చిన్నారులు తీసుకున్న ఆహారం అరగకపోతే వారి తల్లిదండ్రులు హైరానా పడతారు. ఆఘమేగాల మీద ఆసుపత్రులకు పరుగులు తీస్తుంటారు. పిల్లల్లో వచ్చే చాలా అనారోగ్య సమస్యలకు మూలం నులి పురుగులే అని వైద్యులు చెబుతున్నారు. పిల్లల కడుపులో నులి పురుగుల ఉన్నట్టు గుర్తిస్తే సులభ పద్ధతిలో వైద్యం చేయించవచ్చు. తగిన చికిత్స అందించకపోతే ప్రమాదకరంగా పరిగణిస్తాయని హెచ్చరిస్తున్నారు.
నులి పురుగులు హెల్‌మెంత్ అనే పరాన్నజీవి జాతికి చెందినవి. ఇవి మూడు రకాలు. 1.రౌండ్ వారమ్స్ 2.పిన్ వారమ్స్ 3.ప్లూక్స్. వాటిలో రౌండ్ వారమ్స్ జాతికి చెందిన పురుగులు సాధారణంగా కనిపిస్తాయి. పిన్ వారమ్స్, ప్లూక్స్ వారమ్స్ జాతి పురుగులు ముఖ్యంగా పిల్లల పేగుల్లో జీవిస్తాయి. రౌండ్ వారమ్స్ జాతి పురుగులు 2 నుంచి 5 అంగుళాల పొడవుంటాయి. ఇవి పెంపుడు జంతువులు, కుక్కలు, పిల్లుల్లోనే గాకుండా మట్టిలో కూడా నివశిస్తాయి. పెంపుడు జంతువులతో చిన్నారులు సన్నిహితంగా ఉండడం, కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా చిన్నారులకు నులి పురుగుల సంక్రమిస్తాయి.
వ్యాప్తి ఇలా..
హుక్ వారమ్స్, పిన్ వారమ్స్ అనే జీవులు లార్వా రూపంలో మట్టిలో ఉంటాయి. చెప్పులు లేకుండా పిల్లలు మట్టిలో తిరిగేటపుడు ఈ జీవులు వారి కాళ్ల చర్మం ద్వారా రక్తంలో ప్రవేశించి వారి ఊపిరితిత్తులలోకి చేరతాయి. అక్కడ నుంచి శ్వాస నాళంలోకి చేరి పురుగులుగా వృద్ధి చెందుతాయి. అక్కడే గుడ్లు పెట్టి వ్యాప్తి చెందుతాయి. ఆ గుడ్లు పిల్లల మలము ద్వారా బయటకు వచ్చి తిరిగి మట్టిలో లార్వాగా వ్యాప్తి చెందుతాయి.
నులి పురుగుల లక్షణాలు
నులి పురుగుల బారిన పడ్డ చిన్నారుల్లో ప్రాథమిక దశలో కొద్దిగా జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. లార్వా ఊపిరితిత్తులలోకి వెళ్ళడంతో కడుపులో నొప్పి, వాంతులు, ఆహారం జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. హుక్ వార్మ్ జాతి పురుగులకు చిన్న దంతాలు వంటివి ఉంటాయి. వాటి సాయంతో అవి ఆమర నాళాల గోడలకు అతుక్కుని ఉంటూ క్రమంగా రక్తాన్ని పీల్చుకుంటాయి. చిన్నారుల జీర్ణ కోశంలో రక్త శ్రావం ఏర్పడుతుంది. దీంతో చిన్నారుల్లో రక్త హీనత, పోషకాహార లోపాల సమస్యలు తలెత్తుతాయి. రక్తహీనత కలిగిన పిల్లల్లో ఆయాసం ఉంటుంది. అలాగే శరీరం పాలిపోయినట్టుగా, నీరసంగా ఉంటారు. మట్టి తినే అలవాటు కనిపిస్తుంది.
భారత్‌లో 22 కోట్ల చిన్నారులు ..
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2006లో జరిపిన సర్వే ప్రకారం భారత్‌లో 22 కోట్ల చిన్నారులు నులి పురుగుల బారిన పడినట్టు అంచనా. దేశంలో ప్రతి 10 మందిలో ఏడుగురు పిల్లలు నులి పురుగుల బారిన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల చిన్నారులు ఎక్కువ మంది నులి పురుగులు బారిన పడుతున్నారు.
మాత్రలు ఉచితంగా వేస్తారు
బయట ఆహారం తినడం, మట్టిలో ఆడడం, కలుషిత నీరు తాగడం వల్ల పిల్లలకు నులిపురుగుల సమస్యలు వస్తాయి. పిల్లలకు ఈ వ్యాధి రాకుండా తల్లిదండ్రులు ఏటా రెండుసార్లు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలి. గర్భిణులు కూడా మాత్రలు తీసుకోవచ్చు. ప్రధానంగా పిల్లలకు చేతులు శుభ్రంగా కడుక్కో వడం నేర్పించాలి. పిల్లలకు తల్లి పాలు పట్టించడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరు గుతోంది. మంచి పోషక విలువలున్న ఆహారాన్ని పిల్లలకు అందించాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది సోమవారం పిల్లలకు ఉచితంగా ఈ మాత్రలు వేస్తారు.
–డాక్టర్ హేనా, అర్బన్ హెల్త్ సెంటర్, నిడదవోలు
Comments
Please login to add a commentAdd a comment