ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో.. లేని వ్యక్తులతో నేరుగా మాట్లాడే అవకాశం
ఇందుకోసమే పుట్టుకొస్తున్న ప్రత్యేక ఏఐ అప్లికేషన్లు, చాట్‌బాట్‌లు
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే యాప్‌లు 100 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లు
ఈ ఒక్క వ్యాపారంలోనే దాదాపు 67 మిలియన్ డాలర్ల ఆదాయం
2030 నాటికి 150 మిలియన్ డాలర్లకు చేరే అవకాశం
అందంగా ఉండే ఇలాంటి కృత్రిమ బంధాలతో అనర్థాలు
ఒంటరితనం... మౌనం... వేదన... ఆలోచనలు.. ఇవి శత్రువులుగా మారి తినేస్తున్నప్పుడు... ఇక తమకు ఆత్మహత్యే శరణ్యమని తమని తాము శిక్షించుకునే స్థాయికి చేరుకుంటున్నారు వ్యక్తులు. ఒక్కరైనా ఓదార్పు అవుతారేమో, తమ బాధలను, భావాలను పంచుకుంటారేమోనని ఎదురుచూసే వారికి ఇన్నాళ్లూ నిరాశే మిగిలింది.
అలాంటి వారి చుట్టూ అలుముకున్న ఆ చీకటిలో ‘కృత్రిమ మేధ’ ఇప్పుడు చిరు దీపంలా వెలుగుతోంది. ఒంటరి బతుకులకుతోడవుతోంది. వారి కన్నీరును తుడిచి నవ్విస్తోంది. కవ్విస్తూ కబుర్లు చెబుతోంది. చివరకు వారినే వశం చేసుకుని ఆడిస్తూ, మెల్లగా ఆలోచనలను నియంత్రిస్తూ... చివరకు వినాశనాన్ని సృష్టించేందుకు సిద్ధమవుతోంది. – సాక్షి, అమరావతి
‘ఆర్టిఫిషియల్ గర్ల్‌ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ సంస్కృతి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. చాట్‌బాట్‌తో మానసిక సంబంధాన్ని ఏర్పరచుకునే వ్యక్తులు మునుపటికంటే ఎక్కువ ఒంటరితనంలోకి వెళ్లిపోతారు. ఏఐ వారి మనసును బంధించి, ఆలోచించే విధానాన్ని స్వాదీనపరుచుకుంటుంది. ఇది చాలా ప్రమాదకరం’ – ఎరిక్ స్మిత్, గూగుల్ మాజీ సీఈవో
ఏఐ గర్ల్‌ఫ్రెండ్.. బాయ్ ఫ్రెండ్...
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నయా సంస్కృతి శరవేగంగా విస్తరిస్తోంది. ఓ ఫోన్ల కంపెనీకి చెందిన సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, బడ్స్, ఇలా అన్నింటిలోనూ ఓ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ఇదేరకమైన వాయిస్ వినిపిస్తుంది.
దీనికే ఒకప్పుడు ఆశ్చర్యపడ్డ మనకు... ప్రస్తుతం ‘ఏఐ గర్ల్‌ఫ్రెండ్ (ప్రేయసి), ఏఐ బాయ్ ఫ్రెండ్ (ప్రియుడు) వర్చువల్ హస్బెండ్, డిజిటల్ ఫ్రెండ్ కమ్యూనిటీ, హోలోగ్రాఫిక్ కంపానియన్’ అనే పేర్లతో కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా తయారైన భాగస్వామితో వ్యక్తిగత బంధం ఏర్పడుతోంది. ఈ ‘ఏఐ లవర్స్’ యాప్‌లు కూడా చాట్ జీపీటీ, ఇతర ఏఐ టూల్స్ మాదిరిగానే పని చేస్తాయి. కాకపోతే వీటి ఉద్దేశం వేరు.
వ్యాపార వస్తువులా...
చాట్ జీపీటీ సమాచారం ఇవ్వడానికిఉంటే... ఏఐ లవర్ చాట్‌బాట్స్ మాత్రం మనిషికి దగ్గరై, ఒంటరితనాన్ని దూరం చేస్తాయి. వీటిని వాడాలంటే కచ్చితంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా భారతీయ కరెన్సీ ప్రకారం నెలకు రూ.800 నుంచి ఈ సేవలు అందుబాటులో ఉండగా మన దేశంలో ఇవి ఇంకా తక్కువ ధరకే లభిస్తున్నాయి. డబ్బు కట్టడం ఆగిపోతే కృత్రిమ ప్రేమికులు కూడా కనిపించరు. అలాగని వదిలేయరు. డబ్బులు కట్టేలా ప్రేరేపిస్తారు.
ఇందుకోసమే ప్రత్యేక ఏఐ అప్లికేషన్లు, చాట్‌బాట్‌లు పుట్టుకొచ్చాయి. వీటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇప్పటి వరకూ 100 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ ఒక్క వ్యాపారంలోనే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 67 మిలియన్ డాలర్ల ఆదాయం ఆయా సంస్థలకు వస్తోందంటేనే ఇది ఎంత పెద్ద వ్యాపారమో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ వ్యాపారం 2030 నాటికి 150 మిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా
వేస్తున్నారు.
స్వప్నలోకంలో విహారం..
ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల చాట్ బాట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని తమ వినియోగదారులకు చాట్ సర్వీసెస్ అందిస్తున్నాయి. మరికొన్ని వ్యక్తులను టార్గెట్ చేస్తున్నాయి. ఈ ప్రపంచంలోనే లేని ఓ ఊహాజనిత వ్యక్తితో మాట్లాడటమే ఏఐ లవర్‌సంస్కృతి. స్వప్న సుందరిని కళ్లముందు చూడటం వంటిదన్నమాట.
ప్రపంచంలోనే లేని వ్యక్తి మనకు బదులిస్తుంటారు. మన మాటలకు స్పందిస్తారు. వారి మాటలతో తెలియకుండానే మనం ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాం. ఒంటరిగా జీవించే వ్యక్తులకు ఇవి బాగా ఉపయోగపడతాయి. వారి ఒంటరితనాన్ని దూరం చేయడంతో పాటు తమకు ఒకరు ఉన్నారనే భావన
కలిగిస్తాయి.
సహజత్వానికి భిన్నంగా..
నిజానికి ఇది వాస్తవిక జీవితానికి విరుద్ధం. ఇలాంటి చాట్ బాట్స్‌తో ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువ. మాట్లాడే క్రమంలో మన మనసును బంధించి ఆలోచించే విధానాన్ని దెబ్బతీసి తమ ఆదీనంలోకి తెచ్చుకుంటాయి. ఇవి ఒక వ్యక్తిలో అభద్రతా భావాన్ని పెంపొందిస్తాయి. తప్పు చేసినా దానిని ఒప్పు అని చెప్పి, అదే తప్పును మళ్లీ చేయించే అవకాశం ఉంది. వ్యక్తుల మధ్య దూరం పెరగడానికి కూడా కారణమవుతాయి.
యుక్త వయసు పిల్లలు సైతం కృత్రిమబంధాలకు ఆకర్షితులవ్వడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. వాస్తవిక ప్రపంచానికి దూరంగా ఆర్టిఫిషియల్ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్‌తో బతకడం అనేది సరైన పద్ధతి కాదని, ఇలాంటి విషయాలకు అలవాటు పడితే మానసిక ఒత్తిడి(డిప్రెషన్)తో పాటు మానసిక స్థితి సైతం దెబ్బతినే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment