ఐఎంఏ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద వైద్యుల ఆందోళన
రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసన
సాక్షి నెట్‌వర్క్: కోల్‌కతాలో యువ డాక్టర్‌పై హత్యాచారాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా శనివారం ప్రభు త్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ వైద్య సేవలు నిలిచిపోయాయి. మెడికల్ కాలేజీలు, జిల్లా కేంద్రాల్లో పలు రూపాల్లో డాక్టర్లు, వైద్యసిబ్బంది నిరసన వ్యక్తం చేశాయి.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ధర్నా చేశారు. పెద్దఎత్తున డాక్టర్లు, వైద్య సిబ్బంది, రాజకీయనేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పొల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ తాను ఒక ఎంపీగా ఇక్కడకు రాలేదని ఓ వైద్యురాలిగా తన కుటుంబంలో ఒకరిని కోల్పోయిన బాధతో ఇక్కడకు వచ్చినట్టు తెలిపారు.
రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతానని ఆమె డాక్టర్లకు హామీ ఇచ్చారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని బహిరంగంగా ఉరి తీసినా తప్పు లేదన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.కాళీప్రసాదరావు మాట్లాడుతూ డాక్టర్లకు పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలతోపాటు భద్రత కల్పించాలన్నారు. అనేక చట్టాలు ఉన్నా, వాటి అమలు తీరు సరిగ్గా లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని చెప్పారు.
చట్టాల పటిష్ట అమలుతోనే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రధానకార్యదర్శి డాక్టర్ విజయ్‌రావు, ఫైనాన్స్ సెక్రటరీ ఆర్కే.యాదవ్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ దయాల్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఓపీ మినహా అన్ని రకాల వైద్య సేవలు నిలిచిపోవడంతో వేలాది మంది రోగులు ఇబ్బందులు పడ్డారు. అసలే రోగాల సీజన్ కావడంతో ఓపీకి వచ్చిన వారంతా డాక్టర్ల కోసం ఎదురుచూశారు.
కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట వైద్యుల ధర్నా
వైద్యులు, వైద్య విద్యార్థులు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. జిల్లా వైద్యులు డాక్టర్ బీఎన్.రావు, రఘురామన్, విజయ్‌మోహన్‌రెడ్డి, రమణాచారి, చల్మెడ, ప్రతిమ మెడికల్ కళాశాల డాక్టర్లు, పీజీ డాక్టర్లు పాల్గొన్నారు.
పాలమూరులో భారీ ర్యాలీ
ఐఎంఏ, ప్రభుత్వ జూనియర్ వైద్యుల ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి నుంచి తెలంగాణ చౌరస్తా వరకు భారీర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కలెక్టర్ విజయేందిర బోయికి వినతిపత్రం అందజేశారు.
ఆదిలాబాద్ కలెక్టర్‌కు రాఖీ కట్టిన రిమ్స్ జూడాలు
ఆదిలాబాద్ రిమ్స్ జూనియర్ వైద్యులు కలెక్టర్ రాజర్షి షాకు రాఖీలు కట్టి రక్షణ కల్పించాలన్నారు.
వరంగల్‌లో నిరసన వెల్లువ
వరంగల్‌లో వైద్యులు పెద్దఎత్తున నిరసన తెలిపారు. జూనియర్ వైద్యులు ఓ పక్క విధులు బహిష్కరించి నాలుగు రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్న క్రమంలో వారికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నర్సింగ్ విద్యార్థులు వివిధ పార్టీలు మద్దతు తెలిపాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి కాకతీయ మెడికల్ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేఎంసీ ప్రధానగేటు వద్ద నిరసన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment