ట్రెండీ ఫ్యాషనబుల్ ఐటమ్‌గా మారిన కళ్లజోళ్లు
దేశీయ కళ్లజోళ్ల మార్కెట్ రూ.54,863 కోట్లు
2032 నాటికి రూ.1,53,384 కోట్లకు చేరుతుందని అంచనా
స్మార్ట్ గ్లాస్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెన్స్‌లకు పెరుగుతున్న డిమాండ్
గ్రామీణ మార్కెట్లపై కార్పొరేట్ల దృష్టి
సాక్షి, అమరావతి: దేశీయ నేత్ర రక్షణ వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. గతంలో కేవలం చూపు కోసమే వినియోగించిన కళ్లజోళ్లు ఇప్పుడు ట్రెండీ ఫ్యాషనబుల్ ఐటమ్స్‌గా మారిపోయాయి. యువత వస్త్రధారణకు అనుగుణంగా సరికొత్త డిజైన్లతో ఉన్న కళ్లజోళ్లను వినియోగిస్తోంది. బరువు తక్కువగా ఉండి.. విభిన్న రంగుల్లో పెద్ద ఫ్రేమ్‌లున్న కళ్లజోళ్లను వినియోగించడం ఇప్పుడు ట్రెండీగా మారింది. మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్ వినియోగించిన భారీ కళ్లజోడు అందరినీ ఆకర్షించింది.
సినీనటుల నుంచి గ్రామీణ యువత వరకు కళ్లజోడు ఫ్యాషన్ వస్తువుగా మారింది. ప్రస్తుతం దేశీయ కళ్లజోళ్ల మార్కెట్ రూ.54,863 కోట్లు ఉండగా.. అది 2032 నాటికి ఏటా 12 శాతంపైగా వృద్ధి సాధిస్తూ రూ.1,53,384 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. భారత్‌లో 30 కోట్ల మంది దృష్టి మెరుగుదల కోసం కళ్లజోళ్లను వాడాల్సి ఉండగా.. కేవలం 12 కోట్ల మందే వినియోగిస్తుండటంతో ఈ మార్కెట్‌పై కార్పొరేట్ సంస్థలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి.
ఇప్పుడు అత్యధికులు కంప్యూటర్లు, ఫోన్లతో ఎక్కువ సమయం గడిపేస్తుండటంతో నేత్ర సంబంధ సమస్యలు తలెత్తడం అత్యంత సహజమైన పరిమాణంగా మారిపోయింది. దీంతో ప్రతి ఒక్కరికీ కళ్లజోడు తప్పనిసరి అనే పరిస్థితి ఏర్పడుతోంది. ఇటు ఫ్యాషన్‌తోపాటు చూపు కోసం కళ్లజోళ్ల మార్కెట్‌కు డిమాండ్ అధికంగా ఉండటంతో రిటైల్ చైన్ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ విస్తరిస్తున్నాయి.
లెన్సుల మార్కెట్టే ప్రధానం
మొత్తం దేశీయ ఐకేర్ మార్కెట్ రూ.54,863 కోట్లు ఉండగా.. అందులో ఒక్క లెన్సుల మార్కెట్ పరిమాణమే రూ.22,908 కోట్లు ఉంటుందని అంచనా. కాంటాక్ట్ లెన్స్‌లతో పాటు కాస్మొటిక్ లెన్స్‌లు ముఖ్యంగా బ్లూలైట్ లెన్స్‌ల వినియోగం భారీగా పెరుగుతోంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ స్మార్ట్ గ్లాస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే కళ్లజోళ్లు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి.
ఒక వ్యక్తి సొంత అవసరాలకు అనుగుణంగా కావాల్సినప్పుడు కావాల్సిన విధంగా మారే ప్రోగ్రాంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసేలా వీటిని రూపొందిస్తున్నారు. భారత్ మార్కెట్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇటలీ, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. దీనికి ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎగ్జిబిషన్‌లో వివిధ దేశాల నుంచి 1,500కుపైగా విదేశీ బ్రాండ్స్ పాల్గొనడమే నిదర్శనమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment