kids health
-
చిన్నపిల్లల్లో చుండ్రు సమస్య.. ఎలా వదిలించాలి?
చిన్నపిల్లల్లో చుండ్రు రావడం కాస్త తక్కువే అయినా చలికాలంలో అప్పుడప్పుడు కనిపిస్తుండటం మామూలే. దీని నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలివి... ►పిల్లలకు వారానికి 3–4సార్లు తలస్నానం చేయించాలి. తలకు తేమనిచ్చే ఆయిల్స్, లోషన్స్ వంటివి అప్లై చేస్తుండాలి. ఒకసారి జుట్టు రాలడం తగ్గిన తర్వాత హెయిర్ ఆయిల్స్, లోషన్స్ వాడుతూ మాటిమాటికీ మాడు పొడిబారకుండా చూసుకోవాలి. ►అన్ని విటమిన్లతో పాటు ప్రత్యేకంగా విటమిన్ బీ కాంప్లెక్స్ లభ్యమయ్యే ఆహారాలు తీసుకోవాలి. అందులో జింక్ మోతాదులు ఎక్కువ ఉండటం మరింత మేలు చేస్తుంది. ► ఒకసారి డాక్టర్ సలహా తీసుకుని కెటకెనజోల్, సాల్సిలిక్ యాసిడ్, జింక్ ఉన్న షాంపూలను వారానికి 2–3 సార్లు... అలా 4–6 వారాల పాటు వాడాల్సి ఉంటుంది. ► అప్పటికీ తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించి తగిన మందులతో పాటు ఈ సమస్య చాలా తీవ్రంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు సీబమ్ సెక్రిషన్స్ తగ్గించే మందుల్ని కూడా వాడాల్సి రావచ్చు. -
పుట్టగానే పిల్లలు ఏడవడం లేదా? ఈ సమస్య రావొచ్చు..కారణాలివే!
సుమంత్ చాలా చురుకైన పిల్లవాడు. వాడికి కొత్తా పాతా ఏమీ ఉండదు. ఎవరింటికెళ్లినా ఇల్లు పీకి పందిరేస్తాడు. కొడుకు చురుకుదనం చూసి, ఆనంద్, రేఖ మురిసిపోయేవారు. వాడేం చెప్పినా ఎదురుచెప్పేవారు కాదు. ఖరీదైన వస్తువులను పగలగొట్టినా చిన్నతనంలో అదంతా మామూలే అని సర్ది చెప్పుకునేవారు. కానీ సుమంత్‌ను స్కూల్లో చేర్పించాకే అసలు సమస్య మొదలైంది. అస్సలు కుదురుగా కూర్చోడని, కూర్చోనివ్వడని రోజూ కంప్లయింట్స్. బోర్డు మీద రాసింది రాసుకోడు, హోమ్‌వర్క్ పూర్తి చేయడు. ఎన్నిసార్లు చెప్పినా చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తుంటాడు. ఇంటికి ఎవరొచ్చినా పట్టించుకోకుండా తనిష్టమొచ్చినట్లు తానుంటాడంతే. వాడిని కుదురుగా పది నిమిషాలు కూర్చోపెట్టడం ఆనంద్, రేఖలకు తలకు మించిన పనిగా తయారైంది. సుమంత్ లాంటి పిల్లలు మనకు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటారు. చాలామంది పేరెంట్స్ ఆ సమస్యను పట్టించుకోరు లేదా వయసుతో పాటు అదే పోతుందని వదిలేస్తారు. కానీ అది అటెన్షన్–డెఫిషిట్/హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ADHD).. ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ప్రపంచవ్యాప్తంగా 7.2 శాతం పిల్లల్లో కనిపించే మానసిక రుగ్మత. ఇది పాఠశాల వయసులో ఎక్కువగా ఉంటుంది. టీనేజ్‌లో తగ్గుతుంది. వయోజనుల్లో తక్కువగా కనిపిస్తుంది. కారణాలు– పర్యవసానాలు ఏడీహెచ్‌డీ ఎందుకు వస్తుందనడానికి స్పష్టంగా కారణం చెప్పలేం. కొందరిలో జన్యు సంబంధమైన కారణాలుంటాయి. మరికొందరి మెదడు ఆకృతిలోనే తేడాలుంటాయి. తల్లి గర్భంతో ఉన్నప్పుడు మద్యం, ధూమపానం, అధిక రక్తపోటు, కాన్పు కష్టమవడం కూడా కారణం కావచ్చు. అలాగే పుట్టగానే ఏడవని పిల్లలు, మరేదైనా కారణాల వల్ల మెదడు దెబ్బతిన్న పిల్లలు కూడా ఇలా అవ్వొచ్చు. ఏ కారణమూ లేకుండా కూడా ఈ సమస్య ఉత్పన్నం కావొచ్చు. ఇలాంటి పిల్లలకు సకాలంలో చికిత్స అందించకపోతే పెద్దయ్యే కొద్దీ మొండిగా తయారవుతారు. పరీక్షల్లో తక్కువ మార్కులతో సరిపెట్టుకుంటారు. స్నేహితులతో తరచూ గొడవపడుతుంటారు. ఒక దగ్గర నిలకడగా ఉద్యోగం చేయలేరు. ఎప్పుడూ ఆత్మన్యూనత భావంతో ఉంటారు. మగ పిల్లలైతే సంఘవ్యతిరేక చర్యలు చేయడం, లేకపోతే తాగుడు లాంటి దురలవాట్ల పాలవుతారు. లక్షణాలు ఇలా ఉంటాయి.. ఏడీహెచ్డీలో ప్రధానంగా మూడు లక్షణాలుంటాయి. 1. చంచలత్వం (Inattention), 2. అతి చురుకుదనం (Hyperactive), 3. ఇంపల్సివ్. వీటిల్లో ఏదో ఒక లక్షణం ఉన్నంత మాత్రాన ఈ రుగ్మత ఉందనలేం. ఈ కింద చెప్పిన లక్షణాల్లో ఆరు అంతకుమించి లక్షణాలు ఆరునెలలకు మించి ఉన్నప్పుడు మాత్రమే ఈ రుగ్మత ఉందని చెప్పవచ్చు. చంచలత్వం (attention deficit) లక్షణాలు: వివరాలపై శ్రద్ధ చూపడంలో విఫలవమవడం లేదా అజాగ్రత్తగా తప్పులు చేయడం. టాస్క్స్ లేదా ఆటల్లో శ్రద్ధ వహించడంలో ఇబ్బంది ∙నేరుగా మాట్లాడినప్పుడు వినకపోవడం, పరధ్యానం సూచనలను అర్థం చేసుకోవడంలో, పాటించడంలో ఇబ్బంది ∙క్రమపద్ధతిలో, గడువులోపు పనులను పూర్తి చేయడంలో ఇబ్బంది ∙సమయ నిర్వహణలో ఇబ్బందులు అవసరమైన పనులను కూడా ఇష్టపడక పోవడం లేదా తరచుగా తప్పించుకోవడం పెన్సిళ్లు, పుస్తకాలు, ఇతర వస్తువులను తరచూ పోగొట్టు కోవడం ∙రోజువారీ కార్యకలాపాల్లో మతిమరపు హైపర్యాక్టివ్ అండ్ ఇంపల్సివ్ లక్షణాలు: ►తరచుగా చేతులు లేదా కాళ్లు కదిలిస్తూ ఉండటం ∙సీట్లో స్థిరంగా కూర్చోలేకపోవడం, సీటు వదిలేసి బయటకు వెళ్లడం. తరచుగా ఆడటం, నిశ్శబ్దంగా ఉండలేకపోవడం, ఎక్కువగా పరుగెత్తడం లేదా గెంతడం ► ప్రశ్న పూర్తయ్యేలోపు సమాధానాలు చెప్పడం, అతిగా మాట్లాడటం ∙తన వంతు వచ్చేవరకూ వేచి ఉండకుండా ఇతరులకు అంతరాయం కలిగించడం ∙తరచుగా ఇతరుల సంభాషణల్లోకి, పనుల్లోకి చొరబడటం ► ఇతరుల వస్తువులను అనుమతి లేకుండానే తీసుకోవడం, ఉపయోగించడం ఈ లక్షణాల్లో ఆరేడు కనిపించాయంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్‌ను కలసి సమగ్ర మూల్యాంకనం చేయించడం అవసరం. తల్లిదండ్రులు ఏం చేయాలి? ADHD లక్షణాలున్న పిల్లలను గైడ్ చేసేందుకు తల్లిదండ్రులకు ఓపిక అవసరం. పేరెంట్స్‌గా మీరేం చేయొచ్చంటే.. ♦మీరిచ్చే సూచనలు ఒక్కొక్కటిగా స్పష్టంగా, సరళంగా, నేరుగా ఉండాలి ∙పిల్లలు చదువుతున్నప్పుడు వాళ్ల ఏకాగ్రతకు భంగం కలిగించే అంశాలు లేకుండా చూసుకోండి ♦ వారిలోని శక్తి ఖర్చయ్యేందుకు నిత్యం వ్యాయామం చేసేలా ప్రోత్సహించండి ∙మీ పిల్లల సమస్యను అధిగమించడానికి తగిన వసతులు పాఠశాలలో ఉన్నాయో లేదో తెలుసుకోండి ∙ADHD ఉన్న పిల్లలను పెంచడం ఒక సవాల్. అందువల్ల ఆ అంశంపై మీ పరిజ్ఞానాన్ని పెంచుకోండి ∙సాధారణ చిట్కాలతో ADHD అదుపులోకి రాదు. అందుకు థెరపీ, మందులు అవసరమవుతాయి. ♦ పేరెంటింగ్ ట్రైనింగ్, బిహేవియర్ థెరపీ రోజువారీ పనితీరును మెరుగుపరచుకోవడానికి సహాయపడతాయి ∙సామాజిక నైపుణ్యాల శిక్షణ ఇతరులతో మరింత సమర్థంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడానికి సహాయపడుతుంది ∙మందులు మెదడులోని న్యూరోట్రాన్మ్సిటర్లు డోపమైన్, నోర్ ఎపినెఫ్రిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి, ఇవి అటెన్షన్ ను మెరుగుపరుస్తాయి. -సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com -
చిన్నపిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నారా? టీనేజ్‌లో డిప్రెషన్‌తో..
ఆధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్‌ఫోన్ అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. స్మార్ట్ ఫోన్ లేనిదే రోజు గడవదంటే అతిశయోక్తికాదు. లేచినప్పటి నుంచి నిద్రకు ఉపక్రమించే వరకు పక్కన స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. సగం పనులు దీనితోనే అవున్నాయంటే మాటలు కాదు. ఒక వైపు స్మార్ట్ ఫోన్‌తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంతకుమించి సమస్యలూ ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలపై ఫోన్ పెను ప్రభావం చూపుతోంది. జీవనశైలే మారిపోయింది ప్రస్తుతం 99 శాతం మంది చేతుల్లో స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. చిన్నపిల్లలు ఈ ఫోన్ల వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. 1995 తర్వాత పుట్టిన పిల్లలు తమ కౌమారమంతా స్మార్ట్‌ఫోన్‌తోనే గడుపుతున్న మొదటి తరమని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఫోన్లు వచ్చాక మనిషి జీవన శైలే మారియిందని పేర్కొంటున్నాయి. 1995 తర్వాత పుట్టిన పిల్లలు ఎక్కువ సమయం ఆన్లైన్లోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. కబుర్లు, సరదాలు, ఆట పాటలూ అన్నీ అందులోనే. పుస్తకాలు చదవడం, నిద్రపోవడం, స్నేహితులతో గడపడం, శారీరక ఆటలకు కేటాయిస్తున్న సమయం చాలా తక్కువ. ఈ జీవన శైలి వలన పిల్లల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్యులూ హెచ్చరిస్తున్నారు. ముందు తరాలవారితో పోల్చుకుంటే జీవన నైపుణ్యాల్లో ఇప్పటి పిల్లలు వెనకబడిపోతున్నారని నిపుణులు చెప్తున్నారు. వీటికి అదనంగా ఒంటరితనంతోపాటు ఇతర మానసిక సమస్యలూ ఎక్కువవుతున్నాయని అధ్యయనాలు తేల్చాయి. స్మార్ట్ ఫోన్లు పిల్లలు, టీనేజర్ల మెదళ్లపై తీవ్ర ప్రభావం చూపి సృజనాత్మకతను చంపేస్తున్నాయని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు స్పష్టం చేశాయి. అమెరికా సైకాలజీ ప్రొఫెసర్ జీన్ అధ్యయనమూ ఇదే విషయాన్ని మరింత విడమరిచి చెప్పింది. టీనేజర్లు తీవ్ర నిరాశలోకి.. టీనేజర్ల ఆరోగ్యం, ప్రవనర్తన తాలూకు అంశాలపై అమెరికాలోని శాండియాగో స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్, ఐజెన్ కన్సెల్టింగ్ వైద్యురాలు జీన్ త్వెంగే అధ్యయనం చేశారు. ఆమె తన బృందంతో కలిసి 13 నుంచి 18 ఏళ్ల వయస్సు గల పది లక్షలకుపైగా పిల్లపై పరిశోధనలు చేశారు. టీనేజర్లు తమ సమయాన్ని ఎలా గడుపుతన్నారనేది మానసిక ఆరోగ్య కోణంలో ఓ ప్రాథమిక అంశమని ఆమె పేర్కొన్నారు. ఆమె 2011 నుంచి ఒంటరితనంతో బాధపడే టీనేజర్లు బాగా పెరగడం గుర్తించినట్టు చెప్పారు. జీవితం వృథా అనే భావనకు చాలామంది వస్తున్నట్టు తేలిందని పేర్కొన్నారు. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలని, ఐదేళ్లలో ఈ వ్యాధి లక్షణాలు 60 శాతం మేర పెరిగాయని వివరించారు. తమను తాము గాయపరుచుకునేంతగా అవి విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాలికల్లో ఈ ప్రమాదకర ధరోణి రెండు మూడింతలు పెరిగిందని పేర్కొన్నారు. కొన్నేళ్లలోనే టీనేజర్ల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని జీన్ తన అధ్యయనంలో వివరించారు. ఫోన్ వ్యసనంలా.. మన దేశంలోని కాలేజీ విద్యార్థులు రోజుకు 150 సార్లుకుపైగా తమ ఫోన్లు చెక్ చేసుకుంటున్నారట. ఫోన్ చూసుకోకపోతే ఏదో మిస్ అయిపోతామనే భావనలో ఉంటున్నారట. ఇదొక వ్యసనంలా మారిందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడేం చేయాలి? ► రోజుకు రెండు గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం డిజిటల్ మీడియాకు కేటాయించడం మంచిది. ఇది మానసిక ఆరోగ్యానికి ఆనందానికి దోహదపడుతుంది. ► అయితే డిజిటల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇది కూడా విచారానికి కారణమవుతుంది. ► మన సమయం మన చేతిలోనే ఉంటుంది. ఉండాలి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ► స్నేహితులతో టచ్‌లో ఉండేందుకు మాత్రమే సోషల్ మీడియాను వాడాలి. ఒకవేళ పిల్లలకు ఫోన్ చాలా అవసరమని భావిస్తే ఇంటర్నెట్ సౌకర్యం లేని ఫోన్ మాత్రమే ఇవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మన పిల్లలను జాగ్రత్తగా పరిశీలిస్తుండాలి. చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదు చిన్న పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వకూడదు. అది వారికి అలవాటు చేయడం వల్ల వారి పెరుగుదలతోపాటు మెదడుపై ప్రభావం చూపుతోంది. మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. పెద్దలు కూడా అవసరానికి మించి స్మార్ట్ఫోన్లు వాడకూడదు. దీనివల్ల మతిమరుపు నిద్రలేమి సమస్యలకు లోనవుతారు. మీపిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చినట్లు అనుమానం ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. -
పిల్లలు అడిగనవన్నీ ఇచ్చేస్తున్నారా? అయితే మీరు ట్రాప్‌లో పడ్డట్లే!
ఈ మధ్యకాలంలో సెల్‌ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా రెండేళ్ల లోపు చిన్నారులు కూడా ఫోన్లో బొమ్మలు చూస్తూ గంటల తరబడి గడిపేస్తున్నారు. భోజనం తినాలన్నా, నిద్ర పోవాలన్నా ఫోన్ పక్కన ఉండాల్సిందే అనేంతలా అలవాటుపడుతున్నారు. ఇక తల్లిదండ్రులు కూడా పిల్లల చేతిలో ఫోన్ పెడితే అన్నం తినిపించడం సులువు అని ఈజీగా మొబైల్ అలవాటు చేస్తున్నారు. ఇది చిన్నారుల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఇది మానసికంగా, శారీరకంగా చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. 1. మీ పిల్లల స్నేహితులందరికీ సెల్ ఫోన్ ఉందని, మీ బిడ్డకు కూడా సెల్ ఫోన్ కొనిచ్చారా? 2.మీ పిల్లలు హోంవర్క్ పుస్తకం మర్చిపోతే మీరు స్కూల్ కు వెళ్లి ఇచ్చి వస్తున్నారా? 3.మీ పిల్లల ప్రాజెక్ట్ వర్క్ కు కావాల్సిన మెటీరియల్ కోసం మీరు షాపుల చుట్టూ తిరుగుతున్నారా? 4.మీ బిడ్డను చాలా యాక్టివిటీస్ లో చేర్పించడం వల్ల అసలు ఖాళీ సమయమే ఉండటం లేదా? 5. మీరు పికప్ చేసుకోవడానికి వెళ్లేందుకు కాస్తంత లేటయితే వెంటనే మీకు మెసేజ్ వస్తుందా? వీటిలో ఏ ఒక్కటి చేస్తున్నా.. మీరు పేరెంట్ ట్రాప్‌లో చిక్కుకున్నట్లే. పిల్లలు కష్టపడకూడదని చాలామంది పేరెంట్స్ పిల్లలు అడిగినవన్నీ ఇచ్చేస్తుంటారు. అలాగే వాళ్ల ప్రాజెక్ట్ వర్క్స్ కూడా చేస్తుంటారు. ఫ్రెండ్స్ తో, టీచర్స్ తో వారికి ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులే పరిష్కరిస్తుంటారు. దీనివల్ల పిల్లలు తమకు సొంతంగా సమస్యలను పరిష్కరించుకొని, స్కిల్స్ సాధించుకునే అవకాశాన్ని కోల్పోతారు. జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పరిష్కారం కోసం ఇతరులవైపు చూసే, ఇతరులపై ఆధారపడే మనస్తత్వాన్ని అలవాటు చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితులకు కారణమయ్యే ప్రవర్తననే parenttrap(పేరెంట్ ట్రాప్)అంటారు. కంట్రోల్ ట్రాప్(Control Trap): తల్లిదండ్రులు తమ పిల్లలను అతిగా నియంత్రించడం, వాళ్లు ఏం చేస్తున్నారో, సోషల్ మీడియా వాడకం వరకు ప్రతీది నిర్దేశించినప్పుడు ఇది జరుగుతంది. పిల్లల భద్రత, శ్రేయస్సు కోసం కొంత నియంత్రణ అవసరం. అయితే అతిగా నియంత్రించడం వల్ల పిల్లల్లో ఆందోళన, స్వీయగౌరవ సమస్యలు ఏర్పడతాయి. క్రిటిసిజమ్ ట్రాప్(Criticism Trap): కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను నిత్యం విమర్శిస్తుంటారు, నిరంతరం వారిలో తప్పులను వెతుకుతుంటారు. ఇది వారి ఆత్మగౌరవం, విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. కంపారిజన్ ట్రాప్(Comparison Trap): చాలామంది పేరెంట్స్ పిల్లలను తోబుట్టువులతోనూ, తోటివారితోనూ పోల్చుతుంటారు. నిరంతరం ఇతరులతో పోల్చడం వారి ఆత్మగౌరవాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. గివింగ్ ట్రాప్(Giving Trap): ఇతర పిల్లలకు ఉన్నవి తమకు లేవని పిల్లలు బాధపడకూడదని తల్లిదండ్రులు భావిస్తారు. అందువల్ల వారు అడగకుండానే అన్నీ తెచ్చి పెడతారు. దీనివల్ల పిల్లలకు అవసరంలేని వస్తువులను ఇచ్చే ఉచ్చులో పడతారు. గిల్ట్ ట్రాప్(Guilt Trap): పిల్లల అసంతృప్తికి తాము కారణం కాకూడదని పేరెంట్స్ భావిస్తారు. తమ బిడ్డ కలత చెందడానికి కారణం తామేనని తల్లిదండ్రులు భావించి అపరాధ భావనకు లోనవుతారు. దాన్ని అధిగమించేందుకు పిల్లలు కోరినవీ, కోరనివీ కొనిచ్చి తమ భారం దింపుకుంటారు. హర్రీడ్ ట్రాప్(Hurried Trap): తల్లిదండ్రులు తమ పిల్లల కోసం తమ శక్తిమేరకు ప్రతిదీ చేయాలని కోరుకుంటారు. దీనివల్ల పిల్లల అవసరాలు వెంటనే తీరతాయని భావిస్తుంటారు. తక్షణ తృప్తి (#instantgratification)కి అలవాటు పడతారు. అలా తక్షణ తృప్తి దొరకనప్పుడు తీవ్రంగా నిరాశ చెందుతారు, విపరీత నిర్ణయాలు తీసుకుంటారు. పర్మీసివ్ ట్రాప్(Permissive Trap): కొందరు తల్లిదండ్రులు పిల్లలు ఏం చేసినా ఏమీ అనరు, ఏం చేయాలనుకున్నా అనుమతిస్తారు. పిల్లలతో సంఘర్షణ నివారించడానికి ఇది సులువైన మార్గంగా భావిస్తారు. కానీ దీనివల్ల పిల్లల్లో స్వీయ క్రమశిక్షణ లోపిస్తుంది, విచ్చలవిడితనానికి దారితీయవచ్చు. ప్రెజర్ ట్రాప్(Pressure Trap): తల్లిదండ్రులు తమ పిల్లల విజయాలను పంచుకోవడం గర్వంగా భావిస్తారు. పోటీలో పిల్లలు ముందుంటే సంతోషిస్తారు, ఏమాత్రం వెనుకంజ వేసినా ఆందోళన పడుతుంటారు. ముందుకు దూసుకుపోవాలని పిల్లలను ఒత్తిడి చేస్తారు. రెస్క్యూ ట్రాప్(Rescue Trap): తల్లిదండ్రులు తమ పిల్లల కష్టాలను చూసి బాధపడతారు. వాటినుంచి బయట పడేయడం ద్వారా వారిని ‘రక్షించాలని’ భావిస్తారు, బయటపడేస్తారు. పర్యవసానంగా కొన్ని పనులు జరగాలంటే వేచి ఉండటం ( delayed gratification) అవసరమనే విషయం పిల్లలకు ఎప్పటికీ అర్థం కాదు. అలాగే తమ సమస్యలను స్వయంగా పరిష్కరించుకునే అవకాశం ఉండదు. పేరెంట్ ట్రాప్స్ నుండి బయటపడాలంటే... పేరెంట్ ట్రాప్స్ నుండి బయటపడాలంటే ఎప్పటికప్పుడు తమ ప్రవర్తనను గమనించుకుంటూ, అంచనా వేసుకుంటూ, అవసరమైనమేరకు మార్చుకునేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి. ► ప్రతి బిడ్డ ప్రత్యేకమని, ఎవరి ప్రత్యేక సామర్థ్యాలు వారికి ఉంటాయని గుర్తించాలి. ► బిడ్డను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పోల్చకూడదు. ► సరిహద్దులను నిర్ణయించి స్థిరంగా అమలు చేయాలి. వాటి పరిధిలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛనివ్వాలి. ► కష్టమైన అంశాలపై మాట్లాడటానికి, అవసరమైనప్పుడు కష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ► విమర్శించడం కంటే నిర్మాణాత్మక అభిప్రాయాన్ని అందించడంపై దృష్టి పెట్టాలి. ► పిల్లల బలాలను, విజయాలను, సానుకూల ప్రవర్తనలను ప్రశంసించాలి. ► పిల్లలు తమ పనులు తాము చేసుకునేలా ప్రోత్సహించండి. ► తమకు కావాల్సినవి తాము కష్టపడి సాధించుకోవడం నేర్పించండి. ► తమ సమస్యలు తామే పరిష్కరించుకునేందుకు ప్రోత్సహించండి. -డా. మీ నవీన్ నడిమింటి(9703706660), ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
మీ బిడ్డ స్కూల్లో నోరు విప్పడంలేదా? సైలెంట్ అనుకోవద్దు.. చాలా ప్రమాదం
సునీత, సుందర్‌లకు నందిని ఒక్కతే కూతురు. హైదరాబాద్‌లోని ప్రముఖ స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది. ముచ్చటైన పిల్ల. తన పనులన్నీ తానే చేసుకుంటుంది. బొమ్మలు అద్భుతంగా వేస్తుంది. కానీ మాట్లాడటం తక్కువ. మేనత్త పోలికలు వచ్చాయని సరిపెట్టుకున్నారు. ఒకరోజు స్కూల్ నుంచి ఫోన్‌కాల్ వచ్చేసరికి, పాపకు ఏమైనా అయ్యుంటుందేమోనని సునీత భయపడింది. హడావుడిగా స్కూల్‌కు వెళ్లి చూసేసరికి, క్లాస్ టీచర్ సుమిత్ర దగ్గర నిల్చుని ఉంది నందిని. ఎందుకింత హడావుడిగా పిలిచారని అడిగింది. ‘ఏం చెప్పమంటారు మేడం? నందిని రెండు నెలలుగా క్లాసులో నోరు మెదపడం లేదు. ఏం అడిగినా మౌనంగానే ఉంటోంది. క్లాస్ టెస్ట్‌లలో బాగానే రాస్తోంది. కానీ క్లాసులో మాత్రం నోరు విప్పడం లేదు. ఎంత బుజ్జగించి అడిగినా నో యూజ్.’ ‘తను ఇంట్లో కూడా తక్కువే మాట్లుతుంది మేడం. వాళ్ల మేనత్త పోలిక.’‘అలా సరిపెట్టుకుంటే సరిపోదు మేడం. పాప ఏదో సమస్యతో బాధపడుతోంది. వెంటనే ఎవరైనా సైకాలజిస్ట్‌కు చూపించండి.’ ‘సైకాలజిస్ట్ దగ్గరకా? ఎందుకు మేడం? మా పాపకేమైనా పిచ్చి అనుకుంటున్నారా?’ అని కోపంగా అడిగింది సునీత. ‘సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్లేవాళ్లందరూ పిచ్చివాళ్లే అనేది మీ అపోహ మేడం. మానసిక సమస్యలు పిల్లల్లో కూడా రావచ్చు. దయచేసి అర్థంచేసుకుని సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లండి’ అని చెప్పింది టీచర్. తప్పదన్నట్లుగా నందినిని మా క్లినిక్‌కు తీసుకువచ్చారు. సునీత చెప్పింది విన్నాక నందిని ‘సెలెక్టివ్ మ్యూటిజం’తో బాధపడుతోందని అర్థమైంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాట్లాడకపోవడమే దీని ప్రధాన లక్షణం. ఒకశాతం మంది పిల్లల్లో ఈ సమస్య ఉంటుందని అంచనా. కొన్నిచోట్ల నోరు విప్పరు.. మీ బిడ్డ సెలెక్టివ్ మ్యూటిజంతో పోరాడుతున్నట్లనిపిస్తే ఈ కింది లక్షణాల కోసం చూడండి. అయితే రెండు మూడు లక్షణాలు కనపడగానే సెలక్టివ్ మ్యూటిజం అని నిర్ధారణకు రాకండి. సైకోడయాగ్నసిస్ ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలి. ఆత్రుత, భయం లేదా ఇబ్బంది కారణంగా మాట్లాడాలనే కోరికను అణచుకోవడం ∙భయపడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కదలిక లేకపోవడం, మాట్లాడకపోవడం, కళ్లల్లోకి చూడలేకపోవడం ∙ స్కూల్ లేదా ఇతర నిర్దిష్ట సామాజిక పరిస్థితులలో మాట్లాడలేకపోవడం ∙అవసరాలను వ్యక్తీకరించడానికి మాటలు కాకుండా సంజ్ఞలు ఉపయోగించడం ∙ 2–4 సంవత్సరాల వయసులో సిగ్గు, ఇతరులంటే భయం, మాట్లాడటానికి అయిష్టత ∙ ఇంట్లో లేదా తెలిసిన వ్యక్తులతో సులభంగా మాట్లాడటం, స్కూల్లో, టీచర్లతో నోరువిప్పకపోవడం.మాట్లాడమని బలవంతం చేయొద్దు..సెలెక్టివ్ మ్యూటిజంను ఎంత ముందుగా గుర్తించి చికిత్స అందిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. లేదంటే బిడ్డ మౌనానికి అలవాటు పడే ప్రమాదం ఉంది. మీ బిడ్డ నెల అంతకంటే ఎక్కువ కాలం మౌనంగా ఉంటే, వెంటనే చికిత్స ప్రారంభించడం చాలా ముఖ్యం. చికిత్స కోసం సైకాలజిస్టును సంప్రదించడంతో పాటు మీరు చేయగలిగేవి కూడా ఉన్నాయి.∙మాట్లాడని పిల్లల పట్ల టీచర్లు విసుగ్గా లేదా కోపంగా ఉంటారు. పిల్లల ప్రవర్తన ఉద్దేశపూర్వకం కాదని టీచర్లకు తెలియజేయండి. సానుకూల ప్రవర్తనలకు ప్రశంసలు, బహుమతులు అందించాలి ∙మాట్లాడినప్పుడు మెచ్చుకోండి. అంతేతప్ప మాట్లాడాల్సిందేనని పిల్లలను బలవంతం చేయవద్దు. బదులుగా చదవడం, డ్రాయింగ్ లేదా పజిల్స్ చేయడం వంటివి ఎంచుకోండి ∙మీ బిడ్డ మాట్లాడటానికి భయపడితే, ఒత్తిడి లేదా పనిష్మెంట్ ద్వారా వారు ఈ భయాన్ని అధిగమించలేరు. కాబట్టి మౌనానికి శిక్షించవద్దు ∙మాట్లాడమని ఒత్తిడి చేయవద్దు. దానివల్ల ఆందోళన మరింత పెరుగుతుంది ∙సెలెక్టివ్ మ్యూటిజం కోసం దీర్ఘకాలం కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) అవసరమవుతుంది ∙ఇందులో డీసెన్సిటైజేషన్, రీఇన్ఫోర్స్మెంట్, షేపింగ్ పద్ధతుల ద్వారా పిల్లల్లోని ఆందోళన తగ్గి ధైర్యంగా మాట్లాడేందుకు సహాయపడతారు ∙ఎక్స్పోజర్ థెరపీ ద్వారా సురక్షితమైన స్థలాన్ని సృష్టించి పిల్లల్లోని భయాన్ని తగ్గించవచ్చు. సమస్య తీవ్రంగా లేదా దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు, థెరపీ వల్ల మెరుగుపడనప్పుడు సైకియాట్రిస్ట్‌ను కలసి మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ఆందోళనే ప్రధాన కారణం.. అన్ని మానసిక రుగ్మతల్లాగే సెలెక్టివ్ మ్యూటిజానికి కూడా ఒకే కారణం ఉండటం అసంభవం. చైల్డ్ అబ్యూజ్, ట్రామా కారణమని గతంలో నమ్మేవారు. అయితే ఇది సోషల్ యాంగ్జయిటీకి సంబంధించినదని, జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయని ప్రస్తుత పరిశోధనలు సూచిస్తున్నాయి. బాగా సిగ్గుపడే లేదా భయపడే లేదా స్వీయ నియంత్రణ సమస్యలున్న పిల్లల్లో కూడా ఇది రావచ్చు. సోషల్ యాంగ్జయిటీ ఉన్న పేరెంట్స్ ఉంటే వారి పిల్లల్లో వచ్చే అవకాశం ఉంది. డిప్రెషన్, లాంగ్వేజ్ ప్రాబ్లమ్, ఓసీడీ, పానిక్ డిజార్డర్, ఆటిజం లాంటి మానసిక సమస్యలున్న పిల్లల్లో కూడా సెలెక్టివ్ మ్యూటిజం కనిపించే అవకాశం ఉంది. -సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com -
చిన్నారులు పెంపుడు జంతువులతో ఆడుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త
చిన్నారులు తీసుకున్న ఆహారం అరగకపోతే వారి తల్లిదండ్రులు హైరానా పడతారు. ఆఘమేగాల మీద ఆసుపత్రులకు పరుగులు తీస్తుంటారు. పిల్లల్లో వచ్చే చాలా అనారోగ్య సమస్యలకు మూలం నులి పురుగులే అని వైద్యులు చెబుతున్నారు. పిల్లల కడుపులో నులి పురుగుల ఉన్నట్టు గుర్తిస్తే సులభ పద్ధతిలో వైద్యం చేయించవచ్చు. తగిన చికిత్స అందించకపోతే ప్రమాదకరంగా పరిగణిస్తాయని హెచ్చరిస్తున్నారు. నులి పురుగులు హెల్మెంత్ అనే పరాన్నజీవి జాతికి చెందినవి. ఇవి మూడు రకాలు. 1.రౌండ్ వారమ్స్ 2.పిన్ వారమ్స్ 3.ప్లూక్స్. వాటిలో రౌండ్ వారమ్స్ జాతికి చెందిన పురుగులు సాధారణంగా కనిపిస్తాయి. పిన్ వారమ్స్, ప్లూక్స్ వారమ్స్ జాతి పురుగులు ముఖ్యంగా పిల్లల పేగుల్లో జీవిస్తాయి. రౌండ్ వారమ్స్ జాతి పురుగులు 2 నుంచి 5 అంగుళాల పొడవుంటాయి. ఇవి పెంపుడు జంతువులు, కుక్కలు, పిల్లుల్లోనే గాకుండా మట్టిలో కూడా నివశిస్తాయి. పెంపుడు జంతువులతో చిన్నారులు సన్నిహితంగా ఉండడం, కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా చిన్నారులకు నులి పురుగుల సంక్రమిస్తాయి. వ్యాప్తి ఇలా.. హుక్ వారమ్స్, పిన్ వారమ్స్ అనే జీవులు లార్వా రూపంలో మట్టిలో ఉంటాయి. చెప్పులు లేకుండా పిల్లలు మట్టిలో తిరిగేటపుడు ఈ జీవులు వారి కాళ్ల చర్మం ద్వారా రక్తంలో ప్రవేశించి వారి ఊపిరితిత్తులలోకి చేరతాయి. అక్కడ నుంచి శ్వాస నాళంలోకి చేరి పురుగులుగా వృద్ధి చెందుతాయి. అక్కడే గుడ్లు పెట్టి వ్యాప్తి చెందుతాయి. ఆ గుడ్లు పిల్లల మలము ద్వారా బయటకు వచ్చి తిరిగి మట్టిలో లార్వాగా వ్యాప్తి చెందుతాయి. నులి పురుగుల లక్షణాలు నులి పురుగుల బారిన పడ్డ చిన్నారుల్లో ప్రాథమిక దశలో కొద్దిగా జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. లార్వా ఊపిరితిత్తులలోకి వెళ్ళడంతో కడుపులో నొప్పి, వాంతులు, ఆహారం జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. హుక్ వార్మ్ జాతి పురుగులకు చిన్న దంతాలు వంటివి ఉంటాయి. వాటి సాయంతో అవి ఆమర నాళాల గోడలకు అతుక్కుని ఉంటూ క్రమంగా రక్తాన్ని పీల్చుకుంటాయి. చిన్నారుల జీర్ణ కోశంలో రక్త శ్రావం ఏర్పడుతుంది. దీంతో చిన్నారుల్లో రక్త హీనత, పోషకాహార లోపాల సమస్యలు తలెత్తుతాయి. రక్తహీనత కలిగిన పిల్లల్లో ఆయాసం ఉంటుంది. అలాగే శరీరం పాలిపోయినట్టుగా, నీరసంగా ఉంటారు. మట్టి తినే అలవాటు కనిపిస్తుంది. భారత్‌లో 22 కోట్ల చిన్నారులు .. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2006లో జరిపిన సర్వే ప్రకారం భారత్‌లో 22 కోట్ల చిన్నారులు నులి పురుగుల బారిన పడినట్టు అంచనా. దేశంలో ప్రతి 10 మందిలో ఏడుగురు పిల్లలు నులి పురుగుల బారిన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల చిన్నారులు ఎక్కువ మంది నులి పురుగులు బారిన పడుతున్నారు. మాత్రలు ఉచితంగా వేస్తారు బయట ఆహారం తినడం, మట్టిలో ఆడడం, కలుషిత నీరు తాగడం వల్ల పిల్లలకు నులిపురుగుల సమస్యలు వస్తాయి. పిల్లలకు ఈ వ్యాధి రాకుండా తల్లిదండ్రులు ఏటా రెండుసార్లు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలి. గర్భిణులు కూడా మాత్రలు తీసుకోవచ్చు. ప్రధానంగా పిల్లలకు చేతులు శుభ్రంగా కడుక్కో వడం నేర్పించాలి. పిల్లలకు తల్లి పాలు పట్టించడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరు గుతోంది. మంచి పోషక విలువలున్న ఆహారాన్ని పిల్లలకు అందించాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది సోమవారం పిల్లలకు ఉచితంగా ఈ మాత్రలు వేస్తారు. –డాక్టర్ హేనా, అర్బన్ హెల్త్ సెంటర్, నిడదవోలు -
ఫస్ట్ ఎయిడ్‌తో వేలకొద్దీ ప్రాణాలను కాపాడవచ్చు
ఫస్ట్ ఎయిడ్ గురించి కొద్దిపాటి అవగాహన ఉన్నా వేలకొద్దీ ప్రాణాలను కాపాడవచ్చు అంటున్నారు డాక్టర్ శివరంజని. హైదరాబాద్‌కు చెందిన ఈ పిడియాట్రీషియన్ పసిపిల్లల్లో, పెద్దల్లో వచ్చే హటాత్ అపస్మారకం, ఉక్కిరిబిక్కిరి, ఫిట్స్ సమయాల్లో ఎలా వ్యవహరిస్తే ప్రాణాలు నిలుస్తాయో గత దశాబ్దకాలంగా ఉచిత వర్క్‌షాపుల ద్వారా చైతన్యపరుస్తున్నారు. తన జీవితంలోని ఒక సంఘటన వల్లే లైఫ్ సేవింగ్ స్కిల్స్ అవసరాన్ని తెలుసుకున్నానని అంటున్నారామె. రాధిక (పేరు మార్చాం) హాల్లో టీవీ చూస్తోంటే బాత్రూమ్లోనుంచి ధబ్మని శబ్దం వచ్చింది. పరిగెత్తుకెళ్లి చూస్తే భర్త అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతనికి హార్ట్ఎటాక్ వచ్చినట్టు ఆమెకు అర్థమైంది. అదృష్టవశాత్తు నెల క్రితం ఆమె డాక్టర్ శివరంజని నిర్వహించిన ఒక వర్క్‌షాప్‌లో సి.పి.ఆర్. ఎలా చేయాలో తెలుసుకుంది. వెంటనే ఛాతీ మీద నియమానుసారం నొక్కుతూ భర్తకు నోటితో ఊపిరి అందించింది. భర్తలో చలనం వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలిస్తే అతనికి వచ్చిన హార్ట్ఎటాక్ ప్రాణాంతకం కాకుండా కాపాడటంలో ఆమె చేసిన సి.పి.ఆర్ చాలా ముఖ్యపాత్ర పోషించిందని డాక్టర్లు తెలిపారు. ‘ఫస్ట్ ఎయిడ్ తెలిస్తే ఇలాగే ఎన్నోప్రాణాలు నిలుస్తాయి. ఆమె సాధారణ గృహిణి. సి.పి.ఆర్. ఎలా చేయాలో ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఆమెకే కాదు.. ఆమెలాంటి గృహిణులకు స్త్రీలకు అందరికీ ఎవరో ఒకరు తెలపాలి. నా వంతుగా నేను వర్క్‌షాప్స్ ద్వారా తెలుపుతున్నాను’ అంటారు శివరంజని. పిల్లల డాక్టర్ డాక్టర్ శివరంజని పిల్లల డాక్టర్. ‘మా నాన్నగారు, తాతగారు కూడా డాక్టర్లే. నేను డాక్టర్ కావాలనుకున్నప్పుడు పిల్లలంటే ఇష్టం కనుక వారికి వైద్యం చేయడంలో ఆనందం ఉందనిపించింది. జిప్మర్ (పాండిచ్చేరి)లో పిల్లల వైద్యంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశాను’ అన్నారు శివరంజని. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో పిల్లల డాక్టర్‌గా పని చేస్తున్నారు. అయితే కేవలం తన వృత్తిని పనిగా మాత్రమే చూడదలుచుకోలేదు. తనకు తెలిసిన జ్ఞానాన్ని సామాన్యులకు కొద్దిగానైనా అందుబాటులో తేవాలని అనుకున్నారు. ‘మన దగ్గర ప్రతి ఆరు మరణాల్లో ఒకటి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో తెలియపోవడం వల్ల జరుగుతోంది. గుండెపోటు, మూర్ఛ, అపస్మారకం, ఊపిరాడకపోవడం ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో ఎలా చేయాలో అందరికీ శాస్త్రీయమైన శిక్షణ ఉంటే చాలా ప్రాణాలు కాపావచ్చు. అందుకే గత పదేళ్లుగా నేను ఉచితంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ చైతన్యం తెస్తున్నారు’ అన్నారామె. మలుపు తిప్పిన ఘటన ‘నేను పాండిచ్చేరిలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఒకరోజు ఉసిరి కాయలు తింటుంటే హటాత్తుగా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. నా పక్కనే సహ విద్యార్థిని ఉంది. ఆమెకు ఇలాంటి స్థితిలో చేయాల్సిన హైమ్లక్ మనూవా (ఉక్కిరిబిక్కిరి సమయంలో పొత్తికడుపు మీద నొక్కుతూ చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్) తెలుసు. వెంటనే చేసింది. ఆమె లేకున్నా, ఆ ఫస్ట్ ఎయిడ్ చేయకున్నా ఇవాళ మిగిలేదాన్ని కాదు. అప్పుడే నాకు ఫస్ట్ ఎయిడ్ విలువ ఏంటో తెలిసింది. కా6ఋ దురదృష్టం మన దేశంలో ఇందుకై సాధారణ ప్రజలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వరు. అవగాహన కల్పించరు. కొద్దిమందికే ఈ అవగాహన ఉంటుంది. నా వంతుగా నేను వర్క్‌షాప్స్ ద్వారా అవగాహన కలిగిస్తున్నాను’ అన్నారు శివరంజని. పసిపిల్లలకు ‘చంటిపిల్లలు ఒక్కోసారి ఊపిరిపీల్చని స్థితికి వెళతారు. సి.పి.ఆర్ చేయడం తెలిసుంటే పిల్లల్ని కాపాడుకోగలుగుతారు తల్లులు. అలాగే వారు గొంతుకు అడ్డం పడేలా ఏదైనా మింగినప్పుడు కూడా ఏం చేయాలో తల్లులకు తెలియాలి. ఇవన్నీ నా వర్క్‌షాప్స్‌లో చూపిస్తాను. ఇందుకు బొమ్మలను ఉపయోగిస్తాను’ అన్నారు శివరంజని. ఇందుకోసం ఆమె నేరుగా ఆన్లైన్లో సెషన్స్ నిర్వహిస్తారు. ‘కాని చాలామంది తల్లులు సెషన్స్‌కు రారు. ఆ ఏముందిలే అనుకుంటారు. వారిని ఒప్పించి తేవడం కష్టం. అయినా నేను పట్టువిడవక ప్రయత్నిస్తాను. ఫోన్లు చేసి పిలుస్తాను. వాట్సప్ గ్రూప్ పెట్టి వెంటపడతాను’ అంటారు శివరంజని. డాక్టర్ శివరంజని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగుళూరులలో గత పదేళ్లలో 12 వేల మంది తల్లులకు, సాధారణ వ్యక్తులకు ఫస్ట్ ఎయిడ్ స్కిల్స్ నేర్పించారు. అంతేకాదు... సీజనల్‌గా అవసరమైన హెల్త్ అవేర్నెస్ కోసం వీడియోలు చేస్తుంటారు. ఇలాంటి కృషి విలువైనది. ఇతర డాక్టర్లు అనుసరించాల్సినది. -
పిల్లలు సెల్‌ఫోన్, టీవీకి అడిక్ట్ అయ్యారా?.. కడుపులో నులిపురుగులు ఉంటే..
మా అబ్బాయి / అమ్మాయి సెల్‌ఫోన్ / టీవీకి అడిక్ట్ అయిపోయారు. పుస్తకం ముట్టుకోవడానికి ఇష్టపడం లేదు !” అని కొంత మంది పేరెంట్స్ అంటున్నారు. నిజానికి మనం నేర్పే వాటినే పిల్లలు నేర్చుకొంటారు. మన ప్రమేయం లేకుండా పిల్లలు, ముఖ్యంగా అయిదేళ్ల లోపు పిల్లలు ఏదీ నేర్చుకోరు. పిల్లలు మనల్ని అనుకరిస్తారు. ఇలా చెయ్యండి 1 . ఎటువంటి పరిస్థితుల్లో పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇవ్వొద్దు. “ అది పెద్దల కోసం.. అవసరానికి మాత్రం వినియోగించడానికి “ అని చెప్పండి. 2 . మీరు టీవీ ముందు, సెల్‌ఫోన్‌తో గడిపే కాలాన్ని తగ్గించండి. 3 . ఆసక్తి కలిగిన పుస్తకాలు చదవండి. పిల్లలు దాన్ని అనుకరిస్తారు. 4 . పిల్లలతో సమయం గడపండి. వారికి రకరకాల ఆటలు నేర్పండి. వారితో ఆడండి. 5 . పిల్లలకు కథలు చెప్పండి. దాని గురించి వారితో చర్చించండి. దీని వల్ల క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది. అన్నిటికీ మించి మీ పిల్లలు మీరు చెప్పింది వినడం చేస్తారు. పెద్దయ్యాక కూడా ఇది కొనసాగుతుంది . మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు . 6 . పిల్లలు ఆకలేస్తే తింటారు. కడుపులో నులిపురుగులు లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఆకలి తగ్గుతుంది. దానికి ట్రీట్మెంట్ అవసరం. నాలుగు గంటలకు స్వీట్స్ ఐస్ క్రీం లాంటి హై కెలొరీ ఫుడ్ ఇచ్చి, మరో మూడు గంటల్లో అన్నం తినమంటే తినరు. పిల్లల్ని అన్నం తినిపించే పేరుతొ ఏదైనా చేసి వారికి తినడం పైన ఇంటరెస్ట్ పోయేలా చేయకండి. పిల్లల్ని జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచండి. -వాసిరెడ్డి అమర్నాథ్, పాఠశాల విద్య పరిశోధకులు చదవండి: షుగర్ ఎందుకొస్తుంది?.. రాకుండా ఎలా కాపాడుకోవాలి? విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదా? ఎంతవరకు! డాక్టర్లు చెప్తున్నదేంటి? -
ఎదిగే పిల్లలకు ఈ పోషకాహారం ఇస్తున్నారా? పాలు, గుడ్డు, పాలకూర..
ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం అవసరం. అలాగని ఏది పడితే అది తినిపించడమూ మంచిది కాదు. ముఖ్యంగా వాళ్లు ఇష్టంగా తింటున్నారు కదా అని జంక్ ఫుడ్ తినిపిస్తే ఆరోగ్యంగా ఎదగకపోగా ఊబకాయం వస్తుంది. ముందు ముందు అది మరెన్నో సమస్యలకు దారి తీయవచ్చు. అందువల్ల ఏ ఆహారంలో ఏముంటుందో తెలుసుకుని, వాటినే వారు తినేలా చూడగలిగితే పిల్లలు ఆరోగ్యంగా పెరగడంతోపాటు మానసిక వికాసం కూడా కలుగుతుంది. ►పాలు: బిడ్డ పుట్టగానే తల్లికి ప్రకృతి సిద్ధంగా ఊరేవి పాలు. తల్లి పాలు శ్రేష్ఠమైనవి, ఆరోగ్యకరమైనవి, వ్యాధి నిరోధక శక్తిని కలిగి శీఘ్రంగా జీర్ణం అయ్యే ఆహారం.తల్లి పాల తర్వాత ప్రోటీనులూ, విటమిన్లు, ఖనిజాలు గల పాలు ఆవుపాలు. పిల్లలకు ఆవుపాలు తాగించడం వల్ల వారిలో ధారణ శక్తి కలుగుతుంది. ఆవుపాలు శ్వాస సంబంధిత వ్యాధులను తొలగించడంతోపాటు. శరీరానికి కాంతిని, ఇంద్రియాలకు నిర్మలత్వాన్ని ఇవ్వడంలో తోడ్పడతాయి. అందువల్ల పిల్లలకు ఆవుపాలు తాగించడం మంచిది. ►విటమిన్ ఎ: చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఎముక బలానికీ, కంటి చూపు మెరుగుపడేందుకూ తోడ్పడుతుంది. ఇందుకోసం జున్ను, క్యారెట్, పాలూ, గుడ్లూ ఇవ్వాలి. ►బి కాంప్లెక్స్ విటమిన్లు: శరీర పనితీరు బాగుండాలంటే బీ కాంప్లెక్స్ అత్యవసరం. మాంసం, చేపలూ, సోయా బీన్స్ వంటివి ఇవ్వడం వల్ల బి కాంప్లెక్స్ అందుతుంది. ►కండర పుష్టికి: శారీరక దృఢత్వానికీ, అందమైన చర్మానికీ విటమిన్ సి చాలా అవసరం. టొమాటో, తాజా కూరలూ, పుల్లని పండ్లూ అందించడం వల్ల విటమిన్ సి లభిస్తుంది. ►ఎముక బలానికి: ఎదిగే పిల్లల ఎముకలు బలంగా ఉండాలంటే ఆహారంలో క్యాల్షియం ఉండాలి. ఇది సమృద్ధిగా అందాలంటే విటమిన్ డి తప్పనిసరి. ఇందుకోసం పాలూ, పాల ఉత్పత్తులతోపాటూ ఉదయం వేళ సూర్యరశ్మి పిల్లలకు అందేట్టు జాగ్రత్త తీసుకోవాలి. ►ఐరన్ లోపం లేకుండా: ఐరన్ రక్తం వృద్ధి చెందేట్టు చేస్తుంది. ఇందుకోసం పాలకూర, ఎండుద్రాక్ష, బీన్స్ వంటివి ఇవ్వాలి. ►గుడ్డు: గుడ్డు ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రోటీన్లు అందజేస్తుంది. రోజుకో గుడ్డు ఇవ్వడం వల్ల మాంసకృత్తులు సమృద్ధిగా అందు తాయి. కండపుష్టికి, కండర నిర్మాణానికి దోహదం చేస్తుంది. గుడ్లు చవకైన పోషకాహారమే కాదు. ఎప్పుడంటే అప్పుడు తినటానికి వీలుగా ఉంటాయి కూడా. గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని కొందరు గుడ్లను పూర్తిగా మానేస్తుంటారు. కానీ వీటిని మితంగా తింటే ఎలాంటి నష్టమూ ఉండదు. గుడ్లలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు దండిగా ఉంటాయి. అందువల్ల వీటిని ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గుడ్లలో విటమిన్ డి దండిగా ఉంటుంది. అందువల్ల గుడ్లను పిల్లల ఆహారంలో చేర్చటం మంచిది. ప్రోటీన్లతో నిండిన గుడ్లలో మనకు అవసరమైన అన్నిరకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. శారీరకశ్రమ అధికంగా చేసినప్పుడు తిరిగి శక్తిని పుంజుకోవటానికి ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి. ►మన శరీరం అవసరమైనంత మేరకు కోలిన్‌ను తయారు చేసుకోలేదు. ఇది లోపిస్తే కాలేయ వ్యాధి, ధమనులు గట్టిపడటం, నాడీ సమస్యల వంటి వాటికి దారితీస్తుంది. కాబట్టి కోలీన్ అధికంగా ఉండే గుడ్లను తీసుకోవటం మేలు. ►ఉదయాన్నే అల్పాహారంగా పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఉప్మాలు, బ్రెడ్ల వంటి అల్పాహారాలకు బదులు గుడ్లను తింటే రక్తంలో మంచి కొవ్వు అయిన హెచ్‌డీఎల్ స్థాయులు మెరుగుపడతాయి. ట్రై గ్లిజరైడ్ల మోతాదులు తగ్గటానికీ దోహదం చేస్తాయి. ఏ పాలు..? ఎన్ని పాళ్లు ..? పిల్లల ఆరోగ్యానికీ, ఎదుగుదలకూ పాలు చాలా అవసరం. అయితే, పిల్లలకు ఏ పాలు ఇవ్వడం మంచిదన్న విషయాన్ని పరిశీలించాలి. ఆవు, గేదె, మేకపాలు, స్కిమ్డ్ మిల్క్ లభిస్తాయి. ఆవుపాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమయినవి. కొంతమంది, పాలు పిండగానే అలాగే తాగేస్తారు. ఆ పాలను గుమ్మపాలు అంటారు. పొదుగు నుంచీ పిండగానే అలాగే పచ్చిపాలను తాగడం మంచిది కాదు. ఆరోగ్యం మాట అటుంచి ఎన్నెన్నో అనారోగ్యాలు ఏర్పడే ప్రమాద ముంటుంది. ఆ పాలల్లో ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు ఉండే అవకాశం ఎక్కువ. ఆ పాలు తాగిన పిల్లలకు సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ను, వ్యాధిని కలిగిస్తాయి. ఏ పాలనయినా బాగా కాగి (వేడి చేసి) కాచిన తర్వాతనే తాగించడం ఆరోగ్యకరం. పాశ్చరైజ్డ్ మిల్క్‌ను కనీసం పదినిముషాలయినా కాచినట్లయితే అందులోని బాక్టీరియా నశిస్తుంది. పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకు తాగించాలి. చల్లారిన, నిల్వ ఉన్న పాలను తాగించకూడదు. చిక్కగా ఉన్న పాలల్లో నీళ్ళు కలిపి తాగించాలంటే పాలు కాగుతున్నప్పుడే కొంచెం నీటిని కలపాలి. వేడిపాలల్లో చన్నీళ్ళు కలిపితే, ఆ నీటి ద్వారా బాక్టీరియా పాలల్లోకి ప్రవేశించి పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పిల్లలకు పాలు పడకపోతే వాంతులు, విరేచనాలు, అజీర్తి వ్యాధులు కలుగుతాయి. పిల్లల వైద్యుని సంప్రదించి, పిల్లలకు ఏ పాలు తాగించాలన్నదీ తెలుసుకోవడం మంచిది. చదవండి: Dairy Rich Diet: గుండె ఆరోగ్యానికి అందుబాటులోని 5 పాల ఉత్పత్తులు ఇవే... -
ఇంట్లో సిగరెట్ కాలిస్తే కష్టమే!
వాషింగ్టన్ : తల్లిదండ్రులు ఇంట్లో పొగతాగడం వల్ల పిల్లల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. పాసివ్ స్మోకింగ్ వల్ల చిన్నారుల చేతులుపై, లాలాజలంలో కేన్సర్ కారక నికోటిన్ అవశేషాలు చేరుతున్నాయని వారు పేర్కొన్నారు. సిన్సినాటీ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెడికల్ కేర్ సెంటర్లో 700 మంది చిన్నారుల సమాచారాన్ని శాస్త్రవేత్తలు సేకరించారు. వీరిలో ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతున్న 25 మంది చిన్నారుల డేటాను విశ్లేషించారు. ఈ చిన్నారులందరి సగటు వయస్సు అయిదు సంవత్సరాలు. వీరిని పరిశీలించిన శాస్త్రవేత్తలు వీరి శరీరంపైనా, లాలాజలంలో కేన్సర్ కారక నికోటిన్ ఉందని కనుగొన్నారు. ఈ చిన్నారుల తల్లిదండ్రులందరూ పొగతాగేవారేనని వారు తెలిపారు.