‘చెవిచిల్లు పెట్టే నీ గురక... చిందరవందర అయింది నా పడక’ అని నిద్రలో గురక పెట్టే వాళ్లపైన చుట్టుపక్కలవాళ్లు గింజుకుంటారు. అయితే నిద్రలో గురకపెట్టేవారికి అంతకు మించిన సమస్యలే ఎదురవుతాయని హెచ్చరిస్తున్నాయి అధ్యయనాలు.
ఎవరైనా మంచం మీద ఇలా వాలి అలా గుర్రుపెట్టారంటే హాయిగా నిద్రపోతున్నారనుకుంటాం. అయితే గురకపెడుతూ నిద్రపోవడం హాయిగా భావించడం సరికాదని, దానిని తీవ్రమైన ఆరోగ్య సమస్యగా భావించాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. గురక తెచ్చిపెట్టే సమస్యలపై మన దేశంలో అవగాహన అత్యల్ప స్థాయిలో ఉందని వారంటున్నారు
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల చేసిన రెస్మెడ్–2023 గ్లోబల్ స్లీప్ సర్వేలో 58 శాతం మంది భారతీయులు గురకను మంచి నిద్రకు చిహ్నంగా భావిస్తున్నట్టు తేలడం నిద్ర ఆరోగ్యంపై వారి అవగాహన లేమిని తేల్చింది. 2022తో పోలిస్తే 2023లో మన వాళ్ల నిద్ర నాణ్యత 22 శాతం క్షీణించినా సర్వేలో పాల్గొన్నవారిలో 85 శాతం మంది తమ నిద్ర నాణ్యత బాగుందన్నారని సర్వే వెల్లడించింది. మూడ్ మార్పులు, పగటి నిద్ర, ఏకాగ్రత లోపం ఉన్న 20 శాతం మంది మాత్రమే వైద్యుడ్ని సంప్రదించాలని నిర్ణయించుకున్నారని తేల్చింది.
గురక.. అనారోగ్య కారణమే...
అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెడికల్ జర్నల్ ‘న్యూరాలజీ ఆన్‌లైన్’సంచికలోప్రచురించిన అధ్యయనం ప్రకారం..గురక పెట్టే వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం 91 శాతం ఎక్కువ. అంతేకాదు గురకపెట్టేవారిలో దాదాపు 20–25 శాతం మంది గురక.. తద్వారా అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (ఒఎస్‌ఎ)తో బాధపడుతూ ఉండవచ్చునని మరో అధ్యయనం తేల్చింది. గురకపెట్టే వారిలో ప్రతి నాల్గవ వ్యక్తి స్లీప్ అప్నియా రోగి అని వైద్యులు అంటున్నారు.
పెరుగుతున్నబాధితులు
గురక–స్లీప్ అప్నియాతో బాధపడుతున్న చాలా మందికి దాని తీవ్రమైన పరిణామాల గురించి తెలియదని ఛాతీ, శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ సందీప్ అంటున్నారు. ‘40 శాతం మంది వ్యక్తులు గురక పెట్టినట్లయితే, వారిలో 10 శాతం మందికి స్లీప్ అప్నియా ఉన్నట్టే’అని దేశంలో తొలి స్లీప్ ల్యాబ్ ప్రారంభించిన డాక్టర్ జేసీ సూరి అన్నారు.
తాను స్లీప్ ల్యాబ్ ప్రారంభించినప్పుడు నెలకు నలుగురైదుగురు రోగులు మాత్రమే వచ్చేవారని, ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పెరిగిందని అందులో మధ్య వయసు్కలు, వృద్ధుల సంఖ్య దాదాపు 15–20 శాతంగా ఉందన్నారు. ‘స్లీప్ అప్నియా ద్వారా రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం కూడా ఉందని అంటున్నారు.
బాల్యంలోనే...
నగరానికి చెందిన ఏఐజీ ఆసుపత్రి ఇటీవలి అధ్యయనం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 40 శాతం మంది పిల్లలు గురక, నిద్రలేమితో బాధపడుతున్నారు. చిన్నారుల్లో గురకకు చికిత్స చేయకపోతే మానసిక వికాసం, మేధో సామర్థ్యాలు దెబ్బతింటాయని, శారీరక చురుకుదనంపై కూడా ప్రభావం చూపుతుందని, దీర్ఘకాలిక అనారోగ్యానికి దారితీయవచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గురక లక్షణాలున్న కేసుల్లో దాదాపు 70 శాతం మంది పిల్లలకు స్లీప్ అప్నియా ఉన్నట్టు, 15 నుంచి 20 శాతం మంది పాఠశాల పిల్లలు ఊబకాయంతో ఉన్నారని వీరిలో అత్యధికులు గురకతో బాధపడేవారేనని ఏఐజీ అధ్యయనంలో తేలింది, నిద్ర పోకుండా పిల్లలు ఎక్కువ గంటలు మేల్కొని ఉండటం అధిక చురుకుదనం లక్షణంగా తల్లిదండ్రుల భావిస్తే అది అపోహ మాత్రమేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
స్లీప్ అప్నియాలక్షణాలివే..
నిద్రలో కండరాలు సడలించడం వల్ల శ్వాసనాళాలు కుంచించుకు పోతాయి. ఫలితంగా ఆక్సిజన్ అందక అది నాణ్యమైన శ్వాసక్రియకు, నిద్రకు తీవ్రమైన అంతరాయం కలిగించే పరిస్థితే స్లీప్ అప్నియా. గురక ముదిరి స్లీప్ అప్నియాకు దారి తీస్తుంది. సాధారణంగా ఊబకాయం ఉన్న వారిలో ఇది కనిపిస్తుంది. మెడ చుట్టుకొలత తగినంత లేకపోవడం, ఎగువవైపునకు గాలి వెళ్లే మార్గం ఇరుకుగా మారడం స్లీప్ అప్నియాకు దోహదం చేస్తుంది.
ఉదాహరణకు, పిల్లలలో టాన్సిల్స్ లేదా అడినాయిడ్స్ కూడా స్లీప్ అప్నియాకు కారణం కావచ్చు. స్లీప్ అప్నియా ముదురుతున్న దశలో వ్యక్తి సురక్షితంగా డ్రైవింగ్ చేసే సామర్థ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. పగటిపూట అధికంగా నిద్రపోవడం ఏకాగ్రత లోపాలకు దారితీస్తుంది.
‘స్లీప్ అప్నియా చికిత్సలో భాగంగా బరువు తగ్గడం, ధూమపానం మానేయడం, ఆల్కహాల్ బాగా తగ్గించడం, తీరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. ఈ వ్యాధి తీవ్రమైతే రోగులకు మాస్క్ ద్వారా గాలిని అందించే వైద్య పరికరం, కొన్ని సందర్భాల్లో, అడ్డంకిని సరిచేయడానికి శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు.
పిల్లలకు మరింత చేటు...
తీవ్ర గురకతో బాధపడుతున్న పిల్లల్లో చురుకుదనం, శ్రద్ధ లోపిస్తాయి. చిరుతిళ్లు అధికంగా తినడం, చిరాకు, తరచుగా అలసట ఉంటాయి. గురక, నోటితో శ్వాస తీసుకోవడం, రాత్రి పూట చెమట పట్టడం వంటివి పిల్లల్లో గమనిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. –ఆర్.దీప్తి, చీఫ్ పీడియాట్రిషియన్,అమోర్ హాస్పిటల్స్
Comments
Please login to add a commentAdd a comment