నా భార్య వయసు 33. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా వస్తుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. హోమియోలో చికిత్స ఉందా?
– మల్లికార్జునరావు, కాకినాడ
గర్భాశయానికి ఇరువైపులా అండాశయాలు ఉంటాయి. ఈ అండాశయాల్లో నీటిబుడగల వంటివి ఉండటాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (పీసీఓడీ) అంటారు. రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో రెండు అండాశయాల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అయితే ఈ పీసీఓడీ సమస్య ఉన్నవారిలో అండాశయం నుంచి అండం విడుదల కాకుండా, అపరిపక్వమైన అనేక అండాలు నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోతాయి. చూడటానికి ఇవి ముత్యాల్లా కనిపిస్తుంటాయి. ఇలా రెండువైపులా కనిపిస్తుంటే దీన్ని వైద్యపరిభాషలో ‘బైలేటరల్ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ.
లక్షణాలు : నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానంకలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు.
చికిత్స : హోమియో ప్రక్రియలో సరైన కాన్‌స్టిట్యూషన్ సిమిలియం విధానంలో హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ,
హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
కాళ్లపై నరాలు ఉబ్బుతున్నాయి
నా వయసు 45 ఏళ్లు. కనీసం పది నిమిషాల పాటు నిల్చోలేకపోతున్నాను. కాళ్లు లాగుతున్నాయి. కాళ్లపై నరాలు ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. దీనికి హోమియోలో పరిష్కారం ఉందా? – శంకరమ్మ, మెదక్
మీకు ఉన్న సమస్య వేరికోస్ వెయిన్స్. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఏర్పడే సమస్యనే వేరికోస్ వెయిన్స్ అంటారు. అంటే శరీరంలోని రక్తనాళాలు రంగు మారతాయి లేదా నలుపు రంగులోకి మారతాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. మారుతున్న జీవనశైలి, అవగాహన లేమి వల్ల ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి ఇతర సమస్యలకు దారితీస్తోంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండెవైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల రక్తప్రసరణ మందగించడం, కాళ్ల ఒత్తిడి పెరగడం జరగవచ్చు. ఈ క్రమంలో సిరలు (రక్తనాళాలు) నలుపు లేదా ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడి నడవడానికీ వీలు కాదు. సాధారణంగా 30 ఏళ్ల పైబడిన వారిలో ఈ వేరికోస్ వెయిన్స్ కనిపిస్తుంది. మహిళలు, స్థూలకాయులు, వ్యాయామం చేయనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
కారణాలు : ∙ముందుకు ప్రవహించాల్సిన రక్తం వెనకకు రావడం ∙కొంతమంది మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు ∙ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్‌మేన్, సేల్స్‌మెన్, టీచర్లు వంటి) ఉండేవారికి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ.
లక్షణాలు : ∙కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం ∙కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం, దాని తీవ్రత పెరుగుతూ పోవడం ∙చర్మం దళసరిగా మారడం ∙చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం
చికిత్స : హోమియోలో ఈ సమస్యకు హామామెలిస్, పల్సటిల్లా, కాల్కేరియా, గ్రాఫైటిస్, కార్బోవెజ్, ఆర్నికా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో),
స్టార్ హోమియోపతి, హైదరాబాద్
ఐబీఎస్‌కి పరిష్కారం ఉందా?
నా వయసు 38 ఏళ్లు. భోజనం తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొద్దిగా నొప్పి ఉండి మెలిపెట్టినట్లుగా అనిపిస్తోంది. డాక్టర్‌కు చూపిస్తే ఐబీఎస్ అన్నారు. మందులు వాడినా తగ్గలేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – ఎల్. రాజేశ్వరి, విజయవాడ
మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే ∙జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ∙దీర్ఘకాల జ్వరాలు ∙మానసిక ఆందోళన ∙కుంగుబాటు ∙ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం ∙జన్యుపరమైన కారణాలు ∙చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తాయి. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయిలెట్‌కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజన్ బ్రీత్ టెస్ట్ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి.
వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు : ∙పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ∙ఒత్తిడిని నివారించుకోవాలి ∙పొగతాగడం, మద్యం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ∙రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.
చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన, సమర్థమైన మందులు అందుబాటులో ఉన్నాయి. లక్షణాలను బట్టి కాన్‌స్టిట్యూషనల్ సిమిలియం ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్,
పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్
Comments
Please login to add a commentAdd a comment