
పప్పెట్ షోలతో ఫోను అలవాటు మాన్పించేందుకు కృషి
వెంట్రిలాక్విజంతో చిన్నారులను ఆకట్టుకుంటున్న సంతోష్‌కుమార్
తరగతులను చేపడుతున్న పలు కార్పొరేట్ పాఠశాలలు
గత కొంతకాలంగా చిన్నారుల్లో ఫోన్ వాడే అలవాటు విపరీతంగా పెరిగిపోతోంది. ఆ అలవాటును మాన్పించేందుకు తనదైన శైలిలో ప్రయత్నాలు చేపట్టాడు నగరానికి చెందిన ప్రముఖ వెంట్రిలాక్విజం కళాకారుడు సంతోష్ కుమార్. వివిధ రకాల జంతువుల బొమ్మలతో పప్పెట్ షోలు నిర్వహిస్తూ చిన్నారుల్లోని ఫోన్, టీవీ చూసే అలవాటును మాన్పిస్తున్నారు. అలాంటి అలవాట్లతో వచ్చే అనర్థాలను తెలియజేస్తూ వారిని ఎడ్యుకేట్ చేస్తున్నారు. దీంతో పాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి అంశాలపైనా అవగాహన కల్పిస్తున్నాడు. – సుల్తాన్‌బజార్
చిన్నారుల్లోని మానసిక స్థితిని మార్చేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు వెంట్రిలాక్విజం కళాకారుడు సంతోష్ కుమార్. తద్వారా నగరంలోని ఎందరో తల్లిదండ్రుల మన్ననలను పొందుతున్నాడు. నగరంలోని పేరొందిన కార్పొరేట్ పాఠశాలలతో పాటు అమెరికా, జర్మనీ, జపాన్, లండన్, శ్రీలంక లాంటి దేశాల్లో తనదైన శైలీలో ప్రదర్శనలు ఇస్తూ జాతీయస్థాయిలో అవార్డులను అందుకుంటున్నారు.
చిన్నారుల్లో మార్పుకు దోహదం..
కార్టూన్ షోలకు ఎడిక్ట్ అయిన చిన్నారులను వాటి ద్వారా రుగ్మతలను దూరం చేసేందుకు తనదైన శైలిలో కృషి చేస్తున్నాడు. పిల్లల భవిష్యత్తు కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్న తల్లిదండ్రులు టీవీ, మొబైల్ ఎడిక్షన్ నుంచి వారిని మాన్పించే విషయంలో విఫలమ వుతున్నారు. ఈ క్రమంలో తన వెంట్రిలాక్విజం కళతో పలు పాఠశాలల ఆహ్వానం మేరకు 30 నిమిషాల పప్పెట్ షో నిర్వహిస్తున్నాడు. తద్వారా వివిధ జంతువులు, తోలు బొమ్మల ద్వారా వెంట్రిలాక్విజం చేస్తూ చిన్నారుల్లోని అలవాట్లను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. విద్యాబోధన ద్వారానే కాకుండా ఇలాంటి షోల ద్వారా చిన్నారుల్లో ఎంతో మార్పు వస్తుందని పలు పాఠశాలల యాజమాన్యాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
జాతీయస్థాయి అవార్డు..
దేశ విదేశాల్లో వెయ్యికి పైగా షోల ద్వారా చిన్నారుల మానసిక పరివర్తనలో మార్పుతెచ్చేందుకు కృషిచేసిన సంతోష్‌కు ఎర్లీ చైల్డ్‌హుడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఈ నెల 15న ముంబయిలో జాతీయ అవార్డును ప్రదానం చేసింది. ఇదే ప్రోత్సహంతో చిన్నారుల మానసిక స్థితిని మార్చేందుకు ప్రభుత్వ పాఠశాలల్లోనూ పప్పెట్ షోలు నిర్వహిస్తానని, అయితే దానికి ప్రభుత్వ సహకారం కావాలని సంతోష్ కోరుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment