దృష్టికి అవరోధాలూ... అధిగమించే ఐడియాలు | To focus on Constraints ... Overtake the ideas | Sakshi
Sakshi News home page

దృష్టికి అవరోధాలూ... అధిగమించే ఐడియాలు

Published Mon, Dec 29 2014 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM

దృష్టికి అవరోధాలూ... అధిగమించే ఐడియాలు

దృష్టికి అవరోధాలూ... అధిగమించే ఐడియాలు

లోచనాలూ - లోపాలు
మనం చూసే ప్రక్రియలో ఎలాంటి అవరోధం కలిగినా వైద్యపరిభాషలో దాన్ని ‘విజువల్ డిస్టర్‌బెన్సెస్’ అంటారు. అంటే... చూసేటప్పుడు మనకు కలిగే అంతరాయాలన్నమాట. ఇవి అనేక రకాలుగా ఉంటాయి. చూపునకు అంతరాయం కలిగించే కొన్ని అంశాలు తాత్కాలికమైనవి. వీటి గురించి కొద్దిపాటి జాగ్రత్తలు, చికిత్స తీసుకుంటే మళ్లీ అంతా మామూలైపోతుంది. కానీ... దృష్టికి కలిగే కొన్ని అంతరాయాలు మాత్రం క్రమంగా పెరుగుతూ పోతాయి. ఫలితంగా శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి విజువల్ డిస్టర్‌బెన్సెస్ గురించి ప్రాథమిక అవగాహన ఉండటం వల్ల కంటి చూపును పదికాలాల పాటు పదిలంగా కాపాడుకోవచ్చు. అందుకు ఉపయోగపడేదే ఈ ప్రత్యేక కథనం.

తాత్కాలిక వ్యాధులు

తాత్కాలిక లోపాలే అని నిర్లక్ష్యం చేయడం సరికాదు. ఒక్కోసారి అవి శాశ్వతం కావచ్చు.
 
మైగ్రేన్
ఇది తీవ్రమైన తలనొప్పి. ముఖ్యంగా యువతలో ఎక్కువ. ఒకవైపు కంటిలో లేదా తలలో ఒక పక్క ఈ నొప్పి వస్తుంటుంది. అందుకే పార్శ్వపు నొప్పి అంటారు. ఈ నొప్పిలో వికారం, వాంతులతో పాటు, కొందరిలో ఏదో కాంతి ఆవరించినట్లుగా  ఉంటుంది. దీన్నే ‘విజువల్ ఆరా’ అంటారు. కళ్ల ముందు మిరిమిట్లు గొలిపే మెరుపులూ కనిపించవచ్చు.

చికిత్స: నొప్పిని తక్షణం తగ్గించేవాటితో పాటు... మున్ముందు రాకుండా నివారించే మందులు... దాదాపు ఏడాది నుంచి రెండేళ్ల పాటు వాడాలి.
 
క్యాటరాక్ట్ (తెల్ల ముత్యం)
కంటిలో ఉండే లెన్స్ పారదర్శకంగా ఉండటం వల్ల మనకు ఎదుటి వస్తువులు స్పష్టంగా కనిపిస్తుంటాయి. కానీ కాలక్రమంలో ఈ లెన్స్ తన పారదర్శకతను కోల్పోతుంటుంది. దాంతో దృష్టి సన్నగిల్లడం, ఒకవస్తువు రెండుగా కనిపించడం, అనేక దొంతరలుగా కనిపించడం, మసకబారడం, రాత్రివేళ చూడటం కష్టమైపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
 
చికిత్స: ఈ సమస్య చాలా సాధారణం. అత్యంత సాధారణమైన శస్త్రచికిత్స ద్వారా కంటిలోని లెన్స్‌ను మార్చి మరో పారదర్శకమైన లెన్స్ అమర్చడం వల్ల చికిత్స తర్వాత మళ్లీ మామూలుగానే చూడగలం.
 
ట్రామా (గాయాలు)
కంటికి దెబ్బతగిలినప్పుడు తక్షణం కనిపించే లక్షణాలు, ఆ తర్వాత కనిపించే లక్షణాలు వేర్వేరుగా ఉండవచ్చు. చూపు మసకబారవచ్చు. కంటిముందు మెరుపులు కనిపించడం, కంటిలోని ద్రవం (విట్రియల్) బయటకు రావడం,   దీర్ఘకాలంలో గ్లకోమా, రెటీనా పొరలు విడిపోవడం, కంటి నరం దెబ్బతినడం వంటి ప్రమాదాలు జరగవచ్చు.
 
చికిత్స: కంటికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు (ట్రామా కేసుల్లో) అత్యవసరంగా తగిన చికిత్స చేస్తే చూపు కోల్పోయే అవకాశాలు తక్కువ. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా ఫాలో అప్ దీర్ఘకాలం పాటు చేయిస్తూ ఉండాలి.
 
రేచీకటి (నైట్ బ్లైండ్‌నెస్)
ఇది మనం తీసుకునే ఆహారంలో విటమిన్-ఏ పాళ్లు తగ్గడం వల్ల కలిగే కంటి సమస్య. మరికొందరిలో ఇది రెటీనాకు వచ్చే ఆరోగ్య సమస్యలు వల్ల ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య వచ్చినవారిలో రాత్రిపూట కనిపించకపోవడం వంటి లక్షణాలుంటాయి. ఇక విటమిన్-ఏ లోపం తీవ్రంగా ఉన్నవారిలో కార్నియా కరిగిపోయే పరిస్థితి వస్తుంది. దీన్నే వైద్యపరిభాషలో ‘కెరటోమలేసియా’ అంటారు. పిల్లల్లో ఇది ఎక్కువ. అది అత్యవసరమైన పరిస్థితి (ఎమర్జెన్సీ).
 
చికిత్స: ఆహారంలో విటమిన్ ఏ ఉన్న పదార్థాలు ఇవ్వడం, విటమిన్-ఏ మాత్రలు వాడటం వంటివి చికిత్సలు.
 
డ్రగ్స్
కార్టికోస్టెరాయిడ్స్, కీళ్లనొప్పుల కోసం దీర్ఘకాలం పాటు వాడే కొన్ని మందులు, క్షయవ్యాధికి వాడే కొన్ని రకాల మందుల వల్ల స్కోటోమాస్ వచ్చి క్రమంగా చూపు తగ్గుతూ పోవచ్చు. ఒక్కోసారి ఇది శాశ్వతమూ కావచ్చు. అందుకే చూపు తగ్గుతున్నట్లు గ్రహించగానే డాక్టర్‌ను సంప్రదించి, తాము వాడుతున్న మందులను వివరించి, తగిన చికిత్స తీసుకోవాలి. దాంతో కోల్పోయిన చూపు తిరిగి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ.
 
పక్షవాతం (స్ట్రోక్ )
పక్షవాతం వచ్చినవారిలో మెదడులోని కొన్ని భాగాలకు రక్తసరఫరా తగ్గడం వల్ల ఆ భాగాలు చచ్చుబడిపోతాయి. ఒకవేళ కంటిచూపును నియంత్రించే కేంద్రానికి రక్తప్రసరణ తగ్గితే, ఆ ప్రభావం చూపుపై పడవచ్చు. ఇది సాధారణంగా తాత్కాలికం అయ్యేందుకే అవకాశాలు ఎక్కువ. అయితే కొన్ని సందర్భాల్లో ఇది శాశ్వత అంధత్వానికీ దారితీయవచ్చు.
 
చికిత్స: ఈ విషయంలో నివారణే చికిత్సతో సమానం. డయాబెటిస్‌ను, రక్తపోటును అదుపులో ఉంచుకోవడం వల్ల ఈ ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. అప్పటికీ స్ట్రోక్ బారిన పడితే న్యూరాలజిస్ట్‌ల ఆధ్వర్యంలో చికిత్స తీసుకోవాలి.
 
బ్రెయిన్ ట్యూమర్స్
మెదడులో వచ్చే గడ్డలు (ఉదా: పిట్యూటరీ గడ్డల వంటివి) పెరిగిపోతూ... అవి చూపును మెదడుకు చేరవేసే ఆప్టిక్ నర్వ్ అనే నరాన్ని నొక్కివేయడం వల్ల లేదా కంటికీ, నరానికీ రక్తప్రసరణ కల్పించే రక్తనాళాన్ని నొక్కివేయడం వల్ల ఒక్కోసారి పాక్షిక అంధత్వం రావచ్చు. ఇందులో ఒక్కోసారి కంటికి ఎదురుగా ఉన్న మొత్తం దృశ్యం కాకుండా సగమే కనిపించవచ్చు. అలాంటి లక్షణం కనిపించినప్పుడు మెదడులో గడ్డలు ఉన్నట్లు అనుమానించి, నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. గడ్డలు ఉన్నట్లయితే వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తే మళ్లీ కోల్పోయిన చూపు వచ్చేందుకే అవకాశాలు ఎక్కువ.
 
పొగతాగడం వల్ల
దీనివల్ల వచ్చే తాత్కాలిక అంధత్వం (టొబాకో ఆంబ్లోపియా), ఆ అలవాటును  మానివేస్తే తొలగిపోతుంది.
 
శాశ్వత వ్యాధులు
ఈ కంటి వ్యాధులు శాశ్వత అంధత్వానికి దారితీస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి.
 
గ్లకోమా
మన కంటిలోని నల్లగుడ్డులో ఉన్న ద్రవాలు కొంత ఒత్తిడిని కలిగిస్తుంటాయి. ఈ ఒత్తిడినే ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ అంటారు. అయితే ఈ ఒత్తిడి క్రమంగా పెరుగుతూ పోవడం వల్ల మనం చూసే ప్రాంతపు వైశాల్యం క్రమంగా కుంచించుకుపోతూ, చికిత్స తీసుకోకపోతే  శాశ్వతంగా చూపు పోయే ప్రమాదం ఉంది. దీన్నే గ్లకోమా అంటారు.
 
చికిత్స : గ్లకోమాకు చికిత్స మూడు విధాలుగా జరుగుతుంది. మొదటిది మందులతో ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్‌ను పెరగకుండా ఉంచడం. రెండోది లేజర్ చికిత్స. ఇంకా ప్రెషర్ అదుపులోకి రాకపోతే శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు.
 
రెటినల్ డిటాచ్‌మెంట్
ఈ సమస్య ఉన్న వారిలో రెటీనా లోని లోపలి పొర,  బయటి పొర మధ్యలోకి కొన్ని రకాల ద్రవపదార్థాలు రావడం వల్ల ఆ రెండు పొరలూ విడిపోవచ్చు. ఫలితంగా కొంతమేరకు గాని లేదా పూర్తిగా కాని దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉంది.
 
చికిత్స : పై సమస్యలు కనిపించినప్పుడు వెంటనే కంటి డాక్టర్‌ను సంప్రదించాలి. అప్పుడు డాక్టర్లు అత్యవసర శస్త్రచికిత్స చేసి, విడిపోయిన రెండు రెటీనా పొరలను కలుపుతారు.
 
డయాబెటిక్ రెటినోపతి
డయాబెటిస్ ఉన్నవారిలో రక్తం మందంగా మారుతుంది. ఇలా మందంగా మారిన రక్తం అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన రక్తనాళాల నుంచి ప్రవహించడం కష్టం కావడం వల్ల రెటినాకు తగినంత రక్తప్రసరణ జరగదు. ఫలితంగా చక్కెర పాళ్లను సమర్థంగా అదుపులో ఉంచుకోని వారిలో రెటీనా దెబ్బతినే అవకాశాలు ఎక్కువై చూపు పోయే ప్రమాదం ఉంది.
 
చికిత్స : డయాబెటిక్ రెటినోపతి కండిషన్ ఉన్నట్లు నిర్ధారణ అయితే తక్షణ లేజర్ చికిత్సతోగానీ లేదా కంటిలో ఇచ్చే ఇంజెక్షన్లతో గాని లేదా శస్త్రచికిత్స మార్గాల ద్వారాగాని చూపును మరింత కోల్పోకుండా ఆపే అవకాశాలు ఉంటాయి.
 
హైపర్‌టెన్సివ్ రెటినోపతి
మన దేహంలోని అన్ని అవయవాలతో పాటు కంటికీ నిత్యం రక్తప్రసరణ జరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే రక్తపోటు ఉన్నవారిలో రక్తం వల్ల రక్తనాళాలపై కలిగే ఒత్తిడి తీవ్రంగా పెరిగినప్పుడు అత్యంత సన్నటి రక్తకేశనాళికలు (క్యాపిల్లరీస్) ఆ ఒత్తిడికి చిట్లిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా చూపు కోల్పోయే అవకాశం ఉంది.
 
చికిత్స : ఈ సమస్య వల్ల చూపు కోల్పోకుండా ఉండేందుకు రక్తపోటును అదుపులో ఉంచుకోవడమనే నివారణ చర్య చాలా ఉత్తమమైన మార్గం. కొందరిలో లేజర్ లేదా శస్త్రచికిత్స అవసరం కావచ్చు.
 
ఏఆర్‌ఎమ్‌డీ
ఇది వయసుతో పాటు వచ్చే కంటి సమస్య. ‘ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్’ అనే ఇంగ్లిష్ పదాలకు  ఏఆర్‌ఎమ్‌డీ అన్నది సంక్షిప్త రూపం. వీరిలో రెటీనాలోని ‘మాక్యులా’ అనే మధ్యభాగం ప్రభావితం కావడం వల్ల ఇది వస్తుంది.
 
చికిత్స: ఈ సమస్య ఉన్నవారు తక్షణం డాక్టర్‌ను కలిస్తే లేజర్ చికిత్స ద్వారాగానీ లేదా కంటిలోని విట్రియల్ ఛేంబర్ అనే ప్రాంతంలో ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్లగానీ లేదా శస్త్రచికిత్సతో గాని సమస్యను పెరగకుండా చూడవచ్చు.
 
థైరాయిడ్ ఐ డిసీజ్
ఇది హైపోథైరాయిడజమ్ లేదా హైపర్ థైరాయిడిజమ్ వ్యాధులు ఉన్న రోగుల్లో కనిపించే సమస్య. ఈ సమస్య ఉన్న కొందరిలో కనుగుడ్లు ముందుకు పొడుచుకు వచ్చినట్లుగా కనిపిస్తుంటాయి. దీన్నే వైద్యపరిభాషలో ప్రోప్టోసిస్ అంటారు. కొందరిలో కన్ను పొడిబారవచ్చు. ఒకే వస్తువు రెండుగా కనిపించడం, కంటి నొప్పి, గ్లకోమా కూడా రావచ్చు.
 
చికిత్స : లక్షణాలు కనిపించగానే థైరాయిడ్ హార్మోన్ల సమతౌలత్య నెలకొనేలా హార్మోన్ చికిత్స తీసుకోవాలి. కొందరిలో ఆర్బిటాల్ డీకంప్రెషన్ అనే శస్త్రచికిత్స అవసరం కావచ్చు.
 
కెరటోకోనస్ వ్యాధి
సాధారణంగా గమనించి చూస్తే మన కంటి నల్ల గుడ్డు ప్రాంతం ఒకింత ఉబ్బెత్తుగా కనిపిస్తూ గుండ్రం (స్ఫెరికల్)గా ఉంటుంది. కానీ కెరటోకోనస్ అనే కండిషన్ ఉన్నవారిలో ఈ నల్ల గుడ్డు భాగం ఒక కోణం (కోన్) ఆకృతిలో ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది.
 
చికిత్స : కాంటాక్ట్ లెన్స్‌లతో దీనికి చికిత్స చేయవచ్చు. ‘కొలాజెన్ క్రాస్ లింకింగ్’ ప్రక్రియతో దీన్ని అదుపు చేయవచ్చు. ఇదిగాక కెరటోప్లాస్టీ అనే చికిత్స కూడా చేయవచ్చు.
 
  మెల్లకన్ను
ఇంగ్లిష్‌లో స్క్వింట్ అని పిలిచే మెల్లకన్ను ఉన్నవారు వీలైనంత త్వరగా దాన్ని సరిచేసే శస్త్రచికిత్స చేయించుకోవాలి.
 
చూపునకు కలిగే అంతరాయాల్లో తాత్కాలికం... శాశ్వతాలివి...
వివిధ వ్యాధులు, రుగ్మతలు చూపునకు అంతరాయం కలిగించవచ్చు. కానీ అందులో కొన్ని తాత్కాలికమైనవి. తగిన చికిత్స తీసుకుంటే తగ్గుతాయి. కానీ కొన్ని మాత్రం తగిన చికిత్స తీసుకోకపోతే శాశ్వతంగా చూపును కోల్పోయేలా చేస్తాయి. ఆ తాత్కాలిక, శాశ్వత అంతరాయాల గురించి తెలుసుకుందాం.
 
లక్షణాలు
చూపునకు కలిగే అంతరాయాలు తాత్కాలికమైనా లేదా శాశ్వతం అయినా ఆయా వ్యాధులను కొన్ని సాధారణ లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. అవి... ఒకే వస్తువు రెండుగా కనిపించడం, ఒకే వస్తువు అనేక వస్తువులుగా  కనిపించడం, మసగ్గా కనిపించడం, కళ్ల ముందు మెరుపులు, ఏవేవో మెరుపు తీగలు తేలుతున్నట్లు కనిపించడం,  మనం చూసే దృశ్యం మధ్యలో నల్లమచ్చ కనిపించడం లేదా కొంత భాగం కనపడకుండా పోవడం  జరగవచ్చు. దీన్ని వైద్యపరిభాషలో స్కోటోమాస్ అంటారు.
 
ఫీల్స్ డిఫెక్ట్స్: మనం చూసే ప్రాంతం (వైశాల్యం)లో అంతా ఒకేలా కనిపించకపోవచ్చు. వీటిని ఫీల్డ్ డిఫెక్ట్స్ అంటారు. ఉదా: ఒకవైపు అంతా స్పష్టంగా ఉండి, మరోవైపు స్పష్టత లేకపోవడాన్ని ‘హెమీ అనోపియా’ అంటారు. మనం చూసే ప్రాంతంలో పావు భాగం స్పష్టంగా లేకపోవడాన్ని ‘క్వాడ్రాంటనోపియా’ అంటారు. మనం చూసే దృశ్య వైశాల్యం రానురాను తగ్గిపోవడాన్ని ‘కన్‌స్ట్రిక్షన్’ అంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement