపడుతున్న కుటుంబ సభ్యులు, బాధాకరమైన అనుభవాలు ఉన్నవారిలో ఇది వచ్చే అవకాశం ఉంది. దీనికి చికిత్స తీసుకోకుండా తాత్సారం చేస్తే.. డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలకు, ఆత్మహత్య ప్రయత్నాలకు దారితీస్తుంది.
ఒకరోజు ధైర్యం చేసి బయటకు వెళ్లి.. అక్కడే కుప్పకూలింది. పక్కింటివారు చూసి ఇంటికి తీసుకువచ్చారు. ఏమైందని భర్త ప్రశ్నిస్తే.. ఒళ్లంతా వణుకు వచ్చిందని, శ్వాస ఆడలేదని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని చెప్పింది. ఒక్కోసారి గుండె పట్టేసినట్టుగా ఉంటోందనీ చెప్పింది. శివాజీ వెంటనే ఆమెను హాస్పిటల్‌కి తీసుకువెళ్లి అన్నిరకాల వైద్య పరీక్షలు చేయించాడు. ఆరోగ్యపరంగా అంతా బాగానే ఉందని వైద్యుడు చెప్పాడు. శివానీ మానసికంగా భయపడుతోందని, వెంటనే సైకాలజిస్ట్‌ను సంప్రదించమని సూచించడంతో మా సెంటర్‌కి వచ్చారు.
ఇంటికే పరిమితం చేసే జబ్బు
శివానీతో అరగంట మాట్లాడాక ఆమె యాంగ్జయిటీ డిజార్డర్‌తో సతమతమవుతోందని అర్థమైంది. దాన్ని నిర్ధారించుకునేందుకు కొన్ని టెస్టులు ఇచ్చాను. వాటి ద్వారా ఆమె అగ్రోఫోబియాతో బాధపడుతోందని తేలింది. ఇది ఒక రకమైన ఆందోళన రుగ్మత. కొన్ని ప్రదేశాలకు వెళ్తే మైకం, మూర్ఛ, పడిపోవడం లేదా అతిసార వంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని భయపడుతుంటారు. ఆయా ప్రదేశాలకు వెళ్తే గుండె వేగంగా కొట్టుకుంటుంది. చేతులు చెమట పట్టడం, వణుకు, శ్వాస సమస్యలు, ఛాతీ నొప్పి రావచ్చు. వీటన్నింటి నుంచి తప్పించుకునేందుకు అడుగు బయట పెట్టకుండా ఇంటికే పరిమితమవుతారు.
సాధన, సహాయమే మార్గం..
అగ్రోఫోబియాను నివారించడానికి కచ్చితమైన మార్గం లేదు. భయపడే పరిస్థితులను తప్పించుకునే కొద్దీ ఆందోళన పెరుగుతుంది. జీవితం కష్టంగా మారుతుంది. దాన్నుంచి బయటపడాలంటే ముందుగా మీ ప్రయత్నాలు మీరు చేయాలి. వాటివల్ల ఫలితం కనిపించకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ను కలవాలి. మీరు భయపడే ప్రదేశాలకు మళ్లీ మళ్లీ వెళ్లడం సాధన చేయాలి. దానివల్ల ఆయా ప్రదేశాల్లో మీకు సౌకర్యం పెరుగుతుంది.
ఇలా స్వంతంగా చేయడం కష్టమైతే, కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సహాయం తీసుకోవాలి· యోగా, ప్రాణాయామం, జాకబ్ సన్, మసాజ్, విజువలైజేషన్ లాంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ సాధన చేయాలి· మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. అలాగే కాఫీని కూడా మితంగానే సేవించడం మంచిది · తగినంత నిద్ర పోవాలి. ప్రతిరోజూ శారీరకంగా చురుకుగా ఉండేందుకు ప్రయత్నించాలి. కూరగాయలు, పండ్లతో సహా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి·
యాంగ్జయిటీ డిజార్డర్స్ ఉన్న వ్యక్తుల కోసం ఏర్పాటు చేసిన సపోర్ట్ గ్రూప్స్‌లో చేరడం వలన.. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్న ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి, అనుభవాలను పంచుకోవడానికీ ఆ గ్రూప్స్ సహాయపడతాయి· అప్పటికీ సమస్య తగ్గకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకియాట్రిస్ట్‌ను కలవాలి. కన్సల్టెంట్.. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా మీకు సహాయపడతారు· క్రమం తప్పకుండా థెరపీ సెషన్ ్సకు హాజరవ్వాలి. థెరపిస్ట్‌తో మాట్లాడాలి. చికిత్సలో నేర్చుకున్న టెక్నిక్స్‌ను ప్రాక్టీస్ చేయాలి· ఆందోళన తీవ్రంగా ఉంటే సైకియాట్రిస్ట్ సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలి.
--సైకాలజిస్ట్ విశేష్
(చదవండి: French Bubble Palace Facts: బుడగల మాదిరి భవనం..కట్టడానికే 14 ఏళ్లు..కానీ.. )
Comments
Please login to add a commentAdd a comment