సునీత, సుందర్‌లకు నందిని ఒక్కతే కూతురు. హైదరాబాద్‌లోని ప్రముఖ స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది. ముచ్చటైన పిల్ల. తన పనులన్నీ తానే చేసుకుంటుంది. బొమ్మలు అద్భుతంగా వేస్తుంది. కానీ మాట్లాడటం తక్కువ. మేనత్త పోలికలు వచ్చాయని సరిపెట్టుకున్నారు. ఒకరోజు స్కూల్ నుంచి ఫోన్‌కాల్ వచ్చేసరికి, పాపకు ఏమైనా అయ్యుంటుందేమోనని సునీత భయపడింది. హడావుడిగా స్కూల్‌కు వెళ్లి చూసేసరికి, క్లాస్ టీచర్ సుమిత్ర దగ్గర నిల్చుని ఉంది నందిని. ఎందుకింత హడావుడిగా పిలిచారని అడిగింది. ‘ఏం చెప్పమంటారు మేడం? నందిని రెండు నెలలుగా క్లాసులో నోరు మెదపడం లేదు. ఏం అడిగినా మౌనంగానే ఉంటోంది. క్లాస్ టెస్ట్‌లలో బాగానే రాస్తోంది. కానీ క్లాసులో మాత్రం నోరు విప్పడం లేదు. ఎంత బుజ్జగించి అడిగినా నో యూజ్.’
‘తను ఇంట్లో కూడా తక్కువే మాట్లుతుంది మేడం. వాళ్ల మేనత్త పోలిక.’‘అలా సరిపెట్టుకుంటే సరిపోదు మేడం. పాప ఏదో సమస్యతో బాధపడుతోంది. వెంటనే ఎవరైనా సైకాలజిస్ట్‌కు చూపించండి.’ ‘సైకాలజిస్ట్ దగ్గరకా? ఎందుకు మేడం? మా పాపకేమైనా పిచ్చి అనుకుంటున్నారా?’ అని కోపంగా అడిగింది సునీత. ‘సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్లేవాళ్లందరూ పిచ్చివాళ్లే అనేది మీ అపోహ మేడం. మానసిక సమస్యలు పిల్లల్లో కూడా రావచ్చు. దయచేసి అర్థంచేసుకుని సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లండి’ అని చెప్పింది టీచర్. తప్పదన్నట్లుగా నందినిని మా క్లినిక్‌కు తీసుకువచ్చారు. సునీత చెప్పింది విన్నాక నందిని ‘సెలెక్టివ్ మ్యూటిజం’తో బాధపడుతోందని అర్థమైంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాట్లాడకపోవడమే దీని ప్రధాన లక్షణం. ఒకశాతం మంది పిల్లల్లో ఈ సమస్య ఉంటుందని అంచనా.
కొన్నిచోట్ల నోరు విప్పరు.. మీ బిడ్డ సెలెక్టివ్ మ్యూటిజంతో పోరాడుతున్నట్లనిపిస్తే ఈ కింది లక్షణాల కోసం చూడండి. అయితే రెండు మూడు లక్షణాలు కనపడగానే సెలక్టివ్ మ్యూటిజం అని నిర్ధారణకు రాకండి. సైకోడయాగ్నసిస్ ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలి. ఆత్రుత, భయం లేదా ఇబ్బంది కారణంగా మాట్లాడాలనే కోరికను అణచుకోవడం ∙భయపడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కదలిక లేకపోవడం, మాట్లాడకపోవడం, కళ్లల్లోకి చూడలేకపోవడం ∙ స్కూల్ లేదా ఇతర నిర్దిష్ట సామాజిక పరిస్థితులలో మాట్లాడలేకపోవడం ∙అవసరాలను వ్యక్తీకరించడానికి మాటలు కాకుండా సంజ్ఞలు ఉపయోగించడం ∙ 2–4 సంవత్సరాల వయసులో సిగ్గు, ఇతరులంటే భయం, మాట్లాడటానికి అయిష్టత ∙
ఇంట్లో లేదా తెలిసిన వ్యక్తులతో సులభంగా మాట్లాడటం, స్కూల్లో, టీచర్లతో నోరువిప్పకపోవడం.మాట్లాడమని బలవంతం చేయొద్దు..సెలెక్టివ్ మ్యూటిజంను ఎంత ముందుగా గుర్తించి చికిత్స అందిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. లేదంటే బిడ్డ మౌనానికి అలవాటు పడే ప్రమాదం ఉంది. మీ బిడ్డ నెల అంతకంటే ఎక్కువ కాలం మౌనంగా ఉంటే, వెంటనే చికిత్స ప్రారంభించడం చాలా ముఖ్యం. చికిత్స కోసం సైకాలజిస్టును సంప్రదించడంతో పాటు మీరు చేయగలిగేవి కూడా ఉన్నాయి.∙మాట్లాడని పిల్లల పట్ల టీచర్లు విసుగ్గా లేదా కోపంగా ఉంటారు. పిల్లల ప్రవర్తన ఉద్దేశపూర్వకం కాదని టీచర్లకు తెలియజేయండి. సానుకూల ప్రవర్తనలకు ప్రశంసలు, బహుమతులు అందించాలి ∙మాట్లాడినప్పుడు మెచ్చుకోండి. అంతేతప్ప మాట్లాడాల్సిందేనని పిల్లలను బలవంతం చేయవద్దు.
బదులుగా చదవడం, డ్రాయింగ్ లేదా పజిల్స్ చేయడం వంటివి ఎంచుకోండి ∙మీ బిడ్డ మాట్లాడటానికి భయపడితే, ఒత్తిడి లేదా పనిష్మెంట్ ద్వారా వారు ఈ భయాన్ని అధిగమించలేరు. కాబట్టి మౌనానికి శిక్షించవద్దు ∙మాట్లాడమని ఒత్తిడి చేయవద్దు. దానివల్ల ఆందోళన మరింత పెరుగుతుంది ∙సెలెక్టివ్ మ్యూటిజం కోసం దీర్ఘకాలం కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) అవసరమవుతుంది ∙ఇందులో డీసెన్సిటైజేషన్, రీఇన్ఫోర్స్‌మెంట్, షేపింగ్ పద్ధతుల ద్వారా పిల్లల్లోని ఆందోళన తగ్గి ధైర్యంగా మాట్లాడేందుకు సహాయపడతారు ∙ఎక్స్‌పోజర్ థెరపీ ద్వారా సురక్షితమైన స్థలాన్ని సృష్టించి పిల్లల్లోని భయాన్ని తగ్గించవచ్చు. సమస్య తీవ్రంగా లేదా దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు, థెరపీ వల్ల మెరుగుపడనప్పుడు సైకియాట్రిస్ట్‌ను కలసి మందులు కూడా వాడాల్సి ఉంటుంది.
ఆందోళనే ప్రధాన కారణం..
అన్ని మానసిక రుగ్మతల్లాగే సెలెక్టివ్ మ్యూటిజానికి కూడా ఒకే కారణం ఉండటం అసంభవం. చైల్డ్ అబ్యూజ్, ట్రామా కారణమని గతంలో నమ్మేవారు. అయితే ఇది సోషల్ యాంగ్జయిటీకి సంబంధించినదని, జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయని ప్రస్తుత పరిశోధనలు సూచిస్తున్నాయి. బాగా సిగ్గుపడే లేదా భయపడే లేదా స్వీయ నియంత్రణ సమస్యలున్న పిల్లల్లో కూడా ఇది రావచ్చు. సోషల్ యాంగ్జయిటీ ఉన్న పేరెంట్స్ ఉంటే వారి పిల్లల్లో వచ్చే అవకాశం ఉంది. డిప్రెషన్, లాంగ్వేజ్ ప్రాబ్లమ్, ఓసీడీ, పానిక్ డిజార్డర్, ఆటిజం లాంటి మానసిక సమస్యలున్న పిల్లల్లో కూడా సెలెక్టివ్ మ్యూటిజం కనిపించే అవకాశం ఉంది.
-సైకాలజిస్ట్ విశేష్
psy.vishesh@gmail.com
Comments
Please login to add a commentAdd a comment