థెరపినిచ్చే కిరణాలు... | Treatments with the Radiology | Sakshi
Sakshi News home page

థెరపినిచ్చే కిరణాలు...

Published Mon, Dec 22 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM

థెరపినిచ్చే కిరణాలు...

థెరపినిచ్చే కిరణాలు...

ట్రీట్‌మెంట్స్ విత్ రేడియాలజీ
 
చికిత్సారంగంలో ఈరోజు సీటీ స్కాన్ అంటేనో, ఎమ్మారై అంటేనో తెలియని వారు ఉండరంటే అతి అతిశయోక్తి కాదు. ఈ రంగంలో జరిగిన అభివృద్ధి అంతా ఇంతా కాదు. ఇరవై ఏళ్ల కిందట ఒక అధ్యయనం నిర్వహించడానికి 20 నిమిషాలు పడితే... ఇవ్వాళ్ల ఆ పనికి కేవలం రెండు సెకండ్లు చాలు! ఇదే వ్యాధినిర్ధారణ విషయంలో, చికిత్సారంగంలో ఓ విప్లవం తెచ్చింది. కేవలం సమయం, సునిశితత్వం పరంగానే కాదు. సంస్థల మధ్య పోటీ పెరుగుతూ ఆర్థిక కోణంలోనూ గతంలో సగటు రోగికి అందుబాటులో లేని కొన్ని ప్రక్రియలు ఇప్పుడు అతడి చెంతకు వచ్చాయి. అంతేకాదు... దీర్ఘకాలంలో జరిగే ఖర్చులు ముందే నివారితమయ్యాయి. మరిన్ని ప్రాణాలు నిలిచాయి. వీటన్నింటికీ కారణం... రేడియేషన్ ద్వారా వెలువడే కిరణాల సాయంతో వ్యాధి నిర్ధారణలతో పాటు కొన్ని చికిత్సలూ చేయడం సాధ్యం కావడమే. ఎక్స్‌రే, సీటీస్కాన్, ఎమ్మారై వంటివి శరీరంలోని ఏ భాగంలోనైనా వ్యాధి నిర్ధారణలో తోడ్పడతాయన్న సంగతి తెలిసిందే. కానీ చికిత్సలో ఈ రేడియేషన్ తరంగాలు ఎలా ఉపయోగపడతాయి, ఏయే వ్యాధులకు ఉపయోగపడతాయన్న విషయాన్ని తెలుసుకోవడం కోసమే ఈ కథనం.
 
వేరికోసీల్స్

కొందరిలో శుక్రకణాలను చేరవేసే నాళాల్లో అడ్డంకులు ఏర్పడి వృషణాల వాపు, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ అడ్డంకుల వల్ల పురుషుల్లో వంధ్యత్వం రావచ్చు. ఇంటర్‌వెన్షన్ రేడియాలజిస్టులు ఈ అడ్డంకులను తొలగించడం వల్ల వేరికోసీల్స్‌కు చికిత్స జరగడంతో పాటు పురుషుల్లో శుక్రకణాల ప్రవాహానికి అడ్డంకులు తొలగి పిల్లలు పుట్టడానికి అవకాశాలు పెరుగుతాయి.
 
బయాప్సీలు

ఏదైనా ఒక అవయవం నుంచి చిన్న కండరాన్ని సేకరించే ప్రక్రియను ‘బయాప్సీ’ అంటారు. ఇమేజింగ్ గెడైన్స్ ప్రక్రియ ద్వారా ఇంటర్‌వెన్షనల్ రేడియాలజిస్టులు సాధ్యమైనంత తక్కువ/చిన్న గాటుతో ఇప్పుడు కండను సేకరించడం సాధ్యమవుతోంది.
 
రక్తనాళాల జబ్బులకు...
 
వేరికోజ్ వెయిన్స్

రక్తనాళాల్లో రక్తం ఒకేవైపు పయనిస్తుందన్న విషయం తెలిసిందే. మంచి రక్తం ధమనుల్లో, చెడు రక్తం సిరల్లో ప్రవహిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో రక్తాన్ని ఇలా ఒకే వైపునకు ప్రవహింపజేస్తూ... వెనక్కు రాకుండా చూసే కవాటాలు (వాల్వ్స్) బలహీనపడటం వల్ల రక్తం మునుపటిలా ప్రవహించక సిరల్లో పోగుపడుతుంది. దాంతో చాలా సందర్భాల్లో కాళ్లపై సిరలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. దీనివల్ల చూడటానికి బాగుండకపోవడమే (కాస్మటిక్‌గానే) కాదు... నొప్పులు కూడా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో రేడియేషన్ కిరణాలను ఉపయోగించి ఇలా వాల్వ్స్ దెబ్బతిన్న రక్తనాళాల్లోకి ట్యూబ్‌లను పంపి, వాటి ద్వారా లేజర్ కిరణాలను పంపి చికిత్స చేస్తారు. ఈ ప్రక్రియనే వైద్య పరిభాషలో ఇంటర్‌వెన్షనల్ ఎండోవీనస్ లేజర్ ట్రీట్‌మెంట్ లేదా స్క్లీరోథెరపీ అంటారు. దాంతో కవాటాలు బలహీనపడ్డ రక్తనాళాలు శాశ్వతంగా మూసుకుపోతాయి. ఆ పనిని ఆరోగ్యకరమైన ఇతర సిరలు చేస్తాయి. ఫలితంగా రక్తప్రవాహం మునుపటిలాగే జరుగుతుంది. సిరలు ఉబ్బి కనిపించడం, నొప్పులు రావడం తగ్గుతాయి.

 పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (పీఏడీ)

సాధారణంగా మంచి రక్తాన్ని తీసుకుపోయే ధమనుల గోడలు చాలా మృదువుగా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో అవి గట్టిబారడం, పెళుసుబారినట్లుగా కావడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితినే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు. ధమని ఇరు చివరలా ఇలా జరిగితే... దీనివల్ల రక్తం మధ్యలోనే పోగుపడినట్లుగా అవుతుంది. దాంతో నొప్పి, చర్మంపైన పుండ్లు రావడం, ఒక్కోసారి ఆ పుండ్లు కుళ్లిపోవడం (గ్యాంగ్రీన్) జరగవచ్చు. ఇలాంటి సందర్భాల్లో రక్తనాళంలోకి అంతకంటే సన్నటి నాళాన్ని మళ్లీ ప్రవేశపెట్టి యాంజియోప్లాస్టీ ప్రక్రియతోగానీ లేదా కొంత ఒత్తిడి కలిగించిగానీ ఆ ధమనిని వెడల్పు చేస్తారు. ఇందుకు రేడియాలజీ ప్రక్రియ సహాయం తీసుకుంటారు.
 
డీప్ వీన్ థ్రాంబోసిస్ (డీవీటీ)

రక్తనాళాల్లోని సిరల్లో చెడురక్తం, ధమనుల్లో మంచి రక్తం ప్రవహిస్తాయన్నది తెలిసిందే. శరీరం లోపల ఉండే ఏదైనా సిరలో రక్తం గడ్డ కట్టడం జరిగితే ఆ భాగంలో వాపు కనిపిస్తుంది. సాధారణంగా కాళ్లలో ఎక్కువగా కనిపించే ఈ కండిషన్‌లో కాలుకు విపరీతంగా వాపు రావడం, దానిపైన ఉండే చర్మపు రంగు మారిపోవడం, తీవ్రమైన నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే డీప్ వీన్ థ్రాంబోసీస్ (డీవీటీ) అంటారు. ఒకవేళ డీవీటీ దీర్ఘకాలం పాటు కొనసాగితే అది పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ లేదా పల్మునరీ ఎంబోలిజమ్ అనే పరిస్థితికి దారితీయవచ్చు. పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్‌లో రక్తం గడ్డకట్టిన పై భాగంలో వాపు వచ్చి, చర్మంపైన పుండ్లు పడతాయి. ఇక పల్మునరీ ఎంబోలిజమ్ అన్నది ప్రాణాపాయం కలిగించే స్థితి. ఇందులో గడ్డకట్టిన రక్తపు ముద్ద మరింత చిన్న చిన్న గడ్డలుగా విడిపోయి రక్తప్రవాహంతో కలిసి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించవచ్చు. దీన్నే పల్మునరీ ఎంబోలిజమ్ అంటారు. ఫలితంగా శ్వాసతీసుకోవడం కష్టమై ప్రాణాపాయం సంభవించవచ్చు. తొలుత డీప్‌వీన్ థ్రాంబోసిస్ ఉన్న చోటికి ఇంటర్‌వెన్షనల్ రేడియాలజిస్టులు రక్తనాళాల్లోకి మరింత సన్నటి నాళాన్ని (క్యాథెటర్‌ను) ప్రవేశపెట్టడం ద్వారా రక్తపు గడ్డ ఉన్న ప్రాంతానికి చేరతారు. అక్కడ బెలూన్ యాంజియోప్లాస్టీ ప్రక్రియ ద్వారాగానీ లేదా స్టెంటింగ్ ద్వారాగానీ ఆ అడ్డు తొలగించి చికిత్స చేస్తారు. ఫలితంగా రక్తప్రవాహం మళ్లీ మునపటి స్థితికి వస్తుంది.
 
పల్మునరీ ఎంబోలిజమ్

 
ముందు చెప్పుకున్నట్లుగా గడ్డ కట్టిన రక్తం ముద్దలు మళ్లీ చిన్న చిన్న ముక్కలుగా మారి రక్తప్రవాహంలో కలిసి ఊపిరితిత్తులను చేరుతాయి. ఇది ప్రాణాపాయ స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఊపిరి ఆడకపోవడం, నీసరం, నిస్సత్తువ, గుండెదడ, స్పృహతప్పిపడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్లు దాన్ని పల్మునరీ ఎంబోలిజమ్‌గా నిర్ధారణ చేసి ‘క్యాథెటర్ డెరెక్టైడ్ థ్రాంబోలైసిస్’ ప్రక్రియ ద్వారా చికిత్స చేస్తారు. అంటే కాలు లేదా చేతిలోని ప్రధాన రక్తనాళంలోకి మరింత సన్నటి నాళాన్ని పంపి దాని చివర గడ్డకట్టిన రక్తపు ముద్దను చెల్లాచెదురు చేసే (క్లాట్ బస్టింగ్) మందులను ఉపయోగిస్తారు. దాంతో రక్తపు గడ్డ రక్తప్రవాహాన్ని అడ్డగించలేనంత చిన్న చిన్న ముక్కలుగా చెదిరిపోయి ప్రాణాపాయం తప్పుతుంది.
 
ఐవీసీ ఫిల్టర్ ప్లేస్‌మెంట్ చికిత్స
 
పల్మునరీ ఎంబోలిజమ్ వ్యాధి చరిత్ర ఉన్న రోగులు గానీ లేదా ఇలా జరిగేందుకు అవకాశం ఉన్న రోగుల విషయంలో డాక్టర్లు ఒక ముందు జాగ్రత్త / నివారణ చర్యను చేపడతారు. అదేమిటంటే... గుండెకు చెడు రక్తాన్ని తీసుకుపోయే ‘వేన-కేవా’ అనే అత్యంత ప్రధాన రక్తనాళంలోకి గానీ లేదా ఊపిరితిత్తుల్లోకి గానీ ఈ రక్తపు గడ్డలు ప్రవేశించకుండా ముందుగానే అక్కడ రక్తపు గడ్డలను అడ్డుకునే ‘ఫిల్టర్ల’ను అమర్చుతారు. దీనికోసం రేడియేషన్ థెరపీ చికిత్స సహాయం తీసుకుంటారు. ఈ ప్రక్రియనే ‘ఐవీసీ ఫిల్టర్ పేస్‌మెంట్’ అంటారు. ఫలితంగా పల్మునరీ ఎంబోలిజమ్‌ను ముందుగానే నివారించవచ్చు.
 
అబ్డామినల్ అయోర్టిక్ అన్యురిజమ్స్ (ఏఏఏ)
 
కడుపు/పొట్టకు రక్తాన్ని చేరవేసే ప్రధాన రక్తనాళమైన అబ్డామినల్ అయోర్టా బలహీనపడటం వల్లగానీ లేదా అది తన ఎలాస్టిసిటీ కోల్పోయి మామూలు పరిమాణం కంటే ఎక్కువగా సాగిపోయి వెడల్పు కావడం వల్లగానీ తీవ్రమైన పొట్టనొప్పి లేదా వీపునొప్పి వస్తాయి. ఇలాంటి స్థితిలో ఎలాస్టిసిటీ కోల్పోయి సాగిపోయి బలహీన పడ్డ రక్తనాళం చీలిపోతే అది ప్రాణాపాయ స్థితికి దారితీస్తుంది. ఈ కండిషన్‌నే ‘అబ్డామినల్ అయోర్టిక్ అన్యురిజమ్’ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా కేవలం యాంజియోగ్రఫీ / స్టెంటింగ్ ద్వారా ‘ఎండోవ్యాస్క్యులార్ అన్యురిజమ్ రిపేర్’ అనే ప్రక్రియ సహాయంతో సాగిపోయిన/బలహీన పడ్డ అబ్డామినల్ అయోర్టాకు చికిత్స చేయవచ్చు.
 
మూత్రపిండాలు
 
రీనల్ ఆర్టరీ స్టెనోసిస్

హైబీపీ ఉన్నవారికి మూత్రపిండాలకు మంచి రక్తాన్ని సరఫరా చేసే రీనల్ ఆర్టరీ కుంచించుకుపోయినప్పుడు బెలూన్ యాంజియోప్లాస్టీ లేదా స్టెంటింగ్ ప్రక్రియ ద్వారా దాన్ని వెడల్పు చేసి రేడియాలజీ సహాయంతో చికిత్స చేయడం సాధ్యమే.
 
డయాలసిస్ ఫిస్టులా / ఆర్టీరియో వీనస్ గ్రాఫ్ట్ క్లాట్

 
కొందరిలో మూత్రపిండాలకు సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయే అవకాశాలు ఉంటాయి. అలాంటి గడ్డలను ‘ఇంటర్‌వెన్షనల్ డీక్లాట్’ ప్రక్రియ ద్వారా తొలగించే అవకాశం ఉంది.
 
నెఫ్రోస్టోమీ ట్యూబ్ రీప్లేస్‌మెంట్

 
కొందరిలో కిడ్నీలో ఏర్పడిన రాళ్లు... కిడ్నీ నుంచి యురేటర్ ద్వారా మూత్రకోశానికి చేరి అక్కడి నుంచి మూత్ర విసర్జన చేసే మూత్రనాళాల్లోకి (యురెథ్రాలోకి) ప్రవేశించి అక్కడ అడ్డంకిగా మారవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మూత్రద్వారం గుండా మరొక చిన్న నాళాన్ని ప్రవేశపెట్టి ఆ రాయిని తొలగించవచ్చు.
 
క్యాన్సర్ గడ్డలు
 
క్యాన్సర్ గడ్డల చికిత్స విషయంలో రేడియాలజీ రంగాన్ని ఉపయోగించి అనేక రకాల చికిత్సలు చేయడం సాధ్యమవుతుంది. ఇందులో గడ్డ ఎలాంటి రకానికి చెందింది, ఎంత పరిమాణంలో ఉంది, ఏ మేరకు వ్యాపించి ఉంది, దాని ఆకృతి ఎలా ఉంది... లాంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుని చేయాల్సిన చికిత్సను నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాల్లో ‘ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబోలైజేషన్’ అనే ప్రక్రియను ఉపయోగించి... గడ్డకు జరిగే రక్తసరఫరాను ఆపివేస్తారు. దాంతో గడ్డ కుంచించుకుపోయి రాలిపోతుంది. మరికొన్ని సందర్భాల్లో రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్, మైక్రోవేవ్ అబ్లేషన్, క్రయోఅబ్లేషన్, ఇర్రివర్సిబుల్ ఎలక్ట్రోపోరేషన్, హై-ఇంటెన్సిటీ ఫోకస్‌డ్ అల్ట్రాసౌండ్ అనే ప్రక్రియలను అనుసరించి రేడియేషన్ కిరణాలతో నేరుగా క్యాన్సర్ గడ్డలోని కణజాలాన్ని శిథిలమైపోయేలా చేస్తారు. కేవలం గడ్డ ఉన్న ప్రాంతంలోనే కిరణాలు ప్రసరింపజేయడం వల్ల పక్కన ఉండే ఆరోగ్యకరమైన కణజాలానికి అత్యంత తక్కువ నష్టం జరిగేలా చూస్తారు. అలాగే కీమోథెరపీ వల్ల కలిగే సైడ్‌ఎఫెక్ట్స్‌నూ తగ్గిస్తారు.
 
కాలేయం

 
పోర్టల్ హైపర్‌టెన్షన్


కాలేయంపై పగుళ్లు ఏర్పడటం (సిర్రోసిస్) లేదా దానికి ఇతరత్రా ఏవైనా ప్రమాదాలు జరగడం (హెపటైటిస్) వంటి సందర్భాల్లో కాలేయానికి రక్తప్రసరణ వేగం తగ్గిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో రోగులకు అంతర్గత రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. ఇది ప్రాణాపాయ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అతి తక్కువ గాటుతో ‘ట్రాన్స్‌జ్యుగులార్ ఇంట్రాహెపాటిక్ పోర్టోసిస్టమిక్ షంట్ (టిప్స్)’ అనే ప్రక్రియ ద్వారా చికిత్స చేసి రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తారు.

బైల్ డక్ట్ అబ్‌స్ట్రక్షన్

కాలేయ క్యాన్సర్, బైల్ డక్ట్ క్యాన్సర్, కోలిసిస్టైటిస్, కోలాంజిటిస్ లేదా కాలేయ, బైల్ వ్యవస్థలకు చెందిన ఏ జబ్బుల్లోనైనా బైల్ ప్రవాహానికి అడ్డంకి ఏర్పడినప్పుడు రేడియాలజిస్ట్‌లు సాధారణంగా ‘పెర్‌క్యుటేనియస్ ట్రాన్స్‌హెపాటిక్ కోలాంజియోగ్రఫీ (పీటీహెచ్‌సీ లేదా పీసీటీ) అనే ఇమేజింగ్ ప్రక్రియ ద్వారా ఆ అడ్డంకిని గుర్తిస్తారు. అలా గుర్తించిన తర్వాత పెర్‌క్యుటేనియస్ ట్రాన్స్‌హెపాటిక్ బిలియరీ డ్రైనేజ్ (పీటీబీడీ) అనే ప్రక్రియ ద్వారా చికిత్స చేస్తారు. ఇందులో క్యాథెటర్ లేదా స్టెంట్‌ను చర్మం పొరల ద్వారా బైల్‌డక్ట్ లోకి పంపి, బైల్ స్రావాన్ని బయటకు డ్రెయిన్ చేస్తారు. ఆ తర్వాత సర్జరీకి పూనుకుంటారు.
 
న్యూరలాజిక్
 
స్ట్రోక్ (పక్షవాతం)

మెదడుకు రక్తనాళాల ద్వారా అందాల్సిన ఆక్సిజన్ లేదా పోషకాలు అందని సమయంలో మెదడులోని ఆ ప్రాంతం దెబ్బతింటుంది. దీన్నే ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. ఒకవేళ మెదడుకు రక్తసరఫరా చేసే రక్తనాళాలు చిట్టిపోయి అంతర్గత రక్తస్రావం జరిగి మెదడులోని భాగాలు దెబ్బతినడం వల్ల ఆ భాగం నియంత్రించే శరీర అవయవాలు పనిచేయకపోవడాన్ని హేమరేజిక్ స్ట్రోక్ అంటారు. స్ట్రోక్ ఎలా వచ్చినా దాని వల్ల మాట్లాడటంలో మార్పులు, కాళ్లూ చేతులు సరిగా పనిచేయకపోవడం, చూపు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లోనే ఇంటర్‌వెన్షనల్ న్యూరో రేడియాలజిస్ట్ అనే నిపుణులు సీటీ స్కాన్ లేదా ఎమ్మారై స్కాన్ వంటి ఇమేజింగ్ ప్రక్రియలతో వచ్చిన పక్షవాతం... ఇస్కిమిక్ స్ట్రోకా లేక హేమరేజిక్ స్ట్రోకా అన్నది నిర్ణయిస్తారు. ఒకవేళ ఆ స్ట్రోక్ రక్తం గడ్డకట్టడం వల్ల జరిగితే ఇంట్రా ఆర్టీరియల్ థ్రాంబోలైసిస్ అనే ప్రక్రియ ద్వారాగానీ లేదా థ్రాంబెక్టమీ అనే ప్రక్రియ ద్వారాగాని ఆ గడ్డను తొలగిస్తారు. ఒకవేళ రక్తనాళాలు సాగిపోయి, ఉబ్బి అవి చిదిమిపోవడం (అన్యురిజమ్స్)వల్ల రక్తస్రావం అయితే వాటిని ఎంబోలైజేషన్ ప్రక్రియ ద్వారా చికిత్స చేస్తారు.

కెరటాయిడ్ ఆర్టరీ స్టెనోసిస్

మన మెడలోని కెరటాయిడ్ ఆర్టరీ అనే ధమని సన్నబారితే మెదడుకు తగినంత రక్తం అందదు. ఇలా సన్నబారినప్పుడు కెరటాయిడ్ ఆర్టరీ స్టెంటింగ్ అనే ప్రక్రియ ద్వారా మెదడుకు తగినంత రక్తం అందేలా చేస్తారు. ఇది కెరటాయిడ్ ఎండార్టరెక్టమీ అనే శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయం. కెరటాయిడ్ ఆర్టరీ సన్నబడినట్లు గుర్తించినప్పుడు స్ట్రోక్ రాకుండా ముందస్తు నివారణ చర్యగా ఈ చికిత్స చేస్తారు.
 

స్పైనల్ ఫ్రాక్చర్స్
 
వెన్నెముకకు ఏదైనా పగుళ్ల వంటివి ఏర్పడితే అలా ఏర్పడిన పగుళ్ల చీలికలలోనికి ఇంజెక్షన్ ద్వారా సిమెంట్ వంటి ఎముకలోనే కలిసిపోయే పదార్థాన్ని పంపి చికిత్స చేస్తారు. ఇంజెక్షన్ ద్వారా చర్మం పొర అయిన ‘పర్‌క్యుటేనియస్’ లేయర్‌లోకి ఇంజెక్షన్ చేసి నిర్వహించే ఈ చికిత్సను వర్టిబ్రోప్లాస్టీ లేదా కైఫోప్లాస్టీ అంటారు. ఇలా రేడియాలజీ అన్నది కేవలం వ్యాధి నిర్ధారణ విషయంలోనే గాక... రకరకాల చికిత్సల్లోనూ కీలక భూమిక పోషిస్తోంది.     - నిర్వహణ: యాసీన్
 
 మహిళల ఆరోగ్యం విషయంలో...
 
 యుటెరైన్ ఫైబ్రాయిడ్స్

ఇవి యుటెరస్‌లో ఏర్పడే ఒక రకం గడ్డలు. వీటి వల్ల మహిళల్లో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం జరుగుతాయి. శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఇప్పుడు ఇంటర్‌వెన్షన్ రేడియాలజిస్టులు ‘యుటెరైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ (యూఎఫ్‌ఈ) లేదా ‘యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ (యూఏఈ) ప్రక్రియల ద్వారా ఈ గడ్డలకు రక్తప్రసరణ చేసే ధమని నుంచి ఒక క్యాథెటర్‌ను పంపి, ఆ ధమనిని మూసి వేసి ఆ గడ్డలకు జరిగే రక్తప్రసరణను ఆపివేస్తారు. దాంతో ఆ ఫైబ్రాయిడ్స్ కుంచించుకుపోయి రాలిపోతాయి.
 
మహిళల్లో ఫలదీకరణకు తోడ్పడటం

కొందరిలో ఫెలోపియన్ ట్యూబ్స్ కుంచించుకుపోవడం వల్ల పురుషుల నుంచి విడుదల అయ్యే శుక్రకణాలు అండాన్ని చేరలేవు. అలాంటి సందర్భాల్లో సాల్పింగోగ్రఫీ అనే ప్రక్రియ ద్వారా ఫెలోపియన్ ట్యూబ్స్‌లోకి సన్నటి నాళాలను పంపి బెలూన్ సహాయంతో వాటిని వెడల్పు చేసి మహిళల్లోని వంధ్యత్వాన్ని నివారించగలరు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement