దువ్వెన తీయవచ్చు | Hair Trans plantation | Sakshi
Sakshi News home page

దువ్వెన తీయవచ్చు

Published Wed, Dec 28 2016 10:36 PM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM

దువ్వెన తీయవచ్చు

దువ్వెన తీయవచ్చు

హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌

ఎండలో తిరిగి తిరిగి అలసట...
ముఖం కడిగి సేదదీరచ్చు.
పనిలో పనిగా జేబులో నుంచి దువ్వెన తీసి
తల దువ్వుకోనూ వచ్చు. కానీ...
దువ్వెన తీయాలంటే బెరుకు.
తల దువ్వుకోవాలంటే జుట్టు ఎక్కడో వెతుక్కోవాల్సి వస్తోంది.
ఎవరైనా చూస్తారేమోననే బెంగ.
అటూ ఇటూ చూసి మాడు నిమురుకుంటూ తలదువ్వుకోవాలి
ప్రపంచానికి విశాలంగా కనిపిస్తున్న ముఖం
అద్దంలో మాత్రం చిన్నబోయి కనిపిస్తుంది.
ఎక్సర్‌సైజ్‌ దేహాన్ని ఫిట్‌గా ఉంచి యూత్‌ ఫీల్‌నిస్తుంది.
అయినా... జుట్టే వెవ్వెవ్వె అని వెక్కిరించి పరుగెడుతోంది.
బోసిపోయిన తలకు యంగ్‌ లుక్‌ ఎలాగ?!
జుట్టు ఎందుకు రాలుతుందంటే..!


జుట్టు రాలడానికి ఒకటి – రెండు కాదు, అనేక కారణాలుంటాయి. పోషకాహార లోపం, అస్వస్థత ఎక్కువ రోజులు ఉన్నప్పుడు, క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా కీమోథెరపీ చేసినప్పుడు జుట్టు రాలిపోతుంది. అస్వస్థత కారణంగా దేహంలో నిల్వ ఉన్న ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ వంటి పోషకాలు తగ్గిపోతాయి. అలాంటప్పుడు ఆ ప్రభావం జుట్టు మీద కూడా ఉంటుంది.ఇవేవీ కాకుండా దేహం ఆరోగ్యంగా ఉండి కూడా జుట్టు రాలిపోవడం జరుగుతుంటుంది. అందుకు కారణం  మాడుకు (స్కా ల్ప్‌)కు సంబంధించిన సమస్యలతో వచ్చే డాండ్రఫ్‌ ఒకటి. ఇటీవల పని ఒత్తిడి, వాతావరణ కాలుష్యం కూడా తోడవుతున్నాయి.

ఈ కండిషన్స్‌లో జుట్టు రాలడాన్ని తగ్గించడానికంటూ ట్రీట్‌మెంట్‌ ఉండదు. కారణాన్ని బట్టి ఆ సమస్య పరిష్కారానికి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే చాలు. ఇవేవీ హెయిర్‌ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నవి కానే కాదు. చాలామంది ఎదుర్కొంటున్న కామన్‌ ప్రాబ్లమ్‌ – మేల్‌ పాటర్న్‌ బాల్డ్‌నెస్‌... అంటే మగవారిలో వయసురీత్యా వచ్చే బట్టతల. హెయిర్‌ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ట్రీట్‌మెంట్‌ అవసరం ప్రధానంగా ఈ రెండింటికి మాత్రమే. ఫిమేల్‌ పాటర్న్‌ బాల్డ్‌నెస్‌ (మహిళల్లో వయసు రీత్యా జుట్టు పలచబడడం) కూడా ఉంటుంది. కానీ అది తలంతా సమంగా ఉంటుంది గనక ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అవసరం ఉండదు.

బాల్డ్‌నెస్‌ ఎందుకు?
మగవారిలోని టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ప్రభావం వల్ల జుట్టు రాలిపోతుంటుంది. సాధారణంగా 30–40 ఏళ్లు దాటినప్పటి నుంచి ఈ సమస్య మొదలవుతుంది. చాలా అరుదుగా అతికొద్దిమందిలో ఇరవై ఏళ్ల నుంచే బట్టతల మొదలవుతుంది.ఎక్కువ మందిలో తల ముందు భాగంలో నుదురు నుంచి పైకి జుట్టు రాలిపోయి ఖాళీ ఏర్పడుతుంటుంది. కొందరిలో నడినెత్తిన చంద్రాకారంలో ఖాళీ ఏర్పడుతుంది. బట్టతల వచ్చినప్పటికీ మాడులో జుట్టు పెరగగలిగిన పోషణ ఉంటుంది. కానీ వెంట్రుక కుదురు దగ్గర బలహీనపడి రాలిపోయి ఖాళీ ఏర్పడి ఉంటుంది. అలాంటి చోట కొత్త కుదుళ్లను నాటడం ద్వారా అక్కడ తిరిగి వెంట్రుకలు పెరిగేలా చేయవచ్చు.  

డోనర్‌ జోన్‌లు!
ఆక్సిపిటల్‌ రీజియన్‌ (తల వెనుక వైపు) నుంచి జుట్టును సేకరించాలి. దీనినే డోనార్‌ సైట్‌ అని కూడా అంటారు. బట్టతల ఎంతగా విస్తరించిన వారిలోనైనా ఆక్సిపిటల్‌ రీజియన్‌లో జుట్టు ఉంటుంది. ఆ ప్రదేశం నుంచి సేకరించిన వెంట్రుకలను అవసరమైన చోట ఇంప్లాంట్‌ చేస్తారు. చదరపు సెంటీమీటరు జాగాలో 20 ఫాలికల్‌ యూనిట్స్‌ ఇంప్లాంట్‌ చేస్తారు.

గడ్డం నుంచి కూడా!
అనేక పరిశోధనలు, అధ్యయనాల తర్వాత ఇప్పుడు గడ్డం నుంచి కూడా వెంట్రుకలను సేకరిస్తున్నారు. టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ప్రభావంతో వయసు పెరిగే కొద్దీ తల మీద వెంట్రుకలు పలుచబడుతూ, గడ్డం వెంట్రుకల సాంద్రత పెరుగుతూ ఉంటుంది. ఈ లక్షణాన్ని ట్రీట్‌మెంట్‌కు అనువుగా మార్చుకోవడం జరుగుతోంది. గడ్డం నుంచి రెండు– మూడు వేల వెంట్రుకలను తీయవచ్చు. మందులతో చికిత్స!
► పిల్లల్లో పోషకాహార లోపం,విటమిన్స్‌ లోపం, చుండ్రు, జ్వరం, కామెర్లు, ఇతర కాలేయ సమస్యలతో జుట్టు రాలిపోతుంటుంది. అలాంటి సమస్యలను మందులు, చక్కటి పరిశుభ్రత, పోషకాహారంతో అదుపుచేయవచ్చు.
► మేల్‌పాటర్న్‌ బాల్డ్‌నెస్‌ మొదలైన వారికి ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఫైన్‌స్టెరెడ్‌ మందులతో చికిత్స చేయవచ్చు. ఇది షార్ట్‌టర్మ్‌ ట్రీట్‌మెంట్‌. మగవారికి మాత్రమే చేసే చికిత్స.
►  తలలో రక్తప్రసరణ తగ్గడం వల్లా జుట్టు రాలిపోతుంటుంది. మినాక్సిడిల్‌ మందులతో జుట్టు కుదురును శక్తిమంతం చేయవచ్చు. ఈ మందులను మగవాళ్లు, మహిళలు వాడవచ్చు.

సెమీ ఇన్‌వేజివ్‌ ట్రీట్‌మెంట్‌!
ఈ పద్ధతిలో పేషెంటు రక్తం నుంచి ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మాను సేకరించి, ప్రాసెస్‌ చేసి మాడుకు ఇంజెక్ట్‌ చేస్తారు. దాంతో జుట్టు కుదురు, హెయిర్‌ రూట్‌ బలపడతాయి. దీనిని అందరికీ చేయవచ్చు. మధ్య వయసు మహిళలకు అంటే ఫిమేల్‌ ప్యాటర్న్‌ బాల్డ్‌నెస్‌ ఉన్న వారికి అనువైన చికిత్స. విటమిన్‌లు, ఇతర పోషకాలను కూడా నేరుగా మాడుకే ఇంజక్షన్‌ ద్వారా ఇస్తారు. డయాబెటిస్, హైబీపీ వంటి ఏ ఇతర అనారోగ్యాలున్నా సరే చేయించుకోవచ్చు.

ఆపరేషన్‌కు సిద్ధం చేయడం ఇలా?
► సర్జరీ చేయాల్సిన ముందురోజు రాత్రి తలస్నానం చేయాలి.
► సర్జరీకి ఒకటి– రెండు రోజుల ముందుగా హెయిర్‌ ట్రిమ్‌ చేయించాలి. పొట్టి జుట్టుతో పోలిస్తే పొడవు జుట్టును తీయడం, ఇంప్లాంట్‌ చేయడానికి శ్రమ, సమయం ఎక్కువ. పొట్టిగా ఉంటే మరింత కచ్చితంగా ఇంప్లాంట్‌ చేయవచ్చు. సక్సెస్‌రేట్‌ కూడా పెరుగుతుంది.
– వాకా మంజులా రెడ్డి ‘సాక్షి’ ఫీచర్స్‌ ప్రతినిధి

మొక్కను నాటినట్లే!
పేషెంటు తల మీద జుట్టును ఒత్తుగా ఉన్న చోట నుంచి కుదురుతో పాటుగా తీస్తారు. జుట్టు లేని చోట చిన్న రంధ్రం చేసి ఒక్కొక్క ఫాలికల్‌ను నాటుతారు. ఈ ప్రక్రియలో కేశాలను తీయడంతోపాటు ఇంప్లాంట్‌ చేయడం కూడా చాలా మెళకువతో చేయాలి. భూమి మీద ఒక చోట మొలచిన ఒక మొక్కను అక్కడ నుంచి తీసి మరొక చోట నాటేటప్పుడు వేరుతో పాటుగా తీసి ఎంతlజాగ్రత్తగా నాటుతామో, ఇదీ అలాగేనన్నమాట. ఇలా నాటిన కుదుళ్లలో నూటికి90 ఫాలికల్స్‌విజయవంతంఅవుతాయి.

గుర్తుంచుకోవాల్సినవి
► హెయిర్‌ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఏ వయసులోనైనా చేయించుకోవచ్చు.

►ట్రీట్‌మెంట్‌ చేయించుకున్న తర్వాత కూడా బాల్డ్‌నెస్‌ ప్రాసెస్‌ ఆగదు. అంటే నాటిన ప్రదేశంలో వెంట్రుకలు ఉంటాయి. మిగిలిన భాగంలో జుట్టు రాలడాన్ని నివారించడం కష్టం.
► గతంలో పాటించిన స్ట్రిప్‌ ఎక్స్‌ట్రాక్ట్‌ పద్ధతుల్లో డోనార్‌ సైట్‌ నుంచి జుట్టు తీసిన చోట మచ్చ పడేది. ఇప్పుడు డోనార్‌ సైట్‌లో జుట్టు పలచబడుతుంది తప్ప మచ్చ పడదు.
► ఈ ట్రీట్‌మెంట్‌ తర్వాత కొందరిలో జుట్టు పొడవులో తేడాలు వచ్చే అవకాశం లేకపోలేదు. హెయిర్‌కట్‌ నిడివి మార్చుకోవాలి.
►చాలా అరుదుగా అతి కొద్దిమందిలో మందుల కారణంగా అలర్జీలు వస్తుంటాయి. అందుకోసం ట్రీట్‌మెంట్‌కు ముందుగానే పేషెంటు తన ఫ్యామిలీ హెల్త్‌ హిస్టరీని డాక్టరుకు తెలియచేసి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

డాక్టర్‌ వై. వెంకట రమణ
సీనియర్‌ ప్లాస్టిక్‌ సర్జన్,
కాంటూర్స్‌ ప్లాస్టిక్‌ సర్జరీ సెంటర్,
హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement