మృదువైన మర్దన
బ్యూటిప్స్
వెంట్రుకలు రాలడం, నిర్జీవంగా కనిపించడం వంటి సమస్యలు పోషకాహరం లోపంతో తలెత్తుతాయి. అలాగే సరైన పోషణ లేకపోవడం వల్ల కూడా కురుల నిగనిగలకు సమస్యలు ఎదురవుతాయి. పరిష్కారంగా... కొబ్బరి నూనె, నువ్వుల నూనెలతో మాడుకు మసాజ్ చేసుకోవాలి. ఈ నూనెలలో ఉసిరి లేదా మందార పువ్వు లేదా బంతిపువ్వు లేదా కరివేపాకు వేసి వేడి చేయాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించి, మృదువుగా మసాజ్ చేయాలి. అలాగే వెంట్రుకల చివర్లకు రాయాలి. రాత్రి పడుకునేముందు ఇలా మసాజ్ చేసుకొని, మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయడం వల్ల మాడుపై గల మృతకణాలు తొలగిపోతాయి. చుండ్రు తగ్గుతుంది. వెంట్రుకల పెరుగుదల బాగుంటుంది.
షాంపూల వాడకం వల్ల జుట్టు పాడైపోతుందనుకునేవారు సహజసిద్ధంగా లభించే వాటితో తలంటుకోవచ్చు. కుంకుడుకాయ, షికాయలను నానబెట్టి రసం తీసి దీంట్లో ఉసిరిపొడి, మందారపువ్వుల పొడి, టీ స్పూన్ బంకమట్టి, మెంతి పొడి, గోరింటాకు పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్‌ట్రేలలో పోసి డీప్ ఫ్రీజర్‌లో పెట్టాలి. ఈ ఐస్‌క్యూబ్స్‌ని కావల్సినప్పుడు తీసి ఉపయోగించడం సులువు అవుతుంది. పదిహేను రోజులకొకసారి పప్పులతో తయారుచేసిన షాంపూతో తలస్నానం చేయాలి. ఇందుకు శనగపిండి, మినప్పిండి, పెసరపిండి సమభాగాలుగా తీసుకోవాలి. ఈ పిండిలో నీళ్లు లేదా కుంకుడు రసంలో కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు ప్యాక్‌లా వేసి, మృదువుగా రుద్దుతూ కడిగేయాలి.