కంటికి జిమ్ | Eye Gym | Sakshi
Sakshi News home page

కంటికి జిమ్

Published Mon, Jun 15 2015 10:40 PM | Last Updated on Sun, Sep 3 2017 3:47 AM

కంటికి జిమ్

కంటికి జిమ్

ఒంటికి జిమ్ లాగే కంటికీ జిమ్ ఉంటుంది. కానీ, కంటికి చేయవలసిన వ్యాయామాలు కొన్ని వ్యాధులు ఉన్నప్పుడు వాటి చికిత్సకోసం ఉపయోగపడుతాయి. ఒంటికి చేసే వ్యాయామం ప్రాధాన్యం మనకు తెలియనిది కాదు. ఆయా అవయవాలకోసం చేసే ప్రత్యేక వ్యాయామాలు వాటి బలాన్ని, సామర్థ్యాన్ని పెంచేందుకు అవి ఉపకరిస్తాయి. అలాగే కంటికి చేసే ఈ వ్యాయామాల వల్ల రెండు కళ్లూ ఒకేలా చూసే క్రమంలో (బైనాక్యులార్ విజన్‌లో) ఏవైనా లోపాలు వచ్చినప్పుడు వాటిని సరిదిద్దవచ్చు. వీటిని ఎలా చేయాలో కంటి వైద్య నిపుణులు సూచిస్తుంటారు. కంటి కోసం వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఎప్పుడొస్తుంది, వాటిని సందర్భాల్లో సూచిస్తారు అన్న విషయాలు తెలుసుకుందాం.
 
దృష్టిని మెరుగుపరిచేందుకు ఆఫ్తాల్మాలజిస్టులు కంటి వ్యాయామాలు చేయించడం 1928లో మొదలైంది. దీన్ని ఒక ప్రత్యేక విభాగంగానూ అభివృద్ధి చేశారు. కంటికి చేయించే వ్యాయామాల విభాగాన్ని వైద్య పరిభాషలో ‘ఆర్థాప్టిక్స్’ అంటారు. ఈ విభాగాన్ని తొలిసారి బ్రిటన్ గుర్తించింది. కంటి వ్యాయామాలకు ఇంతటి సుదీర్ఘ చరిత్ర ఉన్నా నిజానికి సాధారణ ప్రజల్లో దీని గురించిన అవగాహన పరిమితమే.
 
ఎలాంటి సందర్భాల్లో కంటి వ్యాయామాలు అవసరం?

కంటికి సంబంధించి మూడు రకాలుగా ఉపయోగపడేలా కంటి వ్యాయామాలు చేయవచ్చు. చికిత్సలో భాగంగా వీటిని చేయించడం ద్వారా నిపుణులు దృష్టిని మెరుగుపరచగలరు. అవి...

1) తప్పక ఉపయోగపడతాయని నిరూపితమైనవి :
మెల్లకన్ను లేదా స్ట్రాబిస్మస్ : రెండు కళ్ల చెందిన నల్లగుడ్లు ఒకేలా లేని (విజువల్ యాక్సిస్ పారలల్‌గా లేని) సందర్భాన్ని మెల్లకన్ను లేదా స్ట్రాబిస్మస్ అంటారు. సాధారణ వ్యక్తులందరిలోనూ రెండు కళ్లతోనూ ఒకే దృశ్యాన్న చూస్తుంటారు. దీన్ని బైనాక్యులార్ సింగిల్ విజన్ అంటారు. కానీ మెల్లకన్ను వ్యాధి ఉన్నవారిలో రెండు కనుగుడ్లూ ఒకేచోట కేంద్రీకృతం కావు. కనుగుడ్డు తిరిగి ఉన్న పొజిషన్ ఆధారంగా దీన్ని నాలుగు రకాలుగా విభజిస్తారు. అవి... ఎ) ఎగ్సోట్రోఫియా (కనుగుడ్డు బయటివైపునకు తిరిగి ఉండటం) బి) ఈసోట్రోఫియా (కనుగుడ్డు లోపలి వైపునకు తిరిగి ఉండటం) సి) హైపర్‌ట్రోఫియా (పై వైపునకు తిరిగి ఉండటం) డి) హైపోట్రోఫియా (కిందివైపునకు తిరిగి ఉండటం)

సరిచేసే వ్యాయామాలు : మెల్లకన్నులోని పై నాలుగు లోపాలను సరిచేయడానికి రకరకాల వ్యాయామాలు ఉన్నాయి. అందులో కొన్ని ఇవి...  1) పెన్సిల్ పుష్‌అప్స్ (ఇందులో ఒక పెన్సిల్‌ను ముక్కుకు సూటిగా పెట్టుకొని దగ్గరగా, దూరంగా జరుపుతుంటారు) 2) బ్రోక్ స్ట్రింగ్ (ఫ్రెడ్రిక్ బ్రోక్ అనే నిపుణుడు రూపొందించిన ఈ వ్యాయామ రీతికి ఆయన పేరునే పెట్టారు. ఇందులో ఒక పది అడుగుల పురికొసపైన  దారానికి మూడు పూసలు ఎక్కించి, ఆ పూసల స్థానాలను మారుస్తూ వాటిని కంటితో  చూసేలా వ్యాయామం చేయిస్తారు). 3) బ్యారెల్ కార్డ్స్ ఎక్సర్‌సైజ్ (పేకముక్కల వంటి వాటిపై వేర్వేరు రంగులను అద్ది, ఒక్కోముక్కపైనా కాసేపు దృష్టిసారిస్తూ, మరో ముక్కవైపునకు దృష్టి మళ్లిస్తూ చేసే ఒక రకం వ్యాయామం ఇది). ఇవీగాక ప్రత్యేకమైన వైద్యపరమైన పరికరాలతోనూ వ్యాయామాలు చేయిస్తారు.

ఆంబ్లోపియా (లేజీ ఐ): ఇందులో చూడటానికి రెండు కళ్లూ బాగానే కనిపించినా ఒక కంటి నుంచి మెదడుకు అందే దృశ్యంలో స్పష్టత తగ్గుతూ ఉండటం వల.్ల... మెదడు నాణ్యమైన దృశ్యం అందే కంటి నుంచే దృష్టి సంకేతాలను స్వీకరిస్తుంటుంది. అంతగా నాణ్యత లేని కంటి నుంచి సంకేతాలను నిరాకరిస్తూ ఉండటం వల్ల క్రమంగా ఒక కంటి చూపు తగ్గుతూ పోతుంది. ఈ ప్రక్రియను సప్రెషన్ అంటారు. కాలక్రమంలో ఆ కన్ను చూపును కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ కండిషన్‌ను సరిచేయడానికి వ్యాయామాలు ఉంటాయి. దీనికి అక్లూజన్ అనే వ్యాయామం చేయిస్తారు. ఇందులో బాగా కనపడే కంటిని పాక్షికంగానో లేదా పూర్తిగా మూసి, సరిగా కనిపించని కంటి ద్వారా మంచి నాణ్యమైన సంకేతాలు మెదడుకు అందేలా క్రమంగా అలవాటు చేస్తారు. దాంతో నాణ్యమైన సంకేతాలు పంపడం మానేసిన ‘లేజీ ఐ’ కూడా క్రమంగా బలపడుతూ పోతుంది.
 
2) దృష్టిని మెరుగుపరచడానికి
పరోక్షంగా ఉపయోగపడేవి

మామూలుగా మనం చేసే వ్యాయామ కార్యకలాపాలు మన పూర్తి ఆరోగ్యానికి మేలు చేసినట్లే, మన కళ్లకూ బలాన్ని చేకూర్చి, అనేక కంటి వ్యాధులను నివారిస్తాయి. మనం చేసే వ్యాయామాలు మన రక్తంలోని కొలెస్ట్రాల్ పాళ్లను అదుపులో పెడతాయి. వ్యాయామంతో అన్ని అవయవాలకు రక్తసరఫరా పెరిగినట్లే, కళ్లకూ రక్తసరఫరా పెరిగి ఎక్కువ మోతాదులో ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. దాంతో కళ్లు, కంటి కండరాలు కూడా బలపడతాయి. కంటికి వచ్చే అనేక వ్యాధులు వాటంతట అవే నివారితమవుతాయి. అవి... క్యాటరాక్ట్ (కళ్లలో తెల్ల ముత్యం), ఏఆర్‌ఎమ్‌డీ (ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్), డయాబెటిక్ రెటినోపతి, హైపర్‌టెన్సివ్ రెటినోపతి, గ్లకోమా వంటివి.
 
3) కంటి ఆరోగ్యానికి తాత్కాలికంగా మాత్రమే
ఉపయోగపడేవి

ఇవి కంటిపై ఉన్న భారాన్ని తాత్కాలికంగా తొలగించి, కొద్దిపాటి ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. అప్పటికప్పుడు కనిపించే ప్రయోజనమే తప్ప దీర్ఘకాలిక లాభం ఉండని వ్యాయామరీతులుగా వీటిని చెప్పవచ్చు. అవి...

కనుగుడ్డును కదిలిస్తూ ఉండటం;  
రెండుకళ్లనూ అరచేతులతో మూసుకొని కళ్లకు తాత్కాలిక విశ్రాంతి ఇచ్చి, కొంతసేపు ఉపశమనం కలిగించడం (దీన్ని పామింగ్ అంటారు);
బ్లింకింగ్ (రెండు రెప్పలనూ ఠక్కున కొడుతూ ఉండటం, ఈ ప్రక్రియలో కారు అద్దాలపై నీరు చిమ్మి వైపర్స్‌తో శుభ్రం చేసినట్లుగానే, కంటిలోని నీటి  (లాక్రిమల్ సెక్రిషన్స్) సహాయం వల్ల బ్లింకింగ్ చేసినప్పుడల్లా కన్ను శుభ్రమవుతుంది.
యానింగ్ (ఆవలించడం - మనం ఆవలించినప్పుడు ఒక్కోసారి కంటిలో కొద్దిగా నీళ్లు రావడం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. ఈ కన్నీరు (లాక్రిమల్ సెక్రిషన్) కంటిలోని పొడిదనాన్ని తొలగించి, కన్నును తేమగా ఉండేలా చేస్తుంది.
 
ప్రమాదకరం... ఎప్పుడూ చేయకూడని పని సన్నింగ్
కొందరు వ్యాయామంలో భాగంగా ‘సన్నింగ్’ అనే ప్రక్రియను చేస్తుండేవారు. ఇది తమకు మేలు చేసే అంశంగా భావించేవారు. ఈ తరహా భావన 1920 ల నుంచి 1960ల వరకు రాజ్యమేలుతూ ఉండేది. సన్నింగ్‌లో భాగంగా పట్టపగలు సూర్యుణ్ణి తదేకంగా కాసేపు చూస్తుండేవారు. ప్రాతఃకాలం, సాయం సందెవేళ మినహాయించి మిగతా ఏ సమయంలోనూ ఎలాంటి రక్షణ ఉపకరణాలు లేకుండా సూర్యుణ్ణి తదేకంగా చూడటం కంటికి తీవ్రంగా హానిజరుగుతుందనే  విషయాలను గుర్తుంచుకోండి. దీన్నే ‘రెటినల్స్ బర్న్స్’ అంటారు.

ఇక కంటి చూపును అద్దాలతో మాత్రమే సరిదిద్దగలిగే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అయిన మయోపియా, హైపరోపియా, ఆస్టిగ్మాటిజమ్ వంటి లోపాలను వ్యాయామాలతో సరిదిద్దలేం. వీటికి ఎలాంటి కంటి వ్యాయామాలూ (ఆక్యులార్ ఎక్సర్‌సెజైస్) ఉండవు. వీటిని సరిచేయడానికి కేవలం అద్దాలనే వాడాలి.
 
డాక్టర్ కె. రవికుమార్‌రెడ్డి
కంటి వైద్య నిపుణులు,
మెడివిజన్ ఐ హాస్పిటల్, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement