పాత తేదీలతో రాజపత్రం జారీ దుర్మార్గం
ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలను విస్మరించడం తగదు
రాష్ట్ర ప్రభుత్వంపై యూటీఎఫ్ నేతల మండిపాటు.. గెజిట్ కాపీలు దహనం
అనకాపల్లి/భీమవరం: గ్యారంటీడ్ పెన్షన్ స్కీం (జీపీఎస్) అమలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేయడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆదివారం కూడా ఆందోళన బాటపడ్డాయి. రాజపత్రాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని అమలుచేస్తుందని ఆశించామని.. కానీ, మా ఆశలను వమ్ముచేస్తూ జీపీఎస్‌కు చట్టబద్ధత తెచ్చి గెజిట్ నోటిఫికేషన్ జారీచేయడం చాలా అన్యాయమంటూ ఆదివారం అనకాపల్లిలోని సీఐటీయూ కార్యాలయం వద్ద యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వత్సవాయి శ్రీలక్ష్మి, గొంది చినబ్బాయిలు విమర్శించారు. గెజిట్ కాపీలను దగ్థంచేశారు.
పైగా.. జీపీఎస్ విధానాన్ని అమలుచేస్తూ పాత తేదీలతో రాజపత్రాన్ని విడుదల చేయడం దుర్మార్గమని చెప్పారు. జీపీఎస్ కంటే మెరుగైన విధానాన్ని అమలుచేస్తామని పవన్‌కళ్యాణ్, నారా లోకేశ్‌లు కూడా హామీ ఇచ్చారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుని, పాత పెన్షన్ విధానం అమలుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎల్లయ్యబాబు, ఎంవీ అప్పారావు, జిల్లా కార్యదర్శి శేషుబాబు, కోశాధికారి జోగా రాజేష్, మున్సిపల్ ఉపాధ్యాయుల నాయకులు సతీ‹Ù, మోడల్ స్కూల్ నాయకులు ఆశాలత, ఏపీసీపీఎస్‌ఈఏ నాయకులు ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీవన్మరణ సమస్యగా ఉన్న కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలుచేస్తుందని భావించామని.. కానీ, అందుకు విరుద్ధంగా కొత్త ప్రభుత్వం జీపీఎస్‌పై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం చాలా అన్యాయమని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి.గోపిమూర్తి, జిల్లా అధ్యక్షుడు పీఎస్ విజయరామరాజు అన్నారు. భీమవరంలో ఆదివారం వారు జీఓ కాపీలను దగ్థం చేశారు.
కొలువుదీరిన ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను అమలుచేయడం దేనికి సంకేతమని వారు ప్రశి్నంచారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి సీహెచ్ పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శులు సీహెచ్ కుమారబాబ్జి, డి. ఏసుబాబు, ఎస్.రత్నరాజు, జి. రామకృష్ణంరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment