ప్రభుత్వ వైద్యుల పోరు బాట
ప్రభుత్వ వైద్యుల పోరు బాట
Published Mon, Feb 27 2017 9:59 PM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM
- సమస్యల పరిష్కారం కోసం నేటి నుంచి గంటపాటు నిరసన
- మార్చి 6న సామూహిక సెలవు
కర్నూలు (హాస్పిటల్): సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టేందుకు ప్రభుత్వ వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ వైద్యుల సంఘం కర్నూలు శాఖ కార్యదర్శి డా.రామకృష్ణనాయక్, ఉపాధ్యక్షులు డా.మనోరాజు.. సోమవారం కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా.జీఎస్.రాంప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీర్ఘకాలంగా తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళనకు సిద్ధం కావాల్సి వచ్చిందని తెలిపారు. ఆందోళనలో భాగంగా మంగళవారం నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామన్నారు. ప్రతి రోజు గంటపాటు ప్రభుత్వాసుపత్రిలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు. మార్చి 6వ తేదీన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అత్యవసర సేవలు మినహా సామూహిక సెలవుల్లో వెళ్తారని, 7వ తేదీ నుంచి బయోమెట్రిక్ హాజరు వేయబోమని చెప్పారు. వైద్యులకు కాలపరిమితి వేతనాలు అందజేయాలని, యూజీసీకి అనుగుణంగా జీతాలు పెంచాలని కోరారు. కర్నూలులో పని చేస్తున్న వైద్యులకు హెచ్‌ఆర్‌ఏను 20 శాతానికి పెంచాలని, అన్ని శాఖల్లో పని చేసే సీనియర్ వైద్యులకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు.
Advertisement