ఫస్ట్ ఎయిడ్ గురించి కొద్దిపాటి అవగాహన ఉన్నా వేలకొద్దీ ప్రాణాలను కాపాడవచ్చు అంటున్నారు డాక్టర్ శివరంజని. హైదరాబాద్‌కు చెందిన ఈ పిడియాట్రీషియన్ పసిపిల్లల్లో, పెద్దల్లో వచ్చే హటాత్ అపస్మారకం, ఉక్కిరిబిక్కిరి, ఫిట్స్ సమయాల్లో ఎలా వ్యవహరిస్తే ప్రాణాలు నిలుస్తాయో గత దశాబ్దకాలంగా ఉచిత వర్క్‌షాపుల ద్వారా చైతన్యపరుస్తున్నారు. తన జీవితంలోని ఒక సంఘటన వల్లే లైఫ్ సేవింగ్ స్కిల్స్ అవసరాన్ని తెలుసుకున్నానని అంటున్నారామె.
రాధిక (పేరు మార్చాం) హాల్లో టీవీ చూస్తోంటే బాత్‌రూమ్‌లోనుంచి ధబ్‌మని శబ్దం వచ్చింది. పరిగెత్తుకెళ్లి చూస్తే భర్త అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతనికి హార్ట్‌ఎటాక్ వచ్చినట్టు ఆమెకు అర్థమైంది. అదృష్టవశాత్తు నెల క్రితం ఆమె డాక్టర్ శివరంజని నిర్వహించిన ఒక వర్క్‌షాప్‌లో సి.పి.ఆర్. ఎలా చేయాలో తెలుసుకుంది. వెంటనే ఛాతీ మీద నియమానుసారం నొక్కుతూ భర్తకు నోటితో ఊపిరి అందించింది. భర్తలో చలనం వచ్చింది.
వెంటనే ఆస్పత్రికి తరలిస్తే అతనికి వచ్చిన హార్ట్‌ఎటాక్ ప్రాణాంతకం కాకుండా కాపాడటంలో ఆమె చేసిన సి.పి.ఆర్ చాలా ముఖ్యపాత్ర పోషించిందని డాక్టర్లు తెలిపారు. ‘ఫస్ట్ ఎయిడ్ తెలిస్తే ఇలాగే ఎన్నోప్రాణాలు నిలుస్తాయి. ఆమె సాధారణ గృహిణి. సి.పి.ఆర్. ఎలా చేయాలో ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఆమెకే కాదు.. ఆమెలాంటి గృహిణులకు స్త్రీలకు అందరికీ ఎవరో ఒకరు తెలపాలి. నా వంతుగా నేను వర్క్‌షాప్స్ ద్వారా తెలుపుతున్నాను’ అంటారు శివరంజని.
పిల్లల డాక్టర్
డాక్టర్ శివరంజని పిల్లల డాక్టర్. ‘మా నాన్నగారు, తాతగారు కూడా డాక్టర్లే. నేను డాక్టర్ కావాలనుకున్నప్పుడు పిల్లలంటే ఇష్టం కనుక వారికి వైద్యం చేయడంలో ఆనందం ఉందనిపించింది. జిప్‌మర్ (పాండిచ్చేరి)లో పిల్లల వైద్యంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశాను’ అన్నారు శివరంజని. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో పిల్లల డాక్టర్‌గా పని చేస్తున్నారు. అయితే కేవలం తన వృత్తిని పనిగా మాత్రమే చూడదలుచుకోలేదు.
తనకు తెలిసిన జ్ఞానాన్ని సామాన్యులకు కొద్దిగానైనా అందుబాటులో తేవాలని అనుకున్నారు. ‘మన దగ్గర ప్రతి ఆరు మరణాల్లో ఒకటి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో తెలియపోవడం వల్ల జరుగుతోంది. గుండెపోటు, మూర్ఛ, అపస్మారకం, ఊపిరాడకపోవడం ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో ఎలా చేయాలో అందరికీ శాస్త్రీయమైన శిక్షణ ఉంటే చాలా ప్రాణాలు కాపావచ్చు. అందుకే గత పదేళ్లుగా నేను ఉచితంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ చైతన్యం తెస్తున్నారు’ అన్నారామె.
మలుపు తిప్పిన ఘటన
‘నేను పాండిచ్చేరిలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఒకరోజు ఉసిరి కాయలు తింటుంటే హటాత్తుగా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. నా పక్కనే సహ విద్యార్థిని ఉంది. ఆమెకు ఇలాంటి స్థితిలో చేయాల్సిన హైమ్‌లక్ మనూవా (ఉక్కిరిబిక్కిరి సమయంలో పొత్తికడుపు మీద నొక్కుతూ చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్) తెలుసు. వెంటనే చేసింది. ఆమె లేకున్నా, ఆ ఫస్ట్ ఎయిడ్ చేయకున్నా ఇవాళ మిగిలేదాన్ని కాదు. అప్పుడే నాకు ఫస్ట్ ఎయిడ్ విలువ ఏంటో తెలిసింది. కా6ఋ దురదృష్టం మన దేశంలో ఇందుకై సాధారణ ప్రజలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వరు. అవగాహన కల్పించరు. కొద్దిమందికే ఈ అవగాహన ఉంటుంది. నా వంతుగా నేను వర్క్‌షాప్స్ ద్వారా అవగాహన కలిగిస్తున్నాను’ అన్నారు శివరంజని.
పసిపిల్లలకు
‘చంటిపిల్లలు ఒక్కోసారి ఊపిరిపీల్చని స్థితికి వెళతారు. సి.పి.ఆర్ చేయడం తెలిసుంటే పిల్లల్ని కాపాడుకోగలుగుతారు తల్లులు. అలాగే వారు గొంతుకు అడ్డం పడేలా ఏదైనా మింగినప్పుడు కూడా ఏం చేయాలో తల్లులకు తెలియాలి. ఇవన్నీ నా వర్క్‌షాప్స్‌లో చూపిస్తాను. ఇందుకు బొమ్మలను ఉపయోగిస్తాను’ అన్నారు శివరంజని. ఇందుకోసం ఆమె నేరుగా ఆన్‌లైన్‌లో సెషన్స్ నిర్వహిస్తారు.
‘కాని చాలామంది తల్లులు సెషన్స్‌కు రారు. ఆ ఏముందిలే అనుకుంటారు. వారిని ఒప్పించి తేవడం కష్టం. అయినా నేను పట్టువిడవక ప్రయత్నిస్తాను. ఫోన్లు చేసి పిలుస్తాను. వాట్సప్ గ్రూప్ పెట్టి వెంటపడతాను’ అంటారు శివరంజని. డాక్టర్ శివరంజని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగుళూరులలో గత పదేళ్లలో 12 వేల మంది తల్లులకు, సాధారణ వ్యక్తులకు ఫస్ట్ ఎయిడ్ స్కిల్స్ నేర్పించారు. అంతేకాదు... సీజనల్‌గా అవసరమైన హెల్త్ అవేర్‌నెస్ కోసం వీడియోలు చేస్తుంటారు. ఇలాంటి కృషి విలువైనది. ఇతర డాక్టర్లు అనుసరించాల్సినది.
Comments
Please login to add a commentAdd a comment