Eye diseases
-
హైదరాబాద్‌లో కండ్లకలక కలవరం.. మందులకే 2 గంటలా?
సాక్షి, హైదరాబాద్: నగరంలో కండ్లకలక కేసులు కలవరం పుట్టిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం పదుల సంఖ్యలోనే వెలుగుచూసిన కేసులు తాజాగా వేలల్లో నమోదయ్యాయి. అయితే, చికిత్స కోసం వెళ్లిన బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. హైదరాబాద్‌లోని సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో వసతులు కరువయ్యాయంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్స అందించే డాక్టర్ల కొరతకు తోడు.. మెడిసిన్ తీసుకునేందుకు కూడా పేషంట్లు బారులు తీరారు. ఆస్పత్రి యాజమాన్యం ముందస్తుగా చర్యలు చేపట్టకపోవడంతో బాధితులు ఒకేచోట గుమిగూడాల్సిన పరిస్థితి తలెత్తింది. మందులకు అందించేందుకు ఒకే కౌంటర్ అందుబాటులో ఉండటంతో దాదాపు 2 గంటలు లైన్లో వేచి ఉంటే తప్ప మెడిసిన్ తీసుకునే పరిస్థితి లేదు. కాగా, వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చే కండ్లకలక ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా గుంపుగా ఉన్న ప్రదేశాల్లో ఈ వ్యాధి సొందరగా ఇతరులకు సోకుతుంది. కండ్లకలకను పింక్ ఐ లేదా ఐ ఫ్లూ అని అంటారు. (చదవండి: ఆ అలవాటే కరోనా అటాక్‌కి ప్రధాన కారణం! వెలుగులోకి విస్తుపోయే నిజాలు!) ✅గత కొద్ది రోజులుగా కళ్ల కలక 👁️కేసులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ✅మరి ఇలాంటి సమయంలో చేయాల్సినవి, చేయకూడనివి తెలిస్తే త్వరగా నయం అవుతుంది. ✅అవేంటో కింది ఇన్ఫోగ్రాఫ్ ద్వారా తెలుసుకోండి#Conjuctivitis #HealthForAll #SwasthaBharat #EyeFlu #EyeConjuctivitis pic.twitter.com/EZ7TLH6axd — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 2, 2023 కళ్ల కలక లక్షణాలు! 👁🗨కళ్ళలో నొప్పి, మంట, దురద 👁🗨కళ్ళు ఎర్రగా మారడం 👁🗨కళ్ళ నుంచి తరుచుగా నీరు కారడం 👁🗨కళ్ళు వాపు 👁🗨నిద్ర లేచిన తర్వాత కనురెప్ప అతుక్కుపోవడం 👁🗨నిర్లక్ష్యం చేస్తే కండ్ల నుంచి చీము కారడం#Conjuctivitis #HealthForAll #SwasthaBharat #EyeFlu #EyeConjuctivitis pic.twitter.com/rMmPxOdB0g — PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 2, 2023 -
కంటి వ్యాధులకు జన్యు చికిత్స
న్యూఢిల్లీ: వంశపారంపర్యంగా వచ్చే కంటి వ్యాధులను నయం చేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రిలయన్స్ లైఫ్ సైన్సెస్‌కు లైసెన్స్ ఇచ్చింది. ఈ జన్యు చికిత్సను రిలయన్స్ లైఫ్ మరింత అభివృద్ధి చేసి వాణిజ్యపరం చేయనుంది. జన్యు చికిత్సకు (జీన్ థెరపీ) సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, భారత్‌లోని ఒక విద్యాసంస్థ నుండి కంపెనీకి బదిలీ చేయడం ఇదే మొదటిసారి అని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఐఐటీ కాన్పూర్‌కు చెందిన బయాలాజికల్ సైన్సెస్, బయో ఇంజనీరింగ్ విభా గానికి చెందిన జయంధరణ్ గిరిధర రావు, శుభమ్ మౌర్య ఈ పేటెంటెడ్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. జంతువుల్లో దృష్టి లోపాన్ని సరిదిద్దడంలో ఇది మెరుగ్గా పనిచేసిందని ఐఐటీ కాన్పూర్ తెలిపింది. -
అసలే వేసవి, ఆపై కంప్యూటర్ కాలం.. కళ్లు ‘కళ’ తప్పితే.. చిన్న వయసులోనే!
సాక్షి, పార్వతీపురం: కళ్లు నిత్యం తడిగా ఉంటాయి.. కంటినిండా నీరు ఉంటుంది.. ఒక విధంగా చెప్పాలంటే నేత్రాలు నిండు జలాశయాలు వంటివి. అయితే మనిషి నిర్లక్ష్యం కారణంగా కంటిలో తడి ఆరిపోతోంది. నేత్ర వ్యాధులు అధికమవుతున్నాయి. చివరకు చూపు మసకబారుతోంది. అన్ని ఇంద్రియాల్లో కంటే కన్ను చాలా విలువైనది. అందమైన ఈ ప్రపంచాన్ని చూడాలంటే కళ్లు కలకాలం చల్లాగా ఉండాలి. చూపు శాశ్వతమవ్వాలి. కానీ మనిషి దుష్ప్రవర్తన కారణంగా కంటి సమస్యలు ఏర్పడి పిన్న వయస్సులోనే అంధత్వం ఏర్పడుతోంది. మనిషి నిమిషానికి ఎనిమిది సార్లు కంటి రెప్పలు ఆర్పుతుంటాడు. అలా చేయడం ద్వారా కార్నియాకు అవసరమైన నీరు చేరి కళ్లు ఎండిపోకుండా చేస్తాయి. వేసవి ప్రయాణాల్లో వేడి గాలులకు కళ్లు తడి ఆరిపోయి దురదలు ప్రారంభమవుతున్నాయి. వేసవి ప్రయాణాల్లో కంటి రెప్పలు నిమిషానికి రెండు నుంచి మూడు సార్లు మాత్రమే కొట్టుకుంటున్నాయని వైద్యులు ఒక సర్వేలో పేర్కొన్నారు. ఫలితంగా కంటి సమస్యలు వచ్చి ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు తలనొప్పి వంటివి కూడా వస్తున్నాయని వెల్లడించారు. చదవండి👉🏼 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు, బచ్చలి కూర తిన్నారంటే! అధిక వినియోగం ముప్పు.. ప్రస్తుతం సాంకేతికత రాజ్యమేలుతోంది. అన్ని చోట్లా కంప్యూటర్ వినియోగం పెరిగింది. ప్రతి పది మందిలో తొమ్మిది మందికి పైగా ప్రజలు మొబైల్ వినియోగిస్తున్నారు. నిత్యం కంప్యూటర్‌తో వర్క్ చేయడం, మొబైల్ ఆపరేటింగ్‌లో తలమునకలవ్వడం కారణంగా కళ్లు పొడిబారి పోతున్నాయి. ప్రస్తుతం ప్రతి 100 మందిలో 60 నుంచి 70 మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో 99 శాతం మంది కార్నియ సమస్యలకు గురవుతున్నారు. వేడిగాలుల బారిన పడడం, ఆండ్రాయిడ్, కంప్యూటర్ వినియోగించడం, రాత్రి 12 గంటల వరకు సెల్‌ఫోన్‌తో గడపడం కారణంగా ఈ సమస్య వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. 15 నుంచి 40 ఏళ్ల మద్య ఉన్నవారే అధికంగా ఈ సమస్యకు గురవుతున్నట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. చదవండి👉🏻 నోరూరించే అటుకుల కేసరి.. ఇంట్లో ఇలా సులువుగా తయారు చేసుకోండి! సాధారణ కన్ను పొడిబారిన కన్ను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► వేసవిలో ప్రయాణించే వారు తప్పనిసరిగా కళ్లజోడు ధరించాలి. ► ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగం తగ్గించుకోవాలి. ► కంప్యూటర్ల వద్ద గంటలకొద్దీ గడపరాదు. ► కంటి రెప్పలు ఎక్కువసార్లు కొట్టుకొనే విధంగా ప్రయత్నించాలి. ► తరచూ ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి. ► కంటికి దురదలు వచ్చే సమయంలో చేతితో నలపరాదు ► కళ్లు ఎర్రగా ఉంటే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. చదవండి👉🏾 చట్టం తనపని తాను చేసుకుపోతుంది: మంత్రి బొత్స అవగాహన తప్పనిసరి రోజురోజుకూ కంటి సమస్యలు అధిగమవుతున్నాయి. 70 శాతం మంది కంటి రోగాలతో బాధపడుతున్నారు. ఇవి చిన్నవైనప్పటికీ జాగ్రత్తలు పాటించాలి. వేసవిలో బయట ప్రయాణాలు వద్డు. ఆండ్రాయిడ్ మొబైల్‌ను చిన్నారులకు ఇవ్వరాదు. టీవీ, సెల్‌ఫోన్, కంప్యూటర్ వాడే సమయంలో అరగంట కొకసారి ప్రతి పది నిమిషాలకు ఒకసారి విరామం ఇవ్వాలి. ఏవైనా కంటి సమస్యలు వస్తే నేరుగా వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ జీరు నగేష్‌రెడ్డి, వైఎస్సార్ కంటి వెలుగు జిల్లా ఇన్చార్జ్, పార్వతీపురం మన్యం -
చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం
చిన్నపిల్లలు మెుబైళ్లు, టీవీలు అధికంగా చూడటంతో దృష్టి లోపాలతో ఇబ్బంది పడుతుంటారు. పిల్లలు సరైన పోషకపదార్థాలు తీసుకోకపోవడం వలన చిన్న వయస్సులోనే కంటి జబ్బులు తప్పట్లేదు. కాయగూరలు, పండ్లు తినడం ద్వారా శరీరానికి స్వాభావికంగా కంటి జబ్బుల నుంచి దూరం చేసే శక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జామ కంటికి ఎంతో సహాయపడుతుంది. దీంతోపాటు నల్లద్రాక్ష, కొత్తిమీర, మెంతికూరను ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటే దృష్టి లోపాలను నివారించవచ్చు. అందుకే పిల్లలు తీసుకునే ఆహారంలో బీన్స్, క్యారెట్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మునగ ఆకులు, అల్లం, గుమ్మడికాయ, సొరకాయ, పొట్లకాయ, మామిడి పండ్లు వంటివి చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు ఇలా రకరకాలుగా తిండి పెట్టడం వలన మీరు వారి కంటి జబ్బులను దూరం చేయవచ్చు. ఈ కూరగాయలు, పండ్లలో విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక్క కంటి సమస్యలే కాదు... అనేక ర కాల సమస్యలకు ఆహారంతోనే చెక్ పెట్టవచ్చు. వీటితోపాటు రోజూ ఒక స్పూను తాజా వెన్నను తినిపించడం ద్వారా కూడా కంటిజబ్బులను నివారించవచ్చు. సీజన్లో లభించే పండ్లను తినడం పిల్లలకే కాదు, పెద్దల కంటికి కూడా మంచిదే. -
కంటి జబ్బులకు వినూత్న కాంటాక్ట్ లెన్స్!
కాలో చేయో విరిగితే అతికించవచ్చునేమోగానీ.. అలాంటి దెబ్బ కంటికి తగిలితే మాత్రం చాలా ఇబ్బంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్త ఒకరు వినూత్నమైన కాంటాక్ట్ లెన్స్ సిద్ధం చేశారు. మానవ ఉమ్మునీటితో తయారయైన ఈ కాంటాక్ట్ లెన్స్‌లలో లింబల్ మెసెన్కైమల్ స్టోమల్ కణాలతో నిండి ఉంటుంది. కనుగుడ్ల మార్పిడి శస్త్రచికిత్సల్లో వ్యర్థాలుగా ఉండే ఈ కణాలు కంటి గాయాలను మాన్పడంలో సాయపడతాయి. అలాగే ఉమ్మునీటితో తయారైన త్వచాలు మంట/వాపులు, గాయపు గుర్తులు మాన్పే లక్షణమున్నట్లు ఇప్పటికే స్పష్టమైంది. కనుగుడ్డుపై వచ్చే అల్సర్లు, సంప్రదాయ చికిత్స పద్ధతులకు లొంగని కొన్ని సమస్యలకు ఈ కొత్త పద్ధతి ద్వారా ఉపశమనం లభిస్తుందని అంచనా. ఇళ్లల్లో, ఫ్యాక్టరీల్లో ప్రమాదకరమైన రసాయనాలు సోకినప్పుడు ఏర్పడే గాయాలకూ ఈ వినూత్న కాంటాక్ట్ లెన్స్‌ను మెరుగైన చికిత్స కాగలవని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డేమియన్ హార్కిన్ అంటున్నారు. అయితే ఉమ్మునీటి త్వచాలు అవసరమైనప్పుడు అందుబాటులో ఉండటం ఒక్కటే కొంచెం సమస్యగా ఉందని చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో ఐదేళ్లలో ఈ కొత్త రకం కాంటాక్ట్ లెన్స్‌లు అందరికీ అందుబాటులోకి రావచ్చునని హార్కిన్ అంటున్నారు. -
11 రోజుల కార్నియాను వాడొచ్చు
న్యూయార్క్: దాతల నుంచి సేకరించిన కార్నియాలను 11 రోజుల వరకు కూడా ఉపయోగించవచ్చని పరిశోధకులు గుర్తించారు. ఇప్పటి దాకా వారం రోజుల కార్నియాను మాత్రమే అమర్చేవారు. వారం దాటిన తర్వాత అయితే అవి సరియైన ఫలితాలనివ్వవని నమ్ముతూ వచ్చారు. అయితే, జొనాథన్ లాస్ వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సేకరించిన కార్నియాలను దాదాపు 11 రోజుల దాకా ఉపయోగించి మంచి ఫలితాలను సాధించగలిగారు. ఇప్పటి వరకు ఆచరించిన విధానం కేవలం నమ్మకం పైనే ఆధారపడి ఉందని, దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెప్పారు. అయితే తమ పరిశోధనలు ఈ పద్ధతిలో సమూల మార్పులు తేనున్నాయని వర్సిటీ పరిశోధకుడు జొనాథన్ లాస్ తెలిపారు. మూడేళ్లలో 1090 వ్యక్తులకు 11 రోజుల పాటు భద్రపరిచిన కార్నియాలతో విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. వారం రోజుల పాటు ఉన్న కార్నియాలతో ఆపరేషన్ సక్సెస్ రేట్ 95.3 శాతం ఉండగా 11 రోజుల పాటు ఉన్న కార్నియాలతో సక్సెస్ రేటు 92.1 శాతంగా ఉందని వివరించారు. -
మెడివిజన్‌లో ‘ఫెమ్టా సెకండ్ లేజర్ సర్జరీ’ సేవలు
మెడివిజన్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ రవికుమార్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇప్పటివరకు విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న కేటరాక్ట్ సర్జరీలో వినియోగించే లిక్విడ్ ఆప్టిక్స్ ఇంటర్ఫేస్ ‘ఫెమ్టా సెకండ్ లేజర్ చికిత్స’ హైదరాబాద్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. నగరంలోని మెడివిజన్ ఐ కేర్ సెంటర్ దీన్ని ఆరంభించింది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ శస్త్రచికిత్స నాణ్యమైనదే కాక... 30 మైక్రాన్ల మందంలో (మనిషి వెంట్రుక మందంలో 3వ వంతు) కూడా పనిచేస్తుందని మెడివిజన్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ రవికుమార్‌రెడ్డి చెప్పారు. శనివారమిక్కడ లిక్విడ్ ఆప్టిక్స్ ఇంటర్ఫేస్ పేరిట కేటరాక్ట్ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో కంటి జబ్బులకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం కొరత వల్ల లక్షలాది కేసుల్లో సగం కూడా శస్త్రచికిత్సలు చేయలేకపోతున్నారని తెలియజేశారు. అందుకే విదేశాల్లో మాదిరిగా కాటరాక్ట్ చికిత్సలోనూ టెక్నాలజీని వినియోగించాల్సిన అవసరాన్ని గుర్తించామన్నారు. ఈ సందర్భంగా చికిత్స ప్రత్యేకతలను డాక్టర్ రవికుమార్ వివరించారు. సినీ నిర్మాత డి.సురేశ్‌బాబు, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కేర్ ఆసుపత్రి డెరైక్టర్ సురేశ్, కన్సల్టెంట్ ఆప్తాల్మాలజిస్ట్, కేటరాక్ట్ అండ్ రిఫ్రెక్టివ్ సర్జన్ డాక్టర్ రూపక్ కుమార్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కంటికి జిమ్
ఒంటికి జిమ్ లాగే కంటికీ జిమ్ ఉంటుంది. కానీ, కంటికి చేయవలసిన వ్యాయామాలు కొన్ని వ్యాధులు ఉన్నప్పుడు వాటి చికిత్సకోసం ఉపయోగపడుతాయి. ఒంటికి చేసే వ్యాయామం ప్రాధాన్యం మనకు తెలియనిది కాదు. ఆయా అవయవాలకోసం చేసే ప్రత్యేక వ్యాయామాలు వాటి బలాన్ని, సామర్థ్యాన్ని పెంచేందుకు అవి ఉపకరిస్తాయి. అలాగే కంటికి చేసే ఈ వ్యాయామాల వల్ల రెండు కళ్లూ ఒకేలా చూసే క్రమంలో (బైనాక్యులార్ విజన్‌లో) ఏవైనా లోపాలు వచ్చినప్పుడు వాటిని సరిదిద్దవచ్చు. వీటిని ఎలా చేయాలో కంటి వైద్య నిపుణులు సూచిస్తుంటారు. కంటి కోసం వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఎప్పుడొస్తుంది, వాటిని సందర్భాల్లో సూచిస్తారు అన్న విషయాలు తెలుసుకుందాం. దృష్టిని మెరుగుపరిచేందుకు ఆఫ్తాల్మాలజిస్టులు కంటి వ్యాయామాలు చేయించడం 1928లో మొదలైంది. దీన్ని ఒక ప్రత్యేక విభాగంగానూ అభివృద్ధి చేశారు. కంటికి చేయించే వ్యాయామాల విభాగాన్ని వైద్య పరిభాషలో ‘ఆర్థాప్టిక్స్’ అంటారు. ఈ విభాగాన్ని తొలిసారి బ్రిటన్ గుర్తించింది. కంటి వ్యాయామాలకు ఇంతటి సుదీర్ఘ చరిత్ర ఉన్నా నిజానికి సాధారణ ప్రజల్లో దీని గురించిన అవగాహన పరిమితమే. ఎలాంటి సందర్భాల్లో కంటి వ్యాయామాలు అవసరం? కంటికి సంబంధించి మూడు రకాలుగా ఉపయోగపడేలా కంటి వ్యాయామాలు చేయవచ్చు. చికిత్సలో భాగంగా వీటిని చేయించడం ద్వారా నిపుణులు దృష్టిని మెరుగుపరచగలరు. అవి... 1) తప్పక ఉపయోగపడతాయని నిరూపితమైనవి : మెల్లకన్ను లేదా స్ట్రాబిస్మస్ : రెండు కళ్ల చెందిన నల్లగుడ్లు ఒకేలా లేని (విజువల్ యాక్సిస్ పారలల్‌గా లేని) సందర్భాన్ని మెల్లకన్ను లేదా స్ట్రాబిస్మస్ అంటారు. సాధారణ వ్యక్తులందరిలోనూ రెండు కళ్లతోనూ ఒకే దృశ్యాన్న చూస్తుంటారు. దీన్ని బైనాక్యులార్ సింగిల్ విజన్ అంటారు. కానీ మెల్లకన్ను వ్యాధి ఉన్నవారిలో రెండు కనుగుడ్లూ ఒకేచోట కేంద్రీకృతం కావు. కనుగుడ్డు తిరిగి ఉన్న పొజిషన్ ఆధారంగా దీన్ని నాలుగు రకాలుగా విభజిస్తారు. అవి... ఎ) ఎగ్సోట్రోఫియా (కనుగుడ్డు బయటివైపునకు తిరిగి ఉండటం) బి) ఈసోట్రోఫియా (కనుగుడ్డు లోపలి వైపునకు తిరిగి ఉండటం) సి) హైపర్ట్రోఫియా (పై వైపునకు తిరిగి ఉండటం) డి) హైపోట్రోఫియా (కిందివైపునకు తిరిగి ఉండటం) సరిచేసే వ్యాయామాలు : మెల్లకన్నులోని పై నాలుగు లోపాలను సరిచేయడానికి రకరకాల వ్యాయామాలు ఉన్నాయి. అందులో కొన్ని ఇవి... 1) పెన్సిల్ పుష్అప్స్ (ఇందులో ఒక పెన్సిల్‌ను ముక్కుకు సూటిగా పెట్టుకొని దగ్గరగా, దూరంగా జరుపుతుంటారు) 2) బ్రోక్ స్ట్రింగ్ (ఫ్రెడ్రిక్ బ్రోక్ అనే నిపుణుడు రూపొందించిన ఈ వ్యాయామ రీతికి ఆయన పేరునే పెట్టారు. ఇందులో ఒక పది అడుగుల పురికొసపైన దారానికి మూడు పూసలు ఎక్కించి, ఆ పూసల స్థానాలను మారుస్తూ వాటిని కంటితో చూసేలా వ్యాయామం చేయిస్తారు). 3) బ్యారెల్ కార్డ్స్ ఎక్సర్సైజ్ (పేకముక్కల వంటి వాటిపై వేర్వేరు రంగులను అద్ది, ఒక్కోముక్కపైనా కాసేపు దృష్టిసారిస్తూ, మరో ముక్కవైపునకు దృష్టి మళ్లిస్తూ చేసే ఒక రకం వ్యాయామం ఇది). ఇవీగాక ప్రత్యేకమైన వైద్యపరమైన పరికరాలతోనూ వ్యాయామాలు చేయిస్తారు. ఆంబ్లోపియా (లేజీ ఐ): ఇందులో చూడటానికి రెండు కళ్లూ బాగానే కనిపించినా ఒక కంటి నుంచి మెదడుకు అందే దృశ్యంలో స్పష్టత తగ్గుతూ ఉండటం వల.్ల... మెదడు నాణ్యమైన దృశ్యం అందే కంటి నుంచే దృష్టి సంకేతాలను స్వీకరిస్తుంటుంది. అంతగా నాణ్యత లేని కంటి నుంచి సంకేతాలను నిరాకరిస్తూ ఉండటం వల్ల క్రమంగా ఒక కంటి చూపు తగ్గుతూ పోతుంది. ఈ ప్రక్రియను సప్రెషన్ అంటారు. కాలక్రమంలో ఆ కన్ను చూపును కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ కండిషన్‌ను సరిచేయడానికి వ్యాయామాలు ఉంటాయి. దీనికి అక్లూజన్ అనే వ్యాయామం చేయిస్తారు. ఇందులో బాగా కనపడే కంటిని పాక్షికంగానో లేదా పూర్తిగా మూసి, సరిగా కనిపించని కంటి ద్వారా మంచి నాణ్యమైన సంకేతాలు మెదడుకు అందేలా క్రమంగా అలవాటు చేస్తారు. దాంతో నాణ్యమైన సంకేతాలు పంపడం మానేసిన ‘లేజీ ఐ’ కూడా క్రమంగా బలపడుతూ పోతుంది. 2) దృష్టిని మెరుగుపరచడానికి పరోక్షంగా ఉపయోగపడేవి మామూలుగా మనం చేసే వ్యాయామ కార్యకలాపాలు మన పూర్తి ఆరోగ్యానికి మేలు చేసినట్లే, మన కళ్లకూ బలాన్ని చేకూర్చి, అనేక కంటి వ్యాధులను నివారిస్తాయి. మనం చేసే వ్యాయామాలు మన రక్తంలోని కొలెస్ట్రాల్ పాళ్లను అదుపులో పెడతాయి. వ్యాయామంతో అన్ని అవయవాలకు రక్తసరఫరా పెరిగినట్లే, కళ్లకూ రక్తసరఫరా పెరిగి ఎక్కువ మోతాదులో ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. దాంతో కళ్లు, కంటి కండరాలు కూడా బలపడతాయి. కంటికి వచ్చే అనేక వ్యాధులు వాటంతట అవే నివారితమవుతాయి. అవి... క్యాటరాక్ట్ (కళ్లలో తెల్ల ముత్యం), ఏఆర్‌ఎమ్‌డీ (ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్), డయాబెటిక్ రెటినోపతి, హైపర్టెన్సివ్ రెటినోపతి, గ్లకోమా వంటివి. 3) కంటి ఆరోగ్యానికి తాత్కాలికంగా మాత్రమే ఉపయోగపడేవి ఇవి కంటిపై ఉన్న భారాన్ని తాత్కాలికంగా తొలగించి, కొద్దిపాటి ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. అప్పటికప్పుడు కనిపించే ప్రయోజనమే తప్ప దీర్ఘకాలిక లాభం ఉండని వ్యాయామరీతులుగా వీటిని చెప్పవచ్చు. అవి... ♦ కనుగుడ్డును కదిలిస్తూ ఉండటం; ♦ రెండుకళ్లనూ అరచేతులతో మూసుకొని కళ్లకు తాత్కాలిక విశ్రాంతి ఇచ్చి, కొంతసేపు ఉపశమనం కలిగించడం (దీన్ని పామింగ్ అంటారు); ♦ బ్లింకింగ్ (రెండు రెప్పలనూ ఠక్కున కొడుతూ ఉండటం, ఈ ప్రక్రియలో కారు అద్దాలపై నీరు చిమ్మి వైపర్స్‌తో శుభ్రం చేసినట్లుగానే, కంటిలోని నీటి (లాక్రిమల్ సెక్రిషన్స్) సహాయం వల్ల బ్లింకింగ్ చేసినప్పుడల్లా కన్ను శుభ్రమవుతుంది. ♦ యానింగ్ (ఆవలించడం - మనం ఆవలించినప్పుడు ఒక్కోసారి కంటిలో కొద్దిగా నీళ్లు రావడం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. ఈ కన్నీరు (లాక్రిమల్ సెక్రిషన్) కంటిలోని పొడిదనాన్ని తొలగించి, కన్నును తేమగా ఉండేలా చేస్తుంది. ప్రమాదకరం... ఎప్పుడూ చేయకూడని పని సన్నింగ్ కొందరు వ్యాయామంలో భాగంగా ‘సన్నింగ్’ అనే ప్రక్రియను చేస్తుండేవారు. ఇది తమకు మేలు చేసే అంశంగా భావించేవారు. ఈ తరహా భావన 1920 ల నుంచి 1960ల వరకు రాజ్యమేలుతూ ఉండేది. సన్నింగ్లో భాగంగా పట్టపగలు సూర్యుణ్ణి తదేకంగా కాసేపు చూస్తుండేవారు. ప్రాతఃకాలం, సాయం సందెవేళ మినహాయించి మిగతా ఏ సమయంలోనూ ఎలాంటి రక్షణ ఉపకరణాలు లేకుండా సూర్యుణ్ణి తదేకంగా చూడటం కంటికి తీవ్రంగా హానిజరుగుతుందనే విషయాలను గుర్తుంచుకోండి. దీన్నే ‘రెటినల్స్ బర్న్స్’ అంటారు. ఇక కంటి చూపును అద్దాలతో మాత్రమే సరిదిద్దగలిగే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అయిన మయోపియా, హైపరోపియా, ఆస్టిగ్మాటిజమ్ వంటి లోపాలను వ్యాయామాలతో సరిదిద్దలేం. వీటికి ఎలాంటి కంటి వ్యాయామాలూ (ఆక్యులార్ ఎక్సర్‌సెజైస్) ఉండవు. వీటిని సరిచేయడానికి కేవలం అద్దాలనే వాడాలి. డాక్టర్ కె. రవికుమార్‌రెడ్డి కంటి వైద్య నిపుణులు, మెడివిజన్ ఐ హాస్పిటల్, హైదరాబాద్ -
దృష్టికి అవరోధాలూ... అధిగమించే ఐడియాలు
లోచనాలూ - లోపాలు మనం చూసే ప్రక్రియలో ఎలాంటి అవరోధం కలిగినా వైద్యపరిభాషలో దాన్ని ‘విజువల్ డిస్టర్బెన్సెస్’ అంటారు. అంటే... చూసేటప్పుడు మనకు కలిగే అంతరాయాలన్నమాట. ఇవి అనేక రకాలుగా ఉంటాయి. చూపునకు అంతరాయం కలిగించే కొన్ని అంశాలు తాత్కాలికమైనవి. వీటి గురించి కొద్దిపాటి జాగ్రత్తలు, చికిత్స తీసుకుంటే మళ్లీ అంతా మామూలైపోతుంది. కానీ... దృష్టికి కలిగే కొన్ని అంతరాయాలు మాత్రం క్రమంగా పెరుగుతూ పోతాయి. ఫలితంగా శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి విజువల్ డిస్టర్బెన్సెస్ గురించి ప్రాథమిక అవగాహన ఉండటం వల్ల కంటి చూపును పదికాలాల పాటు పదిలంగా కాపాడుకోవచ్చు. అందుకు ఉపయోగపడేదే ఈ ప్రత్యేక కథనం. తాత్కాలిక వ్యాధులు తాత్కాలిక లోపాలే అని నిర్లక్ష్యం చేయడం సరికాదు. ఒక్కోసారి అవి శాశ్వతం కావచ్చు. మైగ్రేన్ ఇది తీవ్రమైన తలనొప్పి. ముఖ్యంగా యువతలో ఎక్కువ. ఒకవైపు కంటిలో లేదా తలలో ఒక పక్క ఈ నొప్పి వస్తుంటుంది. అందుకే పార్శ్వపు నొప్పి అంటారు. ఈ నొప్పిలో వికారం, వాంతులతో పాటు, కొందరిలో ఏదో కాంతి ఆవరించినట్లుగా ఉంటుంది. దీన్నే ‘విజువల్ ఆరా’ అంటారు. కళ్ల ముందు మిరిమిట్లు గొలిపే మెరుపులూ కనిపించవచ్చు. చికిత్స: నొప్పిని తక్షణం తగ్గించేవాటితో పాటు... మున్ముందు రాకుండా నివారించే మందులు... దాదాపు ఏడాది నుంచి రెండేళ్ల పాటు వాడాలి. క్యాటరాక్ట్ (తెల్ల ముత్యం) కంటిలో ఉండే లెన్స్ పారదర్శకంగా ఉండటం వల్ల మనకు ఎదుటి వస్తువులు స్పష్టంగా కనిపిస్తుంటాయి. కానీ కాలక్రమంలో ఈ లెన్స్ తన పారదర్శకతను కోల్పోతుంటుంది. దాంతో దృష్టి సన్నగిల్లడం, ఒకవస్తువు రెండుగా కనిపించడం, అనేక దొంతరలుగా కనిపించడం, మసకబారడం, రాత్రివేళ చూడటం కష్టమైపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స: ఈ సమస్య చాలా సాధారణం. అత్యంత సాధారణమైన శస్త్రచికిత్స ద్వారా కంటిలోని లెన్స్‌ను మార్చి మరో పారదర్శకమైన లెన్స్ అమర్చడం వల్ల చికిత్స తర్వాత మళ్లీ మామూలుగానే చూడగలం. ట్రామా (గాయాలు) కంటికి దెబ్బతగిలినప్పుడు తక్షణం కనిపించే లక్షణాలు, ఆ తర్వాత కనిపించే లక్షణాలు వేర్వేరుగా ఉండవచ్చు. చూపు మసకబారవచ్చు. కంటిముందు మెరుపులు కనిపించడం, కంటిలోని ద్రవం (విట్రియల్) బయటకు రావడం, దీర్ఘకాలంలో గ్లకోమా, రెటీనా పొరలు విడిపోవడం, కంటి నరం దెబ్బతినడం వంటి ప్రమాదాలు జరగవచ్చు. చికిత్స: కంటికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు (ట్రామా కేసుల్లో) అత్యవసరంగా తగిన చికిత్స చేస్తే చూపు కోల్పోయే అవకాశాలు తక్కువ. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా ఫాలో అప్ దీర్ఘకాలం పాటు చేయిస్తూ ఉండాలి. రేచీకటి (నైట్ బ్లైండ్నెస్) ఇది మనం తీసుకునే ఆహారంలో విటమిన్-ఏ పాళ్లు తగ్గడం వల్ల కలిగే కంటి సమస్య. మరికొందరిలో ఇది రెటీనాకు వచ్చే ఆరోగ్య సమస్యలు వల్ల ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య వచ్చినవారిలో రాత్రిపూట కనిపించకపోవడం వంటి లక్షణాలుంటాయి. ఇక విటమిన్-ఏ లోపం తీవ్రంగా ఉన్నవారిలో కార్నియా కరిగిపోయే పరిస్థితి వస్తుంది. దీన్నే వైద్యపరిభాషలో ‘కెరటోమలేసియా’ అంటారు. పిల్లల్లో ఇది ఎక్కువ. అది అత్యవసరమైన పరిస్థితి (ఎమర్జెన్సీ). చికిత్స: ఆహారంలో విటమిన్ ఏ ఉన్న పదార్థాలు ఇవ్వడం, విటమిన్-ఏ మాత్రలు వాడటం వంటివి చికిత్సలు. డ్రగ్స్ కార్టికోస్టెరాయిడ్స్, కీళ్లనొప్పుల కోసం దీర్ఘకాలం పాటు వాడే కొన్ని మందులు, క్షయవ్యాధికి వాడే కొన్ని రకాల మందుల వల్ల స్కోటోమాస్ వచ్చి క్రమంగా చూపు తగ్గుతూ పోవచ్చు. ఒక్కోసారి ఇది శాశ్వతమూ కావచ్చు. అందుకే చూపు తగ్గుతున్నట్లు గ్రహించగానే డాక్టర్‌ను సంప్రదించి, తాము వాడుతున్న మందులను వివరించి, తగిన చికిత్స తీసుకోవాలి. దాంతో కోల్పోయిన చూపు తిరిగి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. పక్షవాతం (స్ట్రోక్ ) పక్షవాతం వచ్చినవారిలో మెదడులోని కొన్ని భాగాలకు రక్తసరఫరా తగ్గడం వల్ల ఆ భాగాలు చచ్చుబడిపోతాయి. ఒకవేళ కంటిచూపును నియంత్రించే కేంద్రానికి రక్తప్రసరణ తగ్గితే, ఆ ప్రభావం చూపుపై పడవచ్చు. ఇది సాధారణంగా తాత్కాలికం అయ్యేందుకే అవకాశాలు ఎక్కువ. అయితే కొన్ని సందర్భాల్లో ఇది శాశ్వత అంధత్వానికీ దారితీయవచ్చు. చికిత్స: ఈ విషయంలో నివారణే చికిత్సతో సమానం. డయాబెటిస్‌ను, రక్తపోటును అదుపులో ఉంచుకోవడం వల్ల ఈ ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. అప్పటికీ స్ట్రోక్ బారిన పడితే న్యూరాలజిస్ట్‌ల ఆధ్వర్యంలో చికిత్స తీసుకోవాలి. బ్రెయిన్ ట్యూమర్స్ మెదడులో వచ్చే గడ్డలు (ఉదా: పిట్యూటరీ గడ్డల వంటివి) పెరిగిపోతూ... అవి చూపును మెదడుకు చేరవేసే ఆప్టిక్ నర్వ్ అనే నరాన్ని నొక్కివేయడం వల్ల లేదా కంటికీ, నరానికీ రక్తప్రసరణ కల్పించే రక్తనాళాన్ని నొక్కివేయడం వల్ల ఒక్కోసారి పాక్షిక అంధత్వం రావచ్చు. ఇందులో ఒక్కోసారి కంటికి ఎదురుగా ఉన్న మొత్తం దృశ్యం కాకుండా సగమే కనిపించవచ్చు. అలాంటి లక్షణం కనిపించినప్పుడు మెదడులో గడ్డలు ఉన్నట్లు అనుమానించి, నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. గడ్డలు ఉన్నట్లయితే వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తే మళ్లీ కోల్పోయిన చూపు వచ్చేందుకే అవకాశాలు ఎక్కువ. పొగతాగడం వల్ల దీనివల్ల వచ్చే తాత్కాలిక అంధత్వం (టొబాకో ఆంబ్లోపియా), ఆ అలవాటును మానివేస్తే తొలగిపోతుంది. శాశ్వత వ్యాధులు ఈ కంటి వ్యాధులు శాశ్వత అంధత్వానికి దారితీస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. గ్లకోమా మన కంటిలోని నల్లగుడ్డులో ఉన్న ద్రవాలు కొంత ఒత్తిడిని కలిగిస్తుంటాయి. ఈ ఒత్తిడినే ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ అంటారు. అయితే ఈ ఒత్తిడి క్రమంగా పెరుగుతూ పోవడం వల్ల మనం చూసే ప్రాంతపు వైశాల్యం క్రమంగా కుంచించుకుపోతూ, చికిత్స తీసుకోకపోతే శాశ్వతంగా చూపు పోయే ప్రమాదం ఉంది. దీన్నే గ్లకోమా అంటారు. చికిత్స : గ్లకోమాకు చికిత్స మూడు విధాలుగా జరుగుతుంది. మొదటిది మందులతో ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్‌ను పెరగకుండా ఉంచడం. రెండోది లేజర్ చికిత్స. ఇంకా ప్రెషర్ అదుపులోకి రాకపోతే శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. రెటినల్ డిటాచ్మెంట్ ఈ సమస్య ఉన్న వారిలో రెటీనా లోని లోపలి పొర, బయటి పొర మధ్యలోకి కొన్ని రకాల ద్రవపదార్థాలు రావడం వల్ల ఆ రెండు పొరలూ విడిపోవచ్చు. ఫలితంగా కొంతమేరకు గాని లేదా పూర్తిగా కాని దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉంది. చికిత్స : పై సమస్యలు కనిపించినప్పుడు వెంటనే కంటి డాక్టర్‌ను సంప్రదించాలి. అప్పుడు డాక్టర్లు అత్యవసర శస్త్రచికిత్స చేసి, విడిపోయిన రెండు రెటీనా పొరలను కలుపుతారు. డయాబెటిక్ రెటినోపతి డయాబెటిస్ ఉన్నవారిలో రక్తం మందంగా మారుతుంది. ఇలా మందంగా మారిన రక్తం అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన రక్తనాళాల నుంచి ప్రవహించడం కష్టం కావడం వల్ల రెటినాకు తగినంత రక్తప్రసరణ జరగదు. ఫలితంగా చక్కెర పాళ్లను సమర్థంగా అదుపులో ఉంచుకోని వారిలో రెటీనా దెబ్బతినే అవకాశాలు ఎక్కువై చూపు పోయే ప్రమాదం ఉంది. చికిత్స : డయాబెటిక్ రెటినోపతి కండిషన్ ఉన్నట్లు నిర్ధారణ అయితే తక్షణ లేజర్ చికిత్సతోగానీ లేదా కంటిలో ఇచ్చే ఇంజెక్షన్లతో గాని లేదా శస్త్రచికిత్స మార్గాల ద్వారాగాని చూపును మరింత కోల్పోకుండా ఆపే అవకాశాలు ఉంటాయి. హైపర్టెన్సివ్ రెటినోపతి మన దేహంలోని అన్ని అవయవాలతో పాటు కంటికీ నిత్యం రక్తప్రసరణ జరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే రక్తపోటు ఉన్నవారిలో రక్తం వల్ల రక్తనాళాలపై కలిగే ఒత్తిడి తీవ్రంగా పెరిగినప్పుడు అత్యంత సన్నటి రక్తకేశనాళికలు (క్యాపిల్లరీస్) ఆ ఒత్తిడికి చిట్లిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా చూపు కోల్పోయే అవకాశం ఉంది. చికిత్స : ఈ సమస్య వల్ల చూపు కోల్పోకుండా ఉండేందుకు రక్తపోటును అదుపులో ఉంచుకోవడమనే నివారణ చర్య చాలా ఉత్తమమైన మార్గం. కొందరిలో లేజర్ లేదా శస్త్రచికిత్స అవసరం కావచ్చు. ఏఆర్‌ఎమ్‌డీ ఇది వయసుతో పాటు వచ్చే కంటి సమస్య. ‘ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్’ అనే ఇంగ్లిష్ పదాలకు ఏఆర్‌ఎమ్‌డీ అన్నది సంక్షిప్త రూపం. వీరిలో రెటీనాలోని ‘మాక్యులా’ అనే మధ్యభాగం ప్రభావితం కావడం వల్ల ఇది వస్తుంది. చికిత్స: ఈ సమస్య ఉన్నవారు తక్షణం డాక్టర్‌ను కలిస్తే లేజర్ చికిత్స ద్వారాగానీ లేదా కంటిలోని విట్రియల్ ఛేంబర్ అనే ప్రాంతంలో ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్లగానీ లేదా శస్త్రచికిత్సతో గాని సమస్యను పెరగకుండా చూడవచ్చు. థైరాయిడ్ ఐ డిసీజ్ ఇది హైపోథైరాయిడజమ్ లేదా హైపర్ థైరాయిడిజమ్ వ్యాధులు ఉన్న రోగుల్లో కనిపించే సమస్య. ఈ సమస్య ఉన్న కొందరిలో కనుగుడ్లు ముందుకు పొడుచుకు వచ్చినట్లుగా కనిపిస్తుంటాయి. దీన్నే వైద్యపరిభాషలో ప్రోప్టోసిస్ అంటారు. కొందరిలో కన్ను పొడిబారవచ్చు. ఒకే వస్తువు రెండుగా కనిపించడం, కంటి నొప్పి, గ్లకోమా కూడా రావచ్చు. చికిత్స : లక్షణాలు కనిపించగానే థైరాయిడ్ హార్మోన్ల సమతౌలత్య నెలకొనేలా హార్మోన్ చికిత్స తీసుకోవాలి. కొందరిలో ఆర్బిటాల్ డీకంప్రెషన్ అనే శస్త్రచికిత్స అవసరం కావచ్చు. కెరటోకోనస్ వ్యాధి సాధారణంగా గమనించి చూస్తే మన కంటి నల్ల గుడ్డు ప్రాంతం ఒకింత ఉబ్బెత్తుగా కనిపిస్తూ గుండ్రం (స్ఫెరికల్)గా ఉంటుంది. కానీ కెరటోకోనస్ అనే కండిషన్ ఉన్నవారిలో ఈ నల్ల గుడ్డు భాగం ఒక కోణం (కోన్) ఆకృతిలో ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. చికిత్స : కాంటాక్ట్ లెన్స్‌లతో దీనికి చికిత్స చేయవచ్చు. ‘కొలాజెన్ క్రాస్ లింకింగ్’ ప్రక్రియతో దీన్ని అదుపు చేయవచ్చు. ఇదిగాక కెరటోప్లాస్టీ అనే చికిత్స కూడా చేయవచ్చు. మెల్లకన్ను ఇంగ్లిష్‌లో స్క్వింట్ అని పిలిచే మెల్లకన్ను ఉన్నవారు వీలైనంత త్వరగా దాన్ని సరిచేసే శస్త్రచికిత్స చేయించుకోవాలి. చూపునకు కలిగే అంతరాయాల్లో తాత్కాలికం... శాశ్వతాలివి... వివిధ వ్యాధులు, రుగ్మతలు చూపునకు అంతరాయం కలిగించవచ్చు. కానీ అందులో కొన్ని తాత్కాలికమైనవి. తగిన చికిత్స తీసుకుంటే తగ్గుతాయి. కానీ కొన్ని మాత్రం తగిన చికిత్స తీసుకోకపోతే శాశ్వతంగా చూపును కోల్పోయేలా చేస్తాయి. ఆ తాత్కాలిక, శాశ్వత అంతరాయాల గురించి తెలుసుకుందాం. లక్షణాలు చూపునకు కలిగే అంతరాయాలు తాత్కాలికమైనా లేదా శాశ్వతం అయినా ఆయా వ్యాధులను కొన్ని సాధారణ లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. అవి... ఒకే వస్తువు రెండుగా కనిపించడం, ఒకే వస్తువు అనేక వస్తువులుగా కనిపించడం, మసగ్గా కనిపించడం, కళ్ల ముందు మెరుపులు, ఏవేవో మెరుపు తీగలు తేలుతున్నట్లు కనిపించడం, మనం చూసే దృశ్యం మధ్యలో నల్లమచ్చ కనిపించడం లేదా కొంత భాగం కనపడకుండా పోవడం జరగవచ్చు. దీన్ని వైద్యపరిభాషలో స్కోటోమాస్ అంటారు. ఫీల్స్ డిఫెక్ట్స్: మనం చూసే ప్రాంతం (వైశాల్యం)లో అంతా ఒకేలా కనిపించకపోవచ్చు. వీటిని ఫీల్డ్ డిఫెక్ట్స్ అంటారు. ఉదా: ఒకవైపు అంతా స్పష్టంగా ఉండి, మరోవైపు స్పష్టత లేకపోవడాన్ని ‘హెమీ అనోపియా’ అంటారు. మనం చూసే ప్రాంతంలో పావు భాగం స్పష్టంగా లేకపోవడాన్ని ‘క్వాడ్రాంటనోపియా’ అంటారు. మనం చూసే దృశ్య వైశాల్యం రానురాను తగ్గిపోవడాన్ని ‘కన్‌స్ట్రిక్షన్’ అంటారు. -
కనుపాపకు ఎంత కష్టం
రోజూ నగరంలో కంటి సమస్యలతో వైద్యుల వద్దకు వెళుతున్న వారు 5,000 ఇందులో గాలి, రసాయన కాలుష్యాల కారణ బాధితులు 500 ఎక్కువగా ఇలాంటి బాధితులు 18 నుంచి 35 ఏళ్ల లోపువారే పొల్యూషన్ వల్ల దీర్ఘకాలిక కంటిసమస్య మారిన బాధితుల సంఖ్య ఏటా 15 వేలు ఇందులో అబ్బాయిలే 70 శాతం మంది. నయనం ప్రధానం. కానీ నగర జీవి కంటిపాపకు కష్టకాలమొచ్చింది. ఇది ఎంత వేగంగా అంటే మనకు ఏం జరుగుతోందో తెలిసే లోపే చూపు మసకబారుతోంది. ఇంటికెళితే చికాకు. ఆఫీసుకొస్తే అలసట. ఆఫీసు పనులతో మానసిక ఒత్తిడి. ప్రయాణం చేయడంతో కంటిపాపపై ఒత్తిడి. ఇదీ నగరంలో లక్షలాది మంది యువతీయువకుల పరిస్థితి. కంటి బాధితులు మిగతా ఏరంగంలో పెరగనంతగా పెరుగుతున్నారు. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం వారిని తిన్నగా అంధత్వం దిశగా నెడుతోంది. అరవై ఏళ్లకు చత్వారం వస్తుందంటారు. కానీ ముప్ఫై దాటాయో లేదో కళ్లకు అద్దాలు. నలభై దాటితే చత్వారం. యాభైలో మరింత దారుణం. ప్రతి వందమంది కంటి బాధితుల్లో నగరంలో పొగలు, దుమ్మూ ధూళితో వస్తున్న కంటివ్యాధుల బాధితులు కనీసం 15 శాతం దాటారు. పొగల సెగలు కంటిపాపను ఛిద్రం చేస్తున్న తీరుపై డాక్టర్లే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటిస్తే కొంతవరకైనా కంటిని కాపాడుకోవచ్చునని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డా.రవికుమార్‌రెడ్డి చెబుతున్నారు. ఇలా మొదలవుతున్నాయ్ కంటిపాప కష్టాలు - నగరంలో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు కంటి వ్యాధులకు గురవుతున్నారు. - ప్రధానంగా రెండు రకాల ఇబ్బందులు కంటివ్యాధులకు కారణమవుతోంది - వెజిటబుల్ మెటీరియల్...అంటే వృక్ష సంబంధిత లేదా జంతు సంబంధిత రేణువులు. - వాహనాల నుంచి వచ్చే రసాయన ధూళి. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్, సల్ఫర్ డయాక్సైడ్ తదితరం - ఈ రెండు రకాల కారణాల వలన ప్రతి వందమందికీ పదిహేను మంది ఏడాదికి రెండు మూడు సార్లు కంటి వైద్యుల దగ్గరకు వెళుతున్నారు - ప్రధానంగా వీటి వలన కళ్లకలక, ఇన్ఫెక్షన్, కార్నియల్ అల్సర్ తదితరం వస్తున్నాయి - కళ్లు ఎరుపుగా మారడం, కళ్లనుంచి పదే పదే నీళ్లు కారడం వస్తున్నాయి - కళ్లలో ఇరిటేషన్, అలర్జీ, కళ్లు డ్రై అవడం అంటే పొడిబారడం జరుగుతుంది - ఇలాగే కొన్నేళ్ల తర్వాత కళ్లు మసకబారడం జరుగుతుంది - ఆ తర్వాత కొన్నేళ్లలో కంటిచూపు తగ్గుతూ వస్తుంది - ఎయిర్ పొల్యూషన్, కెమికల్ పొల్యూషన్ వల్ల కంటిలో నల్లగుడ్డుపై ఎరిటియం అనే కండరం పెరుగుతుంది. ఇది తిన్నగా చూపును తగ్గిస్తుంది కొద్ది పాటి జాగ్రత్తలు పాటిస్తే - ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేస్తున్నప్పుడు రక్షణగా అద్దాలు (ప్రొటెక్టివ్ గ్లాసెస్) ధరించడం వలన కళ్లను గాలి పొల్యూషన్ నుంచి కాపాడుకోవచ్చు - అద్దంతో కూడిన హెల్మెట్ కవర్‌ను ధరించడం మంచిదే - ఇంటినుంచి ఆఫీసుకు వెళ్లగానే మంచినీళ్లతో కళ్లను కడుక్కోవడం మంచిది - అలాగే ఆఫీసునుంచి ఇంటికి వచ్చినప్పుడు కూడా మంచినీళ్లతో కళ్లను కడుక్కోవాలి - ప్రయాణం చేసి కొద్దిగా కంటికి ఇబ్బందిగా ఉన్నప్పుడు లూబ్రికెంట్ డ్రాప్స్ వేసుకోవచ్చు - పదే పదే కళ్లతో బాధపడుతూంటే వైద్యుల సలహా మేరకు యాంటిబయోటిక్ చుక్కలు వేసుకోవచ్చు. - ద్విచక్రవాహనంలో తిరిగే వారు ప్రతి ఆరుమాసాలకు కంటి వైద్యులను సంప్రదించడం మంచిది - ద్విచక్ర వాహనంలో వెళ్తున్నప్పుడు చిన్నపిల్లలను ఎలాంటి కళ్లద్దాలుగానీ, హెల్మెట్‌గానీ లేకుండా ముందువైపు కూర్చోపెట్టద్దు. - ఎక్కువగా పెద్ద పెద్ద చౌరస్తాల్లో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కళ్లకు ఎఫెక్ట్ అయ్యే పొగలు వెలువడున్నాయి. వీలైనంత వరకూ ఇలాంటి చౌరస్తాల గుండా వెళ్లడం తగ్గించాలి - డా. రవికుమార్‌రెడ్డి కంటివైద్య నిపుణులు, మెడివిజన్ హాస్పిటల్ మెహిదీపట్నం