ఒకవేళ దొంగిలించినా దొంగలను ఇట్టే పట్టేయవచ్చు
వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌తో వాహనాలకు రక్షణ
వీటీఎస్ టెక్నాలజీని వాడుకోవాలంటున్న అధికారులు
గుడ్లవల్లేరు: మన ఇంటి ఎదుట సీసీ కెమెరాలున్నా.. లాక్ చేసిన వాహనాలు సైతం చోరీకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహనాల చోరీని అరికట్టవచ్చు. ఒకవేళ వాహనాలు చోరీకి గురైనా దొంగలను ఇట్టే పట్టించేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానం దోహదపడుతుంది. అదే వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్. ఈ వ్యవస్థ అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే విజయవంతమైంది. మన దేశంలో పట్టణాల్లో ఉపయుక్తమవుతోంది. లక్షల వ్యయంతో లారీలు, కార్లు, బైకులు కొనుగోలు చేసే వాహనదారులు వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను కొంతఖర్చుతో అమర్చుకోవాలని పోలీసు, రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు.
జీపీఎస్ శాటిలైట్ ద్వారా సిగ్నల్స్
జీపీఎస్ శాటిలైట్ నుంచి సిగ్నల్స్ వీటీఎస్‌కు వచ్చి అక్కడి నుంచి సెల్ టవర్ ద్వారా సర్వర్‌కు వస్తాయి. వీటీఎస్ పూర్తిగా వెబ్ ద్వారా పని చేస్తుంది. మన వాహనంలో జీపీఆర్‌ఎస్, ఆర్‌ఎఫ్‌డీ యూనిట్‌ను అమర్చుకోవాలి. సర్వర్ నుంచి యూజర్‌కు వివరాలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయి. వీటిని కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్, ఐప్యాడ్‌లకు అనుసంధానం చేసుకోవచ్చు. తద్వారా వాహనం ఎక్కడికి వెళ్తున్నా.. మొబైల్‌లో చూసుకోవచ్చు.
మార్కెట్లో సెక్యూర్టీ డివైజ్‌లు
టూ వీలర్స్‌కు సైతం సెక్యూర్టీ డివైజ్‌లు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా వెహికల్ డివైజ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని వాహనాలకు అమర్చితే చోరీలకు కళ్లెం వేసినట్లే. చోరీ చేసినా డివైజ్ యాక్టివేట్ అయి ఇంజిన్ స్టార్ట్ కాకుండా పోతుంది. ఒకవేళ బైక్‌లో డివైజ్‌ను తొలగించినా బైక్ హారన్ మోగటంతో పాటు బండి స్టార్ట్ అవ్వదు. జీపీఆర్‌ఎస్ ద్వారా బైకిస్ట్ ఫోనుకు అనుసంధానం చేయటం వలన ఆ మొబైల్‌కు సమాచారం వెళుతుంది. ఫోనుకు అలెర్ట్ మెసేజ్ వచ్చేస్తుంది.
ఎన్నెన్నో ప్రయోజనాలు...
👉మహిళల ప్రయాణంలో వెహికల్ ట్రాకింగ్‌తో ఎంతో మేలు చేకూరుతుంది. ప్రయాణంలో వారు ఎక్కడ ఉన్నదీ తెలుస్తుంది. గమ్యస్థానం చేరేంతవరకు ఆందోళన చెందకుండా ఉండవచ్చు.
👉 బ్యాంకులకు భారీ మొత్తం నగదును తరలించేటపుడు ఆ వాహనం ఎక్కడుందో బ్యాంకర్లు తెలుసుకోవచ్చు.
👉 దూర ప్రాంతాలకు వెళ్లే లారీలు, కార్లు, విలువైన వస్తువులు తీసుకువెళ్లే భారీ కంటైనర్లు ఎక్కడి వరకు వెళ్లాయనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.
దొంగల్ని ఇట్టే పట్టేయవచ్చు
వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ దొంగల్ని సైతం ఇట్టే పట్టించేస్తుంది. కార్లు, లారీల యజమానులంతా రక్షణగా సాంకేతిక పరిజ్ఞానాన్ని నమ్ముకుంటే చోరీలను అరికట్టవచ్చు. మా శాఖతో పాటు రవాణా శాఖ వారు కూడా అన్ని వాహనాలకు సాంకేతికతను వినియోగించుకోవలసిందిగా ప్రచారం చేస్తున్నాం.
– ఎన్.వి.వి.సత్యనారాయణ, గుడ్లవల్లేరు ఎస్.ఐ
Comments
Please login to add a commentAdd a comment