సియోల్: సౌత్ కొరియాలో డాక్టర్లు వారం రోజుల నుంచి ఆందోళన బాట పట్టారు. వచ్చే ఏడాది నుంచి మెడికల్ కోర్సుల్లో ఏడాదికి 2 వేల సీట్లు పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీ విధులను కూడా బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. దీంతో ఎమర్జెన్సీ వార్డుల్లో పేషెంట్లు డాక్టర్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాజధాని సియోల్‌లోని 5 పెద్ద ఆస్పత్రుల్లో ఇప్పటికే షెడ్యూల్ అయిన సగం సర్జరీలు రద్దవుతున్నాయి. దీనిపై దేశ వైద్యశాఖ సహాయ మంత్రి పార్క్ మిన్‌సూ స్పందించారు. డాక్టర్ల ప్రాథమిక కర్తవ్యం పేషెంట్ల ప్రాణాలు కాపాడటమని, నిరసనల కంటే వారు ఈ విషయానికే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పనిచేసే చోటే ఉండాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల వల్ల ఇప్పటివరకు 7813 మంది డాక్టర్లు ఉద్యోగాలు వదిలి వెళ్లిపోయారని, ఇందుకే మరింత మంది డాక్టర్లు అవసరమని చెప్పారు.
అయితే స్టే ఎట్ వర్క్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని, ప్రభుత్వం డాక్టర్ల సంఖ్యను పెంచే బదులు వారి వేతనాలు, పని ప్రదేశంలో సౌకర్యాలు పెంచాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని సుదూర గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందిండం కోసమే మెడికల్ సీట్ల సంఖ్యను పెంచుతున్నామని ప్రభుత్వం చెబుతుంటే ఏప్రిల్‌లో జరిగే సాధారణ ఎన్నికల కోసమే ప్రభుత్వం ఈ స్టంట్ ప్లే చేస్తోందని డాక్టర్లు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment